ఖాట్మండూ: నేపాల్ ప్రధాని కేపీ శర్మ ఓలి తీరుపై అధికార కమ్యూనిస్టు పార్టీలో అసంతృప్తి చెలరేగుతున్న నేపథ్యంలో స్టాండింగ్ కమిటీ సమావేశం మరోసారి వాయిదా పడింది. పార్టీ కో చైర్మన్ పుష్ప కమల్ దహల్(ప్రచండ), ఓలి మధ్య విభేదాలు తీవ్ర స్థాయికి చేరడంతో బుధవారం జరగాల్సిన భేటీని జూలై 28 కి వాయిదా వేసినట్లు తెలుస్తోంది. ప్రధాని, పార్టీ పదవి నుంచి వైదొలిగేందుకు ఓలి సుముఖంగా లేరని, ఈ క్రమంలో పార్టీలో చీలిక వచ్చే పరిస్థితులు తలెత్తినట్లు సమాచారం. మరోవైపు.. పార్టీ విభజనను తీవ్రంగా వ్యతిరేకిస్తున్న ప్రచండ రాజకీయంగా మరింత బలపడేందుకు కేబినెట్‌లో తన వర్గానికి స్థానం కల్పించే దిశగా ప్రయత్నాలు ముమ్మరం చేసినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఈ నెల చివరి నాటికి ఓలి కేబినెట్‌లో పలు మార్పులు చోటుచేసుకునే అవకాశం ఉంది. (మేడిన్ చైనా రామాయణం)
కాగా సుదీర్ఘ కాలంగా మిత్రదేశంగా కొనసాగుతున్న భారత్ పట్ల ఓలి వైఖరిని నిరసిస్తూ సొంత పార్టీ నేతలే విమర్శలు గుప్సిస్తున్న విషయం తెలిసిందే. అదే విధంగా ఓలి ప్రధాని పదవికి రాజీనామా చేయాలంటూ డిమాండ్ చేస్తున్నారు. ఈ క్రమంలో అధికార నేపాల్ కమ్యూనిస్టు పార్టీలో విభేదాలు తార స్థాయికి చేరుకున్నాయి. ఈ క్రమంలో నేతల మధ్య ఏకాభిప్రాయం కుదరకపోవడంతో ఇప్పటికే స్టాండింగ్ కమిటీ సమావేశం అనేకమార్లు వాయిదా పడింది.
మరోవైపు చైనాతో సత్సంబంధాలు పెంచుకుంటున్న ఓలి తాను పదవి నుంచి దిగిపోయేది లేదని స్పష్టం చేయడంతో రాజకీయ సంక్షోభం తీవ్ర రూపం దాల్చింది. ఇలాంటి తరుణంలో, భారత్‌తో సరిహద్దు వివాదాలు నెలకొన్న వేళ నేపాల్‌ను అడ్డుపెట్టుకుని భారత్‌పై అక్కసు వెళ్లగక్కాలని చూస్తున్న చైనా అధికార పార్టీలో చీలిక వస్తే మొదటికే మోసం వస్తుందనే భావనతో సంక్షోభాన్ని చల్లార్చేందుకు రంగంలోకి దిగినట్లు తెలుస్తోంది. నేపాల్‌లోని చైనా రాయబారి హు యోంకి ఇప్పటికే ఎన్‌సీపీ నేతలతో సమావేశమై.. సయోధ్య కుదిర్చేందుకు ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. ఓలిని ప్రధానిగా కొనసాగిస్తూనే.. పార్టీలో చీలిక రాకుండా వ్యూహాలు రచించినట్లు తెలుస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment