ముక్తినాథ్ దేవాలయాన్ని సందర్శించిన అనంతరం సరదాగా డ్రమ్ము వాయిస్తున్న ప్రధాని మోదీ
కఠ్మాండు: నేపాల్ విజయశిఖరాలు అధిరోహించేందుకు భారత్ షెర్పాలా సాయంచేసేందుకు సిద్ధంగా ఉందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హామీఇచ్చారు. యుద్ధం నుంచి బౌద్ధం వైపు ఆ దేశం సాగించిన ప్రయాణాన్ని కొనియాడారు. నేపాల్ పర్యటనలోభాగంగా రెండోరోజు శనివారం మోదీ చారిత్రక ముక్తినాథ్, పశుపతినాథ్ ఆలయాలను సందర్శించారు.
మాజీప్రధానులు ప్రచండ, షేర్ బహదూర్ దేవ్‌బా, ప్రతిపక్షనాయకులతో సమావేశమయ్యారు. నేపాల్ అభివృద్ధిలో భారత్ తోడుగా ఉంటుందని పునరుద్ఘాటించారు. తన ఈచారిత్రక పర్యటనతో ఇరుదేశాల మధ్య సంబంధాలకు కొత్తశక్తి వచ్చిందని వ్యాఖ్యానించారు. నేపాల్ ప్రధాని కేపీఓలితో చర్చలు ఫలప్రదమయ్యాయని అన్నారు. రెండ్రోజుల నేపాల్ పర్యటన ముగించుకుని మోదీ స్వదేశం చేరుకున్నారు.
భారత్–నేపాల్ స్నేహం జిందాబాద్..
కఠ్మాండులో శనివారం మోదీ గౌరవార్థం ఘనంగా రిసెప్షన్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగామోదీ మాట్లాడుతూ.. ‘యుద్ధం నుంచి బౌద్ధం వైపు అడుగులేస్తూ నేపాల్ సుదీర్ఘ ప్రయాణం చేసింది. బ్యాలెట్ (ప్రజాస్వామ్యం)ను ఎంచుకోవడానికి బుల్లెట్(యుద్ధం)ను వదులుకున్నారు. అయితే ఇంకా గమ్యస్థానాన్ని చేరుకోలేదు. మౌంట్ ఎవరెస్ట్ బేస్‌క్యాంపు వరకు చేరుకున్నారు.
ప్రధాన అధిరోహణ ఇంకా జరగాల్సిఉంది. పర్వతారోహకులకు సాయంచేసే షెర్పాల మాదిరిగానే నేపాల్‌కు సాయం చేసేందుకు భారత్ సిద్ధంగా ఉంది’అని అన్నారు. ‘సబ్‌కా సాథ్, సబ్‌కా వికాస్’ మంత్రం భారత్‌కే పరిమితం కాలేదని, ప్రపంచహితం కోసం కూడా దోహదపడుతుందని అన్నారు. ‘భారత్–నేపాల్ స్నేహం జిందాబాద్’అని మోదీ తన ప్రసంగం చివరలోమూడుసార్లు నినదించారు.
ఈ పర్యటన చరిత్రాత్మకం..
నేపాల్ పర్యటనను చారిత్రకమని మోదీ అభివర్ణించారు. ‘ఈ పర్యటన నేపాల్ ప్రజలకు చేరువయ్యేందుకు అవకాశం కల్పించింది. అభివృద్ధి ప్రయాణంలో నేపాల్‌కు భారత్ ఎప్పుడూ అండగాఉంటుంది’అని ట్వీట్‌చేశారు. గతంలో కుదుర్చుకున్న ఒప్పందాలను ముందుకు తీసుకెళ్లడానికి ఇదేజోరు కొనసాగించాలని మోదీ, ఓలి నిర్ణయించినట్లు ఉమ్మడి ప్రకటన వెల్లడించింది. విభిన్న రంగాల్లో సహకారం, భాగస్వామ్యాన్ని బలోపేతం చేసుకుని ద్వైపాక్షిక సంబంధాలను ముందుకు తీసుకెళ్లడానికి ఇద్దరు నేతలు అంగీకరించారు. భారత్‌లో పర్యటించాలన్న మోదీ ఆహ్వానాన్ని ఓలి అంగీకరించారు.
Comments
Please login to add a commentAdd a comment