చల్లబడుతున్న ‘ప్రచండ’ం | prachanda, a failure leader | Sakshi
Sakshi News home page

చల్లబడుతున్న ‘ప్రచండ’ం

Published Fri, Nov 29 2013 3:59 AM | Last Updated on Sat, Sep 2 2017 1:04 AM

చల్లబడుతున్న ‘ప్రచండ’ం

చల్లబడుతున్న ‘ప్రచండ’ం

ఒక తిరుగుబాటు నాయకుడి హోదా నుంచి సంప్రదాయ రాజకీయవేత్త స్థితికి రావడానికి ప్రచండ సంఘర్షణ పడుతున్నాడని ఆయన సన్నిహితులు చెబుతున్నారు. ఇది కాకపోచ్చు.
 
 రాజును పదవీచ్యుతుడిని చేయడంలో విజ యవంతమయ్యాడు గానీ, ప్రజల హృదయాలను గెలుచుకోవడం దగ్గర మాత్రం ఆయన విఫలమయ్యాడు. ఆయన ప్రచండ. ‘ప్రచండ అంటే నిన్నటి వరకు గొప్ప ఆకర్షణ, ఇవాళ ఆయన అలంకారప్రాయం’ అని యూనిఫైడ్ కమ్యూనిస్టుపార్టీ ఆఫ్ నేపాల్ (మావోయిస్టు) (యూసీపీఎన్-ఎం) కేంద్ర కమిటీ సభ్యుడు ఒకరు వ్యాఖ్యానించారు. ఆ పార్టీ నాయకుడు సాక్షాత్తు ప్రచండే. నిజమే, నేపాల్ సమీప గతంలో ప్రచండ ఒక ప్రభంజనం. వర్తమాన హిమాలయ భూమిలో ఆయనొక పతన శిఖరం.
 
 నేపాల్ రాచరికానికి వ్యతిరేకంగా 1996 -2006 మధ్య దశాబ్దం పాటు నేపాల్‌లో సాయుధ విప్లవం నడిపిన నాయకుడు ప్రచం డ. అసలు పేరు పుష్పకమాల్ దహాల్. మూడున్నర శతాబ్దాల రాచరికాన్ని కాలమనే చెత్తబుట్టలోకి విసిరివేయడానికి ఆయన నడిపిన కమ్యూనిస్టు విప్లవం అసాధారణమైనది. పదమూడువేల మందిని ప్రాణత్యాగాలకు సిద్ధం చేసిన నాయకుడాయన. రాచరికం రద్దయిన తరువాత తొలిసారి జూన్ 16, 2006లో నీలిరంగు సూట్‌లో ప్రజలందరికీ కనపడినప్పుడు ప్రచండలో నేపాలీలు ‘దేవుడు’నే చూశారు. కానీ అనతికాలంలోనే ఆయన వ్యక్తిత్వం మీద, నడత మీద నీలినీడలు కమ్ముకుంటాయని ఎవరూ అనుకోలేదు. పెద్ద ప్రజా ఉద్యమంతో వచ్చిన ఖ్యాతినీ, అందుకు ఉపకరించిన నేపాల్ కమ్యూనిస్టు పార్టీ (మషాల్)నీ కేవలం ఐదేళ్లలోనే కోల్పోతాడని ఊహించలేకపోయారు. పార్టీలో వచ్చిన మూడు ప్రధాన ముఠాలు ఆయన చరిత్రని తిరగరాశాయి. ఆ చీలిక కార్యకర్తల మధ్య భౌతికదాడులకు దారి తీసింది. సాయుధ పంథాను వీడి రాజ్యాంగబద్ధంగా ప్రధాన జీవన స్రవంతిలోకి వచ్చిన తరువాత ఇనుమడించిన ప్రచండ గౌరవం ముఠాలతో, కార్యకర్తలు బాహాటంగా చేస్తున్న విమర్శలతో అడుగంటిపోయింది.
 
 పాలుంగ్తార్ ప్లీనం తరువాత సొంత పార్టీ ప్రచండ మీద 18 ఆరోపణలతో అసమ్మతి పత్రం విడుదల చేసింది. ‘రివిజనిస్ట్’ అని, పెట్టుబడిదారుల ప్రయోజనాల కోసం పని చేస్తున్నాడని, పార్టీ ప్రయోజనాలకు వ్యతి రేకంగా వ్యవహరిస్తున్నాడని, నిధులను సొం త సొమ్ములా దుర్వినియోగం చేస్తున్నాడని అసమ్మతి పత్రంలో విమర్శించారు. అవినీతి, అనైతికత ఆరోపణలూ ఉన్నాయి. ప్రచండ ఒక పార్టీని నడుపుతున్నాడని చెప్పడం కంటె, ఒక ముఠాకు నాయకుడని చెప్పడం సబబని యూసీపీఎన్-ఎం పొలిట్‌బ్యూరో సభ్యుడు రామ్ కార్కి వ్యాఖ్యానించడం విశేషం. ఎన్నిసార్లు చెప్పినా, పార్టీ జమాఖర్చులు చెప్పడం లేదని తీవ్రమైన ఆరోపణే కార్కి చేశాడు.
 పదేళ్లపాటు అలుపెరుగని రక్తసహిత విప్లవం నడిపిన ప్రచండ ప్రధాని పదవిలో కేవలం ఒక్క సంవత్సరం మాత్రమే(2008- 09) ఉండగలిగారు. సైన్యాధ్యక్షుడిని తొలగిం చడానికి చేసిన ప్రయత్నాన్ని సైన్యం అడ్డుకోవడంతో పదవి నుంచి తప్పుకోవలసి వచ్చింది. నిజానికి ఒక తిరుగుబాటు నాయకుడి హోదా నుంచి సంప్రదాయ రాజకీయవేత్త స్థితికి రావడానికి ప్రచండ సంఘర్షణ పడుతున్నాడని ఆయన సన్నిహితులు చెబుతున్నారు. ఇది కాకపోచ్చు. మొన్న రాజ్యాంగ సభకు జరిగిన ఎన్నికలలో తన పార్టీ మూడో స్థానానికి దిగజారడంతో ఈ ఎన్నికలను అంగీకరించడం లేదనీ, బ్యాలెట్ బాక్సులు మార్చారని ఆరోపించి సంప్రదాయ రాజకీయ నేతల ధోరణికి ప్రచండ దగ్గరగా వచ్చేశారనే అనిపిస్తుంది. క ఠ్మాండు నడిబొడ్డున లక్ష రూపాయల అద్దె ఇంట్లో ఉండడం కూడా దీనినే సూచిస్తుంది.  
 
 రాజ్యాంగ సభ ఎన్నికలలో ప్రచండ నాయకత్వంలోని యూసీపీఎన్-ఎం మూడో స్థానంలోకి పడిపోయింది. నేపాలీ కాంగ్రెస్, సీపీఎన్-యుఎంఎల్ ఒకటి, రెండు స్థానాలలో నిలిచాయి. కఠ్మాండు-10 నియోజకవర్గంలో నేపాలీ కాంగ్రెస్ అభ్యర్థి రాజన్ కె.సి. చేతిలో 8000 ఓట్ల తేడాతో ప్రచండ  ఘోరం గా ఓడిపోయారు. మరో నియోజకవర్గం సిరాహా-5లో కమ్యూనిస్టు పార్టీ తిరుగుబాటు వర్గం స్థాపించిన పార్టీ సీపీఎన్-యుఎంఎల్ అభ్యర్థి లీలా శ్రేష్ట మీద కేవలం 900 ఓట్ల ఆధిక్యంతో గెలిచారు.  కానీ ఈ గెలుపును ఎవరూ గుర్తించడం లేదు. కఠ్మాండు-1 నుంచి పోటీ చేసి ప్రచండ కుమార్తె రేణు దహాల్ నేపాలీ కాంగ్రెస్ అభ్యర్థి చేతిలో ఓడిపోయారు. చిత్రం గా ‘రాచరిక పునరుద్ధరణ, హిందూ దేశం’ నినాదాలతో పోటీకి దిగిన రాష్ట్రీయ ప్రజాతంత్ర పార్టీ (నేపాల్) కూడా 3.95 లక్షల ఓట్లు గెలుచుకుంది.  2008 ఎన్నికలతో కూడా దేశంలో రాజ్యాంగం ఏర్పడలేదు. ఈ ఎన్నికల ఫలితాలను గుర్తించబోమని ప్రచండ ప్రకటిం చారు. ఆయన అనుచరులు కొందరు ఈ విషయం విలేకరులకు చెబుతున్నపుడే మళ్లీ ఆయుధం పట్టాలని నినాదాలు ఇవ్వడం విశేషం. కొత్త రాజ్యాంగం కోసం, ప్రజాస్వామ్యం కోసం నేపాల్ ఇంకా ఎంతకాలం వేచి ఉండాలో?
 - కల్హణ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement