నేపాల్‌లో అధికార క్రీడ | Sakshi Guest Column On Nepal Politics | Sakshi
Sakshi News home page

నేపాల్‌లో అధికార క్రీడ

Published Thu, Mar 21 2024 12:21 AM | Last Updated on Thu, Mar 21 2024 12:21 AM

Sakshi Guest Column On Nepal Politics

ప్రచండ, కేపీ శర్మ ఓలి, షేర్‌ బహదూర్‌ దేవుబా

విశ్లేషణ

ఏడాదిన్నర కూడా కాకముందే నేపాల్‌లో మూడో ప్రభుత్వం ఏర్పాటైంది. విచిత్రమైన కూటములు జట్టుకట్టాయి, విడిపోయాయి, మళ్లీ ఒక్కటయ్యాయి. ఇందులో భారత్‌ అనుకూల, అననుకూల పార్టీలూ ఉన్నాయి. మూడు ప్రభుత్వాలకూ సారథిగా ప్రచండ ఉండటం విశేషం. కోవిడ్‌ –19 మహమ్మారి తర్వాత నేపాలీ ఆర్థిక వ్యవస్థ తీవ్రంగా దెబ్బతింది. తిరిగి పుంజుకునే సంకేతాలు ఎంతమాత్రమూ కనబడటం లేదు. ఇది ప్రజల్లో నిరుత్సాహానికి దారి తీస్తోంది. గతంలో ఉన్న రాచరికమే మంచిదని కొందరు భావిస్తున్నారు. కొన్ని వారాల క్రితం, ఖాట్మండులో రాచరికం అనుకూల ప్రదర్శన కూడా జరిగింది. ప్రస్తుత కూటమి అమరిక వల్ల, ఇంకా మూడేళ్ల వ్యవధి ఉన్నప్పటికీ తిరిగి సాధారణ ఎన్నికలకు రంగం సిద్ధం అయినట్టుగా కనబడుతోంది.

నేపాల్‌లో కేవలం 15 నెలల్లోనే మూడవ ప్రభుత్వం ఏర్పాటైంది. ఆసక్తికరంగా, ఈ మూడు ప్రభుత్వాలకూ పుష్పకమల్‌ దహల్‌ అలియాస్‌ ప్రచండ సారథ్యం వహించారు. 2022 నవంబర్‌లో జరిగిన సార్వత్రిక ఎన్ని కల్లో ఆయన పార్టీ మావోయిస్ట్‌ సెంటర్‌ 30 స్థానాలతో ప్రతినిధుల సభలో మూడవ స్థానంలో నిలిచింది. 275 మంది సభ్యుల సభలో 88 స్థానాలతో నేపాలీ కాంగ్రెస్‌ మొదటి స్థానంలో, 78 స్థానాలతో కమ్యూ నిస్ట్‌ పార్టీ ఆఫ్‌ నేపాల్‌ (యూనిఫైడ్‌ మార్క్సిస్ట్‌– లెనినిస్ట్‌) లేదా సీపీ ఎన్‌–యూఎమ్‌ఎల్‌ రెండవ స్థానంలో నిలిచాయి. చీలిపోయిన ప్రజా తీర్పు ముఖ్యమైన స్థానాన్ని ప్రచండ పొందేలా అనుమతించింది.

మొదటిదే అయినప్పటికీ స్వల్పకాలంలోనే ముగిసిన కూటమి సీపీఎన్‌–యూఎమ్‌ఎల్, మావోయిస్టులకూ మధ్య ఏర్పడినది.ప్రచండకు ప్రధానమంత్రి పదవిని అందించిన తర్వాత, ఆయన నేపాలీ కాంగ్రెస్‌ వైపునకు మళ్లడంతో ఒక నెలలోనే ఆ కూటమి విచ్ఛి న్నమైంది. చిత్రంగా, అదే ప్రచండనీ, అదే సీపీఎన్‌–యూఎమ్‌ఎల్‌నీ మళ్లీ ఒకచోట చేర్చిన ప్రస్తుత కూటమిలో, మరో రెండు వామపక్ష అనుకూల పార్టీలు కూడా ఉన్నాయి.

ఉపేంద్ర యాదవ్‌ నేతృత్వంలోని సమాజ్‌బాదీలు (సోషలిస్టులు), మాజీ ప్రధాని మాధవ్‌ కుమార్‌ నేపాల్‌ ఆధ్వర్యంలో ఏర్పాటైన మాజీ సీపీఎన్‌–యూఎమ్‌ఎల్‌ సభ్యుల పార్టీ ప్రస్తుత ప్రభుత్వానికి మద్దతునిస్తున్నాయి.ఈ కూటమిలోనే రాష్ట్రీయ స్వతంత్ర పార్టీ (ఆర్‌ఎస్‌పీ) ఉండటం కొందరికి ఆశ్చర్యం కలిగిస్తుంది. ఈ పార్టీకి 21 సీట్లున్నాయి. యువత ఆకాంక్షలను సమర్థించే, పశ్చిమ దేశాలకు అనుకూలంగా ఉండే ఒక వేదికగా ఈ పార్టీని చెప్పుకోవచ్చు. ఈ పార్టీ గతంలో మొదటి మావో యిస్టు... సీపీఎన్‌–యూఎమ్‌ఎల్‌ కూటమిలో భాగంగా ఉండేది.

అంతకుముందు అమెరికన్‌ జాతీయుడైన రవీ లామిఛానే దాని నాయ కుడు. ప్రస్తుత సంకీర్ణంలోని నలుగురు ఉప ప్రధాన మంత్రులలో ఆయన ఒకరుగా ఉన్నారు.కోవిడ్‌ –19 మహమ్మారి కాలంలో నేపాలీ ఆర్థిక వ్యవస్థ తీవ్రంగా దెబ్బతింది. కానీ ఇతర దేశాల మాదిరిగా, తిరిగి పుంజుకునే సంకే తాలు ఎంతమాత్రమూ కనబడటం లేదు. ఇది ప్రజల్లో నిరుత్సాహా నికి దారి తీస్తోంది. రాజకీయ వర్గం ఫలితాలు చూపని కారణంగా కొంతమంది గతంలో ఉన్న రాచరికమే మంచిదని కూడా భావిస్తు న్నారు. కొన్ని వారాల క్రితం, రాజధాని నగరం ఖాట్మండులో రాచ రికం అనుకూల ప్రదర్శన కూడా జరిగింది.

ఆర్థిక సమస్యలపై నేపాలీ కాంగ్రెస్‌ చాలా మొండితనంతో ఉందని ప్రచండ ఆరోపించారు. ఆ కారణంగా రాజకీయంగా తన మార్పును సమర్థించుకున్నారు. అయితే, ఐదుసార్లు ప్రధానమంత్రిగా పనిచేసిన  నేపాలీ కాంగ్రెస్‌ నాయకుడు షేర్‌ బహదూర్‌ దేవుబా నిరంతరం వేచివున్న ప్రధానమంత్రి స్థానంలో పరిభ్రమించడం ప్రచండ నిజంగానే భరించలేకపోయి ఉంటారు.

కానీ సాంప్రదాయకంగా నేపాలీ కాంగ్రెస్‌తో వ్యవహరించడం సులభతరమని భారతదేశం గ్రహించింది. నేపాల్‌ను హిందూ రాజ్యంగా పునఃస్థాపించాలనే నేపాలీ కాంగ్రెస్‌ నాయకత్వానికి మావో యిస్టు–నేపాలీ కాంగ్రెస్‌ కూటమి కొంత ఓదార్పునిచ్చింది. 2015 రాజ్యాంగం నేపాల్‌ను లౌకిక దేశంగా ప్రకటించింది. అయితే, సీపీఎన్‌–యూఎమ్‌ఎల్‌ నాయకుడు అయిన కేపీ శర్మ ఓలి గతంలో కూడా హిందూ రాజ్యం పట్ల గానీ, నేపాల్‌లో ‘సాంస్కృతిక’ రాచరికం పట్ల గానీ విముఖంగా లేరని గమనించాలి. అయోధ్యలో రామ
మందిర శంకుస్థాపనను నేపాల్‌ ఉత్సాహంతో స్వీకరించింది. ఇది హిందూ రాజ్యానికి మద్దతును పెంచుతుంది.

ప్రచండ కూడా సానుకూల పాత్రను పోషిస్తున్నట్లు కనిపిస్తు న్నారు. సంవత్సరాల తరబడి తాను విడిచిపెట్టేసినటువంటి, హిందూ రాచరికంతో గుర్తింపు పొందిన నేపాలీ అధికారిక జాతీయ దుస్తులైన దౌడా సురూవాల్‌ను ధరించారు. ఏమైనప్పటికీ, ప్రచండ పెంపకం వామపక్షంతో కూడుకున్నది. అది రాచరికానికి వ్యతిరేకమైనది. ఆయ నకు ఇప్పుడు తనను తాను వెనక్కి తిప్పుకొనే, నేపాల్‌ గుర్తింపు రాజకీయాలను తిరిగి అక్కున చేర్చుకునే అవకాశం వచ్చింది. అంటే ప్రాథమికంగా భారతదేశం నుండి తనను తాను భిన్నంగా చూపు కోవడం. అందుకే ఆయన నేపాలీ కాంగ్రెస్‌తో విడిపోయినప్పుడు దానిని ‘ప్రతీఘాత శక్తి’ అని పేర్కొన్నారు.

నేపాల్‌లోని రాజకీయ చర్చల్లో దక్షిణ (భారతదేశానికి సూక్ష్మ నామం), ఉత్తర (చైనా సూక్ష్మ నామం) పాత్రలకు సంబంధించిన సూచనలు సర్వ సాధారణం. సుమారు గత రెండు దశాబ్దాలుగా పశ్చిమ దేశాలనూ (అమెరికా, యూరోపియన్‌ యూనియన్‌ మొద లైనవి), చర్చ్‌తో కూడుకున్న వారి ఎన్జీఓ భాగస్వాముల పాత్రనూ కూడా కొట్టిపారేయలేము. ఇవి మానవ హక్కులు, లౌకిక వాద ఆలోచనలను కలిగి ఉండి, తమవైన డైనమిక్స్‌ను కలిగి ఉన్నాయి. కొందరికి వామపక్ష కూటమిలో రాష్ట్రీయ స్వతంత్ర పార్టీ చేరిక ఉత్తరాది– పాశ్చాత్య కూటమి మధ్య సఖ్యతలా కనిపిస్తుంది. 

చాలా మంది పరిశీలకు లకు, తాజా అమరిక నేపా ల్‌లో తదుపరి సాధారణ ఎన్ని కలకు రంగం సిద్ధం చేసిన ట్టుగా కనబడుతోంది. కాక పోతే ఎన్నికలకు ఇంకా మూడేళ్ల వ్యవధి ఉంది. అంత కాలం అవస రమైన ఓపికను ఓలీ ప్రదర్శిస్తారా అని చాలామంది అనుమానిస్తు న్నారు. 2020లో, అధికార భాగస్వామ్య ఒప్పందం ఉన్నప్పటికీ ప్రచండకు ప్రధానమంత్రి పదవిని వదులుకోవడానికి ఆయన ఇష్టపడలేదు.

ప్రచండ ఇప్పటికే ప్రజల్లో తన పట్టును కోల్పోయినందున, తన పాత కమ్యూనిస్ట్‌ సహచరులతో చేతులు కలపడమే ఏకైక మార్గం. సీపీఎన్‌ –యూఎమ్‌ఎల్‌ మద్దతుదారుల నుండి మావోయిస్టులకు ఓటు బదిలీ అంత సులభం కానప్పటికీ, నేపాలీ కాంగ్రెస్‌ నుండి మావోయిస్టులకు బదిలీ చేయడం ఇంకా కఠినమైనది. కొత్త అమరిక చైనీయులు సంతో షించడానికి ఒక కారణాన్నిస్తుంది. అంతర్గత నేపాలీ రాజకీయ కోణం కూడా ఉన్నప్పటికీ, దాన్ని తీసుకురావడంలో వారి పాత్ర ఉంది.

భారతదేశం ఇప్పటివరకూ నేపాల్‌కు అతిపెద్ద వాణిజ్య, ఆర్థిక భాగస్వామి. పైగా దేశంలో ఆర్థిక తేజస్సుకు గేట్‌వే. నేపాల్‌కు దాని పెరుగుతున్న జలవిద్యుత్‌ ఉత్పత్తి అవసరాల నుండి ప్రయోజనాలను పొందేందుకు ఇది ఏకైక అర్థవంతమైన మార్గం. ఇటీవలి సంవ త్సరాలలో సమీకృత చెక్‌ పోస్టుల నిర్మాణం, రైల్వే కనెక్టివిటీ అభివృద్ధి, విద్యుత్‌ సరఫరా లైన్‌లు, యూపీఐ లావాదేవీలకు వెళ్లడం వంటి వాటితో నేపాల్‌ కనెక్టివిటీకి భారత్‌ ఊతమిచ్చింది.

వాస్తవానికి, నేపాల్‌కు చమురు సరఫరా చేయడానికి ఏర్పాటయ్యే పైప్‌లైన్, 900 మెగావాట్ల అరుణ్‌–3 ప్రాజెక్ట్‌ నిర్మాణంతో సహా చాలా ప్రాజెక్టులు ఓలీ 2018–19లో ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ప్రారంభించారు.నేపాల్‌లో, ఇండియా కార్డ్‌ను ప్లే చేయడం వల్ల అది ప్రజల సెంటిమెంట్‌ను ప్రభావితం చేస్తుంది. ఆర్థిక వ్యవస్థ చాలా ముఖ్య మైనది. అనారోగ్యకరమైన ఆర్థిక స్థితి ఏ ప్రస్తుత ప్రధానమంత్రికీ మంచిది కాదు. సులభతరమైన వ్యాపారాన్ని మెరుగుపరచడం కోసం తీసుకునే చర్యలు భారతదేశం, నేపాల్‌ రెండింటి ప్రయోజనాలకు ఉపయోగపడుతాయి.

మంజీవ్‌ సింగ్‌ పురీ 
వ్యాసకర్త నేపాల్‌లో భారత మాజీ రాయబారి
(‘ద ట్రిబ్యూన్‌’ సౌజన్యంతో)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement