ఖాట్మండు: నేపాల్ ప్రధానమంత్రి పుష్ప కమల్ దహాల్ ఇటీవల భారతీయ వ్యాపారి సర్దార్ ప్రీతమ్ సింగ్ జీవిత చరిత్ర పుస్తకావిష్కరణ కార్యక్రమంలో పాల్గొని తాను ప్రధానమంత్రి కావడానికి ఆయన చాలా సహాయం చేశారని చేసిన వ్యాఖ్యలు నేపాల్ లో పెను దుమారాన్ని రేపాయి. నేపాల్ ప్రధాని నియామకం ఢిల్లీ కనుసన్నల్లో జరిగిందని ప్రధాని ప్రచండకి ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా వెంటనే తన పదవికి రాజీనామా చెయ్యాలని డిమాండ్ చేశాయి అక్కడి ప్రతిపక్షాలు.
ప్రఖ్యాత భారత వ్యాపారి ప్రీతమ్ సింగ్ పేరిట కిరణ్ దీప్ సంధు రాసిన జీవితచరిత్ర పుస్తకం "రోడ్స్ టు ది వ్యాలీ: ది లెగసీ ఆఫ్ సర్దార్ ప్రీతమ్ సింగ్ ఇన్ నేపాల్" ఆవిష్కరణ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా విచ్చేశారు నేపాల్ ప్రధాన మంత్రి పుష్ప కమల్ దహాల్ ప్రచండ.
ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. భారత్-నేపాల్ సంబంధాలు బలపడటానికి ప్రీతమ్ సింగ్ చాలా సహాయపడ్డారని, తన రాజకీయ జీవితం తొలినాళ్లలో కూడా అయన చాలా సహాయం చేశారని చెప్పుకొచ్చారు. నన్ను ప్రధాన మంత్రిని చేయడానికి ఆయన అనేకమార్లు ఢిల్లీ వెళ్లడమే కాదు అటు ఢిల్లీ నాయకులతోనూ, ఇటు ఖాట్మండు నాయకులతోనూ సంప్రదింపులు జరిపారని తెలిపారు.
ఈ వ్యాఖ్యలకు నేపాల్ ప్రతిపక్షాలు తీవ్రస్థాయిలో స్పందించాయి. ప్రధాని వ్యాఖ్యలు జాతి స్వాతంత్య్రానికి, గౌరవానికి, రాజ్యాంగానికి, చట్టసభకే అవమానకరమని ప్రతిపక్ష నాయకుడు కెపి శర్మ ఓలి అన్నారు.
ప్రధాన ప్రతిపక్షమైన కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ నేపాల్ తోపాటు ఇతర ప్రతిపక్షాలు రాష్ట్రీయ స్వతంత్ర పార్టీ, రాష్ట్రీయ ప్రజాతంత్ర పార్టీల నేతలు ప్రధాని ప్రచండ రాజీనామాను డిమాండ్ చేస్తూ బుధవారం జాతీయ అసెంబ్లీ సమావేశాలకు తీవ్ర అంతరాయం కలిగించారు.
నేపాల్ ప్రధాని ప్రచండ ప్రతిస్పందిస్తూ నేపాల్ అంతర్గత రాజకీయాల్లో భారత్ పాత్ర ఉందని చెప్పడం నా ఉద్దేశ్యం కాదు ప్రీతమ్ సింగ్ కు సాంఘిక సంక్షేమం మీదనే కాదు రాజకీయాల పైన కూడా అంతే ఆసక్తి ఉండేదని చెప్పాలనుకున్నట్లు తెలిపారు.
ప్రతిపక్షాలు మాత్రం మాకు మీ వివరణ అక్కర్లేదు.. మీ రాజీనామా మాత్రమే కావాలని పట్టుబట్టడంతో నేపాల్ జాతీయ అసెంబ్లీ సమావేశానికి నిరవధికంగా అంతరాయం కలిగింది.
ఇది కూడా చదవండి: వింబుల్డన్‌లో దారుణం.. స్కూల్‌లోకి దూసుకెళ్లిన కారు..
Comments
Please login to add a commentAdd a comment