కాఠ్మాండు: వచ్చే నెలలో జరగబోయే నేపాల్ అధ్యక్ష ఎన్నికల్లో అధికార కూటమి పార్టీ సీపీఎన్–యూఎంఎల్ బలపరిచిన అభ్యర్థినికాకుండా అధికార కూటమిలోలేని వేరొక పార్టీ అభ్యర్థికి ప్రధాని ప్రచండ మద్దతు పలకడం సీపీఎన్–యూఎంఎల్‌కు ఆగ్రహం తెప్పించింది. దీంతో ప్రభుత్వానికి తమ మద్దతును ఉపసంహరించుకుంటున్నట్లు ఆ పార్టీ సోమవారం ప్రకటించింది. ఆ పార్టీకి చెందిన నేతలైన ఉపప్రధాని, ఆర్థికమంత్రి బిష్ణు పౌద్యాల్, విదేశాంగ మంత్రి తమ పదవులకు రాజీనామా చేయాలని నిర్ణయించారు. దీంతో రెండు నెలల క్రితమే ఏర్పడిన సంకీర్ణ ప్రభుత్వం కూలే అవకాశాలు ఎక్కువయ్యాయి.
విపక్ష నేపాలీ కాంగ్రెస్ పార్టీకి చెందిన రామచంద్ర పౌద్యాల్‌కు గత శనివారం ఎనిమిది రాజకీయ పార్టీలు సమ్మతి తెలపడం, అధికారకూటమిలోని నేషనల్ డెమొక్రటిక్ పార్టీ.. ప్రభుత్వం నుంచి వైదొలగుతున్నట్లు ప్రకటించడం, ఉపప్రధాని పదవికి రాష్ట్రీయ ప్రజాతంత్ర పార్టీ చైర్మన్ రాజేంద్ర ప్రసాద్ లింగ్టెన్ రాజీనామాచేయడం తెల్సిందే. సీపీఎం–యూఎంఎల్ మద్దతులేకున్నా పార్లమెంట్‌లో 89 మంది సభ్యులున్న నేషనల్ కాంగ్రెస్ పార్టీతో విశ్వాసతీర్మానాన్ని ప్రచండ సర్కార్ గట్టెక్కే వీలుంది. గత డిసెంబర్‌లో 7 పార్టీల కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసింది. అధికార కూటమి పార్టీలు మద్దతు ఉపసంహరిస్తే ప్రధాని ప్రచండ నెలరోజుల్లోపు పార్లమెంట్‌లో విశ్వాసపరీక్షలో నెగ్గాలి.
Comments
Please login to add a commentAdd a comment