నేపాల్ ప్రయాణం ఎటు?
Published Fri, Nov 22 2013 12:10 AM | Last Updated on Sat, Sep 2 2017 12:50 AM
కొత్త దోవను ఎంచుకున్నప్పుడు అందులోని లోతుపాతులేమిటో, ఎదురుకాగల ప్రమాదాలేమిటో, తీసుకోవాల్సిన జాగ్రత్తలేమిటో తెలిసివుండాలి. లేనట్టయితే ఎదురుదెబ్బలు తప్పవు. నేపాల్‌లో రాజ్యాంగ నిర్ణాయక సభకు జరిగిన ఎన్నికల ఫలితాలు చూశాక మాజీ ప్రధాని ప్రచండకు ఈ సంగతి బాగా అర్ధమై ఉండాలి. ఆయన నాయకత్వంలోని యుసీఎన్-మావోయిస్టు పార్టీ తీవ్రంగా దెబ్బ తినబోతున్నట్టు గురువారం ఓట్ల లెక్కింపు ప్రారంభమైన తర్వాత వెలువడిన ప్రాథమిక ఫలితాలు తెలియజేస్తున్నాయి. అయిదే ళ్లక్రితం ఎన్నో ఆశలతో ప్రారంభమైన రాజ్యాంగ నిర్ణాయక సభ అంతర్గత సంక్షోభంతో సతమతమై తన లక్ష్యాల్లో ఏ ఒక్కటీ నెరవేర్చకుండానే ముగిసిపోయింది. దాదాపు 3 కోట్లమంది జనాభాతో, ఒకటిన్నర లక్షల చదరపు కిలోమీటర్ల వైశాల్యంతో అటు చైనా, ఇటు భారత్‌లు సరిహద్దులుగా ఉన్న నేపాల్ సుదీర్ఘకాలం హిందూ రాజరిక పాలనలో కొనసాగింది.
అటు తర్వాత దాదాపు దశాబ్దకాలంపాటు మావోయిస్టు పార్టీ నేతృత్వంలో సాగిన సాయుధ పోరాటం చివరకు అంతర్యుద్ధ దశకు చేర్చింది. ఐక్యరాజ్యసమితి జోక్యంతో సంక్షోభం చల్లార్చడానికి చేసిన ప్రయత్నాలు ఫలించి చివరకు మావోయిస్టులు సాయుధ పోరాటాన్ని విరమించి ప్రధాన స్రవంతిలో భాగమయ్యారు. దేశం సంపూర్ణ గణతంత్ర వ్యవస్థగా ఆవిర్భవించ డానికి అవసరమైన రాజ్యాంగ రచన కోసం ఏర్పాటైన రాజ్యాంగ సభకు 2008లో జరిగిన ఎన్నికల్లో మావోయిస్టులే నలభై శాతం స్థానాలు గెల్చుకున్నారు. మావోయిస్టు పార్టీ అధినేత ప్రచండ ప్రధానిగా బాధ్యతలు చేపట్టారు. ఆనాడు అనుకున్నది ఒకటైతే ఆచరణలో జరిగింది మరోటి. రెండేళ్ల వ్యవధిలో రాజ్యాంగ రచన పూర్తిచేయాలని లక్ష్యంగా పెట్టుకోగా ఆ విషయంలో రాజ్యాంగ సభ పూర్తిగా విఫలమైంది. దాన్ని రెండేళ్ల చొప్పున పొడిగించుకుంటూ వెళ్లినా ఎలాంటి ఫలితం లేకపోయింది. గత ఏడాది జూన్ 28న ఆ సభ కాస్తా రద్దయింది. తదనంతరం ఉమ్మడి ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసి కొత్త రాజ్యాంగసభకు ఎన్నికలు నిర్వహించడానికి ప్రధాన రాజకీయపక్షాలు సూత్రప్రాయంగా అంగీకరించినా ఎవరి నాయకత్వంలో ప్రభుత్వం ఏర్పడాలన్న విషయంలో ఏకాభిప్రాయం కుదరలేదు. చివరకు గత మార్చిలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి అధ్యక్షతన ఏర్పడిన ఆపద్ధర్మ ప్రభుత్వం ఆ కార్యక్రమాన్ని నిర్వహించాల్సివచ్చింది.
నేపాల్ రాజకీయ పరిస్థితులు అనేక కారణాలవల్ల సంక్లిష్టమైనవి. సాయుధ విప్లవ పోరాటంలో కాకలు తీరిన మావోయిస్టులకూ, మిగిలిన పార్టీలకూ ఆదినుంచీ పొసగలేదు. మావోయిస్టుల నేతృత్వంలో ఏర్పడిన ప్రభుత్వంలో చేరకూడదని రెండో ప్రధాన పక్షం నేపాలీ కాంగ్రెస్ నిర్ణయించుకుని జాతీయ ప్రభుత్వ భావనకు ఆదిలోనే గండికొట్టింది. మిగిలిన పార్టీలు సైతం ఎడమొహం పెడమొహంగానే ఉన్నాయి. భిన్న సిద్ధాంతాలతో, భిన్న ప్రయోజనాలతో వేర్వేరు జాతులకు ప్రాతి నిధ్యం వహించే పార్టీలు తమ తమ వైఖరులకు కట్టుబడి ఉండటం తప్ప ఎదుటి పక్షం ఆశిస్తున్నదేమిటో, అందులోని సహేతుకత ఏమాత్రమో ఆలోచించలేక పోయాయి.
ప్రజల ఉమ్మడి ప్రయోజనాల కోసం, దేశంలో ప్రశాంతత ఏర్పడటం కోసం పరస్పర అవగాహనతో ముందుకెళ్లే విశాల దృక్పథాన్ని ప్రదర్శించలేక పోయాయి. ఆరంభంలో తమ మధ్య కుదిరిన 12 అంశాల ఒప్పందాన్ని సైతం మర్చి పోయాయి. ఫలితంగా ఈ అయిదేళ్ల కాలమూ అనిశ్చితిలోనే గడిచిపోయింది. ప్రభుత్వం మారినప్పుడల్లా ఏదో ఒక ఆశారేఖ తళుక్కుమనడం, అంతలోనే అది కనుమరుగవడం సాధారణమై పోయింది. ప్రభుత్వాల మార్పు ఒక ప్రహసనంగా మారింది. నేపాల్‌ను ఈ అయిదేళ్లు పట్టిపీడించిన ప్రధాన సమస్య ఫెడరలిజం. దేశంలో ఫెడరల్ వ్యవస్థ ఉండాలన్న అంశంలో చాలా పార్టీల మధ్య ఏకాభిప్రాయం ఉన్నా అది ఏ రూపంలో ఉండాలన్న విషయంలో తీవ్ర విభేదాలున్నాయి. ఫెడరల్ వ్యవస్థ జాతుల ప్రాతిపదికగా ఉండాలని, ఆ జాతులకు విడిపోయే హక్కుతోసహా స్వయం నిర్ణయాధికారం ఇవ్వాలని మావోయిస్టులు వాదించారు. నేపాలీ కాంగ్రెస్, యునెటైడ్ మార్క్సిస్టు- లెనినిస్టు పార్టీలు ఫెడరల్ వ్యవస్థను సమర్ధిస్తూనే అది జాతి ప్రాతిపదికగా ఉండడాన్ని వ్యతిరేకించాయి. స్వయం నిర్ణయాధికార హక్కునూ కాదన్నాయి.
ఈ ఎన్నికలద్వారా నేపాల్‌కు ఒరిగేదేమీ లేదని, వీటిని బహిష్కరించాలని ప్రచండతో విభేదాలొచ్చి బయటకు వెళ్లిన మావోయిస్టులు పిలుపునిచ్చారు. వారి నాయకత్వంలో 33 పార్టీల కూటమి ఏర్పడి రాజ్యాంగసభ ఎన్నికలను భగ్నం చేయడానికి ప్రయత్నించింది. వారి ప్రభావంవల్లనో, అయిదేళ్లక్రితం ఏర్పడిన రాజ్యాంగ సభ అన్నివిధాలా విఫలం కావడంవల్ల కలిగిన నిరాశవల్లనో ఈసారి రిజిస్టరైన ఓటర్ల సంఖ్య గణనీయంగా పడిపోయింది. 2008లో కోటీ 76 లక్షల మంది ఓటర్లుగా నమోదుకాగా ఇప్పుడా సంఖ్య కోటీ 20 లక్షలు అయింది. 16,000 మంది అభ్యర్థులు 240 స్థానాలకోసం పోటీపడ్డారు. ఇప్పుడు మెజారిటీ స్థానాల్లో నేపాలీ కాంగ్రెస్ దూసుకుపోతుండగా రెండో స్థానంలో సీపీఎన్- యుఎమ్‌ఎల్ ఉంది. ప్రచండ నేతృత్వంలోని మావోయిస్టులు మూడోస్థానానికి పడిపోయారు. రెండు స్థానాలనుంచి పోటీచేసిన ప్రచండ ఒకచోట ముందంజలోనే ఉన్నా రెండోచోట చిత్తుగా ఓడిపోయారు. ఆయన కుమార్తె కూడా ఓటమి పాలయ్యారు. పటిష్టమైన వ్యూహం, ఎత్తుగడలతో దశాబ్దకాలంపాటు సాయుధ విప్లవాన్ని కొనసాగించి దేశమంతా తిరుగులేని ప్రాబల్యాన్ని పెంచుకున్న మావోయిస్టులు పార్లమెంటరీ రాజకీయాల్లో బోర్లాపడ్డారు. ఇతరపక్షాలతో కూటమి కట్టడంలో, సమన్వయం చేసుకోవడంలో విఫలమయ్యారు. ప్రజల్లో సైతం పలచనయ్యారు. ఈసారి ఏర్పాటయ్యే రాజ్యాంగ సభ అయినా ప్రజల మనోభావాలకు అనుగుణంగా నిర్మాణాత్మక పాత్ర పోషించి ప్రస్తుత సంక్షోభానికి తెరదించుతుందా... లేక కొత్త సంక్షోభాలకు అంకురార్పణ చేస్తుందా అన్నది చూడాల్సి ఉంది.
Advertisement
Advertisement