Prachanda
-
ప్రధాని రాజీనామా కోరిన నేపాలీ కాంగ్రెస్
పొరుగుదేశం నేపాల్‌లో సంభవించిన రాజకీయ సంక్షోభం తారాస్థాయికి చేరింది. తాజాగా కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు మార్గం సుగమం చేయాలంటూ నేపాలీ కాంగ్రెస్ దేశ ప్రధాని పుష్ప కమల్ దహల్ ప్రచండను కోరింది. హిమాలయ దేశంలో గెరిల్లా మాజీ నేత నేతృత్వంలోని ప్రస్తుత ప్రభుత్వాన్ని గద్దె దింపేందుకు ప్రయత్నాలు ముమ్మరమయ్యాయి.తాజాగా నేపాలీ కాంగ్రెస్ అధ్యక్షుడు షేర్ బహదూర్ దేవుబా నివాసంలో జరిగిన నేపాలీ కాంగ్రెస్ సెంట్రల్ వర్క్ పెర్ఫార్మెన్స్ కమిటీ (సీడబ్ల్యూసీ) సమావేశంలో ప్రస్తుత రాజకీయ పరిస్థితులు, పార్టీ భవిష్యత్తు వ్యూహంపై చర్చించారు. ఈ నేపధ్యంలో షేర్ బహదూర్ దేవుబా, కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ నేపాల్-యూనిఫైడ్ మార్క్సిస్ట్ లెనినిస్ట్ (సీపీఎన్-యూఎంఎల్) అధ్యక్షుడు కేపీ శర్మ ఓలీతో సమావేశమై ప్రధాని పుష్ప కమల్ దహల్ ప్రచండ నేతృత్వంలోని పాలక కూటమి స్థానంలో కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి ఒక ఒప్పందాన్ని ఖరారు చేశారు.ఈ సమావేశం అనంతరం పార్టీ అధికార ప్రతినిధి డాక్టర్ ప్రకాష్ శరణ్ మహత్ విలేకరులతో మాట్లాడుతూ నేపాల్‌లో అతిపెద్ద పార్టీ అయిన నేపాలీ కాంగ్రెస్, యూఎంఎల్‌లు కలిసి కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు సిద్ధమై, అందుకు మార్గం సుగమం చేసేందుకు ప్రధాని రాజీనామా చేయాలని కోరాయని తెలిపారు. దేశంలోని ఇతర పార్టీలు కూడా కొత్త నేపాలీ కాంగ్రెస్-యుఎంఎల్ కూటమికి మద్దతు ఇస్తున్నాయన్నారు. అయితే ప్రధాని ప్రచండ తన పదవికి రాజీనామా చేసేందుకు నిరాకరించారు. రాజ్యాంగంలోని నిబంధనల ప్రకారం, సభలో మెజారిటీ కోల్పోయిన ప్రధానమంత్రి రాజీనామాకు సిద్ధమైతే అతను పాలక కూటమికి మద్దతు ఇవ్వాల్సి ఉంటుందన్నారు. అయితే ఇందుకు సభలో ఓటింగ్ జరగాలన్నారు. -
ఏడాదిన్నరలో నాలుగోసారి..
కాఠ్మండు: నేపాల్ ప్రధానమంత్రి పుష్పకుమార్ దహల్ ‘ప్రచండ’సోమవారం పార్లమెంట్లో విశ్వాస తీర్మానం నెగ్గారు. పార్లమెంట్లో ప్రచండ సారథ్యంలోని నేపాల్ కమ్యూనిస్ట్ పార్టీ(మావోయిస్ట్ సెంటర్) మూడో అతిపెద్ద పారీ్టగా ఉంది. సోమవారం పార్లమెంట్లో జరిగిన ఓటింగ్‌లో 275 మంది సభ్యులకుగాను హాజరైన 158 మందిలో ప్రచండ ప్రభుత్వానికి అనుకూలంగా 157 మంది ఓటేశారు. ప్రచండ సభ విశ్వాసం పొందినట్లు పార్లమెంట్ స్పీకర్ ప్రకటించారు. ప్రచండ 2022లో ప్రధాని పగ్గాలు చేపట్టాక గత 18 నెలల్లో పార్లమెంట్ విశ్వాసం పొందడం ఇది నాలుగోసారి. -
నేపాల్ కొత్త లడాయి
తీరి కూర్చుని సమస్యలు సృష్టించుకోవటంలో నేపాల్ ప్రధాని ప్రచండను మించినవారెవరూ ఉండరు. కనుకనే భారత్‌లోని ప్రాంతాలతో కూడిన వివాదాస్పద మ్యాప్‌తో కొత్త వంద రూపాయల నోటు విడుదల చేసి మరో గొడవకు తెరతీశారు. మన ఉత్తరాఖండ్‌లో భాగంగా... 372 చదరపు కిలోమీటర్ల మేర విస్తరించివున్న లింపియాథుర, కాలాపానీ, లిపులేఖ్ ప్రాంతాలను తనవిగా చెప్పుకుంటూ లడాయికి దిగడం నేపాల్‌కు కొత్త కాదు. నాలుగేళ్లక్రితం ఆ ప్రాంతాలతో కూడిన భౌగోళిక చిత్రపటాన్నీ, దానికి సంబంధించిన బిల్లునూ పార్లమెంటులో ప్రవేశపెట్టి ఏకగ్రీవ ఆమోదం కూడా పొందింది. నిజానికి అంతకుముందే 2014లో ప్రధాని నరేంద్ర మోదీ నేపాల్‌లో పర్యటించి సరిహద్దు వివాదాల పరిష్కారానికి ఉభయ దేశాల ప్రతినిధులతో ఒక కార్యాచరణ బృందాన్ని ఏర్పాటు చేసుకోవాలని ప్రతిపాదించారు. అందుకు నేపాల్ కూడా ఆమోదం తెలిపింది. దానికి సంబంధించి తదుపరి చర్యలు తీసుకోవటంలో ఇరు దేశాలూ చొరవ తీసుకోలేదన్నది వాస్తవం. ఆ పని తక్షణం మొదలుకావాలని భారత్‌ను డిమాండ్ చేయటంలో తప్పులేదు. అందుకు దౌత్యమార్గంలో నిరంతర చర్చలు జరపటం కూడా అవసరం. కానీ దీన్ని వదిలి 2020లో ఏకపక్షంగా మ్యాప్‌ను విడుదల చేసి సమస్యను మరింత జటిలం చేయటానికే నేపాల్ మొగ్గుచూపింది. పాలక కూటమిలో అంతర్గత విభేదాలు వచ్చిన ప్రతిసారీ ప్రజల దృష్టి మళ్లించేందుకు భారత్‌తో వున్న సరిహద్దు సమస్యను ఎజెండాలోకి తీసుకురావటం తప్ప ఆ వివాదాన్ని చిత్తశుద్ధితో పరిష్కరించుకుందామన్న ఆలోచన పాలకులకు లేదనే విమర్శలు తరచు రావటానికి ఇదే కారణం. వంద రూపాయల నోటుపై వివాదాస్పద మ్యాప్ ఉండాలనుకోవటం వెనక కూడా ఇలాంటి ఉద్దేశమే ఉందన్నది విపక్షాల విమర్శ. తన ఏలుబడిలోని కూటమిలో భాగస్వామిగా వున్న జనతా సమాజ్‌వాదీ పార్టీ–నేపాల్ (జేఎస్పీ–ఎన్)లో కుమ్ములాట మొదలైన మరుక్షణమే ప్రచండ వివాదాస్పద మ్యాప్‌ను బయటకు తీశారు.భారత్ మద్దతున్న మాధేసి తెగల సమూహానికి ప్రాతినిధ్యంవహించే ఆ పార్టీలో అంతర్గత తగాదాలు బయల్దేరితే నేపాల్ రాజకీయాలపై వాటి ప్రభావం ఎక్కువేవుంటుంది. 2020లో సరిహద్దు సమస్యపై నేపాల్ పార్లమెంటులో బిల్లుపెట్టి ఏకగ్రీవంగా ఆమోదించేలా చేయటంలో కీలకపాత్రపోషించిన అప్పటి ప్రధాని, సీపీఎన్ (యూఎంఎల్) నాయకుడు కేపీ శర్మ ఓలి రెండు నెలలక్రితం పాలక కూటమిలో చేరటం కూడా కొత్త కరెన్సీనోటు ముద్రణకు కారణమంటున్నారు. ‘దురాక్రమణలోవున్న నేపాల్ భూభాగాలను తిరిగి తీసుకురావటమే తమ కర్తవ్యమని సీపీఎన్(యూఎంఎల్) తన మేనిఫెస్టోలో ఇప్పటికే ప్రకటించివుంది. అయితే నేపాల్ పార్లమెంటు కొత్త మ్యాప్‌ను ఆమోదించినప్పుడు ప్రజల్లో కనిపించిన ఉత్సాహం, ఉద్వేగం ఇప్పుడు లేవు సరికదా...ప్రచండపై విమర్శలే అధికంగా వినిపిస్తున్నాయి. ఇలా అత్యుత్సాహంతో సొంత మ్యాప్‌లు రూపొందించుకోవటం ఒక్క నేపాల్‌కే కాదు...చైనా, పాకిస్తాన్లకు కూడా అలవాటే. మన అరుణాచల్ ప్రదేశ్‌లోని భౌగోళిక ప్రాంతాలకు తనవైన పేర్లు పెట్టుకుని, మ్యాప్‌లలో చూపుకోవటం చైనాకు అలవాటు. పాకిస్తాన్దీ అదే సంస్కృతి. అది జమ్మూ, కశ్మీర్లో కొంత ప్రాంతాన్ని ఏనాటినుంచో తన మ్యాప్‌లలో చూపుతోంది. దేశాలమధ్య సరిహద్దులకు సంబంధించి తలెత్తే వివాదాలు ప్రజలను రెచ్చగొడితే పరిష్కారం కావు. వాటిని దౌత్య స్థాయిలో అవతలి దేశంతో ఓపిగ్గా చర్చించి, చారిత్రక, సాంస్కృతిక ఆధారాల పరిశీలనకు నిపుణులతో ఉమ్మడి కమిటీలు ఏర్పాటుచేసుకోవాలి. ఆ మార్గాన్ని వదిలి ఇష్టానుసారం జనం భావోద్వేగాలను రెచ్చగొట్టాలనుకుంటే పరిష్కారానికి అందనంత జటిలంగా వివాదాలు మారతాయి. నిజానికి సరిహద్దు తగాదాలన్నీ మన దేశాన్ని పాలించిన బ్రిటిష్ వలసపాలకులు వదిలిపెట్టిపోయినవే. 1814–16 మధ్య సాగిన ఆంగ్లో–నేపాలీ యుద్ధంలో ఈస్టిండియా కంపెనీకి నేపాల్ ధారాదత్తం చేసిన ప్రాంతమే ప్రస్తుత వివాదానికి మూలం. వలసపాలకులు పోయిన ఏడున్నర దశాబ్దాల తర్వాత కూడా ఆ భూభాగంపై ఇరు దేశాల మధ్యా అవగాహన కుదరకపోవటం విచారించదగ్గదే. నిజానికి నేపాల్‌తో సరిహద్దు వివాదాలు అసలు పరిష్కారం కాలేదని చెప్పలేం. గత మూడు దశాబ్దాల్లో ఇరు దేశాలూ పరస్పరం చర్చించుకుని దాదాపు 98 శాతం సమస్యలను పరిష్కరించుకోగలిగాయి. మిగిలిన సమస్యల్ని సైతం ఈ దోవలోనే పరిష్కరించుకోవచ్చన్న ఇంగితజ్ఞానం నేపాల్ నేతలకు లేదు. దేశాధ్యక్షుడు రామచంద్ర పోద్వాల్కు ఆర్థిక సలహాదారుగా వున్న చిరంజీవి నేపాల్ సైతం కొత్త నోటు విడుదల తెలివితక్కువ నిర్ణయమని, రెచ్చగొట్టే చర్యని బాహాటంగా విమర్శించటం గమనించదగింది. అందువల్ల ఆయన తన పదవి పోగొట్టుకోవాల్సివచ్చినా ప్రభుత్వ నిర్ణయంపై జనంలో వున్న అసంతృప్తికి ఆ వ్యాఖ్యలు అద్దంపట్టాయి. ఇరుగు పొరుగు దేశాలతో వున్న సరిహద్దు తగాదాలను పరిష్కరించుకోవటంలో అలసత్వం చూపితే వాటిని చైనా తనకు అనుకూలంగా మలుచుకుంటుందని గుర్తించటంలో మన పాలకులు విఫలమవుతున్నారు. ఎప్పుడో 2014లో ఉమ్మడి కార్యాచరణ బృందం ఏర్పాటుకు ఇరుదేశాల మధ్యా ఒప్పందం కుదిరినా ఇంతవరకూ సాకారం కాకపోవటంలో నేపాల్‌తోపాటు మన బాధ్యత కూడా వుంది. ఈ విషయంలో నేపాల్ పాలకులకు ఎలాంటి స్వప్రయోజనాలున్నాయన్న అంశంతో మనకు నిమిత్తం లేదు. మన వంతుగా ఏం చేస్తున్నామో గమనించుకోవాలి. అటు నేపాల్ కూడా ఏకపక్ష చర్యలతో సాధించేదేమీ ఉండదని గ్రహించాలి. వివాదాలకు భావోద్వేగాలు జోడించటం ఎప్పటికీ పరిష్కారమార్గం కాదని గుర్తించాలి. -
నేపాల్‌లో అధికార క్రీడ
ఏడాదిన్నర కూడా కాకముందే నేపాల్‌లో మూడో ప్రభుత్వం ఏర్పాటైంది. విచిత్రమైన కూటములు జట్టుకట్టాయి, విడిపోయాయి, మళ్లీ ఒక్కటయ్యాయి. ఇందులో భారత్ అనుకూల, అననుకూల పార్టీలూ ఉన్నాయి. మూడు ప్రభుత్వాలకూ సారథిగా ప్రచండ ఉండటం విశేషం. కోవిడ్ –19 మహమ్మారి తర్వాత నేపాలీ ఆర్థిక వ్యవస్థ తీవ్రంగా దెబ్బతింది. తిరిగి పుంజుకునే సంకేతాలు ఎంతమాత్రమూ కనబడటం లేదు. ఇది ప్రజల్లో నిరుత్సాహానికి దారి తీస్తోంది. గతంలో ఉన్న రాచరికమే మంచిదని కొందరు భావిస్తున్నారు. కొన్ని వారాల క్రితం, ఖాట్మండులో రాచరికం అనుకూల ప్రదర్శన కూడా జరిగింది. ప్రస్తుత కూటమి అమరిక వల్ల, ఇంకా మూడేళ్ల వ్యవధి ఉన్నప్పటికీ తిరిగి సాధారణ ఎన్నికలకు రంగం సిద్ధం అయినట్టుగా కనబడుతోంది. నేపాల్‌లో కేవలం 15 నెలల్లోనే మూడవ ప్రభుత్వం ఏర్పాటైంది. ఆసక్తికరంగా, ఈ మూడు ప్రభుత్వాలకూ పుష్పకమల్ దహల్ అలియాస్ ప్రచండ సారథ్యం వహించారు. 2022 నవంబర్‌లో జరిగిన సార్వత్రిక ఎన్ని కల్లో ఆయన పార్టీ మావోయిస్ట్ సెంటర్ 30 స్థానాలతో ప్రతినిధుల సభలో మూడవ స్థానంలో నిలిచింది. 275 మంది సభ్యుల సభలో 88 స్థానాలతో నేపాలీ కాంగ్రెస్ మొదటి స్థానంలో, 78 స్థానాలతో కమ్యూ నిస్ట్ పార్టీ ఆఫ్ నేపాల్ (యూనిఫైడ్ మార్క్సిస్ట్– లెనినిస్ట్) లేదా సీపీ ఎన్–యూఎమ్ఎల్ రెండవ స్థానంలో నిలిచాయి. చీలిపోయిన ప్రజా తీర్పు ముఖ్యమైన స్థానాన్ని ప్రచండ పొందేలా అనుమతించింది. మొదటిదే అయినప్పటికీ స్వల్పకాలంలోనే ముగిసిన కూటమి సీపీఎన్–యూఎమ్ఎల్, మావోయిస్టులకూ మధ్య ఏర్పడినది.ప్రచండకు ప్రధానమంత్రి పదవిని అందించిన తర్వాత, ఆయన నేపాలీ కాంగ్రెస్ వైపునకు మళ్లడంతో ఒక నెలలోనే ఆ కూటమి విచ్ఛి న్నమైంది. చిత్రంగా, అదే ప్రచండనీ, అదే సీపీఎన్–యూఎమ్ఎల్నీ మళ్లీ ఒకచోట చేర్చిన ప్రస్తుత కూటమిలో, మరో రెండు వామపక్ష అనుకూల పార్టీలు కూడా ఉన్నాయి. ఉపేంద్ర యాదవ్ నేతృత్వంలోని సమాజ్బాదీలు (సోషలిస్టులు), మాజీ ప్రధాని మాధవ్ కుమార్ నేపాల్ ఆధ్వర్యంలో ఏర్పాటైన మాజీ సీపీఎన్–యూఎమ్ఎల్ సభ్యుల పార్టీ ప్రస్తుత ప్రభుత్వానికి మద్దతునిస్తున్నాయి.ఈ కూటమిలోనే రాష్ట్రీయ స్వతంత్ర పార్టీ (ఆర్ఎస్పీ) ఉండటం కొందరికి ఆశ్చర్యం కలిగిస్తుంది. ఈ పార్టీకి 21 సీట్లున్నాయి. యువత ఆకాంక్షలను సమర్థించే, పశ్చిమ దేశాలకు అనుకూలంగా ఉండే ఒక వేదికగా ఈ పార్టీని చెప్పుకోవచ్చు. ఈ పార్టీ గతంలో మొదటి మావో యిస్టు... సీపీఎన్–యూఎమ్ఎల్ కూటమిలో భాగంగా ఉండేది. అంతకుముందు అమెరికన్ జాతీయుడైన రవీ లామిఛానే దాని నాయ కుడు. ప్రస్తుత సంకీర్ణంలోని నలుగురు ఉప ప్రధాన మంత్రులలో ఆయన ఒకరుగా ఉన్నారు.కోవిడ్ –19 మహమ్మారి కాలంలో నేపాలీ ఆర్థిక వ్యవస్థ తీవ్రంగా దెబ్బతింది. కానీ ఇతర దేశాల మాదిరిగా, తిరిగి పుంజుకునే సంకే తాలు ఎంతమాత్రమూ కనబడటం లేదు. ఇది ప్రజల్లో నిరుత్సాహా నికి దారి తీస్తోంది. రాజకీయ వర్గం ఫలితాలు చూపని కారణంగా కొంతమంది గతంలో ఉన్న రాచరికమే మంచిదని కూడా భావిస్తు న్నారు. కొన్ని వారాల క్రితం, రాజధాని నగరం ఖాట్మండులో రాచ రికం అనుకూల ప్రదర్శన కూడా జరిగింది. ఆర్థిక సమస్యలపై నేపాలీ కాంగ్రెస్ చాలా మొండితనంతో ఉందని ప్రచండ ఆరోపించారు. ఆ కారణంగా రాజకీయంగా తన మార్పును సమర్థించుకున్నారు. అయితే, ఐదుసార్లు ప్రధానమంత్రిగా పనిచేసిన నేపాలీ కాంగ్రెస్ నాయకుడు షేర్ బహదూర్ దేవుబా నిరంతరం వేచివున్న ప్రధానమంత్రి స్థానంలో పరిభ్రమించడం ప్రచండ నిజంగానే భరించలేకపోయి ఉంటారు. కానీ సాంప్రదాయకంగా నేపాలీ కాంగ్రెస్‌తో వ్యవహరించడం సులభతరమని భారతదేశం గ్రహించింది. నేపాల్‌ను హిందూ రాజ్యంగా పునఃస్థాపించాలనే నేపాలీ కాంగ్రెస్ నాయకత్వానికి మావో యిస్టు–నేపాలీ కాంగ్రెస్ కూటమి కొంత ఓదార్పునిచ్చింది. 2015 రాజ్యాంగం నేపాల్‌ను లౌకిక దేశంగా ప్రకటించింది. అయితే, సీపీఎన్–యూఎమ్ఎల్ నాయకుడు అయిన కేపీ శర్మ ఓలి గతంలో కూడా హిందూ రాజ్యం పట్ల గానీ, నేపాల్‌లో ‘సాంస్కృతిక’ రాచరికం పట్ల గానీ విముఖంగా లేరని గమనించాలి. అయోధ్యలో రామ మందిర శంకుస్థాపనను నేపాల్ ఉత్సాహంతో స్వీకరించింది. ఇది హిందూ రాజ్యానికి మద్దతును పెంచుతుంది. ప్రచండ కూడా సానుకూల పాత్రను పోషిస్తున్నట్లు కనిపిస్తు న్నారు. సంవత్సరాల తరబడి తాను విడిచిపెట్టేసినటువంటి, హిందూ రాచరికంతో గుర్తింపు పొందిన నేపాలీ అధికారిక జాతీయ దుస్తులైన దౌడా సురూవాల్ను ధరించారు. ఏమైనప్పటికీ, ప్రచండ పెంపకం వామపక్షంతో కూడుకున్నది. అది రాచరికానికి వ్యతిరేకమైనది. ఆయ నకు ఇప్పుడు తనను తాను వెనక్కి తిప్పుకొనే, నేపాల్ గుర్తింపు రాజకీయాలను తిరిగి అక్కున చేర్చుకునే అవకాశం వచ్చింది. అంటే ప్రాథమికంగా భారతదేశం నుండి తనను తాను భిన్నంగా చూపు కోవడం. అందుకే ఆయన నేపాలీ కాంగ్రెస్‌తో విడిపోయినప్పుడు దానిని ‘ప్రతీఘాత శక్తి’ అని పేర్కొన్నారు. నేపాల్‌లోని రాజకీయ చర్చల్లో దక్షిణ (భారతదేశానికి సూక్ష్మ నామం), ఉత్తర (చైనా సూక్ష్మ నామం) పాత్రలకు సంబంధించిన సూచనలు సర్వ సాధారణం. సుమారు గత రెండు దశాబ్దాలుగా పశ్చిమ దేశాలనూ (అమెరికా, యూరోపియన్ యూనియన్ మొద లైనవి), చర్చ్తో కూడుకున్న వారి ఎన్జీఓ భాగస్వాముల పాత్రనూ కూడా కొట్టిపారేయలేము. ఇవి మానవ హక్కులు, లౌకిక వాద ఆలోచనలను కలిగి ఉండి, తమవైన డైనమిక్స్‌ను కలిగి ఉన్నాయి. కొందరికి వామపక్ష కూటమిలో రాష్ట్రీయ స్వతంత్ర పార్టీ చేరిక ఉత్తరాది– పాశ్చాత్య కూటమి మధ్య సఖ్యతలా కనిపిస్తుంది. చాలా మంది పరిశీలకు లకు, తాజా అమరిక నేపా ల్లో తదుపరి సాధారణ ఎన్ని కలకు రంగం సిద్ధం చేసిన ట్టుగా కనబడుతోంది. కాక పోతే ఎన్నికలకు ఇంకా మూడేళ్ల వ్యవధి ఉంది. అంత కాలం అవస రమైన ఓపికను ఓలీ ప్రదర్శిస్తారా అని చాలామంది అనుమానిస్తు న్నారు. 2020లో, అధికార భాగస్వామ్య ఒప్పందం ఉన్నప్పటికీ ప్రచండకు ప్రధానమంత్రి పదవిని వదులుకోవడానికి ఆయన ఇష్టపడలేదు. ప్రచండ ఇప్పటికే ప్రజల్లో తన పట్టును కోల్పోయినందున, తన పాత కమ్యూనిస్ట్ సహచరులతో చేతులు కలపడమే ఏకైక మార్గం. సీపీఎన్ –యూఎమ్ఎల్ మద్దతుదారుల నుండి మావోయిస్టులకు ఓటు బదిలీ అంత సులభం కానప్పటికీ, నేపాలీ కాంగ్రెస్ నుండి మావోయిస్టులకు బదిలీ చేయడం ఇంకా కఠినమైనది. కొత్త అమరిక చైనీయులు సంతో షించడానికి ఒక కారణాన్నిస్తుంది. అంతర్గత నేపాలీ రాజకీయ కోణం కూడా ఉన్నప్పటికీ, దాన్ని తీసుకురావడంలో వారి పాత్ర ఉంది. భారతదేశం ఇప్పటివరకూ నేపాల్‌కు అతిపెద్ద వాణిజ్య, ఆర్థిక భాగస్వామి. పైగా దేశంలో ఆర్థిక తేజస్సుకు గేట్‌వే. నేపాల్‌కు దాని పెరుగుతున్న జలవిద్యుత్ ఉత్పత్తి అవసరాల నుండి ప్రయోజనాలను పొందేందుకు ఇది ఏకైక అర్థవంతమైన మార్గం. ఇటీవలి సంవ త్సరాలలో సమీకృత చెక్ పోస్టుల నిర్మాణం, రైల్వే కనెక్టివిటీ అభివృద్ధి, విద్యుత్ సరఫరా లైన్లు, యూపీఐ లావాదేవీలకు వెళ్లడం వంటి వాటితో నేపాల్ కనెక్టివిటీకి భారత్ ఊతమిచ్చింది. వాస్తవానికి, నేపాల్‌కు చమురు సరఫరా చేయడానికి ఏర్పాటయ్యే పైప్‌లైన్, 900 మెగావాట్ల అరుణ్–3 ప్రాజెక్ట్ నిర్మాణంతో సహా చాలా ప్రాజెక్టులు ఓలీ 2018–19లో ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ప్రారంభించారు.నేపాల్‌లో, ఇండియా కార్డ్‌ను ప్లే చేయడం వల్ల అది ప్రజల సెంటిమెంట్‌ను ప్రభావితం చేస్తుంది. ఆర్థిక వ్యవస్థ చాలా ముఖ్య మైనది. అనారోగ్యకరమైన ఆర్థిక స్థితి ఏ ప్రస్తుత ప్రధానమంత్రికీ మంచిది కాదు. సులభతరమైన వ్యాపారాన్ని మెరుగుపరచడం కోసం తీసుకునే చర్యలు భారతదేశం, నేపాల్ రెండింటి ప్రయోజనాలకు ఉపయోగపడుతాయి. మంజీవ్ సింగ్ పురీ వ్యాసకర్త నేపాల్‌లో భారత మాజీ రాయబారి (‘ద ట్రిబ్యూన్’ సౌజన్యంతో) -
నేపాల్‌లో రాజకీయ సంక్షోభం?
నేపాల్ రాజకీయాల్లో గందరగోళం నెలకొంది. నేపాల్ ప్రధాని పుష్ప కమల్ దహల్ ప్రచండ నేపాలీ కాంగ్రెస్‌తో పొత్తును తెగతెంపులు చేసుకున్నారు. ఇరు పార్టీల్లో నెలకొన్న విభేదాల కారణంగా నేపాలీ కాంగ్రెస్‌తో భాగస్వామ్యానికి ప్రచండ స్వస్తి పలికారు. మాజీ ప్రధాని కెపీ ఓలీ పార్టీతో కొత్త కూటమి ఏర్పాటు చేయాలని ప్రచండ నిర్ణయించారు. నేపాల్ కమ్యూనిస్ట్ పార్టీ (మావోయిస్ట్ సెంటర్) నాయకుడు ఒకరు మాట్లాడుతూ ప్రచండ నేతృత్వంలోని సీపీఎన్ (మావోయిస్ట్ సెంటర్), షేర్ బహదూర్ దేవుబా నేతృత్వంలోని నేపాలీ కాంగ్రెస్ మధ్య పొత్తు ముగిసిందని, ఇద్దరు అగ్రనేతల మధ్య విభేదాలు తీవ్రమయ్యాయని చెప్పారు. సీసీఎన్ (మావోయిస్ట్ సెంటర్) కార్యదర్శి గణేష్ షా మాట్లాడుతూ నేపాలీ కాంగ్రెస్ ప్రధానమంత్రికి సహకరించలేదు. అందుకే తాము కొత్త కూటమి కోసం చూడవలసి వచ్చిందన్నారు. కాగా నేపాలీ కాంగ్రెస్ మద్దతుతో 2022, డిసెంబర్ 25న ప్రచండ నేపాల్ ప్రధాని అయ్యారు. హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్‌లో అతిపెద్ద పార్టీ అయిన నేపాలీ కాంగ్రెస్‌తో పొత్తును తెంచుకున్న తర్వాత, ప్రచండ.. ఓలీ నేతృత్వంలోని నేపాల్ కమ్యూనిస్ట్ పార్టీ (యూనిఫైడ్ మార్క్సిస్ట్-లెనినిస్ట్)తో చేతులు కలపాలని నిర్ణయించుకున్నారు. -
ప్రధానితో ముందుగానే వెళ్లిన విమానం.. 31 మంది ప్రయాణికులు విలవిల
నేపాల్ ప్రధాని పుష్పకమల్ దహల్ ప్రచండ యూఏఈలో జరిగే కాప్- 28 వాతావరణ సదస్సులో పాల్గొనేందుకు వెళ్లారు. ఈ సమయంలో ఒక విచిత్రం చోటుచేసుకుంది. ప్రధాని ప్రచండను తీసుకుని దుబాయ్‌కు బయలుదేరిన విమానం షెడ్యూల్ కంటే ముందే బయలుదేరింది. నిర్ణీత సమయానికి ముందుగానే విమానం టేకాఫ్ కావడంతో 31 మంది ప్రయాణికులు విమానాశ్రయంలో చిక్కుకుపోయి, పలు అవస్థలు పడ్డారు. మీడియాకు అందిన సమాచారం ప్రకారం నేపాల్ ప్రధాని ప్రచండతో దుబాయ్‌కి బయలుదేరిన నేపాల్ ఎయిర్‌లైన్స్ విమానం నిర్ణీత షెడ్యూల్‌కు రెండు గంటల ముందుగానే బయలుదేరింది. దీంతో ఖాట్మండులోని త్రిభువన్ అంతర్జాతీయ విమానాశ్రయంలో 31 మంది ప్రయాణికులు చిక్కుకుపోయారు. దుబాయ్ వెళ్లే విమానం ఆర్ఏ- 299 బుధవారం రాత్రి 11.30 గంటలకు టేకాఫ్ కావాల్సి ఉండగా, వీవీఐపీ హోదా కారణంగా విమానం 9.30 గంటలకు బయలుదేరిందని విమానయాన సంస్థ తెలిపింది. ‘ప్రధాని ప్రచండ అదే విమానంలో ఉన్నారు. కాప్-28 సమ్మిట్ కోసం ఆయన ప్రతినిధి బృందంతో కలిసి దుబాయ్‌కి బయలుదేరారని, అందుకే విమానం ముందుగానే బయలుదేరాల్సి వచ్చింది. ప్రయాణికులకు కలిగిన అసౌకర్యానికి క్షమాపణలు’ అంటూ విమానయాన సంస్థ ఒక ప్రకటన విడుదల చేసింది. ఆ విమాన ప్రయాణికుల జాబితాలో 274 మంది ప్రయాణికులు ఉన్నారు. వారిలో 31 మంది విమానం ఎక్కలేకపోయారు. విమానం రెండు గంటలు రీషెడ్యూల్ చేశాం. ఇమెయిల్ ద్వారా విమానం బయలుదేరే సమయం గురించి ప్రయాణికులకు ముందుగానే తెలియపరిచాం. అయితే 31 మంది ప్రయాణికులు స్పందించలేదని ఎయిర్‌లైన్ వివరించింది. యూఏఈలో జరిగే వాతావరణ సదస్సులో పాల్గొనేందుకు ప్రధాని ప్రచండ.. నేపాల్ నుంచి దుబాయ్ చేరుకున్నారు. అక్కడ ఆయన పలువురు దేశాధినేతలతో ద్వైపాక్షిక చర్చలు కూడా జరుపుతారు. మరోవైపు కాప్- 28 వాతావరణ సదస్సులో పాల్గొనేందుకు భారత ప్రధాని నరేంద్ర మోదీ కూడా ఇప్పటికే దుబాయ్ చేరుకున్నారు. అక్కడ ప్రవాస భారతీయులు ఆయనకు ఘనస్వాగతం పలికారు. ఇది కూడా చదవండి: ఎయిమ్స్ నుంచి కార్మికులు డిశార్జ్ -
రాష్ట్రపతి ముర్ముతో ప్రచండ భేటీ
న్యూఢిల్లీ: నేపాల్‌ను ప్రాధాన్యత గల దేశంగా భారత్ పరిగణిస్తుందని రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము స్పష్టం చేశారు. కీలక ప్రాజెక్టులను నిర్ణీత కాలంలోగా పూర్తి చేయడం సహా రెండు దేశాల మధ్య అభివృద్ధి భాగస్వామ్యాన్ని విస్తృతం చేసుకునేందుకు కట్టుబడి ఉంటుందని హామీ ఇచ్చారు. భారత్ పర్యటిస్తున్న నేపాల్ ప్రధాని పుష్పకుమార్ దహల్ ‘ప్రచండ’గురువారం రాష్ట్రపతి భవన్లో రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ముతో భేటీ అయ్యారు. ఇటీవలి సంవత్సరాల్లో నేపాల్–భారత్ ద్వైపాక్షిక సంబంధాలు క్రమేపీ వృద్ధి చెందుతు న్నాయని ముర్ము అన్నారు. ఇరు దేశాల ప్రజల మధ్య సంబంధాలను, పర్యాట కాన్ని అభివృద్ధి చేసేందుకు ఆధ్యాత్మిక పర్యాటక సర్క్యూట్‌ను పునరుద్ధరించాల్సిన అవసరం ఉందని ఆమె అన్నారు. తరాలుగా కొనసాగుతున్న సంబంధాలు మరింతగా బలపడాలని రాష్ట్రపతి ముర్ము ఆకాంక్షించారని రాష్ట్రపతి భవన్ తెలిపింది. అనంతరం నేపాల్ ప్రధాని ప్రచండ ఉపరాష్ట్రపతి జగ్దీప్ ధన్‌ఖడ్‌ను ఆయన నివాసంలో కలుసుకున్నారు. -
నేపాల్ ప్రభుత్వంలో కుదుపు
కాఠ్మాండు: వచ్చే నెలలో జరగబోయే నేపాల్ అధ్యక్ష ఎన్నికల్లో అధికార కూటమి పార్టీ సీపీఎన్–యూఎంఎల్ బలపరిచిన అభ్యర్థినికాకుండా అధికార కూటమిలోలేని వేరొక పార్టీ అభ్యర్థికి ప్రధాని ప్రచండ మద్దతు పలకడం సీపీఎన్–యూఎంఎల్‌కు ఆగ్రహం తెప్పించింది. దీంతో ప్రభుత్వానికి తమ మద్దతును ఉపసంహరించుకుంటున్నట్లు ఆ పార్టీ సోమవారం ప్రకటించింది. ఆ పార్టీకి చెందిన నేతలైన ఉపప్రధాని, ఆర్థికమంత్రి బిష్ణు పౌద్యాల్, విదేశాంగ మంత్రి తమ పదవులకు రాజీనామా చేయాలని నిర్ణయించారు. దీంతో రెండు నెలల క్రితమే ఏర్పడిన సంకీర్ణ ప్రభుత్వం కూలే అవకాశాలు ఎక్కువయ్యాయి. విపక్ష నేపాలీ కాంగ్రెస్ పార్టీకి చెందిన రామచంద్ర పౌద్యాల్కు గత శనివారం ఎనిమిది రాజకీయ పార్టీలు సమ్మతి తెలపడం, అధికారకూటమిలోని నేషనల్ డెమొక్రటిక్ పార్టీ.. ప్రభుత్వం నుంచి వైదొలగుతున్నట్లు ప్రకటించడం, ఉపప్రధాని పదవికి రాష్ట్రీయ ప్రజాతంత్ర పార్టీ చైర్మన్ రాజేంద్ర ప్రసాద్ లింగ్టెన్ రాజీనామాచేయడం తెల్సిందే. సీపీఎం–యూఎంఎల్ మద్దతులేకున్నా పార్లమెంట్లో 89 మంది సభ్యులున్న నేషనల్ కాంగ్రెస్ పార్టీతో విశ్వాసతీర్మానాన్ని ప్రచండ సర్కార్ గట్టెక్కే వీలుంది. గత డిసెంబర్లో 7 పార్టీల కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసింది. అధికార కూటమి పార్టీలు మద్దతు ఉపసంహరిస్తే ప్రధాని ప్రచండ నెలరోజుల్లోపు పార్లమెంట్లో విశ్వాసపరీక్షలో నెగ్గాలి. -
నేపాల్‌లో నాటకీయ పరిణామాలు.. ప్రధానిగా ‘ప్రచండ’ నియామకం
కాఠ్మాండు: నేపాల్ రాజకీయాల్లో నాటకీయ పరిణామాల మధ్య ప్రధానమంత్రిగా సీపీఎన్-మావోయిస్ట్ సెంటర్ పార్టీ ఛైర్మన్ పుష్ప కమల్ దహాల్ ‘ప్రచండ’ ప్రధానిగా నియామకమయ్యారు. అధికార పంపకాలపై నేపాలీ కాంగ్రెస్ అధ్యక్షుడు షేర్ బహదుర్ దేవ్బాతో జరిగిన చర్చలు విఫలమైన క్రమంలో మాజీ ప్రధాని కేపీ శర్మ ఓలితో జతకట్టారు ప్రచండ. ఓలితో పాటు విపక్షంలోని చిన్న చిన్న పార్టీలు ప్రచండకు మద్దతు ప్రకటించాయి. దీంతో తనకు 165 మంది చట్టసభ్యుల మద్దతు ఉందని నేపాల్ అధ్యక్షురాలు బిద్యా దేవి భండారిని కలిశారు. అధికారం ఏర్పాటు చేసేందుకు అనుమతించాలని కోరారు. ఈ క్రమంలో ఆయన్ను ప్రధానిగా నియమిస్తూ అధ్యక్షురాలు బిద్యా దేవి భండారి ఆదేశాలు జారీ చేశారు. సోమవారం సాయంత్రం ప్రమాణ స్వీకారం రాజ్యాంగంలోని ఆర్టికల్ 76 క్లాజ్ 2 ప్రకారం నేపాల్ తదుపరి ప్రధానిగా ప్రచండను నియమించినట్లు అధ్యక్ష కార్యాలయం ప్రకటన జారీ చేసింది. అంతకు ముందు ఆదివారం సాయంత్రం 5 గంటల్లోనే చట్టసభ్యులు మెజారిటీని కూడగట్టి ప్రభుత్వ ఏర్పాటుకు ముందుకు రావాలని ప్రెసిడెంట్ కోరారు. గడువు ముగిసే సమయానికి కొద్ది గంటల ముందు ప్రచండ ప్రభుత్వ ఏర్పాటుకు అనుమతివ్వాలని కోరారు. దీంతో ఆయనను నియమిస్తూ ప్రెసిడెంట్ ఉత్తర్వులు జారీ చేశారు. సోమవారం సాయంత్రం 4 గంటలకు ప్రమాణస్వీకార కార్యక్రమం ఉంటుందని స్పష్టం చేసింది. ప్రచండతో పాటు సీపీఎన్-యూఎంఎల్ ఛైర్మన్ కేపీ శర్మ ఓలి, రాష్ట్రీయ స్వతంత్ర పార్టీ(ఆర్ఎస్పీ) ప్రెసిడెంట్ రవి లమిచ్చనే, రాష్ట్రీయ ప్రజాతంత్ర పార్టీ చీఫ్ రాజేంద్ర లింగ్దే సహా ఇతర నేతలు హాజరయ్యారు. ప్రచండకు మొత్తం 275 సభ్యుల్లో 165 మంది చట్టసభ్యుల మద్దతు లభించింది. అందులో సీపీఎన్-యూఎంఎల్ 78, సీపీఎన్-ఎంసీ 32, ఆర్ఎస్పీ 20, ఆర్పీపీ 14, జేఎస్పీ 12, జనమాత్ 6, నాగరిక్ ఉన్ముక్తి పార్టీ 3 సభ్యులు ఉన్నారు. నేపాల్ ప్రధానిగా మూడోసారి బాధ్యతలు చేపట్టనున్నారు ప్రచండ. రొటేషన్ పద్ధతిపై ఒప్పందం.. నేపాల్ ప్రధాని పదవీ కాలం ఐదేళ్లు. పదవిని రొటేషన్ పద్ధతిలో చేపట్టాలని ఎన్నికలకు ముందు షేర్ బహదుర్ దేవ్బా, పుష్ప కమల్ దహాల్ మధ్య ఒప్పందం కుదిరింది. తొలి రెండున్నరేళ్లు తనకు పదవి ఇవ్వాలని ప్రచండ కోరగా.. అందుకు దేవ్బా నిరాకరించటంతో సంక్షోభం తలెత్తింది. విపక్ష కూటమితో చేతులు కలిపారు ప్రచండ, సహచర కమ్యూనిస్టు పార్టీ నేత, మాజీ ప్రధాని కేపీ శర్మ ఒలిని కలిశారు. రొటేషన్ పద్ధతిన ప్రధాని పదవిని పంచుకునేందుకు ఓలి అంగీకరించటంతో ప్రభుత్వ ఏర్పాటు, ప్రచండ ప్రధాని పదవి చేపట్టేందుకు మార్గం సుగమమైంది. ఇదీ చదవండి: ‘మా తల తీసేయమన్నా బాగుండేది’.. వర్శిటీల్లో నిషేధంపై అఫ్గాన్ మహిళల ఆవేదన -
స్వదేశీ ఆయుధ సంపత్తి
విజయదశమి.. ఆయుధపూజ వేళ... భారత వాయుసేన (ఐఏఎఫ్) అమ్ములపొదిలోకి మరో అస్త్రం వచ్చి చేరింది. స్వదేశీ పరిజ్ఞానంతో తయారైన అత్యాధునిక తేలికపాటి యుద్ధ హెలికాప్టర్ (ఎల్సీ హెచ్) ‘ప్రచండ’ చేరికతో మన సైన్యానికి కొత్త జవసత్వాలు సమకూరాయి. జోద్పూర్ వైమానిక కేంద్రం వేదికగా సోమవారం సైనిక ఉన్నతాధికారులతో కలసి రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ తొలివిడతగా నాలుగు హెలికాప్టర్లను లాంఛనంగా వాయుసేనలోకి ప్రవేశపెట్టారు. పలు విధాలుగా ఇది కీలక ఘట్టం. పొరుగున చైనా నుంచి పొంచివున్న ముప్పు నేపథ్యంలో ప్రధానంగా ఎల్తైన పర్వత ప్రాంతాల్లో సైతం శత్రువులపై పోరాడే దేశవాళీ ఛాపర్ ఇప్పుడు మన చేతిలో ఉన్నట్టయింది. ప్రభుత్వ రంగ హిందుస్తాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (హెచ్ఏఎల్ – హాల్) తయారు చేసిన ఈ లోహవిహంగం గణనీయంగా ఆయుధాలు, ఇంధనం తీసుకొని 5 వేల మీటర్ల ఎత్తున కూడా కిందకు దిగగలదు. టేకాఫ్ తీసుకోగలదు. ప్రపంచంలో అలాంటి యుద్ధ హెలికాప్టర్ ఇదొక్కటే అని నిపుణుల మాట. అతి వేడిగా ఉండే ఎడారుల్లో, రక్తం గడ్డ కట్టించే అతి ఎల్తైన ప్రాంతాల్లో, విద్రోహ చర్యల్ని విచ్ఛిన్నం చేసే వేళల్లో – ఇలా అన్ని యుద్ధ సందర్భాల్లో గురి తప్పకుండా లక్ష్యాన్ని ఛేదించ గలగడం ఈ లోహ విహంగాల ప్రత్యేకత. వెరసి, సైనిక ఆయుధాలను విదేశాల నుంచి కొనడానికే పేరుబడ్డ భారత్ ఈ దేశీయ తయారీ యుద్ధ హెలికాప్టర్లతో కనీసం ఇంతవరకైనా బయ్యర్ నుంచి బిల్డర్‌గా మారింది. ‘మేకిన్ ఇండియా’ స్వప్నసాకారంలో ఒక అడుగు ముందుకు పడింది. 1999 నాటి కార్గిల్ యుద్ధవేళ దేశీయంగా తయారైన తేలికపాటి యుద్ధ హెలికాప్టర్ అవసరం తొలిసారిగా మనకర్థమైంది. అప్పటికి మన దగ్గర చేతక్, చీతా లాంటి హెలికాప్టర్లే ఉన్నాయి. కానీ మరింత చురుగ్గా, బహు పాత్రపోషణ చేయగలవి అవసరమయ్యాయి. ఆ పరిస్థితుల్లో తొలి దశ చర్చల తర్వాత 2006 అక్టోబర్‌లో ప్రభుత్వం ఎల్సీహెచ్ ప్రాజెక్ట్‌ను ‘హాల్’కు మంజూరు చేసి, వాటిని అభివృద్ధి చేసే బాధ్యతను అప్పగించింది. అలా పైలట్, కోపైలట్లు ఒకరి వెనుక మరొకరు కూర్చొనేలా ఈ రెండు ఇంజన్ల, 5.8 టన్నుల లోహ విహంగాన్ని డిజైన్ చేశారు. అనేక కఠిన పరీక్షల అనంతరమే ఈ ఛాపర్లకు అనుమతినిచ్చి, సైన్యంలోకి తీసుకున్నారు. అందుకు 2010– 2015 మధ్య 4 నమూనా ఛాపర్లు సిద్ధం చేసి, రకరకాల ఎత్తుల్లో, 2 వేలకు పైగా గగనయాన పరీక్షలు చేశారు. 2017లో వైమానిక దళ నమూనాకూ, 2019లో ఆర్మీ నమూనాకూ తొలిదశ అనుమతి వచ్చింది. నిరుడు నవంబర్‌లో ప్రధాని మోదీ ప్రతీకాత్మకంగా ఎల్సీహెచ్ను భారత వైమానిక దళానికి అప్పగించి, ఆఖరి ఘట్టానికి తెర తీశారు. ఈ మార్చిలో భద్రతా వ్యవహారాల మంత్రివర్గ సంఘం వాయుసేనకు 10, ఆర్మీకి 5 – మొత్తం 15 ఎల్‌సీహెచ్‌ల తయారీకి ఆమోదం తెలిపింది. దరిమిలా సెప్టెంబర్ 29న బెంగళూరులో ఆర్మీలోకీ, ఇప్పుడు జోద్‌పూర్‌లో వాయుసేనలోకీ ఎల్‌సీహెచ్‌లను లాంఛనంగా ప్రవేశపెట్టారు. ఇలాంటి ఎల్‌సీహెచ్‌లు 160 దాకా మనకు అవసరం. గంటకు 268 కి.మీ గరిష్ఠ వేగంతో వెళ్ళగల ఈ ‘ప్రచండ’ ఛాపర్లలో అనేక ప్రత్యేకతలున్నాయి. 6.5 కి.మీ ఎత్తున ఎగరగల సత్తా ఈ లోహ విహంగం సొంతం. 20 ఎంఎం టరెట్ గన్, 70 ఎంఎం రాకెట్లు, గగనతల క్షిపణి వ్యవస్థలతో ఇది యుద్ధసన్నద్ధమై ఉంటుంది. శత్రు రాడార్ల గురి నుంచి రక్షణవ్యవస్థ ఉండే ఈ ఛాపర్ ముష్కరుల గగనతల భద్రతావలయాన్ని ఛేదించి, విద్రోహ చర్యలను తిప్పికొడుతుంది. తొలి దేశీయ యుద్ధ విమానవాహక నౌక ఐఎన్ఎస్ విక్రాంత్ జలప్రవేశం చేసి నెల తిరిగేసరికి ఇప్పుడు ఈ యుద్ధ హెలికాప్టర్లు మన వైమానికదళానికి సమకూరడం సంతోషమిచ్చే పరిణామం. వీటికన్నా ముందే ఈ జూన్‌లో తీరప్రాంత గస్తీ దళంలోకి దేశవాళీ అడ్వాన్స్›్డ లైట్ హెలికాప్టర్ ఎంకె–3 వచ్చి చేరింది. భారత రక్షణ రంగానికి ఇవన్నీ శుభసూచనలు. రక్షణ రంగంలో ఒకపక్క దిగుమతులు తగ్గించుకొంటూనే, మరోపక్క అంతర్జాతీయ వేదికపై తన ఉనికిని చాటుకుంటున్న ట్టయింది. గత అయిదేళ్ళలో మన రక్షణ ఎగుమతులు 334 శాతం పెరిగాయని సర్కారు వారి మాట. ప్రస్తుతం 75కి పైగా దేశాలకు మన రక్షణ ఉత్పత్తులను ఎగుమతి చేస్తున్నాం. మన తేలికపాటి యుద్ధ విమానం తేజస్‌పై మలేసియా, అర్జెంటీనా, ఆస్ట్రేలియా, ఈజిప్ట్, అమెరికా, ఇండొనేసియా, ఫిలిప్పైన్స్ సైతం ఆసక్తి కనబరచడం విశేషం. రక్షణ ఉత్పత్తుల దేశవాళీ డిజైనింగ్, అభివృద్ధి, తయారీకై కొన్నేళ్ళుగా తీసుకుంటున్న విధాన నిర్ణయాలు క్రమంగా ఫలితమిస్తున్నట్టున్నాయి. విదేశాల నుంచి రక్షణ ఉత్పత్తుల్ని మనం దిగుమతి చేసుకోవడం 2012–16తో పోలిస్తే, 2017–21లో దాదాపు 21 శాతం తగ్గాయని స్టాక్‌హోమ్ ఇంటర్నేషనల్ పీస్ రిసెర్చ్ ఇన్స్టిట్యూట్ చెబుతోంది. అయితే, ఇప్పటికీ ఆయుధాల దిగుమతిలో ప్రపంచంలో మనం ముందు వరుసలోనే మిగిలాం. రష్యన్ తయారీ ఆయుధాలపై భారీగా ఆధార పడ్డాం. ఈ పరిస్థితి మారాలంటే, తక్కువ వ్యయంతోనే ప్రపంచ ప్రమాణాలను అందుకొనే సాంకేతి కతను అభివృద్ధి చేయాలి. అదే అతి పెద్ద సవాలు. చిక్కులు లేకుండా ప్రభుత్వం అవసరమైన వనరుల్ని అందించి, పరిశోధన – అభివృద్ధిని ప్రోత్సహిస్తే, కీలక సాంకేతిక పరిజ్ఞానంపై పట్టు సాధించి ఆ సవాలును అధిగమించవచ్చు. రక్షణ రంగంలో దిగుమతులు తగ్గించుకొని, సొంత కాళ్ళ మీద నిలబడవచ్చు. దృఢసంకల్పం ఉంటే అది అసాధ్యమేమీ కాదని ‘ప్రచండ్’ రూపకల్పన చెబుతోంది. సాధించిన ఘనతతో పాటు సాధించాల్సిన లక్ష్యాలను మరోసారి గుర్తుచేస్తోంది. -
వాయుసేన అమ్ములపొదిలోకి ప్రచండ్ హెలికాఫ్టర్లు
-
శత్రువుల పాలిట ‘ప్రచండ’మే
సాక్షి, న్యూఢిల్లీ: స్వదేశీ పరిజ్ఞానంతో అభివృద్ధి చేసిన అధునాతన తేలికపాటి యుద్ధ హెలికాప్టర్(ఎల్సీహెచ్) ప్రచండ్ భారత వైమానిక దళంలో చేరింది. సోమవారం రాజస్తాన్‌లోని జోధ్‌పూర్ వైమానికస్థావరంలో రక్షణ మంత్రి రాజ్‌నాథ్, చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్(సీడీఎస్) జనరల్ అనిల్ చౌహాన్, ఎయిర్ చీఫ్ మార్షల్ వీఆర్ చౌదరి సమక్షంలో 4 లైట్ కంబాట్ హెలికాప్టర్లను వైమానిక దళంలోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా ప్రచండ్లో రాజ్‌నాథ్ కొద్దిసేపు ప్రయాణించారు. పర్వతప్రాంతాల్లో, ఎడారి వంటి ప్రతికూల వాతావరణంలో పగలూ, రాత్రి శత్రువులపై దాడి చేయగలగడం ప్రచండ్ ప్రత్యేకత. గగనతలంలోని లక్ష్యాలను గగనతలం నుంచే చేధించగల క్షిపణులను, ట్యాంక్ విధ్వంసక మిస్సైళ్లను, 20 ఎంఎం తుపాకులనూ వీటిలో అమర్చవచ్చు. నిమిషానికి 750 తూటాలను పేల్చగల సత్తా వీటి సొంతం. పర్వతప్రాంతాల్లోని శత్రు సైన్యంపై, ట్యాంక్‌లు, బంకర్లు, డ్రోన్లపై ఇవి సులభంగా దాడిచేయగలవని ఆర్మీ ఉన్నతాధికారులు చెప్పారు. 22 ఏళ్ల క్రితం భారత్ కన్న కల ఇప్పుడు నెరవేరిందని రాజ్‌నాథ్ అన్నారు. 1999లో పాకిస్తాన్‌తో కార్గిల్ యుద్ధకాలంలో పర్వతప్రాంతాల్లో తేలికపాటి పోరాట హెలికాప్టర్ల ఆవశ్యకతను గుర్తించిన కేంద్ర ప్రభుత్వం అప్పటి నుంచి చేసిన పరిశోధన ఫలితమే ప్రచండ్ రూపంలో వచ్చిందన్నారు. ఇంకొన్ని ప్రత్యేకతలు ఈ హెలికాప్టర్లు గరిష్ట సంఖ్యలో ఆయుధాలతో పాటు మందుగుండు సామగ్రిని మోసుకెళ్లగలవు. గాలిలో ఎక్కువసేపు ఉండటానికి సరిపడా ఇంథనాన్ని నింపొచ్చు. ఎడారుల్లో, మంచుమయమైన హిమాలయ పర్వతాల్లోనూ పోరాడగలవు. ట్విన్ ఇంజన్లు ఉన్న ఈ హెలికాప్టర్ బరువు 5.8 టన్నులు. శత్రువుకు కనపడని రంగులో, తక్కువ శబ్దం చేస్తూ, రాడార్‌కు, ఇన్ఫ్రారెడ్ సెన్సార్లకు చిక్కకుండా వెళ్లగలవు. హెలికాప్లర్లను అడవులు, పట్టణ ప్రాంతాలలో ఉగ్రవ్యతిరేక ఆపరేషన్లలోనూ మొహరించవచ్చు. ఇక సైనిక వెర్షన్లో 96 హెలికాప్టర్లను తీసుకోవాలని ఆర్మీ భావిస్తోంది. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
పార్టీ పేరులో ‘మావోయిస్టు సెంటర్’ని తొలగించాలి
ఖట్మండూ: దేశంలో మావోయిస్టు భావజాలాన్ని వ్యతిరేకించే, కమ్యూనిస్టు శక్తులు సైతం పార్టీలో చేరేందుకు అనుకూలంగా ఉండేలా పార్టీ పేరులో నుంచి ‘మావోయిస్టు సెంటర్’ అనే పదాన్ని తొలగించాలంటూ, కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ నేపాల్–మావోయిస్టు సెంటర్ (ఎంసీ) నేపాల్ చీఫ్ పుష్ప కమల్ దహాల్ ‘‘ప్రచండ’’ ప్రతిపాదించినట్లు మీడియా వెల్లడించింది. మాజీ ప్రధాని ప్రచండ దేశంలోని కమ్యూనిస్టు శక్తుల ఐక్యతను ఆకాంక్షించారని, అయితే పార్టీ పేరులో నుంచి మావోయిస్టు పదాన్ని తొలగించడం ద్వారా అది సాధ్యమౌతుందని, అందుకు పార్టీ సిద్ధంగా ఉందని సీపీఎన్–ఎంసీ సభ్యుడు శివకుమార్ మండల్ చెప్పినట్టు హిమాలయన్ టైమ్స్ రిపోర్టు చేసింది. ప్రధాని కెపి.శర్మ ఓలి నేతృత్వంలోని సీపీఎన్–యుఎంఎల్‌తో సీపీఎన్–ఎంసీ విలీనాన్ని ఇటీవల సుప్రీంకోర్టు రద్దు చేయడంతో పేరు మార్పు విషయం చర్చకొచ్చింది. ప్రధాని కేపి.శర్మ ఓలికి కేంద్ర కమిటీలోనూ, పార్లమెంటరీ పార్టీలోనూ పూర్తి మెజారిటీ రావడంతో పార్టీలో ఆయన స్థానం బలోపేతం అయ్యింది. ప్రచండతో చేతులు కలిపిన, సీపీఎన్–యుఎంఎల్ నేపాల్ వర్గంలోని ఇతర కీలక నేతలు మాధవ్ కుమార్ నేపాల్, ఝలనాథ్ ఖానల్‌లు ఓలిని ప్రధాని పదవికి రాజీనామా చేయాల్సిందిగా కోరినట్టు రిపోర్టు వెల్లడించింది. 2017 సార్వత్రిక ఎన్నికల్లో కలిసి పోటీచేసి, ఘనవిజయం సాధించిన తరువాత, సీపీఎన్ (యుఎంఎల్), సీపీఎన్ (ఎంసీ)లు కలిసి 2018లో యూనిఫైడ్ నేపాల్‌కమ్యూనిస్టు పార్టీగా ఏర్పడ్డాయి. 275 మంది సభ్యుల ప్రతినిధుల సభను డిసెంబర్లో రద్దు చేయాలన్న ఓలి నిర్ణయంతో ఎన్సీపీ రెండుగా చీలిపోయింది. అయితే సుప్రీంకోర్టు పార్లమెంటు దిగువ సభను తిరిగి నియమించింది. రెండు పార్టీల విలీనాన్ని సుప్రీంకోర్టు రద్దు చేసిన తరువాత తిరిగి తమ పార్టీలను మళ్ళీ విలీనం చేయాలని భావిస్తే, పార్టీకి కొత్త పేరు, ఎన్నికల గుర్తుతో రావాలని నేపాల్ ఎన్నికల కమిషన్ సీపీఎన్(యుఎంల్), సీపీఎన్(ఎంసీ)లను ఆదేశించింది. మార్క్స్, లెనిన్‌ల కమ్యూనిస్టు సిద్ధాంతమే నిజమైన కమ్యూనిజమని విశ్వసించే కమ్యూనిస్టు పార్టీలనేకం ప్రపంచవ్యాప్తంగా ఉన్నాయని, ‘‘మావోయిస్టు సెంటర్’’ అనేది వీరి మధ్య ఐక్యతకు విఘాతంగా మారిందని మండల్ పేర్కొన్నారు. మావో చెప్పినట్టుగా ‘తుపాకీ గొట్టం ద్వారానే రాజ్యాధికారం సిద్ధిస్తుంది’ అని సీపీఎన్–ఎంసీ తొలుత భావించిందనీ, అయితే 2006లో జరిగిన సమగ్ర శాంతి ఒప్పందంపై సంతకం చేసిన తరువాత ‘బ్యాలెట్ ద్వారానే రాజకీయాధికారం లభిస్తుంది’ అని విశ్వసిస్తోందని మారిన సీపీఎన్–ఎంసీ విధానాన్ని రాజకీయ విశ్లేషకులు ఉద్దభ్ ప్యాకురేల్ వివరించారు. ఉదారవాద ప్రజాస్వామ్య విలువలు కలిగిన సీపీఎన్–యుఎంఎల్‌తో విలీనం అవడంతో సీపీఎన్–ఎంసీకి మావోయుస్టు ట్యాగ్‌ని తొలగించుకోక తప్పని పరిస్థితి ఏర్పడిందని ప్యాకురేల్ వ్యాఖ్యానించారు. చదవండి: రైతుల నిరసనకు లిల్లి సింగ్ మద్దతు -
నేపాల్ పార్లమెంటు రద్దు
కఠ్మాండు: అధికార పక్షంలోని ప్రత్యర్థులకు నేపాల్ ప్రధానమంత్రి కేపీ శర్మ ఓలి ఊహించని షాక్ ఇచ్చారు. పార్లమెంటును రద్దు చేయాలని అధ్యక్షురాలు విద్యాదేవి భండారీకి సిఫారసు చేశారు. వెంటనే విద్యాదేవి భండారి పార్లమెంటును రద్దు చేయడంతో పాటు మధ్యంతర సాధారణ ఎన్నికలు వచ్చే సంవత్సరం ఏప్రిల్– మే నెలల్లో జరుగుతాయని ప్రకటించారు. అధికార నేపాల్ కమ్యూనిస్ట్ పార్టీ (ఎన్సీపీ)లో ప్రధాని కేపీ శర్మ ఓలి, మాజీ ప్రధాని పుష్పకుమార్ దహల్(ప్రచండ)ల మధ్య కొన్నాళ్లుగా తీవ్ర స్థాయిలో విబేధాలు కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అకస్మాత్తుగా ఆదివారం ఉదయం ప్రధాని ఓలి అధ్యక్షతన అత్యవసరంగా సమావేశమైన మంత్రి మండలి.. తక్షణమే పార్లమెంటును రద్దు చేయాలని కోరుతూ అధ్యక్షురాలు విద్యాదేవి భండారికి సిఫారసు చేసింది. ఈ సిఫారసుకు వెంటనే అధ్యక్షురాలు భండారీ ఆమోదం తెలిపారు. ఈ నిర్ణయం రాజ్యాంగ విరుద్ధమని ప్రధాన ప్రతిపక్షమైన నేపాలి కాంగ్రెస్‌తో పాటు అధికార పక్షంలోని అసమ్మతి వాదులు విమర్శించారు. ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఓలి మంత్రివర్గంలోని, ప్రచండ వర్గానికి చెందిన ఏడుగురు మంత్రులు రాజీనామా చేశారు. 275 మంది సభ్యులున్న ప్రతినిధుల సభకు తొలి దశ మధ్యంతర ఎన్నికలు ఏప్రిల్ 30న, తుది దశ ఎన్నికలు మే 10న జరుగుతాయని రాష్ట్రపతి భవన్ వెల్లడించింది. నేపాల్ పార్లమెంట్లో దిగువ సభను ప్రతినిధుల సభగా వ్యవహరిస్తారు. ఎగువ సభను నేషనల్ అసెంబ్లీగా పిలుస్తారు. ప్రతినిధుల సభకు 2017లో ఎన్నికలు జరిగాయి. ప్రధాని ఓలి నిర్ణయం ప్రజాస్వామ్య విలువలకు, రాజ్యాంగ నిబంధనలకు విరుద్ధమని, నియంతృత్వ ఆలోచనతో తీసుకున్న నిర్ణయమని ఎన్సీపీ అధికార ప్రతినిధి నారాయణ్‌కాజీ శ్రేష్ట విమర్శించారు. పార్టీ స్టాండింగ్ కమిటీ ఓలి నిర్ణయాన్ని తప్పుబట్టింది. ఓలిపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని పార్టీ నాయకత్వానికి సిఫారసు చేసింది. 2018లో ఓలి నాయకత్వంలోని సీపీఎన్ –యూఎంఎల్, ప్రచండ నేతృత్వంలోని సీపీఎన్(మావోయిస్ట్ సెంటర్) విలీనమై ఎన్సీపీగా ఏర్పడ్డాయి. పార్టీలోని అత్యున్నత విభాగం సెక్రటేరియట్లో ప్రచండదే పైచేయి కావడం గమనార్హం. -
అధికార పార్టీ భేటీ వాయిదా.. రంగంలోకి ఆమె!
ఖాట్మండూ: నేపాల్ ప్రధాని కేపీ శర్మ ఓలి తీరుపై అధికార కమ్యూనిస్టు పార్టీలో అసంతృప్తి చెలరేగుతున్న నేపథ్యంలో స్టాండింగ్ కమిటీ సమావేశం మరోసారి వాయిదా పడింది. పార్టీ కో చైర్మన్ పుష్ప కమల్ దహల్(ప్రచండ), ఓలి మధ్య విభేదాలు తీవ్ర స్థాయికి చేరడంతో బుధవారం జరగాల్సిన భేటీని జూలై 28 కి వాయిదా వేసినట్లు తెలుస్తోంది. ప్రధాని, పార్టీ పదవి నుంచి వైదొలిగేందుకు ఓలి సుముఖంగా లేరని, ఈ క్రమంలో పార్టీలో చీలిక వచ్చే పరిస్థితులు తలెత్తినట్లు సమాచారం. మరోవైపు.. పార్టీ విభజనను తీవ్రంగా వ్యతిరేకిస్తున్న ప్రచండ రాజకీయంగా మరింత బలపడేందుకు కేబినెట్లో తన వర్గానికి స్థానం కల్పించే దిశగా ప్రయత్నాలు ముమ్మరం చేసినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఈ నెల చివరి నాటికి ఓలి కేబినెట్లో పలు మార్పులు చోటుచేసుకునే అవకాశం ఉంది. (మేడిన్ చైనా రామాయణం) కాగా సుదీర్ఘ కాలంగా మిత్రదేశంగా కొనసాగుతున్న భారత్ పట్ల ఓలి వైఖరిని నిరసిస్తూ సొంత పార్టీ నేతలే విమర్శలు గుప్సిస్తున్న విషయం తెలిసిందే. అదే విధంగా ఓలి ప్రధాని పదవికి రాజీనామా చేయాలంటూ డిమాండ్ చేస్తున్నారు. ఈ క్రమంలో అధికార నేపాల్ కమ్యూనిస్టు పార్టీలో విభేదాలు తార స్థాయికి చేరుకున్నాయి. ఈ క్రమంలో నేతల మధ్య ఏకాభిప్రాయం కుదరకపోవడంతో ఇప్పటికే స్టాండింగ్ కమిటీ సమావేశం అనేకమార్లు వాయిదా పడింది. మరోవైపు చైనాతో సత్సంబంధాలు పెంచుకుంటున్న ఓలి తాను పదవి నుంచి దిగిపోయేది లేదని స్పష్టం చేయడంతో రాజకీయ సంక్షోభం తీవ్ర రూపం దాల్చింది. ఇలాంటి తరుణంలో, భారత్‌తో సరిహద్దు వివాదాలు నెలకొన్న వేళ నేపాల్‌ను అడ్డుపెట్టుకుని భారత్‌పై అక్కసు వెళ్లగక్కాలని చూస్తున్న చైనా అధికార పార్టీలో చీలిక వస్తే మొదటికే మోసం వస్తుందనే భావనతో సంక్షోభాన్ని చల్లార్చేందుకు రంగంలోకి దిగినట్లు తెలుస్తోంది. నేపాల్‌లోని చైనా రాయబారి హు యోంకి ఇప్పటికే ఎన్సీపీ నేతలతో సమావేశమై.. సయోధ్య కుదిర్చేందుకు ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. ఓలిని ప్రధానిగా కొనసాగిస్తూనే.. పార్టీలో చీలిక రాకుండా వ్యూహాలు రచించినట్లు తెలుస్తోంది. -
నేపాల్‌లో కొనసాగుతున్న ప్రతిష్టంభన
కఠ్మాండు: అధికారాన్ని పంచుకునే విషయంలో రాజీ కుదరకపోవడంతో నేపాల్ ప్రధాని కేపీ శర్మ ఓలి, అధికార నేపాల్ కమ్యూనిస్ట్ పార్టీ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ ప్రచండల మధ్య చర్చలు ఆదివారం అసంపూర్తిగా ముగిశాయి. మళ్లీ సోమవారం చర్చలు కొనసాగించాలని రెండు వర్గాలు నిర్ణయించాయి. కీలక పార్టీ స్టాండంగ్ కమిటీ సమావేశానికి ముందే ఒక ఒప్పందానికి రావాలని వారు భావిస్తున్నారు. పార్టీ అధ్యక్షుడిగా, ప్రధానిగా కేపీ శర్మ ఓలి దిగిపోవాలని ప్రచండ వర్గం కోరుతోంది. ప్రచండకు సీనియర్ నేతలు మద్దతిస్తున్నారు. మరోవైపు, విపక్ష నేపాలీ కాంగ్రెస్ నేత, మాజీ ప్రధాని షేర్ బహదూర్ దేవ్బాతో ప్రధాని ఓలి భేటీ అయ్యారు. తన ప్రభుత్వాన్ని కాపాడుకునేందుకు విపక్ష మద్దతును కోరేందుకే ఓలి ప్రయత్నిస్తున్నారని భావిస్తున్నారు. ఓలి ప్రధానిగా కొనసాగేందుకు అవసరమైతే.. అధికార పార్టీని చీల్చే అవకాశాలు కూడా ఉన్నాయని కథనాలు వెలువడుతున్నాయి. -
నేపాల్‌లో కీలక పరిణామం
కఠ్మాండు: నేపాల్‌లో రెండు ప్రధాన కమ్యూనిస్టు పార్టీలైన సీపీఎన్–యూఎంఎల్, సీపీఎన్–మావోయిస్టు సెంటర్ చారిత్రక విలీన ఒప్పందానికి అంగీకారం తెలిపాయి. దీంతో నేపాల్‌లో అతిపెద్ద రాజకీయ పార్టీ ఆవిర్భావానికి బాటలు పడినట్లయింది. నేపాల్ సార్వత్రిక, ప్రావిన్షియల్ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన ఈ కూటమి ఏకం కానుందని చాలా రోజులుగా ఊహాగానాలు వినిపిస్తున్నాయి. దీనిని నిజం చేస్తూ ఇప్పుడు ఒప్పందం కుదిరింది. ఈ రెండు పార్టీలు విలీనం కావడంతో నేపాల్‌లో రాజకీయ స్థిరత్వానికి అవకాశం లభిస్తుందని, రాజకీయ, ఆర్థిక, సామాజిక అంశాలపై ప్రభావం చూపుతుందని రాజకీయ నిపుణులు భావిస్తున్నారు. నేపాల్ ప్రధానమంత్రి కేపీ శర్మ ఓలీ నేతృత్వంలోని సీపీఎన్–యూఎంఎల్, మాజీ ప్రధాని ప్రచండ నేతృత్వంలోని సీపీఎన్–మావోయిస్టు సెంటర్ కలసి డిసెంబర్లో జరిగిన ఎన్నికల్లో పోటీ చేసిన సంగతి తెలిసిందే. 275 మంది సభ్యుల పార్లమెంట్లో ఈ కూటమి 174 స్థానాలను దక్కించుకుని అధికారాన్ని కైవసం చేసుకుంది. -
మోదీకి నేపాల్ ప్రధాని ఫోన్.. ఏం మాట్లాడారు?
-
మోదీకి నేపాల్ ప్రధాని ఫోన్.. ఏం మాట్లాడారు?
ఖాట్మండు : భారత్‌లో పెద్దనోట్ల రద్దుతో నేపాల్ ప్రజలకు ఎదురవుతున్న ఇబ్బందులపై ఆ దేశ ప్రధాని ప్రచండ(పుష్ప కమల్ దహాల్), మన ప్రధాని నరేంద్రమోదీకి ఫోన్ చేశారు. భారత ప్రభుత్వం రద్దు చేసిన పెద్ద బ్యాంకు నోట్లు నేపాల్ ప్రజల దగ్గర పెద్ద మొత్తంలో ఉన్నాయని, వాటిని మార్చుకోవడానికి తగిన ఏర్పాట్లు చేయాలని ప్రచండ కోరారు. ఐదు నిమిషాల పాటు జరిపిన ఈ టెలిఫోనిక్ సంభాషణలో పెద్ద మొత్తంలో నేపాల్ ప్రజలు కలిగి ఉన్న పెద్ద నోట్ల కట్టలు, వాటివల్ల వారికి ఎదురవుతున్న కష్టాలను ప్రచండ, మోదీతో చర్చించారు. వేలకొలది నేపాలీ ప్రజలు భారత్‌లో రోజువారీ కూలీలుగా పనిచేస్తూ డబ్బులను ఆర్జిస్తున్నారని, పొరుగు దేశంలోకి వచ్చి వైద్య చికిత్స చేపించుకుంటారని, భారత మార్కెట్లోనే వారికి కావాల్సిన రోజువారీ వస్తువులను కొనుగోలు చేస్తారని ఖాట్మండు పోస్టు రిపోర్టు చేసింది. ఈ నేపథ్యంలో రద్దు చేసిన భారత బ్యాంకు నోట్లు నేపాలీ ప్రజలు ఎక్కువగా ఉన్నాయని పేర్కొంది. అదేవిధంగా భారత్‌లోని పుణ్యక్షేత్రాలకు విచ్చేసే వారు, సరిహద్దు ప్రాంతాల్లో వాణిజ్య ఒప్పందాలు చేసేవారి దగ్గర కూడా ఈ నిరుపయోగమైన కరెన్సీనే ఎక్కువగా ఉందని తెలిపింది. రద్దు చేసిన కరెన్సీ నోట్లను లీగల్ బిల్లులోకి మార్చుకునే అవకాశం లేకపోతే కొంతమంది నేపాల్ ప్రజలు దాచుకున్న సేవింగ్స్ అంతటిన్నీ కోల్పోవాల్సి వస్తుందని ఫెడరేషన్ ఆఫ్ నేపాలీస్ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రి పేర్కొంది. ఈ అంశాలన్నింటిన్నీ పరిగణలోని తీసుకుని, భారతప్రభుత్వం రద్దు చేసిన నోట్లను మార్చుకునే అవకాశం నేపాల్ ప్రజలకు కల్పించాలని ప్రచండ వ్యక్తిగత వెబ్సైట్ ఓ ప్రకటనలో తెలిపింది. ఈ సమస్యను వెంటనే పరిష్కరిస్తామని, నేపాల్ ప్రజలు నోట్లను మార్చుకునేందుకు అవకాశం కల్పించాలని ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీకి కూడా తెలిపినట్టు మోదీ పేర్కొన్నారు. హఠాత్తుగా భారత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో, ఆ దేశ సెంట్రల్ బ్యాంకైన నేపాల్ రాష్ట్ర బ్యాంకు(ఎన్ఆర్బీ) కూడా ఈ నోట్ల వాడకాన్ని అక్కడ రద్దుచేసింది. రూ.500, రూ.1000 పెద్దనోట్లు నేపాల్ ఫైనాన్సియల్ సిస్టమ్‌లో 33.6 మిలియన్లుగా ఉన్నాయని తెలిపింది. ఎన్ఆర్బీ కూడా రిజర్వు బ్యాంకు ఆఫ్ ఇండియాకు లేఖ రాసింది. బ్యాన్ చేసిన నోట్లను, నేపాలీ ప్రజలు ఎక్స్చేంజ్ చేసుకునే అవకాశం కల్పించాలని కోరింది. -
నేపాల్‌కు అన్ని విధాలా చేయూత
• ప్రచండకు మోదీ హామీ • నేపాల్ పునర్నిర్మాణానికి • రూ. 5,025 కోట్ల సాయం న్యూఢిల్లీ: నేపాల్‌లో తాజా రాజకీయ మార్పుల నేపథ్యంలో అన్ని వర్గాల ప్రజల ఆకాంక్షల్ని నెరవేర్చేలా కొత్త రాజ్యాంగాన్ని అమలు చేయాలని భారత్ కోరింది. ఆ దేశంలో చైనా జోక్యం పెరుగుతున్న వేళ... అన్ని విధాలా సాయం చేస్తామంటూ నేపాల్‌కు హామీనిచ్చింది. ప్రధాని నరేంద్ర మోదీ, నేపాల్ ప్రధాని ప్రచండ(పుష్ప కమల్ దహల్)ల మధ్య శుక్రవారం విస్తృత స్థాయి చర్చలు జరిగాయి. ఇరు దేశాలు మూడు ఒప్పందాలపై సంతకాలు చేశాయి. నేపాల్ భూకంపం అనంతరం సాగుతున్న పునర్నిర్మాణ పనులకు రూ.5,025 కోట్ల సాయం చేసేందుకు భారత్ అంగీకరించింది. రక్షణ, భద్రత రంగాల్లో సహకారాన్ని కొనసాగించాలని ఇరు దేశాధినేతలు నిర్ణయించారు. ఇరు దేశాల మధ్య వర్తకాన్ని పెంచడంతో పాటు, రైలు, రోడ్డు అనుసంధానం మెరుగుపర్చాలని నిర్ణయించారు. నేపాల్‌కు రెండోసారి ప్రధాని అయ్యాక ప్రచండ భారత్‌లో పర్యటించడం ఇదే మొదటిసారి. ‘చర్చల ద్వారా నేపాల్‌లో విజయవంతంగా రాజ్యాంగాన్ని అమలు చేస్తారన్న ఆశాభావంతో భారత్ ఉంది. పొరుగు, సన్నిహిత దేశాలుగా నేపాల్‌లో శాంతి, స్థిరత్వం, ఆర్థిక వికాసం నెలకొనడం ఇరు దేశాల ఉమ్మడి లక్ష్యం. నేపాల్ అభివృద్ధి ప్రయాణం, ఆర్థిక పురోగతిలోని ప్రతి అడుగులో కలిసి సాగేందుకు భారత్ హక్కు కలిగి ఉంది’ అని భేటీలో మోదీ పేర్కొన్నారు. నేపాల్‌లో కొనసాగుతున్న హైడ్రోపవర్ పాజెక్టులు వేగంగా, విజయవంతంగా పూర్తవుతాయని హామీనిచ్చారు. ప్రచండ నాయకత్వంలో నేపాల్‌లో విజయవంతంగా రాజ్యాంగం అమలవుతుందన్న ఆశాభావం వ్యక్తం చేశారు. నేపాల్‌తో అభివృద్ధి భాగస్వామ్యాన్ని బలోపేతం చేసేందుకు భారత్ సిద్ధమని ప్రచండకు మోదీ స్పష్టం చేశారు. రాజ్యాంగ అమలులో అందరి భాగస్వామ్యం నేపాల్ భారత్‌తో స్నేహపూర్వక సంబంధాలు కలిగి ఉందని, ఇరు దేశాల గమ్యాలు ఒకదానితో ఒకటి ముడిపడ్డాయని ప్రచండ చెప్పారు. రాజ్యాంగాన్ని అమలు చేసే క్రమంలో సమాజంలోని ప్రతీ వర్గాన్ని భాగస్వాములు చేసేందుకు తమ ప్రభుత్వం ప్రయత్నిస్తుందన్నారు. నేపాల్ కొత్త రాజ్యాంగంలోని కొన్ని నిబంధనల్ని భారత సంతతికి చెందిన మాధేసి వర్గం వ్యతిరేకిస్తోంది. తమను రాజకీయ ప్రాధాన్యం తగ్గించేలా కొన్ని నిబంధనలు ఉన్నాయనేది వారి ప్రధాన ఆరోపణ. 4 నాలుగు రోజుల పర్యటన కోసం గురువారం భారత్ వచ్చిన ప్రచండకు శుక్రవారం ఉదయం రాష్ట్రపతి భవన్లో అధికారిక స్వాగతం లభించింది. దేశ అతిధిగా రాష్ట్రపతి భవన్లో ప్రచండ బస చేస్తున్నారు. చైనాకు అడ్డుకట్ట వేసే ప్రయత్నం: మొదటి నుంచి నేపాల్‌తో భారత్ సన్నిహిత సంబంధాలు కొనసాగుతుండగా... ఇటీవల కఠ్మాండుపై ఆధిపత్యం కోసం చైనా యత్నిస్తోంది. నేపాల్ మాజీ ప్రధాని ఓలి చైనాతో రవాణా ఒప్పందం కూడా కుదుర్చుకున్నారు. దీంతో రంగంలోకి దిగిన భారత్ నేపాల్ అభివృద్ధి భాగస్వామ్యం బలోపేతానికి సిద్ధంగా ఉన్నామని భారత్ స్పష్టం చేసింది. -
నేపాల్ ప్రధానిగా ప్రచండ ఎన్నిక
కఠ్మాండు: నేపాల్ కొత్త ప్రధానిగా మావోయిస్టు చీఫ్ ప్రచండ బుధవారం ఎన్నికయ్యారు. పదవికి ఆయనొక్కరే పోటీపడ్డారు. పార్లమెంటులో జరిగిన ఎన్నికలో సీపీఎన్-మావోయిస్టు సెంటర్ చీఫ్ అయిన ప్రచండకు అనుకూలంగా 363 ఓట్లు , వ్యతిరేకంగా 210 ఓట్లు వచ్చాయి. 595 మంది సభ్యులకుగాను 22 మంది ఓటేయలేదు. సభలో అతిపెద్ద పార్టీ నేపాలీ కాంగ్రెస్, యునెటైడ్ డెమొక్రటిక్ మధేసి ఫ్రంట్, ఫెడరల్ అలయెన్స్ సభ్యులు, చిన్న పార్టీలు ప్రచండకు మద్దతు పలికాయి. మావోయిస్టుల మద్దతు వాపసుతో ఓలీ ప్రధాని పదవికి రాజీనామా చేయడంతో ఈ ఎన్నిక అవసరమైంది. ప్రచండను భారత ప్రధాని మోదీ ఫోన్లో అభినందించారు. ప్రచండ 2008- 2009 మధ్య ప్రధానిగా ఉన్నారు. -
మరోసారి నేపాల్ ప్రధానిగా ప్రచండ ఎన్నిక
ఖాట్మండ్ : నేపాల్ నూతన ప్రధానమంత్రిగా మావోయిస్టు పార్టీ చీఫ్ పుష్ప కమాల్ దహాల్ అలియాస్ ప్రచండ మరోసారి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. దీంతో ఆయన రెండోసారి నేపాల్ ప్రధాని పీఠాన్ని అధిరోహించనున్నారు. చివరి నిమిషంలో సీపీఎన్-యూఎంఎల్ ప్రధాని పోటీ నుంచి తప్పుకుంది. దీంతో ప్రచండ ఎన్నిక ఏకగ్రీవం అయింది. కాగా మధేసి ప్రాంత పార్టీల నుంచి కీలక మద్దతు లభించడంతో ప్రచండ మంగళవారం నామినేషన్ వేసిన విషయం తెలిసిందే. ప్రచండ అభ్యర్థిత్వాన్ని నేపాలీ కాంగ్రెస్ (ఎన్సీ) నేత దేవ్బా ప్రతిపాదించగా మావోయిస్టు నేత మహరా బలపరిచారు. కొత్త ప్రభుత్వానికి మధేసి పార్టీలు మద్దతిచ్చేలా, మావోయిస్టు పార్టీలు ఒప్పందం చేసుకున్నాయి. 595 మంది సభ్యులున్న పార్లమెంట్లో మధేసీ పార్టీల బలం 42 మంది. ప్రభుత్వంలోనూ చేరతామని ఇవి సంకేతాలిచ్చాయి. మావోయిస్టు పార్టీ మద్దతు వాపసుతో యూఎంఎల్ నేత ఓలి ప్రధాని పదవికి గతవారం రాజీనామా చేశారు. దేశ రాజ్యాంగాన్ని అనుసరించి సభలో మెజారిటీని నిరూపించుకోవాల్సి ఉండగా.. 61 ఏళ్ల సీపీఎన్-మావోయిస్టు సెంటర్ చీఫ్‌కు అనుకూలంగా 363 ఓట్లు రాగా, వ్యతిరేకంగా 210 ఓట్లు వచ్చాయి. మొత్తం 595 మంది సభ్యులకుగాను 22 మంది ఓటు వేయలేదు. సభలో అతి పెద్ద పార్టీ అయిన నేపాలీ కాంగ్రెస్‌తోపాటు యునెటైడ్ డెమొక్రటిక్ మధేసి ఫ్రంట్, ఫెడరల్ అలయెన్స్‌లకు చెందిన సభ్యులు, మరికొన్ని చిన్న పార్టీలు ప్రచండకు మద్దతు పలికాయి. ప్రచండ ఎన్నికైనట్టు స్పీకర్ ఒన్సారి ఘర్తీ ప్రకటించారు. ప్రచండ దేశ 39వ ప్రధానిగా బాధ్యతలు చేపట్టనున్నారు. ఎన్నిక నేపథ్యంలో ప్రచండ మాట్లాడుతూ.. దేశాన్ని ఆర్థికాభివృద్ధి పథంలో నడిపిస్తానని హామీ ఇచ్చారు. దేశంలోని ప్రతి ఒక్కర్నీ ఏకం చేస్తానని ప్రతిజ్ఞ చేస్తున్నానని, ఈ సమస్యను పరిష్కరించే బాధ్యతను తాను తీసుకుంటానని చెప్పారు. కొత్త రాజ్యాంగాన్ని తీవ్రంగా నిరసిస్తున్న వర్గాలమధ్య వారధిగా నిలుస్తానని భరోసా ఇచ్చారు. ప్రధానిగా రెండోసారి... ప్రచండ ప్రధాని పదవిని అధిష్టించబోవడం ఇది రెండోసారి. ఆయన గతంలో 2008 నుంచి 2009 మధ్యకాలంలో ప్రధానిగా కొద్దికాలం పనిచేశారు. దేశ ప్రధాని పీఠాన్ని రెండుసార్లు అధిరోహిస్తున్న ఏకైక కమ్యూనిస్టు నేత ఆయనే. గత నెలలో మావోయిస్టు పార్టీ మద్దతు ఉపసంహరించడంతో సీపీఎన్-యూఎంఎల్ చైర్మన్ కేపీ శర్మ ప్రధాని పదవికి రాజీనామా చేశారు. ఈ నేపథ్యంలో ప్రచండ సారథ్యంలో కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన బలం కోసం నేపాలీ కాంగ్రెస్, మావోయిస్టు పార్టీలు మధేసి ఫ్రంట్‌తో మూడు సూత్రాల ఒప్పందం చేసుకున్నాయి. మధేసి ఉద్యమం సందర్భంగా చనిపోయినవారిని అమరులుగా గుర్తించాలని, గాయపడిన వారికి ఉచిత చికిత్స అందించాలన్న డిమాండ్‌తోపాటు ప్రొవిన్షియల్ సరిహద్దులను మార్చుతూ రాజ్యాంగాన్ని సవరించాలనేది మధేసి ఫ్రంట్ డిమాండ్. కాగా మావోయిస్టుపార్టీ, నేపాలీ కాంగ్రెస్, సీపీఎన్-యునెటైడ్, రాష్ట్రీయ ప్రజాతంత్ర పార్టీలకు చెందిన వారితో చిన్న మంత్రివర్గాన్ని ప్రచండ గురువారం ప్రకటించే అవకాశముంది. ప్రచండకు మోదీ ఫోన్ ను భారత ప్రధాని నరేంద్ర మోదీ అభినందించారు. మోదీ స్వయంగా ఫోన్ చేసి ప్రచండకు శుభాకాంక్షలు తెలియజేశారు. భారత పూర్తి మద్దతు నేపాల్‌కు ఉంటుందని హామీఇచ్చారు. భారత్‌ను సందర్శించాల్సిందిగా కూడా ప్రచండను ఆయన ఆహ్వానించారు. -
నేపాల్ నూతన ప్రధానిగా ప్రచండ ఎన్నిక
-
నేపాల్‌లో రాజకీయ సంక్షోభం: ప్రధాని రాజీనామా
కఠ్మాండు: హిమాలయ దేశం నేపాల్ లో రాజకీయ సంక్షభం తలెత్తింది. అవిశ్వాస తీర్మానంపై ఓటింగ్ జరకముందే ఆ దేశ ప్రధాని కేపీ శర్మ ఓలి ఆదివారం సాయంత్రం పదవికి రాజీనామా చేశారు. ఓలీ నేతృత్వంలోని సీపీఎన్(యూఎంఎల్) ప్రభుత్వంలో భాగస్వాములైన మావోయిస్టు పార్టీ రెండు వారాల కిందటే మద్దతు ఉపసంహరించుకోగా, రాష్ట్రీయ ప్రజాతంత్ర, మాదేసి జనాధికార ఫోరంతోపాటు మరో రెండు చిన్నపార్టీలు సైతం పక్కకు తప్పుకున్నాయి. దీంతో మైనారిటీలో పడ్డ ఓలీ ప్రభుత్వం బలపరీక్షను ఎదుర్కొవాల్సి వచ్చింది. అవిశ్వాస తీర్మానానినికి ప్రతిపక్ష నేపాల్ కాంగ్రెస్ పార్టీ సహజంగానే మద్దతు తెలిపింది. అలా అన్ని పార్టీలు ఏకమై ప్రధానిపై తిరుగుబావుటా ఎగరేశాయి. ఎలాగూ ఓటమి తప్పని పరిస్థితుల్లో ఓలీ రాజీనామా చేశారు. అయితే పార్టీల మధ్య నెలకొన్న సైద్ధాంతిక, రాజకీయ విబేధాల మధ్య కొత్త ప్రభుత్వం ఏర్పాటు అవుతుందా? అన్నది సంశయమే! పార్లమెంట్ ను రద్దు చేసి మళ్లీ ఎన్నికలు నిర్వహిస్తారనే వార్తలు వినవస్తున్నాయి. ఎందుకీ అనిశ్చితి? 601 సభ్యుల లెజిస్లేచర్ పార్లమెంట్ ఆఫ్ నేపాల్ (నేపాల్ పార్లమెంట్) లో ప్రస్తుతం కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ నేపాల్ (యునిఫైడ్ మాక్సిస్ట్, లెనినిస్ట్)కు 175 మంది సభ్యులున్నారు. అధికారం చేపట్టడానికి కావాల్సిన కనీస బలం 299. దీంతో సీపీఎన్.. మావోయిస్టు పార్టీ(80 మంది సభ్యులు), ఆర్పీపీ(24), మాదేసిల ఫోరం (14 మంది సభ్యుల) మద్దతుతో ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసింది. కేపీ శర్మ ఓలి ప్రధానిగా ఎన్నికయ్యారు. 196 మంది సభ్యులున్న నేపాలీ కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్ష పాత్రను పోషిస్తోంది. అయితే ప్రభుత్వ ఏర్పాటు సమయంలో ఇచ్చిన హామీలన్నింటినీ ఓలి తుంగలోతొక్కారని మద్దతు ఉపసంహరించుకున్న పార్టీలు ఆరోపిస్తున్నాయి. 'ఆయన తనగురించి మాత్రమే ఆలోచించే స్వార్థపరుడు. అహంకారి. మనుగడ కోసం మా పార్టీని వాడుకుని లబ్దిపొందాలనుకుంటున్నాడు' అంటూ మావోయిస్టు పార్టీ నేత ప్రచండ.. ప్రధాని ఓలీపై నిప్పులు చెరిగారు. ఓలీ మోనార్కిజం! 'నేపాల్ ను సమాఖ్య రాజ్యం(ఫెడరల్ స్టేట్) గా తీర్చిదిద్దాలనుకుంటున్న నాపై లేనిపోని విమర్శలు చేస్తున్నారు' అని ప్రధాని ఓలీ శర్మ శుక్రవారం జరిగిన ఓ సమావేశంలో ఆవేదన చెందారు. నూతన రాజ్యాంగం అమలులోకి తెచ్చిన సమయంలో తమకు అన్యాయం జరుగుతోందంటూ మాదేసీలు చేసిన ఉద్యమాన్ని ప్రధాని ఓలి తీవ్రంగా అణిచివేశారు. నాటి ఆందోళనల్లో 50 మంది మాదేసీలను పోలీసులు కాల్చిచంపారు. భారత్ తో సత్సంబంధాలను తెంచుకుని చైనాకు దగ్గరవుదామనుకున్న ఓలీని స్వపక్షం వారే వ్యతిరేకించారు. కానీ ఆయన 'ఏకపక్షంగా' చైనా అంటకాగారు. -
మైత్రీ ఒప్పందాన్ని సమీక్షిద్దాం!
భారత్, నేపాల్ అంగీకారం నేపాల్ దేశాధినేతలతో మోడీ చర్చలు రాజ్యాంగ రచనకు సాయం చేస్తామని హామీ కఠ్మాండు: నేపాల్‌తో సుహృద్భావ సంబంధాల్లో సరికొత్త అధ్యాయాన్ని ప్రారంభించేందుకు భారత ప్రధానమంత్రి నరేంద్రమోడీ ఆ దేశంపై వరాల వర్షం కురిపించారు. చరిత్రాత్మక మైత్రీ ఒప్పంద సమీక్ష, విద్యుత్ రంగంలో సహకారం, ముఖ్యమైన రహదారుల నిర్మాణంలో సహకారాన్ని వేగవంతం చేయడం, నూతన రాజ్యాంగ రచనలో తోడ్పాటు, స్కాలర్‌షిప్‌ల సంఖ్యను 180 నుంచి 250 పెంచడం.. మొదలైనవి అందులో ఉన్నాయి. 1950 నాటి శాంతి-మైత్రీ ఒప్పందాన్ని ప్రస్తుత అవసరాలకు అనుగుణంగా సమీక్షించి, సవరించడానికి భారత్, నేపాల్‌లు అంగీకరించాయి. అలాగే విద్రోహ శక్తులు సరిహద్దును ఇరు దేశాలకు ముప్పు కలిగించేందుకు వాడుకోకుండా త్వరగా సరిహద్దు వివాదాన్ని ఒకేసారి పరిష్కరించుకోవాలని నిర్ణయించాయి. నరేంద్ర మోడీ సోమవారం నేపాల్ దేశాధ్యక్షుడు రామ్‌బరణ్ యాదవ్, ప్రధాని సుశీల్ కొయిరాలాలతోపాటు, ఆ దేశ విపక్ష నేతలతో సమావేశమై పలు ద్వైపాక్షిక అంశాలపై చర్చించారు. మైత్రీ ఒప్పందం సవరణకు నిర్దిష్ట ప్రతిపాదనలు చేయాలని ఇరు దేశాల సంయుక్త కమిషన్(జీసీ) ఇటీవల తమ విదేశాంగ కార్యదర్శులను ఆదేశించడాన్ని మోడీ, సుశీల్‌లు స్వాగతించారు. నేపాల్ తొలుత సూచనలు చేస్తే సమస్యలన్నింటినీ ఒకేసారి పరిష్కరించుకోవచ్చని మోడీ అన్నారు. నేపాల్‌లో సమాఖ్య, ప్రజాస్వామ్య, గణతంత్ర వ్యవస్థ ఏర్పాటు కోసం కొత్త రాజ్యాంగాన్ని ఏడాదిలోగా రచించాలని, ఇందుకు భారత్ సాయం చేస్తుందని మోడీ నేపాల్ నేతలకు హామీ ఇచ్చారు. నేపాల్ నేతలతో మోడీ చర్చల సందర్భంగా తీసుకున్న నిర్ణయాలను ఇరు దేశాలు ఓ ప్రకటనలో వెల్లడించాయి. అందులోని వివరాు ప్రకారం.. నేరస్తుల అప్పగింత, పరస్పర న్యాయ సహాయ ఒప్పందాల ముసాయిదాలు త్వరగా ఖరారు చేయాలని ఇరు దేశాలు నిర్ణయించాయి. రక్షణ సహకారంపై ప్రధానులు సంతృప్తి వ్యక్తం చేశారు. పెట్రోల్, డీజిల్, విమాన ఇంధన సరఫరాకు బీహార్‌లోని రాక్సాల్ నుంచి కఠ్మాండు వ రకు పైప్‌లైన్ నిర్మించాలని నేపాల్ కోరగా భారత్ అంగీకరించింది. నేపాల్ నుంచి లక్నోకు నేరుగా విమానాల ప్రయాణానికి మూడు ఎంట్రీ పోస్టులు తెరవాలన్న వినతినీ మన్నించింది. తమ దేశంలో భారత్ మరిన్ని పెట్టుబడులు పెట్టాలని, వాణి జ్య నిబంధనలను సడలించానలి నేపాల్ కోరగా, పరిశీలిస్తామని భారత్ పేర్కొంది. విద్యుత్ వాణిజ్య ఒప్పందం ఖరారుకు సాగుతున్న చర్చలను 45 రోజుల్లో ముగించాలని ఇరు దేశాలు తమ ప్రతినిధులను ఆదేశించాయి. పర్యటనను పురస్కరించుకుని మోడీకి నేపాల్ అధ్యక్షుడు రామ్‌బరణ్ విందు ఇచ్చారు. తమ దేశంలో పర్యటించాలని మోడీ .. సుశీల్‌ను కోరగా ఆయన అంగీకరించారు. నేపాల్ పర్యటన ముగించుకుని మోడీ సోమవారం రాత్రి ఢిల్లీ చేరుకున్నారు. ప్రచండతో భేటీ.. మోడీ పర్యటనపై నేపాల్ మావోయిస్టులు హర్షం వ్యక్తం చేశారు. సోమవారం మోడీ నేపాల్ మాజీ ప్రధాని, మావోయిస్టు పార్టీ నేత ప్రచండతో సమావేశమై చర్చలు జరిపారు. నేపాల్ శాంతి ప్రక్రియకు మద్దతు, ఆర్థిక ప్రగతిపై మోడీకి స్పష్టత ఉందని, ఇరు దేశాల సంబంధాల్లో కొత్త అధ్యాయం మొదలైందని ప్రచండ పేర్కొన్నారు. మోడీ నేపాల్ మావోయిస్టు నేత బాబూరామ్ భట్టారాయ్తోనూ చర్చలు జరిపారు.1950నాటి మైత్రీ ఒప్పందాన్ని సమీక్షించేందుకు మోడీ అంగీకరించడం, నేపాల్‌కు రాయితీపై రూ. 6వేల కోట్ల రుణం ప్రకటించడంతో.. భారత్‌ను వ్యతిరేకించే నేపాల్ మావోయిస్టులు ఆయనపై పొగడ్తలు కురిపించారు. ‘నేపాల్ రాజ్యాంగ పరిషత్‌లో మీ ప్రసంగం నేపాల్ ప్రజల హృదయాలను హత్తుకుంద’ంటూ ప్రచండ మోడీతో చెప్పారు.