ఖట్మండూ: దేశంలో మావోయిస్టు భావజాలాన్ని వ్యతిరేకించే, కమ్యూనిస్టు శక్తులు సైతం పార్టీలో చేరేందుకు అనుకూలంగా ఉండేలా పార్టీ పేరులో నుంచి ‘మావోయిస్టు సెంటర్’ అనే పదాన్ని తొలగించాలంటూ, కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ నేపాల్–మావోయిస్టు సెంటర్ (ఎంసీ) నేపాల్ చీఫ్ పుష్ప కమల్ దహాల్ ‘‘ప్రచండ’’ ప్రతిపాదించినట్లు మీడియా వెల్లడించింది. మాజీ ప్రధాని ప్రచండ దేశంలోని కమ్యూనిస్టు శక్తుల ఐక్యతను ఆకాంక్షించారని, అయితే పార్టీ పేరులో నుంచి మావోయిస్టు పదాన్ని తొలగించడం ద్వారా అది సాధ్యమౌతుందని, అందుకు పార్టీ సిద్ధంగా ఉందని సీపీఎన్–ఎంసీ సభ్యుడు శివకుమార్ మండల్ చెప్పినట్టు హిమాలయన్ టైమ్స్ రిపోర్టు చేసింది.
ప్రధాని కెపి.శర్మ ఓలి నేతృత్వంలోని సీపీఎన్–యుఎంఎల్‌తో సీపీఎన్–ఎంసీ విలీనాన్ని ఇటీవల సుప్రీంకోర్టు రద్దు చేయడంతో పేరు మార్పు విషయం చర్చకొచ్చింది. ప్రధాని కేపి.శర్మ ఓలికి కేంద్ర కమిటీలోనూ, పార్లమెంటరీ పార్టీలోనూ పూర్తి మెజారిటీ రావడంతో పార్టీలో ఆయన స్థానం బలోపేతం అయ్యింది. ప్రచండతో చేతులు కలిపిన, సీపీఎన్–యుఎంఎల్ నేపాల్ వర్గంలోని ఇతర కీలక నేతలు మాధవ్ కుమార్ నేపాల్, ఝలనాథ్ ఖానల్‌లు ఓలిని ప్రధాని పదవికి రాజీనామా చేయాల్సిందిగా కోరినట్టు రిపోర్టు వెల్లడించింది.
2017 సార్వత్రిక ఎన్నికల్లో కలిసి పోటీచేసి, ఘనవిజయం సాధించిన తరువాత, సీపీఎన్ (యుఎంఎల్), సీపీఎన్ (ఎంసీ)లు కలిసి 2018లో యూనిఫైడ్ నేపాల్‌కమ్యూనిస్టు పార్టీగా ఏర్పడ్డాయి. 275 మంది సభ్యుల ప్రతినిధుల సభను డిసెంబర్‌లో రద్దు చేయాలన్న ఓలి నిర్ణయంతో ఎన్‌సీపీ రెండుగా చీలిపోయింది. అయితే సుప్రీంకోర్టు పార్లమెంటు దిగువ సభను తిరిగి నియమించింది. రెండు పార్టీల విలీనాన్ని సుప్రీంకోర్టు రద్దు చేసిన తరువాత తిరిగి తమ పార్టీలను మళ్ళీ విలీనం చేయాలని భావిస్తే, పార్టీకి కొత్త పేరు, ఎన్నికల గుర్తుతో రావాలని నేపాల్ ఎన్నికల కమిషన్ సీపీఎన్(యుఎంల్), సీపీఎన్(ఎంసీ)లను ఆదేశించింది.
మార్క్స్, లెనిన్‌ల కమ్యూనిస్టు సిద్ధాంతమే నిజమైన కమ్యూనిజమని విశ్వసించే కమ్యూనిస్టు పార్టీలనేకం ప్రపంచవ్యాప్తంగా ఉన్నాయని, ‘‘మావోయిస్టు సెంటర్’’ అనేది వీరి మధ్య ఐక్యతకు విఘాతంగా మారిందని మండల్ పేర్కొన్నారు. మావో చెప్పినట్టుగా ‘తుపాకీ గొట్టం ద్వారానే రాజ్యాధికారం సిద్ధిస్తుంది’ అని సీపీఎన్–ఎంసీ తొలుత భావించిందనీ, అయితే 2006లో జరిగిన సమగ్ర శాంతి ఒప్పందంపై సంతకం చేసిన తరువాత ‘బ్యాలెట్ ద్వారానే రాజకీయాధికారం లభిస్తుంది’ అని విశ్వసిస్తోందని మారిన సీపీఎన్–ఎంసీ విధానాన్ని రాజకీయ విశ్లేషకులు ఉద్దభ్ ప్యాకురేల్ వివరించారు. ఉదారవాద ప్రజాస్వామ్య విలువలు కలిగిన సీపీఎన్–యుఎంఎల్‌తో విలీనం అవడంతో సీపీఎన్–ఎంసీకి మావోయుస్టు ట్యాగ్‌ని తొలగించుకోక తప్పని పరిస్థితి ఏర్పడిందని ప్యాకురేల్ వ్యాఖ్యానించారు.
చదవండి: రైతుల నిరసనకు లిల్లి సింగ్ మద్దతు
Comments
Please login to add a commentAdd a comment