భారత్లో పెద్దనోట్ల రద్దుతో నేపాల్ ప్రజలకు ఎదురవుతున్న ఇబ్బందులపై ఆ దేశ ప్రధాని ప్రచండ(పుష్ప కమల్ దహాల్), మన ప్రధాని నరేంద్రమోదీకి ఫోన్ చేశారు. భారత ప్రభుత్వం రద్దు చేసిన పెద్ద బ్యాంకు నోట్లు నేపాల్ ప్రజల దగ్గర పెద్ద మొత్తంలో ఉన్నాయని, వాటిని మార్చుకోవడానికి తగిన ఏర్పాట్లు చేయాలని ప్రచండ కోరారు. ఐదు నిమిషాల పాటు జరిపిన ఈ టెలిఫోనిక్ సంభాషణలో పెద్ద మొత్తంలో నేపాల్ ప్రజలు కలిగి ఉన్న పెద్ద నోట్ల కట్టలు, వాటివల్ల వారికి ఎదురవుతున్న కష్టాలను ప్రచండ, మోదీతో చర్చించారు. వేలకొలది నేపాలీ ప్రజలు భారత్లో రోజువారీ కూలీలుగా పనిచేస్తూ డబ్బులను ఆర్జిస్తున్నారని, పొరుగు దేశంలోకి వచ్చి వైద్య చికిత్స చేపించుకుంటారని, భారత మార్కెట్లోనే వారికి కావాల్సిన రోజువారీ వస్తువులను కొనుగోలు చేస్తారని ఖాట్మండు పోస్టు రిపోర్టు చేసింది.