తీరి కూర్చుని సమస్యలు సృష్టించుకోవటంలో నేపాల్ ప్రధాని ప్రచండను మించినవారెవరూ ఉండరు. కనుకనే భారత్‌లోని ప్రాంతాలతో కూడిన వివాదాస్పద మ్యాప్‌తో కొత్త వంద రూపాయల నోటు విడుదల చేసి మరో గొడవకు తెరతీశారు. మన ఉత్తరాఖండ్‌లో భాగంగా... 372 చదరపు కిలోమీటర్ల మేర విస్తరించివున్న లింపియాథుర, కాలాపానీ, లిపులేఖ్ ప్రాంతాలను తనవిగా చెప్పుకుంటూ లడాయికి దిగడం నేపాల్‌కు కొత్త కాదు. నాలుగేళ్లక్రితం ఆ ప్రాంతాలతో కూడిన భౌగోళిక చిత్రపటాన్నీ, దానికి సంబంధించిన బిల్లునూ పార్లమెంటులో ప్రవేశపెట్టి ఏకగ్రీవ ఆమోదం కూడా పొందింది.
నిజానికి అంతకుముందే 2014లో ప్రధాని నరేంద్ర మోదీ నేపాల్‌లో పర్యటించి సరిహద్దు వివాదాల పరిష్కారానికి ఉభయ దేశాల ప్రతినిధులతో ఒక కార్యాచరణ బృందాన్ని ఏర్పాటు చేసుకోవాలని ప్రతిపాదించారు. అందుకు నేపాల్ కూడా ఆమోదం తెలిపింది. దానికి సంబంధించి తదుపరి చర్యలు తీసుకోవటంలో ఇరు దేశాలూ చొరవ తీసుకోలేదన్నది వాస్తవం. ఆ పని తక్షణం మొదలుకావాలని భారత్‌ను డిమాండ్ చేయటంలో తప్పులేదు. అందుకు దౌత్యమార్గంలో నిరంతర చర్చలు జరపటం కూడా అవసరం. కానీ దీన్ని వదిలి 2020లో ఏకపక్షంగా మ్యాప్‌ను విడుదల చేసి సమస్యను మరింత జటిలం చేయటానికే నేపాల్ మొగ్గుచూపింది.
పాలక కూటమిలో అంతర్గత విభేదాలు వచ్చిన ప్రతిసారీ ప్రజల దృష్టి మళ్లించేందుకు భారత్‌తో వున్న సరిహద్దు సమస్యను ఎజెండాలోకి తీసుకురావటం తప్ప ఆ వివాదాన్ని చిత్తశుద్ధితో పరిష్కరించుకుందామన్న ఆలోచన పాలకులకు లేదనే విమర్శలు తరచు రావటానికి ఇదే కారణం. వంద రూపాయల నోటుపై వివాదాస్పద మ్యాప్ ఉండాలనుకోవటం వెనక కూడా ఇలాంటి ఉద్దేశమే ఉందన్నది విపక్షాల విమర్శ. తన ఏలుబడిలోని కూటమిలో భాగస్వామిగా వున్న జనతా సమాజ్‌వాదీ పార్టీ–నేపాల్ (జేఎస్‌పీ–ఎన్)లో కుమ్ములాట మొదలైన మరుక్షణమే ప్రచండ వివాదాస్పద మ్యాప్‌ను బయటకు తీశారు.
భారత్ మద్దతున్న మాధేసి తెగల సమూహానికి ప్రాతినిధ్యంవహించే ఆ పార్టీలో అంతర్గత తగాదాలు బయల్దేరితే నేపాల్ రాజకీయాలపై వాటి ప్రభావం ఎక్కువేవుంటుంది. 2020లో సరిహద్దు సమస్యపై నేపాల్ పార్లమెంటులో బిల్లుపెట్టి ఏకగ్రీవంగా ఆమోదించేలా చేయటంలో కీలకపాత్రపోషించిన అప్పటి ప్రధాని, సీపీఎన్ (యూఎంఎల్) నాయకుడు కేపీ శర్మ ఓలి రెండు నెలలక్రితం పాలక కూటమిలో చేరటం కూడా కొత్త కరెన్సీనోటు ముద్రణకు కారణమంటున్నారు. ‘దురాక్రమణలోవున్న నేపాల్ భూభాగాలను తిరిగి తీసుకురావటమే తమ కర్తవ్యమని సీపీఎన్(యూఎంఎల్) తన మేనిఫెస్టోలో ఇప్పటికే ప్రకటించివుంది. అయితే నేపాల్ పార్లమెంటు కొత్త మ్యాప్‌ను ఆమోదించినప్పుడు ప్రజల్లో కనిపించిన ఉత్సాహం, ఉద్వేగం ఇప్పుడు లేవు సరికదా...ప్రచండపై విమర్శలే అధికంగా వినిపిస్తున్నాయి.
ఇలా అత్యుత్సాహంతో సొంత మ్యాప్‌లు రూపొందించుకోవటం ఒక్క నేపాల్‌కే కాదు...చైనా, పాకిస్తాన్‌లకు కూడా అలవాటే. మన అరుణాచల్ ప్రదేశ్‌లోని భౌగోళిక ప్రాంతాలకు తనవైన పేర్లు పెట్టుకుని, మ్యాప్‌లలో చూపుకోవటం చైనాకు అలవాటు. పాకిస్తాన్‌దీ అదే సంస్కృతి. అది జమ్మూ, కశ్మీర్‌లో కొంత ప్రాంతాన్ని ఏనాటినుంచో తన మ్యాప్‌లలో చూపుతోంది. దేశాలమధ్య సరిహద్దులకు సంబంధించి తలెత్తే వివాదాలు ప్రజలను రెచ్చగొడితే పరిష్కారం కావు.
వాటిని దౌత్య స్థాయిలో అవతలి దేశంతో ఓపిగ్గా చర్చించి, చారిత్రక, సాంస్కృతిక ఆధారాల పరిశీలనకు నిపుణులతో ఉమ్మడి కమిటీలు ఏర్పాటుచేసుకోవాలి. ఆ మార్గాన్ని వదిలి ఇష్టానుసారం జనం భావోద్వేగాలను రెచ్చగొట్టాలనుకుంటే పరిష్కారానికి అందనంత జటిలంగా వివాదాలు మారతాయి. నిజానికి సరిహద్దు తగాదాలన్నీ మన దేశాన్ని పాలించిన బ్రిటిష్ వలసపాలకులు వదిలిపెట్టిపోయినవే.
1814–16 మధ్య సాగిన ఆంగ్లో–నేపాలీ యుద్ధంలో ఈస్టిండియా కంపెనీకి నేపాల్ ధారాదత్తం చేసిన ప్రాంతమే ప్రస్తుత వివాదానికి మూలం. వలసపాలకులు పోయిన ఏడున్నర దశాబ్దాల తర్వాత కూడా ఆ భూభాగంపై ఇరు దేశాల మధ్యా అవగాహన కుదరకపోవటం విచారించదగ్గదే. నిజానికి నేపాల్‌తో సరిహద్దు వివాదాలు అసలు పరిష్కారం కాలేదని చెప్పలేం. గత మూడు దశాబ్దాల్లో ఇరు దేశాలూ పరస్పరం చర్చించుకుని దాదాపు 98 శాతం సమస్యలను పరిష్కరించుకోగలిగాయి.
మిగిలిన సమస్యల్ని సైతం ఈ దోవలోనే పరిష్కరించుకోవచ్చన్న ఇంగితజ్ఞానం నేపాల్ నేతలకు లేదు. దేశాధ్యక్షుడు రామచంద్ర పోద్వాల్‌కు ఆర్థిక సలహాదారుగా వున్న చిరంజీవి నేపాల్ సైతం కొత్త నోటు విడుదల తెలివితక్కువ నిర్ణయమని, రెచ్చగొట్టే చర్యని బాహాటంగా విమర్శించటం గమనించదగింది. అందువల్ల ఆయన తన పదవి పోగొట్టుకోవాల్సివచ్చినా ప్రభుత్వ నిర్ణయంపై జనంలో వున్న అసంతృప్తికి ఆ వ్యాఖ్యలు అద్దంపట్టాయి.
ఇరుగు పొరుగు దేశాలతో వున్న సరిహద్దు తగాదాలను పరిష్కరించుకోవటంలో అలసత్వం చూపితే వాటిని చైనా తనకు అనుకూలంగా మలుచుకుంటుందని గుర్తించటంలో మన పాలకులు విఫలమవుతున్నారు. ఎప్పుడో 2014లో ఉమ్మడి కార్యాచరణ బృందం ఏర్పాటుకు ఇరుదేశాల మధ్యా ఒప్పందం కుదిరినా ఇంతవరకూ సాకారం కాకపోవటంలో నేపాల్‌తోపాటు మన బాధ్యత కూడా వుంది.
ఈ విషయంలో నేపాల్ పాలకులకు ఎలాంటి స్వప్రయోజనాలున్నాయన్న అంశంతో మనకు నిమిత్తం లేదు. మన వంతుగా ఏం చేస్తున్నామో గమనించుకోవాలి. అటు నేపాల్ కూడా ఏకపక్ష చర్యలతో సాధించేదేమీ ఉండదని గ్రహించాలి. వివాదాలకు భావోద్వేగాలు జోడించటం ఎప్పటికీ పరిష్కారమార్గం కాదని గుర్తించాలి.
Comments
Please login to add a commentAdd a comment