Kalhana
-
నవ్యాంధ్ర సాహిత్య సంచిక
పుస్తక పరిచయం నడుస్తున్న చరిత్రను సాహిత్యంలో ప్రతిబింబింప చేయడం ఉన్నత స్థాయి రచనా వ్యాసంగం. వర్తమాన సాహిత్య ధోరణులను పరామర్శించుకోవడం కూడా అలాంటిదే. ‘నవ్యాంధ్ర’ సాహిత్య ప్రత్యేక సంచికలో ఈ రెండూ కనిపిస్తాయి. ఇందులో ఇరవై కథలు, పన్నెండు ఇంటర్వ్యూలు ఉన్నాయి. ఇంకో రెండు వ్యాసాలు, సాహిత్య చర్చకు సంబంధించిన మరో వ్యాసం ఉన్నాయి. మొదటి కథ ‘శ్రీరామా ఎన్క్లేవ్’ (పి.సత్యవతి) క£ý నీ, ఇంటర్వ్యూలనీ చదివితే నడుస్తున్న చరిత్ర సాహిత్య రూపం దాలుస్తున్న సంగతితో పాటు, తెలుగు నాట సాగుతున్న రచనా వ్యాసంగం మీద అభిప్రాయం ఏర్పడటానికి కూడా ఆస్కారం కలుగుతుంది. ఈ కథ పెద్ద నోట్ల రద్దు, పరిణామాలు ఇతివృత్తంగా సాగిన కథ. ఇందులో కవితలు కూడా సమకాలీన సంక్షోభాల మీద వ్యాఖ్యానాలే! ఉదాహరణ: ఎండ్లూరి సుధాకర్ కవిత, ‘ఆ 18 మంది’. ఇది పాకిస్తాన్ తీవ్రవాదుల చేతుల్లో చనిపోయిన ఉరీ సైనికులకు నివాళిగా రాసినది. ఎండపల్లి భారతి, కె. వరలక్ష్మి, రాధిక, జి.లక్ష్మి, కుప్పిలి పద్మ, జీఆర్ మహర్షి, దాట్ల దేవదానం రాజు కథలూ ఉన్నాయిందులో. మెహెర్ కథ ‘కన్నగాడి నాన్న’ కొడుకును కోల్పోయిన తండ్రి కథ. ఆ దురదృష్ట ఘటనలో కొడుకు పోయినా, బతికి బయటపడిన కొడుకు స్నేహితుడిలో కొడుకును చూసుకుంటాడా తండ్రి. అయితే ఈ బాధ లోకానిది కాదు. లోకానికి పట్టదు. ఈ సంచికలో ఇంటర్వ్యూలకు ప్రత్యేకత ఉంది. కొన్ని లోతైన అంశాలనే చర్చించాయి. ఉద్యమానికీ, సాహిత్యానికీ; జీవితానికీ, సాహిత్యానికీ మధ్య ఉన్న వారథులను చర్చించిన ఇంటర్వ్యూలు ఇవన్నీ. వామపక్ష ఉద్యమాలతో, ప్రజా ఉద్యమాలతో, పార్లమెంటరీ రాజకీయాలను విశ్వసించే పార్టీలతో అన్నింటికీ మించి సాహిత్యంతో మంచి అనుబంధం ఉన్న డాక్టర్ ఎంవీ రమణారెడ్డి ఇంటర్వ్యూ చాలా విషయాలను చర్చించింది. ‘రచయిత పరిధి వేరు. పార్టీ కార్యకర్త పరిధి వేరు. రచయితలందర్నీ సామూహికంగా ‘నిబద్ధత’ పేరుతో నియంత్రించడం సమంజసం కాదు. అది రచయిత స్వేచ్ఛకు అడ్డుపడుతుందని దిగంబర కవులూ, నేనూ వ్యతిరేకించినాము. ఆ కారణాలవల్లే విరసం నుండి బయటకు వచ్చినాను’ అని డాక్టర్ చెప్పిన మాటకు సాహిత్య ప్రస్థానంలో ఎంతో విలువ ఉందనిపిస్తుంది. శిష్యరికానికీ, సిద్ధాంతం మీద నమ్మకానికీ మధ్య ఉండే సన్నని గీతను పెద్దిభొట్ల సుబ్బరామయ్య జీవితంలోంచి గమనించడం అవసరం. ఆయన విశ్వనాథ శిష్యుడు. కానీ ఆయన రచనా వ్యాసంగంలో కనిపించే దృక్పథం గురువుగారి ధోరణికి భిన్నమైనది. కొలకలూరి ఇనాక్ ఇంటర్వ్యూలో ‘తెలుగు భాషకు మనుగడ ఉందా?’ అన్న ప్రశ్నకు చక్కని సమాధానం ఉంది: ‘‘ఏదైనా అవసరం మేరకు మారుతుంది. తెలుగయినా అంతే. దాని వినియోగమైనా అంతే. సంస్కృత స్వరూపమైన భాష కొత్తరూపాలు పొందినా, కొత్త పదజాలం గ్రహించినా మార్పులకు గురి అవుతూ ఉంటుంది. తెలుగు భవిష్యత్తుకు ఢోకా లేదు’’. వీఏకే రంగారావు (సుదీర్ఘమైనది), నామిని, పన్నాల సుబ్రహ్మణ్యభట్టు ఇంటర్వ్యూలు భిన్నాంశాలను స్పర్శించాయి. బాతిక్ కళాకారుడు పుట్టా పెంచలదాసు చిత్రకళా నైపుణ్యం మీద వ్యాసం చక్కనిది. రాజాచంద్ర ఫౌండేషన్ గతంలో మంచి పుస్తకాలను వెలువరించింది. నవ్యాంధ్ర సాహిత్య ప్రత్యేక సంచిక కూడా అంతే శ్రద్ధతో వెలువరించారు. తెలుగు భాషోద్యమ సమితి సమర్పించిన ఈ సంచికకు సంపాదకులు సాకం నాగరాజ, గంగవరం శ్రీదేవి. ఈ పుస్తకం చేతిలోకి రాగానే వడ్డాది పాపయ్య ముఖచిత్రం కేసి కొన్ని లిప్తలపాటైనా చూశాకే లోపలికి వెళతాం. నవ్యాంధ్ర సాహిత్య ప్రత్యేక సంచిక; సంపాదకులు: సాకం నాగరాజ, గంగవరం శ్రీదేవి; పేజీలు: 136(ఏ4 సైజ్); వెల: 100; ప్రచురణ: తెలుగు భాషోద్యమ సమితి, రాజాచంద్ర ఫౌండేషన్, తిరుపతి. కల్హణ -
నేటి నిజాలకు గతంలోనే బీజాలు
మానవాళి ఎంత దూరం ప్రయాణించినా గతంతో మాటామంతీ జరుపుతూనే ఉంటుంది. వర్తమానం ఓ అడుగు ముందుకు వేయగలిగినా; సంక్షోభాలనూ, కల్లోలాలనూ ఎదుర్కొంటున్నా అందుకు సంబంధించిన చూపు, రూపు గతంలో తప్పక కనిపిస్తాయి. హైదరాబాద్ రాజ్యంలో కల్లోలాలకీ, రాయలసీమ పాలెగాళ్ల ప్రతాపాలకీ, అదే సమయంలో కోస్తాలో ఆనకట్టల నిర్మాణానికీ దోహద పడిన పరిస్థితులు ఏవి? హైదరాబాద్ సంస్థానం మిగిలిన ప్రపంచానికి దూరంగా ఉండిపోవడానికీ, ప్రజల భాషకు కూడా చోటులేని దుస్థితికీ హేతువులు ఏమిటి? అదే సమయంలో ఆధునిక విద్యలో కోస్తా ప్రాంతీయులు ముందడుగు వేయడానికి కారణం; సామాజిక సంక్షోభాలు ఉన్నా రాయలసీమలో కొంతమేర విద్యాగంధం విరియడానికి ఉన్న హేతువులు ఏమిటి? 18వ శతాబ్దపు చరిత్ర పరిణామాల అధ్యయనమే వీటికి సమాధానం ఇస్తుంది. నిజానికి దక్షిణ భారత చరిత్రను నిర్దేశించిన ఆ మూడు ప్రాంతాల చారిత్రక పరిణామాలు ఒకదానితో ఒకటి గాఢమైన అనుబంధం కలిగినవే. ఆ పరిణామాల విశ్లేషణే 'ఎర్లీ మోడరన్ ఆంధ్ర, హైదరాబాద్ అండ్ కంపెనీ రూల్- క్రీ.శ. 1724-1857' గ్రంథం. ఏపీ హిస్టరీ కాంగ్రెస్, తెలుగు విశ్వవిద్యాలయం సంయుక్తంగా అందిస్తున్న తెలుగువారి చరిత్ర సంపుటాలలో ఆరవది ఈ పుస్తకం. మొగలుల పతనంతో భారత భూభాగంలో చిన్న రాజ్యాలు తలెత్తాయి. ఈ పరిణామానికి సమాంతరంగా జరిగినదే ఇంగ్లిష్ ఈస్టిండియా కంపెనీ విస్తరణ. నిజాం ఉత్థానపతనాలు ఈ ప్రయాణంలో చోటు చేసుకున్నవే. కలకత్తా నుంచి మద్రాసు వరకు కంపెనీ ఆధిపత్యం నెలకొల్పగలిగిందంటే ఆయా ప్రాంతాలను నిజాం కంపెనీకి ధారాదత్తం చేయడమే కారణం. నిజాం రాజ్యం, కంపెనీ-బ్రిటిష్ ఏలుబడిలోకి పోయిన ప్రాంతాలు వేర్వేరు రూపాలు సంతరించుకోవడమే అనేక చరిత్ర మలుపులకు కారణం. వర్తమానం మీద వాటి జాడ కూడా గాఢమైనదే. ఈ పరిణామ క్రమాన్ని ఈ గ్రంథంలోని మొదటి ఆరు అధ్యాయాలు ఆవిష్కరించాయి. అలాగే ఆంగ్లేయుల పాలనలో కోస్తాంధ్రలో ఆనకట్టలు వెలసిన తీరు, ఇంగ్లిష్ విద్య, వాణిజ్యం ఎలాంటివో 7 నుంచి 12 వరకు ఉన్న అధ్యాయాలు విశ్లేషించాయి. ఆచార్య బి. కేశవనారాయణ రాసిన 13వ అధ్యాయం 1773-1857 మధ్య ఉత్తర సర్కారు జిల్లాలలో జరిగిన తిరుగుబాట్లను చర్చించింది. ఇవన్నీ జమిందారీ వ్యవస్థ మీద నిరసనలే. వీటికి విశేష ప్రాధాన్యం ఉంది. తరువాతి అధ్యాయం 1800-1850 మధ్య రాయలసీమలో పాలెగాళ్ల చరిత్రను చర్చించింది. డాక్టర్ వై.ఎ. సుధాకరరెడ్డి ఈ వివరాలు అందించారు. 1857 నాటి ప్రథమ స్వాతంత్య్ర సంగ్రామం హైదరాబాద్ సంస్థానం మీద (వి. రామకృష్ణ), ఆంధ్ర ప్రాంతం మీద (వి. రాజగోపాల్) వేసిన ముద్రను గురించి కూడా ఈ పుస్తకం వివరించింది. ఇందులోని మొత్తం 26 అధ్యాయాలలో, 19వ అధ్యాయం మరీ ప్రత్యేకమైనది. తెలుగు భాష, సాహిత్యాలను ఐరోపా పండితులు వెలుగులోకి తేవడానికి చేసిన కృషిని ఇందులో పీటర్ ఎల్. షిమిథెనర్ లోతుగా చర్చించారు. తెలుగు ప్రాంతాలను సామాజిక, రాజకీయ కల్లోలాలలో ముంచెత్తిన 18వ శతాబ్దంలోనే భాషా సాహిత్యాల మీద కొందరు పాశ్చాత్యులు కొత్త వెలుగును ప్రసరింప చేయడం గొప్ప వైచిత్రి. సీపీ బ్రౌన్, బెంజిమన్ షుల్జ్, విలియం క్యారీ, జార్జి క్రాన్, కోలిన్ మెకంజీ, విలియం బ్రౌన్, వి.డి. క్యాంప్‌బెల్ వంటి వారు ఇందుకు చేసిన కృషిని రమణీయంగా వివరించే అధ్యాయం ఇది. హైదరాబాద్‌లో, కోస్తాంధ్రలో, రాయలసీమలో 18వ శతాబ్దంలో జరిగిన ఈ ఘటనలన్నీ చరిత్రాత్మకమే కాదు, అవి పరస్పర ప్రేరేపితాలు కూడా. ఇవన్నీ చదివిన తరువాత 2000 సంవత్సరం నాటి తరం చూసిన పరిణామాలకు అవే బీజాలు నాటాయన్న వాస్తవం అనుభవానికి రావడం గొప్ప అనుభూతి. ఆచార్య వకుళాభరణం రామకృష్ణ సంపాదక త్వంలో ఈ సంపు టాలు వెలువడుతున్నా, ఒక్కొక్క సంపుటానికి వేర్వేరు సంపాదకులు ఉన్నారు. ఈ సంపుటానికి ఆచార్య అడపా సత్యనారాయణ సంపా దకులు. హెచ్. రాజేంద్రప్రసాద్, ఏఆర్ రామ చంద్రారెడ్డి, తంగెళ్లపల్లి విజయకుమార్, గుంటూరి నాగశ్రీధర్, వి. రామకృష్ణారెడ్డి, చంద్ర మల్లంపల్లి, వి. లలిత, సల్మా అహ్మద్ ఫరూఖీ, బి. సుధారెడ్డి, బిఎస్. రోహిణీ అయ్యంగార్ ఇతర అధ్యాయాలు అందించారు. (డిసెంబర్ 1న హైదరాబాద్‌లోని తెలుగు విశ్వవిద్యాలయంలో ఆరో సంపుటం ఆవిష్కరణోత్సవం సందర్భంగా) - కల్హణ -
ప్రజాసాహితిలో గురజాడ
‘తలుపు తలుపు’... ఈ రెండు మాటలతోనే గురజాడ ‘దిద్దుబాటు’కథను ప్రారంభించారు. ఆ మాటలు ఆధునిక తెలుగు సాహిత్య వాకిలిని తెరిపించడానికి మహాకవి అన్న మాటలేననిపిస్తాయి. ఆయన ఇచ్చిన ఆధునిక దృష్టి నుంచి తెలుగు సాహిత్యం సదా స్ఫూర్తిని పొందుతూనే ఉంది. అందుకు నిదర్శనమే కన్యాశుల్కం నాటక ప్రదర్శన నూరేళ్ల సందర్భం, గురజాడ నూరవ వర్ధంతి సందర్భాలకు లభించిన స్పందన. అందులో ఒక స్రవంతి ‘ప్రజాసాహితిలో (1977-2015) మహాకవి గురజాడ’ పుస్తకం. సాహిత్యాన్ని సమాజోద్ధరణకు వినియోగించుకున్నా, దానికి ఉండవలసిన సౌందర్య దృష్టిని విస్మరించని మహనీయుడు గురజాడ. వీటి వెనుక ఉన్న నేపథ్యాన్నే ఈ వ్యాసాలు చాలా వరకు వివరించాయి. కామ్రేడ్ గురజాడ, కన్యాశుల్కములో మధురవాణి (శ్రీశ్రీ), ‘వాడుక తెనుగు’ (గరిమెళ్ల సత్యనారాయణ రాసిన ఈ పద్యాలు గురజాడ నిర్యాణం సందర్భంలో 4-12-1915న కృష్ణాపత్రికలో వెలువడినాయి.), మహాకవి (కవిత, దేవులపల్లి కృష్ణశాస్త్రి), గిరీశం-శకారుడూ (వ్యాసం, రాంభట్ల కృష్ణమూర్తి), డామిట్ గురజాడా! (దీర్ఘ కవిత, శివసాగర్), అప్పరాయ కవీ! (వ్యాసం, నార్ల వెంకటేశ్వరరావు), గురజాడ మనస్తత్వంలో విపరీత ధోరణులు (వ్యాసం, రాచమల్లు రామచంద్రారెడ్డి), బంగోరె ‘మొట్టమొదటి కన్యాశుల్కంపై సమీక్షలలోని శకలాలు (మునిమాణిక్యం నరసింహారావు), గురజాడ నిపుణవాణి మధురవాణి (సంజీవ్‌దేవ్) వంటి సాహితీవేత్తల వ్యాసాలు ఇందులో చేర్చారు. సెట్టి ఈశ్వరరావు, కాత్యాయనీ విద్మహే, రాచపాళెం చంద్రశేఖరరెడ్డి, ఆచార్య ఎస్.గంగప్ప, బి.సూర్యసాగర్, కొత్తపల్లి రవిబాబు, దివికుమార్, ఛాయారాజ్, కాకరాల, అంపశయ్య నవీన్ వంటి పరిశోధకులు, విమర్శకులు, సామాజిక విశ్లేషకుల వ్యాసాలు కూడా ఉన్నాయి. యుఎ నరసింహమూర్తి కన్యాశుల్కం నాటకాన్ని 19వ శతాబ్దంలో వచ్చిన భారతీయ నాటకాలతో పోలుస్తూ విలువైన వ్యాసం రాశారు (ఈ వ్యాసమే తరువాత ఉద్గ్రంథంగా విస్తరించారు). ఆధునిక తెలుగు సాహిత్యానికి గురజాడ అడుగుజాడను రుజువు చేసే వ్యాస సంకలనం ఇది. కల్హణ ప్రజాసాహితిలో (1977-2015) మహాకవి గురజాడ వెల: 400; ప్రతులకు: మైత్రీ బుక్‌హౌస్, జలీల్ వీధి, కారల్‌మార్క్స్ రోడ్, విజయవాడ-520 002. ఫోన్: 9848631604 -
అంతా మోదమే
దారిద్య్ర నిర్మూలనపైనే దృష్టి సగానికి తగ్గిన ద్రవ్యోల్బణం నీతి ఆయోగ్ ఆవిర్భావం స్వచ్ఛ భారత్ మహాయజ్ఞం ముద్రా బ్యాంకు ఏర్పాటు జన్‌ధన్ యోజనకు శ్రీకారం స్మార్ట్ నగరాలకు పచ్చజెండా పెరిగిన విద్యుదుత్పాదన ఇనుమడించిన దేశ ప్రతిష్ట రోడ్ల నిర్మాణం వేగవంతం దేశంలో ఉన్న 60 శాతం పేదరికాన్ని, 30 శాతానికి తగ్గించడానికి ఏడు దశాబ్దాలు పట్టింది. మిగిలిన సగాన్ని నిర్మూలించడానికి మరో డెబ్బయ్ సంవత్సరాలు కావాలా? ఇది మోదీ వేసుకున్న చరిత్రాత్మకమైన ప్రశ్న. ఆరెస్సెస్ పేరు వింటేనే చాలా వర్గాల నుంచి విమర్శల నిప్పులు కురు స్తాయి. అలాంటి సంస్థలో ఆయన పూర్తిస్థాయి కార్యకర్త. భారత ముస్లింలు సరే, అసలు ఉపఖండ ముస్లింల ఆలోచనలలో మార్పునకు మార్గంవేసినదిగా పేర్గాంచిన అయోధ్య రథికులలో ఆయన ఒకరు. ప్రపంచస్థాయిలో హక్కుల పరిరక్షణ సంస్థల నుంచి తీవ్ర నిరసనను ఎదుర్కొన్న గోధ్రా రైలు దగ్ధం ఘటన ఆయన పాలనలోనే చోటు చేసుకుంది. ఆయన నరేంద్రభాయ్ దామో దర్ మోదీ. అయినా ఆయన భారత ప్రధాని కావడం దేశ రాజకీయాలలో పెను మలుపు. ప్రపంచానికి ఆయన విజయం ఓ అద్భుతమన్నా అతిశయోక్తి కాదు. మోదీ ఈ సంవత్సరానికిగాను సీఎన్ఎన్-ఐబీఎన్ ఎంపిక చేసిన ‘ఇండియన్ ఆఫ్ ది ఇయర్’ కావచ్చు. కానీ ఆయనను విమర్శించడానికి వచ్చే ఏ చిన్న అవకాశాన్నీ వదులుకోని మీడియా ఇక్కడే ఉంది. కాబట్టి ఆయన ఏడాది పాలనపై మదింపునకు అవకాశం వచ్చినపుడు విమర్శలు వెల్లువెత్త కుండా ఉంటే, అది వింతల్లో వింత. ఎవరి మీదనైనా విమర్శలనూ, ఆరోపణ లనూ కప్పిపుచ్చనక్కరలేదు. అది ప్రజాస్వామ్యానికి ద్రోహం చేయడమే. అలాగే మూడు దశాబ్దాల తరువాత ప్రజల నుంచి పూర్తి మెజారిటీ సాధించిన దేశాధినేత సాధించినదేమైనా ఉంటే, దానిని గుర్తించడానికే నిరాకరించడం అంతకుమించిన ప్రజాస్వామ్యద్రోహం. దేశాభివృద్ధి అంటే ప్రధానమంత్రి ఇంటి కార్యమన్నట్టూ, ఇంకా చెప్పాలంటే వందలమంది అధికారుల, విమ ర్శలకు అతీతులైన ఇతర నేతల సమష్టి కృషి అన్న వాస్తవాన్ని విస్మరించేటట్టూ వ్యవహరించడం కూడా అప్రజాస్వామికమే. ఏ పార్టీ, ఏ నేత సాధించినప్ప టికీ అభివృద్ధి అనేది ప్రజాధనంతో, రాజ్యాంగ పరిధిలో జరిగిన యజ్ఞం. ఆ దృష్టితో నరేంద్ర మోదీ ఏడాది పాలనలో దేశం సాధించిన పురోగతిని అవలో కించాలి. మంచి ఉంటే చెప్పాలి. అభ్యంతరాలు వెల్లడించాలి. ఈ దారిలో ► పన్నెండు మాసాలలో ప్రధాని మోదీ 18 దేశాలలో పర్యటించారు. దీనితో ప్రపంచ దేశాలతో భారత్ సంబంధాలు పటిష్టమైనాయని పార్టీ, నిపుణులు ప్రకటించారు. ► సమాఖ్య వ్యవస్థను మరింత బలోపేతం చేయడానికే నీతి ఆయోగ్‌ను ప్రవేశపెట్టినట్టు ప్రభుత్వం చెప్పింది. బొగ్గు వేలం ద్వారా లభించే ఆదాయం రాష్ట్రాలకు వెళ్లాలని ఆశిస్తోంది. అదే సమయంలో 14వ ఆర్థిక సంఘం సిఫారసులను కూడా ఆమోదించింది. దీనితో రాష్ట్రాల ఆర్థిక స్వయం ప్రతిపత్తి పెరుగుతుంది. ► దర్యాప్తు సంస్థల దుర్వినియోగం ఇక గతం. నల్లధనం వెలికితీతకు భవి ష్యత్తులో మరిన్ని చట్టాలు రూపొందించాలని ఎన్డీఏ-2 భావిస్తోంది. ► సుపరిపాలన మీద దృష్టి. వ్యవసాయంలో ముఖ్యంగా, నీటి పారుదల రంగం మీద; గ్రామీణ మౌలిక వసతుల కల్పన రంగంలోను ప్రభుత్వ పెట్టుబడులను విస్తరించాలని మోదీ ఆలోచన. పాలనా రంగం మీద కొత్త దృష్టి ‘కాంగ్రెస్ ముక్తి భారత్’ వంటి నినాదంతో, పూర్తి ఆధునిక సాంకేతిక పరి జ్ఞానంతో ఎన్నికల రణం చేసి అధికారంలోకి వచ్చారు మోదీ. ఇప్పుడు రాజ్య మేలుతున్న రాజకీయ సంస్కృతి పూర్తిగా మారాలన్న దృక్పథం దేశవాసులలో పుష్కలంగా ఉన్న కాలంలో ఈ పరిణామం జరిగింది. ఢిల్లీలో ఆప్ రాజకీ యాలూ, వాటికి లభించిన స్పందన ఇందుకు అద్దం పట్టాయి. అవినీతి, బంధుప్రీతి, జవాబుదారీతనం లోపించడం, పేదరికాన్ని రాజకీయానికి పెట్టు బడిగా మార్చుకునే నీచత్వం, కుహనా లౌకికవాదంతో జరుగుతున్న దగా, జాతీయ సమగ్రతనూ, భద్రతనూ గాలికి వదిలేసే నిర్లక్ష్యం దేశాన్ని అతలా కుతలం చేస్తున్న కాలంలో ప్రజలు మోదీకి ఓటు వేశారు. బీజేపీ సంగ తేమో కానీ, దేశ ప్రజలు మోదీలో కాంగ్రెస్‌కు ప్రత్యామ్నాయాన్ని చూశారు. వివాదా స్పదుడే అయినా, అవినీతి మచ్చ లేకపోవడం మోదీకి కలసివచ్చిన అంశం. కాంగ్రెస్‌లో అనేకమంది వివాదాస్పదులు. మచ్చలేనివారు మిగల లేదు. అందుకే మోదీ మేలని అనిపించారు. పైగా జీరో రాజకీయ అవినీతి మీద పట్టుదల ఉన్నవాడు. ఇంతవరకు అది రుజువు చేసుకున్నారు కూడా. 21వ శతాబ్దం గురించి పదే పదే చెప్పినా, దేశానికి అలాంటి రూపును ఇవ్వడంలో రాజీవ్‌గాంధీ దారుణంగా విఫలమయ్యారు. నిజానికి అలాంటి రూపు కొంత వరకు పీవీ నరసింహారావు ద్వారా సాధ్యమైంది. కానీ కాంగ్రెస్ అవినీతి ఆయన విజయాలను, ఫలితాలను అచిరకాలంలోనే కాలగర్భంలోకి నెట్టి వేసింది. కాబట్టే మోదీలో కొత్త ‘రాజకీయ ముఖాన్ని’ దేశ ప్రజలు చూశారు. తొలినాటి ప్రధానులూ, ప్రణాళికా నేతలూ, రాష్ట్రపతులూ ప్రవేశ పెట్టిన పథ కాలను, పంథాలను ఏళ్ల తరబడి అరమోడ్పు కళ్లతో భక్తిగా కొనసాగించడం కాదు, కాలపరీక్షకు నిలబడని వ్యవస్థలను సగౌరవంగా తప్పించేందుకు మోదీ చేసిన సాహసమే మేధావులను ఆయన వైపు మొగ్గేటట్టు చేసింది. ► పన్నెండు మాసాల మోదీ పాలనలో ద్రవ్యోల్బణం సగానికి తగ్గింది. వృద్ధిరేటు ఏడు శాతానికి పురోగమిస్తున్నది. ► 17,830 మెగావాట్ల విద్యుదుత్పత్తి లక్ష్యాన్ని అధిగమించి, 22,566 మెగావాట్లను సాధించారు. ► కాంగ్రెస్ నత్తనడక పాలన పుణ్యాన ఇటీవల వరకు రోడ్డు నిర్మాణం రోజుకు రెండు కిలోమీటర్లకు పరిమితం కాగా, ఇప్పుడు అది పది కిలో మీటర్లకు పుంజుకుంది. ► మోదీ పార్లమెంటులో ఇచ్చిన తొలి ఉపన్యాసంలో పేర్కొన్న దారిద్య్ర నిర్మూలనకు ఆయన కట్టుబడి ఉన్నట్టు ఈ చర్యలతో భావించవచ్చు. స్వాతంత్య్రం తెచ్చుకున్న నాటికి దేశంలో ఉన్న 60 శాతం పేదరికాన్ని, 30 శాతానికి తగ్గించడానికి ఏడు దశాబ్దాలు పట్టింది. మిగిలిన సగాన్ని నిర్మూలించడానికి మరో డెబ్బయ్ సంవత్సరాలు కావాలా? ఇది మోదీ వేసుకున్న చరిత్రాత్మకమైన ప్రశ్న. వాస్తవానికి ఈ ప్రశ్నకే భవిష్యత్తు సరైన సమాధానం కోరుతోంది. ఇది సాధిస్తేనే మోదీ విజయం నిజంగా చరిత్రా త్మకం అవుతుంది. ► జన్‌ధన్ యోజన ద్వారా 15 కోట్లకు పైగా ప్రజలకు బ్యాంకు సేవలను అందుబాటులోకి తెచ్చారు. పింఛన్ తదితర సౌకర్యాలు కల్పిస్తూ పది కోట్ల రూపే కార్డులను మోదీ ప్రభుత్వం ఇచ్చింది. ► రూ. 20,000 కోట్ల మూలధనంతో ముద్రా బ్యాంకు ఏర్పాటయింది. రూ. 50,000 మొదలు పది లక్షల పెట్టుబడులతో వ్యాపారాలు చేయదలచిన వారికి ఈ బ్యాంకు రుణాలు ఇస్తుంది. 5.7 కోట్ల మంది చిన్న వ్యాపారు లకు సాయం అందించడమే దీని లక్ష్యం. అటల్ పెన్షన్ ఆయోజన వంటి సామాజిక భద్రత పథకాల ఏర్పాటు. ► స్వచ్ఛభారత్ మిషన్ కింద 2019 నాటి దేశంలో సంపూర్ణ పారిశుధ్యాన్ని సాధించడానికి కార్పొరేట్ రంగం హామీ ఇచ్చింది. ► వంట గ్యాస్ పంపిణీని డెరైక్ట్ క్యాష్ బెనిఫిట్ పథకం కిందకు తెచ్చారు. దీనితో సంవత్సరానికి ఐదు బిలియన్ డాలర్ల మేర రాయితీలు తగ్గాయి. ► రక్షణ, బీమా, రైల్వే మౌలిక వ్యవస్థలోకి 49 శాతం విదేశీ ప్రత్యక్ష పెట్టుబ డులకు అవకాశం కల్పించడం మేలేనని నిపుణుల అంచనా. హైస్పీడ్ రైళ్లను ప్రవేశ పెట్టడంతో సహా ఐదేళ్ల కాలంలో రైల్వేల మీద 130 బిలి యన్ డాలర్లు ఖర్చు చేయాలని మోదీ ప్రభుత్వం నిర్ణయించింది. ► వంద స్మార్ట్ నగరాల నిర్మాణానికి మంత్రి మం డలి ఆమోదించింది. ► కొత్త చట్టాలను ఆమోదింపచేయడం ద్వారా గనుల రంగంలో ఏర్పడిన ప్రతిష్టంభనను నిరోధించింది. బొగ్గుగనుల, మొబైల్ టెలిఫోనీకి చెందిన టెలికం స్పెక్ట్రమ్ వేలాలను మోదీ సర్కారు దిగ్విజయంగా పూర్తి చేసింది. ► ఉక్కు, బొగ్గు, విద్యుత్ రంగాల పథకాలకు అనుమతుల కోసం ఏకగవాక్ష విధానాన్ని ప్రవేశపెట్టారు. త్వరితగతిన నిర్ణయాలు తీసుకునేందుకు వీలుగా మంత్రుల బృందాల విధానాన్ని మోదీ రద్దు చేశారు. ► వ్యవసాయ సాధనాల ధరల స్థిరీకరణకూ, ద్రవ్యోల్బణాన్ని అదుపు చేయడానికీ నిధి. సవాళ్లూ ఎక్కువే మోదీ అధిగమించవలసిన సవాళ్లు కూడా తక్కువేమీ కాదు. ఎన్డీఏ-1లో పెట్టుబడుల ఉపసంహరణ మంత్రిత్వ శాఖను నిర్వహించిన అరుణ్‌శౌరి ఇటీవలనే మోదీ ప్రభుత్వం మీద తీవ్ర విమర్శలే చేశారు. ఈ ప్రభుత్వానికి దిశానిర్దేశం ఏదీ లేదని ఆయన ఆరోపణ. అలాగే బీజేపీ సిద్ధాంతకర్త గోవిం దాచార్య యూపీఏకూ, ఎన్డీఏకూ భేదం లేదని విమర్శించారు. ఇక అత్యంత దారుణమైన విమర్శలు ఎదుర్కొంటున్న అంశం- భూసేకరణ బిల్లు. రాజ్యసభలో బలం లేని మోదీ సర్కారు ఈ బిల్లును ఎలా ఆమోదింప చేస్తుందో, ఎలా గట్టెక్కుతుందో చూడాలి. ఇందుకు బీజేపీ అనుబంధ రైతు సంఘం కిసాన్ మోర్చా కూడా వ్యతిరేకమే మరి. కల్హణ -
విశ్వాన్ని కుదిపిన విదూషకుడి ఆత్మహత్య
నటుడు పండించే హాస్యరసానికి పరాకాష్ట, ప్రేక్షకుడి కంటి కొన మీద విరిసే ఓ కన్నీటి చుక్క అంటారు లాక్షణికులు. దానికి తిరుగులేని నమూనా రాబిన్. షికాగోలో పుట్టిన రాబిన్‌కు చిన్నతనం నుంచి రంగస్థల కళలంటే ఆసక్తి. ‘అతడు మనందరినీ నవ్వించాడు. కన్నీళ్లూ పెట్టించాడు.’ అంటూ విచారం ప్రకటించాడు అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా, రాబిన్ విలియమ్స్(జూలై 21, 1951-ఆగస్ట్ 11, 2014) మరణవార్త విని. ఉల్కాపాతం వంటి మేధో పరమైన హాస్యాన్ని చిందించిన ఆ హాలీవుడ్ దిగ్గజం కూలిపోయింది. ఈ సంగతి తెలిశాక శ్వేతసౌధం మౌనం వహించడం సాధ్యం కాకుండా ముందే చేశాడు రాబిన్. ఎందుకంటే, ‘వ్యంగ్యం చచ్చిపోయిందని ప్రజలంతా అంటూ ఉంటారు. కానీ ఆ మాట అబద్ధం. వ్యంగ్యం జీవించి ఉండడమే కాదు, శ్వేత సౌధంలో మనుగడ సాగిస్తోంది’ అంటూ ఒక సందర్భంలో నిశితమైన చెణుకు విసిరాడతడు. నిజమే, ఓ చానల్ చెప్పి నట్టు రాబిన్ అమెరికన్లకి నవ్వడం నేర్పాడు. లోకానికి నవ్వు ను కానుకగా ఇచ్చి, ఆత్మహత్యతో దాన్ని విడిచి పెట్టి వెళ్లిపోయాడు. నటుడు పండించే హాస్యరసానికి పరాకాష్ట, ప్రేక్షకుడి కంటి కొన మీద విరిసే ఓ కన్నీటి చుక్క అంటారు లాక్షణికు లు. దానికి తిరుగులేని నమూనా రాబిన్. షికాగోలో పుట్టిన రాబిన్‌కు చిన్నతనం నుంచి రంగస్థల కళలంటే ఆసక్తి. తరు వాత వేదికల మీద హాస్య, వ్యంగ్య ప్రదర్శనలు ఇచ్చే వృత్తిని చేపట్టాడు. ‘నేను నటుడిని కావాలని అనుకుంటున్నాను’ అని తండ్రితో చెబితే, ‘మంచిది, దానితో పాటు ఎప్పుడైనా పనికొస్తుంది, వెల్డింగ్ వంటి వృత్తి కూడా ఒకటి నేర్చుకో!’ మని ఆయన సలహా ఇచ్చాడట. కానీ రాబిన్ వెనక్కి తిరిగి చూసుకోలేదు. ఆ ‘స్టాండ్ అప్ కమేడియన్’ ఆస్కార్ వేదిక మీద ఉత్తమ సహాయ నటుడు పురస్కారం అందుకునేవరకు ప్రయాణం ఆపలేదు. ‘మోర్క్ అండ్ మిండీ’ అనే మొదటి టీవీ షోతోనే రాబిన్ ప్రపంచ ప్రేక్షకుల మనసులు దోచుకున్నాడు. హాలీవుడ్ అక్కున చేర్చుకుంది. పాపయ్, ది వరల్డ్ అకార్డింగ్ టు గార్ప్, గుడ్ మార్నింగ్, వియత్నాం, డెట్ పొయెట్స్ సొసైటీ, అవేకెనింగ్స్, గుడ్‌విల్ హంటింగ్ (ఇందులో నటించిన మా నసిక విశ్లేషకుడికి పాత్రకే ఆస్కార్ లభించింది), ది ఫిషర్ కింగ్, హుక్, అలాదీన్, మిసెస్ డౌట్ఫైర్ (కమల్ హసన్ నటించిన ‘భామనే సత్యభామనే’కు మాతృక), జుమాంజీ, ది బర్డ్ కేజ్, నైట్ ఎట్ ది మ్యూజియం వంటి అపురూప చిత్రాలలో రాబిన్ నటించారు. ‘హాస్యగాడు బావిలో పడినట్టు’ అని సామెత. అతడు ఆత్మహత్య చేసుకోవడానికి బావిలో పడినా, అదీ లోకానికి నవ్వులాటే. మూడు వారాలుగా ఇంటికే పరిమితమైన రాబిన్ నిజానికి వీధిలోకి వచ్చి ఉంటే ఇలాంటి పరిస్థితినే ఎదుర్కొనేవాడు. అతడు తీవ్రమైన మానసిక ఒత్తిడికి గురై ఉన్నాడు. కొన్ని వారాలుగా పార్కిన్సన్స్ పెయిన్స్‌కు వైద్యం చేయించుకుంటున్నాడు. ప్రపంచానికి ఇంత హాస్యాన్ని పంచిన రాబిన్ వ్యక్తిగత జీవితంలో కొంత చేదు లేకపోలేదు. ఒకనాడు అతడు మత్తుమందులకు బానిస. నటన మీద అభి మానం ఆ వ్యసనం నుంచి అతడిని బయటపడేసింది. చివ రికి రోగాన పడ్డాడు. కలం పట్టడం జీవితంలో ఇక సాధ్యం కాదు అన్న సంగతి తెలిశాకే ప్రఖ్యాత రచయిత ఎర్నెస్ట్ మి ల్లర్ హెమింగ్వే ఆత్మహత్య చేసుకున్నాడని అంటారు. చేతుల నరాలు కోసుకుని, ఉరి వేసుకున్న రాబిన్ జీవితం కూడా ఆ పంథాలోనే ముగిసిందా? ‘గుర్తుంచుకో! తాత్కాలిక సమస్య కి ఆత్మహత్య శాశ్వత పరిష్కారం’ అని 2009లో తీసిన ఒక వీడియోలో తను చెప్పిన మాటనే ఇప్పుడు రాబిన్ ఆచరించా డా? ఇది ప్రపంచాన్ని కుదిపిన విదూషకుడి ఆత్మహత్య. నిజానికి అమోఘమైన సృజనాత్మక ప్రతిభ ఉన్న ఎం దరో సినీ నటులు ఆత్మహత్యను ఆశ్రయించడం పెద్ద విషా దం. మార్లిన్ మన్రో, ఫ్రెడ్డీ ప్రింజ్, స్పాల్డింగ్ గ్రే (హాస్యన టులు), హ్యూ ఓ కానర్, డయానా బెరీమోర్, ల్యూప్ వెలేజ్ ఇలా ఆత్మహత్యలు చేసుకున్న హాలీవుడ్ నటీనటులే. ఆ స్కార్ పురస్కారం కోసం గుమ్మం వరకు వెళ్లిన మహా ప్రతి భావంతులు కూడా ఆత్మహత్యలు చేసుకోవడం మరీ వింత. రిచర్డ్ ఫ్రాన్స్వర్త్, గిన్ యంగ్, చార్లెస్ బోయర్ అలాంటి వారే. డెరైక్టర్ కుర్చీలోనే కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్న గురుదత్, చేదు తప్ప జీవిత మాధుర్యం భ్రమ అనే ప్రగాఢ విశ్వాసంతో ఆత్మహత్యకు పాల్పడిన దివ్యభారతి, సిల్క్ స్మిత, జియాఖాన్, ఉదయ్‌కిరణ్ వంటివారు ఈ సంద ర్భంలో గుర్తుకు రాకుండా ఉండరు. ఇలా ఇంకా ఎందరో! వారందరి ఆత్మలకు శాంతి కలగాలని ఆశిద్దాం. కల్హణ -
‘గత విస్మృతి’తో గందరగోళం
తన గతం ప్రపంచం దృష్టి నుంచి చెరిగిపోవాలని ఈ హక్కు మేరకు వ్యక్తులు కోరవచ్చు. ఆ క్రమంలోనే ఇంటర్నెట్ నుంచి ఫొటోలు, వివరాలు, అందుకు సంబంధించిన లింకులను కూడా తొలగించమని సమాచార వ్యవస్థలను కోరే హక్కు వారికి సంక్రమిస్తుంది. వ్యక్తులు తమ తమ చేదు గతాన్ని సమాజం దృష్టి నుంచి మరుగుపరచాలని కోరుకోవచ్చున ని చెప్పే హక్కు గురించి ఇప్పుడు కొన్నిదేశాలు మాట్లాడుతున్నాయి. దీనికే ‘గత విస్మృతి హక్కు’ అని పేరు పెట్టారు. ఇందువల్ల ఒక వ్యక్తికి సంబంధించిన గతం, అందులోని చీకటికోణం మూడో కం టికి తెలియదన్నమాట. మనిషి తన గతాన్ని మరచిపోవడం ఎలాగూ సాధ్యం కాదు. కాబట్టి సమాజమే దానిని మరచిపో యేటట్టు చేయాలన్నదే ఈ హక్కు అసలు ఉద్దేశం. జీవితం స్వయం ప్రతిపత్తితో ముందుకు సాగేందుకు ఈ హక్కు అవ సరమని అనుకూలురు చెబుతున్నారు. తన గతం ప్రపంచం దృష్టి నుంచి చెరిగిపోవాలని ఈ హక్కు మేరకు వ్యక్తులు కోర వచ్చు. ఆ క్రమంలోనే ఇంటర్నెట్ నుంచి ఫొటోలు, వివ రాలు, అందుకు సంబంధించిన లింకులను కూడా తొలగిం చమని కోరే హక్కు వారికి సంక్రమిస్తుంది. కానీ ప్రైవసీ హక్కుకూ, గత విస్మృతి హక్కుకు చాలా తేడా ఉంది. యూరోపియన్ యూనియన్ ఆవిర్భవించిన తరువాత కొన్ని దేశాలలో, ప్రధానంగా ఫ్రాన్స్, అర్జెంటీనాలలో ఈ హక్కు గురించి ఎక్కువ చర్చ జరిగి, ప్రోత్సాహం కూడా లభించింది. కానీ దీనిని మానవ హక్కులలో భాగంగా పరిగణించడం గురించీ, ఒక హక్కుగా గుర్తించడం గురించీ కూడా ఈయూ దేశాల మధ్యనే ఏకాభిప్రాయం లేదు. నిజానికి ఈ హక్కు యాదృచ్ఛికంగా తెర మీదకు వచ్చిం ది. వ్యక్తులకు సంబంధించిన సమాచారాన్ని విచ్చల విడిగా సేకరించే విధానాలను నిరోధించే ఉద్దేశంతో యూరోపియన్ యూనియన్ డేటా ప్రొటెక్షన్ డెరైక్టివ్ అనే చట్టాన్ని యూరో పియన్ యూనియన్ రూపొందించినపుడే గత విస్మృతి హక్కు అంశం వెలుగు చూసింది. దీనిని మానవహక్కుల చట్టంతో సమానంగా చూడాలన్న అభిప్రాయం కొన్ని దేశా లలో వ్యక్తమవుతోంది. ఫ్రాన్స్, అర్జెంటీనా కొంతవరకు అమెరికా ఈ హక్కును గౌరవిస్తున్నాయి కూడా. ఫ్రాన్స్ 2010లోనే దీనికి చట్టబద్ధత కల్పించింది. గత విస్మృతి హక్కు ఎలాంటి వారు కోరారు? ఎందుకు కోరారు? ఒక్క ఉదాహరణ: 2014 మే నెలలో స్పెయిన్‌లో జరిగిన ఉదంతమిది. దీనినే యూరోపియన్ యూనియన్ కోర్టు వర్సెస్ కోసెజా కేసు అంటారు. స్పెయిన్‌కు చెందిన మేరియా కోసెజా తన ఇల్లు వేలానికి సంబంధించి గూగుల్ లో పెట్టిన ఒక క్లిప్పింగ్ లింక్‌ను తొలగించమని ఆదేశించవ లసిందిగా యూరోపియన్ కోర్టును ఆశ్రయించారు. తీసు కున్న రుణం తిరిగి చెల్లించలేకపోవడంతో కోసెజా ఇల్లు వేలం వేసిన సంగతిని తెలియచేసే క్లిప్పింగ్ అది. తరువాత కోసెజా రుణం చెల్లించారు. దీనితో ఆ క్లిప్పింగ్ ఉన్న లింక్‌ను తొలగించాలని కోసెజా కోరుకుని న్యాయపోరాటం చేశారు. యూరోపియన్ కోర్టు ఆ విన్నపాన్ని ఆమోదించి, గూగుల్‌కు ఆదేశాలు ఇచ్చింది. ఇలా గత విస్మృతి హక్కును వినియోగించదలుచుకున్న వారు ఎవరైనా ఉంటే, అలాంటి వారు కూడా సంప్రదించవ లసిందని గూగుల్ ఒక ప్రకటన కూడా ఇచ్చింది. తరువాత చూడాలి! కేవలం 24 గంటలలోనే 12,000 విన్నపాలు ముం చెత్తాయి. మొదటి నాలుగు రోజులు గడిచేసరికి విన్నపాల సంఖ్య 40,000కు చేరింది. నెల తిరిగేసరికి 70,000 వేల విన్న పాలు గూగుల్ మీద వెల్లువెత్తాయి. వీటిలో ఫ్రాన్స్‌కు చెందినవే ఎక్కువ. దాదాపు 52 శాతం విన్నపాలను గూగుల్ గౌర వించింది. కొన్నింటిని తిరస్కరించ వలసి వచ్చింది. చివరికి ఇందుకోసం గూగుల్ ఓ సలహా మండలిని నియమించింది. కానీ గత విస్మృతి హక్కు మీద ఏకాభిప్రాయానికి రావ డం ఇప్పట్లో సాధ్యం కాదనే అనుకోవాలి. ఇందుకు ప్రధాన కారణం అందులోనే అస్పష్టత. గత విస్మృతి హక్కుకు పూర్తి స్థాయి చట్టబద్ధత కల్పిస్తే వాక్ స్వాతంత్య్రానికి చేటు జరుగు తుందన్న అనుమానాలు ఉన్నాయి. సెన్సార్షిప్ కారణంగా ఇంటర్నెట్ సేవలలో నాణ్యత లోపిస్తుందనీ, చరిత్ర పునర్ని ర్మాణానికి ఆటంకంగా మారుతుందనీ కూడా విమర్శలు ఉన్నాయి. ఇలాంటి అనుమానాలు అమెరికాకు కూడా ఉన్నా యి. అయినా, ఒకసారి వెలుగుచూసిన వాస్తవిక సమాచారా న్ని అభ్యంతరాల రూపంతో ఉపసంహరించుకోవడమంటే, సెన్సార్‌షిప్‌కు తక్కువేమీ కాదని కొందరు విద్యావేత్తలు చెబుతున్నారు. అన్నిటికంటే ముఖ్యంగా, యూరోపియన్ కోర్టు స్పెయిన్‌కు చెందిన కోసెజాకు అనుకూలంగా తీర్పు నిచ్చి, ఇల్లు వేలానికి సంబంధించిన క్లిప్పింగ్ లింక్‌ను తొల గించవలసిందని ఆదేశించింది. కానీ ఒకనాడు చట్టప్రకారం కోసెజా ఇల్లు వేలం వేసిన సంగతి వాస్తవం కాదా? దీనికి యూరోపియన్ కోర్టు సమాధానం చెప్పడం అవసరమని ఇంకొందరు విద్యావేత్తలు అభిప్రాయపడుతున్నారు. - కల్హణ -
‘గాంధీ’ల చేతిలో నెహ్రూ పత్రిక ఖూనీ
యూపీఏ హయాంలో జరిగిన వాటితో పోల్చినపుడు ‘నేషనల్ హెరాల్డ్’ పత్రిక కుంభకోణం లెక్కలోకి రాదు. సోనియా గాంధీ అల్లుడు రాబర్ట్ వాద్రా భూ కుంభకోణం కూడా వందల కోట్లు పలికినదే. ‘నేషనల్ హెరాల్డ్’ అనే పత్రికను ఆసరా చేసుకుని సోనియా, రాహుల్ సాగించిన కుంభకోణం ఐదు వేల కోట్ల రూపాయలే. కానీ ఇది జవహర్లాల్ నెహ్రూ స్ఫూర్తినీ, ఆయన జ్ఞాపకాలను ‘గాంధీ’ల నాయకత్వంలోని నేటి కాంగ్రెస్ ఎంత కించపరుస్తున్నదో భారత జాతి గమనించేటట్టు చేసింది. సెప్టెంబర్ 9, 1937న లక్నోలో నెహ్రూ ‘నేషనల్ హెరాల్డ్’ ఆంగ్ల పత్రికను నెలకొల్పారు. భారత జాతీయ కాంగ్రెస్ వాణిని వినిపించడమే విధానంగా తీసుకున్న ‘నేషనల్ హెరాల్డ్’ తొలి సంపాదకుడు ఆయనే. 1938లో కోటంరాజు రామారావు సంపాదకుడి బాధ్యతలు స్వీకరించారు. అప్పటి నుంచి ప్రధానిగా బాధ్యతలు చేపట్టే వరకు కూడా నెహ్రూ పాలక మండలి అధ్యక్షునిగా పని చేశారు. క్విట్ ఇండియా ఉద్యమ కాలంలో వచ్చిన ఆంక్షల కారణంగా 1942-45 మధ్య పత్రిక మూత పడింది. 1946లో మళ్లీ ప్రచురణ ప్రారంభించినపుడు మానికొండ చలపతిరావు (ఎంసీ) సంపాదకత్వ బాధ్యత తీసుకున్నారు. అప్పటి నుంచి 1978లో మరోసారి మూతపడే వరకు ఎంసీ ఆ స్థానంలో కొనసాగారు. ఆ విధంగా ఈ పత్రికతో తెలుగువారికి ఉన్న అనుబంధం బలమైనది. హిందీలో ‘నవజీవన్’, ఉర్దూలో ‘క్వామి ఆవాజ్’ పేర్లతో ఇదే పత్రికను వెలువరించారు. అత్యవసర పరిస్థితి తరువాత కాంగ్రెస్ ఒడిదుడుకులు ఎదుర్కొన్నపుడు(1977-79) ఈ పత్రిక మూతపడినా, మళ్లీ ప్రచురణ సాగించింది. అప్పుల ఊబిలో కూరుకుపోయి ఉన్న నేషనల్ హెరాల్డ్ 1986లో మరోసారి ఆగిపోయే పరిస్థితి వచ్చింది. కానీ అప్పటి ప్రధాని రాజీవ్ గాంధీ ఆదుకున్నారు. 1998లో ల క్నో శాఖ మూతపడింది. ఆ శాఖ తీర్చవలసిన బకాయిల కోసం కోర్డు ఆదేశం మేరకు కొన్ని ఆస్తులను వేలం వేశారు. పదేళ్ల తరువాత ఏప్రిల్ 1, 2008 నుంచి, అంటే యూపీఏ పాలనలోనే నేషనల్ హెరాల్డ్ ఢిల్లీ ప్రచురణ కూడా నిలిచిపోయింది. అప్పటి సంపాదకుడు టీవీ వెంకటాచలం. రూ. 90.25 కోట్ల అప్పు (ఎక్కువ ఉద్యోగుల బకాయిలు)భారంతో ఆ పత్రిక కుంగిపోయింది. 2011లో మరోసారి దీనిని తెరిపించాలని ప్రయత్నాలు జరిగాయి. ఈ ప్రయత్నాలకు స్వయంగా రాహుల్ అడ్డుపడ్డారని చెబుతారు. ఈ మధ్యలో రాహుల్, సోనియా నేషనల్ హెరాల్డ్ ఆస్తులను దుర్వినియోగం చేయడానికి కుట్ర పన్నారని బీజేపీ నాయకుడు డాక్టర్ సుబ్రమణియం స్వామి ఢిల్లీ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. జరిగిన పరిణామాలను చూస్తే ‘గాంధీ’లు నెహ్రూ కలల పత్రికను చిదిమివేయడానికి ఎంత పథకం పన్నారో సులభంగానే అర్థమవుతుంది. అసోసియేటెడ్ జర్నల్స్ లిమిటెడ్ (ఏజేఎల్) సంస్థ నేషనల్ హెరాల్డ్ (ఇంగ్లిష్, హిందీ, ఉర్దూ) పత్రికను నిర్వహించేది. పత్రిక మూతపడినా 2010లో కూడా ఏజేఎల్ పని చేసింది. గాంధీ కుటుంబానికి విశ్వాసపాత్రుడు మోతీలాల్ ఓరా ఏజేఎల్ పాలక మండలి చైర్మన్. రాహుల్‌గాంధీ, మరో కాంగ్రెస్ ప్రముఖుడు ఆస్కార్ ఫెర్నాండెజ్ డెరైక్టర్లు. ఆ సంవత్సరంలోనే ఏజేఎల్ స్థానంలో మరో పాలక మండలి ఆవిర్భవించింది. దాని పేరు యంగ్ ఇండియన్ లిమిటెడ్. ఇందులో సభ్యులు వేరెవరో కాదు, ఓరా, రాహుల్, ఫెర్నాండెజ్లే. ఈ కొత్త మండలి ఎందుకు? పత్రికను తిరిగి ప్రచురిస్తామని ఈ మండలి ప్రకటించినా, అది జరగలేదు. అయితే ఏజేఎల్ చెల్లించవలసిన రూ. 90 కోట్ల బకాయిలు వసూలు చేయడానికి కొత్త మండలి హక్కును పొందింది. ఈ అప్పులు తీర్చడానికి కాంగ్రెస్ పార్టీ తరఫున మోతీలాల్ ఓరా (పార్టీ కోశాధికారి) రూ. 90.25 కోట్లు అప్పుగా ఇచ్చారు. ఇదే కాకుండా, బహదూర్షా జఫార్ మార్గంలో (ఢిల్లీ) ఉన్న నేషనల్ హెరాల్డ్ భవంతినీ, ప్రింటింగ్ యంత్రాన్ని అద్దెకు ఇచ్చారు. దాని మీద వచ్చే అద్దెను ఒక ప్రైవేటు సంస్థ వసూలు చేస్తున్నది. ఆ సంస్థలో ప్రధాన సభ్యులు సోనియా, రాహుల్. అందుకే ఈ కేసులో ప్రాథమిక ఆధారాలు ఉన్నాయని పేర్కొంటూ ఢిల్లీ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ సోనియా, రాహుల్‌లకు నోటీసులు జారీ చేశారు. ఆగస్టు ఏడున వీరు కోర్టుకు హాజరు కావాలి. ఢిల్లీలోని భవంతితో సహా ఈ పత్రిక పేర లక్నో, భోపాల్, ఇండోర్, ముంబై, పంచకులా (చండీగఢ్), పాట్నాలలో ఉన్న స్థిరాస్థుల విలువ దాదాపు రూ. 5000 కోట్లు. చివరికి కాంగ్రెస్‌పార్టీ ఏజేఎల్‌కు తాను ఇచ్చిన రుణాన్ని రద్దు చేసి, ఈ ఆస్తులను యంగ్ ఇండియన్ లిమిటెడ్ పరం చేసింది. ఈ వివాదం నుంచి బయటపడతామని సోనియా భృత్యులు మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నారు. కానీ అదంత సులభం కాదు. కల్హణ -
నవ్వుల పాలైన నాలుగేళ్ల డిగ్రీ
1943 సంవత్సరం నుంచి మూడేళ్ల డిగ్రీ విధానమే కొనసాగుతోంది. ఈ కోర్సును నాలుగేళ్లకు పెంచి ‘బ్రిటిష్ మోడల్’ తీసుకురావాలని 2013 విద్యా సంవత్సరంలోనే వీసీ దినేశ్‌సింగ్ తలపెట్టారు. డిగ్రీ కోర్సును నాలుగు సంవత్సరాల కోర్సుగా ‘సంస్కరించడానికి’ జరిగిన తొలి ప్రయత్నం ఇదే. ‘స్పర్ధయా వర్థతే విద్య’ అంటారు. పోటీతో విద్య వర్ధిల్లుతుందన్న ఆ నానుడి సదా సంస్కృత శ్లోకాలతో, స్వాతంత్య్రోద్యమ ఘట్టాలతో తన ఉపన్యాసాలని అలంకరించే ఢిల్లీ యూనివర్సిటీ (డీయూ) వైస్ చాన్సలర్ (వీసీ) దినేశ్‌సింగ్ తెలిసే ఉండాలి. కానీ ఆయన ఏం అర్థం చేసుకున్నారో గానీ, దేశంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన జేఎన్‌యూను అధికార రాజకీయాల పోటా పోటీ వేదికగా మార్చడానికి దోహదపడ్డారనే అనిపిస్తుంది. ఆ విశ్వ విద్యాలయం పరిధిలో ఉన్న మూడేళ్ల వ్యవధి కలిగిన అన్ని డిగ్రీ కోర్సులను నాలుగేళ్ల కోర్సులుగా మార్చాలన్న నిర్ణయం నవ్వుల పాలయింది. విద్యార్థులు చదువులలో పోటీ పడే అవకాశమే లేకుండా, ప్రవేశాలకు ఈ అంశం పెద్ద అంతరాయంగా మారిపోయింది. దేశంలో 1943 సంవత్సరం నుంచి మూడేళ్ల డిగ్రీ విధాన మే కొనసాగుతోంది. ఈ కోర్సును నాలుగేళ్లకు పెంచి ‘బ్రిటిష్ మోడల్’ తీసుకురావాలని 2013 విద్యా సంవత్సరంలోనే వీసీ దినేశ్‌సింగ్ తలపెట్టారు. డిగ్రీ కోర్సును నాలుగు సంవత్సరాల కోర్సుగా ‘సంస్కరించడానికి’ దేశం మొత్తం మీద జరిగిన తొలి ప్రయత్నం ఇదే. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న నాలుగేళ్ల డిగ్రీ కోర్సుకు సమాంతరంగా ఇక్కడ కూడా నాలుగేళ్ల పరిధిలోకి డిగ్రీ కోర్సులను తీసుకురావాలన్నది దీని వెనుక ఉన్న ఉద్దేశం. అప్పుడు మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రిగా పని చేసిన సిబల్ సలహాతో దినేశ్‌సింగ్ ఈ ‘సంస్కరణ’కు శ్రీకారం చుట్టా రు. నిరుడు జరిగిన ప్రవేశాలు ఆ ప్రాతిపదికనే జరిగాయి. అప్ప టి నుంచి దీని మీద వివాదం సాగుతూనే ఉంది. కానీ ప్రభుత్వం మారిపోవడంతో డీయూకు ఇక్కట్లు ముదిరాయి. నిజానికి డిగ్రీ కాల పరిధిని నాలుగేళ్లు చేయడం మీద విశ్వ విద్యాలయ ప్రాంగణంలోనే ఏకాభిప్రాయం లేదు. ఇది 60,000 మంది విద్యార్థుల భవిష్యత్తుకు సంబంధించిన విషయం. బీజేపీ, ఆమ్ ఆద్మీ నాలుగేళ్ల వ్యవధికి వ్యతిరేకం. తాము అధికారానికి వస్తే నాలుగేళ్ల కోర్సును మూడేళ్ల కోర్సుగా మార్చడం తథ్యమని బీజేపీ ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల వేళ ప్రకటించింది కూడా. డీయూ పరిధిలో ఉన్న 64 కళాశాలల మధ్య కూడా ఈ అంశం మీద ఏకాభిప్రాయం లేదు. అయితే జూన్ 24న నాలుగేళ్ల కోర్సును మూడేళ్ల కోర్సుగా మార్చవలసిందని యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ ఆదేశాలు జారీ చేసింది. ఇలా మార్చడం విద్యా విధానానికే విరుద్ధమని యూజీసీ వాదించింది. అయితే ఢిల్లీ విశ్వవిద్యాలయం అధ్యాపక సంఘం నాలుగేళ్ల కోర్సుకు అనుకూలం. ఎంతో పటిష్టంగా ఉండే ఢిల్లీ విశ్వ విద్యాలయం అధ్యాపకుల సంఘం (డ్యూటా) యూజీసీ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తోంది. ఈ విషయం మీద పూర్తి స్పష్టత వచ్చే వరకు కొత్త ప్రవేశాలు నిలిపివేయాలనే డ్యూటా ప్రస్తుత అధ్యక్షురాలు నందితా నారాయణ్ కోరుతున్నారు. యూజీసీ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ విశ్వ విద్యాలయం అధ్యాపకులు పార్లమెంటు భవనం వరకు నిరసన ప్రదర్శన నిర్వహించారు. ఖాళీగా ఉన్న నాలుగు వేల అధ్యాపక ఉద్యోగాలను భర్తీ చేయకుండా, ఇలాంటి నిర్ణయాలతో ప్రభుత్వం విశ్వవిద్యా లయం స్వయం ప్రతిపత్తిని భగ్నం చేయడానికి ప్రయత్నిస్తున్న దని డ్యూటా ఆరోపిస్తున్నది. 54,000 సీట్ల భర్తీకి ఇప్పటికే 2,70,000 దరఖాస్తులు పెట్టుకున్న విద్యార్థులు ఈ పరిణామాలతో దిక్కుతోచని పరిస్థితిలో పడ్డారు. నాలుగేళ్ల డిగ్రీ కోర్సును తిరిగి మూడేళ్లకు తగ్గించాలని యూజీసీ ఇచ్చిన ఆదేశాల మీద డ్యూటా మాజీ అధ్యక్షుడు ఆదిత్య నారాయణ్ మిశ్రా ఢిల్లీ సుప్రీం కోర్టులో సవాలు చేశారు. అయితే కోర్టు కలుగ చేసుకోవడానికి అంగీకరించలేదు. కాగా, ఈ అంశం యూజీసీకీ, విశ్వ విద్యాలయానికి మధ్య వివాదమని, తనకు సంబంధం లేదని మానవ వనరుల మంత్రి స్మృతీ ఇరానీ ఇప్పటికే ప్రకటించారు. అయితే ఎప్పుడూ నాలుగేళ్ల వ్యవధి కోర్సుగానే ఉన్న బీటెక్, బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ కోర్సుల విద్యార్థులు తమ భవిష్యత్తు గురించి తీవ్ర ఆందోళన చెందుతున్నారు. వీరి కోర్సు వ్యవధిని మూడేళ్లు చేస్తే రాబోయే పరిణా మాలు తీవ్రంగానే ఉంటాయి. అధ్యాపకులు, కేంద్రం లేదా యూజీసీ, విద్యార్థులు ఎవరి దారి వారిది అన్న రీతిలో ఈ అంశం మీద తమ తమ వైఖరిని కనబరుస్తున్నారు. యూజీసీ ఆదేశాలు రాగానే వీసీ దినేశ్ సింగ్ వెంటనే వాటిని శిరసావహిస్తున్నట్టు ప్రకటించారు. డీయూ పరిధిలోని 64 కళాశాలల్లో 57 వరకు మూడేళ్ల డిగ్రీని తిరిగి ప్రవేశపెట్టడానికి ఆమోదం తెలియచేశాయని యూజీసీ వెంటనే ప్రకటించడం విశేషం. బీజేపీ, దాని విద్యార్థి విభాగం ఏబీవీపీ, ఆప్ యూజీసీ నిర్ణయాన్ని స్వాగతించగా, కాంగ్రెస్ తొందరపా టు చర్యగా భావిస్తోంది. ఇవన్నీ చూస్తే ఒక పెద్ద విద్యా పీఠాన్ని మన రాజకీయులు నవ్వుల పాలు చేశారని చెప్పక తప్పదు. - కల్హణ -
పరిశుభ్ర గంగావతరణమెప్పుడో!
ఇప్పుడు మోడీ ఈ అంశాన్ని చేపడతానని ఘంటాపథంగా చెబుతున్నారు. ఆయన ఎంత తొందరగా చర్యలు చేపడితే భారత పర్యావర ణానికి అంత మంచిది. గంగా క్షాళనం కోసం దేశం మొత్తం ఎదురు చూస్తోంది. ‘గంగామాత పిలుపుతోనే ఇక్కడికి వచ్చాను’ అని ప్రధాని నరేంద్రమోడీ ఎన్నికల ప్రచారంలో ఉద్విగ్నంగా చెప్పుకు న్నారు. వారణాసి ఓటర్లు ఆయనను ఘన విజయంతో అభిషేకించారు కూడా. గంగ క్షాళనకు కంకణం కట్టుకున్నట్టు ప్రధాని పార్లమెంటులో ప్రకటించారు. 26 సంవత్సరాలుగా గంగ క్షాళనకు కృషి జరుగుతోంది. ఇంతవరకు వేల కోట్లు ఖర్చు చేశారు. ప్రపంచ బ్యాంకు నిధులు, జలశుద్ధి సాంకేతిక పరిజ్ఞానంలో ఎంతో ఖ్యాతి పొందిన ఇజ్రాయెల్ సాంకేతిక పరిజ్ఞానం అందించడానికి కూడా అంగీకరించింది. అయినా పవిత్ర గంగావతరణం జరగడంలేదు. పదకొండు రాష్ట్రాల గుండా పారే గంగ, దేశంలో 40 శాతం ప్రజలకు (500 మిలియన్లు) జీవనాధారం. గంగా పరీవాహక ప్రాంతమే నాలుగు లక్షల చదరపు మైళ్లు. లక్ష, ఆపై జనాభా ఉన్న 29 పట్టణాలు, యాభయ్వేలు-లక్ష మధ్య జనాభా కలిగిన 23 పట్టణాలు, ఇంకో 48 చిన్న చిన్న పట్టణాలను తాకుతూ 2,525 కిలోమీటర్ల మేర ప్రవహి స్తోంది. దీనితో పెద్ద మురికికూపంగా అవతరించడానికి కావలసిన అన్ని ప్రమాదాలు సంక్రమించాయి. రోజుకు 8 ల క్షల గ్యాలన్ల మలినాలు చేరుతున్నాయని నిపుణులు చెబుతు న్నారు. గృహావసరాలు, పరిశ్రమల వ్యర్థాలు, స్మశానాల మలినాల వల్ల గంగ కలుషితమవుతున్నదని జల కాలుష్య అధ్యయనాల నిపుణుడు, ఆచార్య బీడీ త్రిపాఠి(బీహెచ్యు) చెప్పారు. ప్రస్తుతం చేరుతున్న మలినాలు 20 ఏళ్ల క్రితం కంటే రెట్టింపు ఉన్నాయి. వచ్చే ఇరవై ఏళ్లలో ఇంకో రెట్టింపు కావచ్చునని అంచనా. పశు కళేబరాలు, అవాంఛనీయ శిశు వుల మృతదేహాలు, చాకిరేవులు నదికి పెద్ద బెడద. నిజానికి రసాయనాలతో చేసిన పదార్థాలే, పశు- మానవ కళేబరాల కంటే ప్రమాదకరమని సెంట్రల్ గంగా అథారిటీ తొలి సంచా లకుడు కేసీ శివరామకృష్ణన్ హెచ్చరించారు. కళేబరాలను నదిలో పెరిగే ఒక జాతి తాబేళ్లు తినగలవు. రసాయనాల నుంచి నదిని కాపాడే శక్తి ఏదీ లేదు. గంగ ప్రయోజనం మత విశ్వాసాలకు పరిమితం కాదు. భవిష్యత్తులో గంగ, దాని ఉపనదుల మీద 300 డ్యామ్‌లు నిర్మించాలని ప్రభుత్వం యోచిస్తున్నది. గంగ పరిరక్షణో ద్యమం పేరుతో అటు ఆధ్యాత్మికవాదులు, పర్యావరణవే త్తలు పాతిక ముప్పయ్ సంవత్సరాలుగా ఉద్యమిస్తున్నారు. అందరి కృషి ఆహ్వానించదగినదే. కేంద్ర ప్రభుత్వ పరంగా 1986, ఏప్రిల్‌లో రాజీవ్ గాంధీ ప్రధానిగా ఉండగా గంగా కార్యాచరణ ప్రణాళికను ప్రారంభించారు. 190 మిలియన్ డాలర్లు ఖర్చు చేసినా నది కాలుష్యం స్థాయిని తగ్గించలేకపో యారు. దీనితో మార్చి 31, 2000 సంవత్సరంలో ఈ కార్య క్రమాన్ని రద్దు చేశారు. ఈ పథకం శుద్ధ దండగ అని శాస్త్రవే త్తలు, ప్రభుత్వేతర సంస్థలు ప్రకటించాయి. సుందర్‌లాల్ బహుగుణ, సుశీలానాయర్, కాంచనలతా సబర్వాల్ వంటి వారు ఈ ఉద్యమంలో భాగస్వాములయ్యారు. ఉత్తరాఖండ్ లోని హరిద్వార్‌లో గంగ ఒడ్డున జరుగుతున్న అక్రమ గనుల తవ్వకానికి వ్యతిరేకంగా స్వామి నిగమానంద సరస్వతి అనే సాధువు ఆమరణ దీక్ష చేసి, చనిపోయారు. దీనితో హరిద్వార్ జిల్లాలో అక్రమ గనుల తవ్వకాన్ని నిషేధించారు. ప్రముఖ పర్యావరణవేత్త డాక్టర్ జీడీ అగర్వాల్ గంగ ప్రక్షాళన కోరుతూ దీర్ఘకాలం నిరాహార దీక్ష చేశారు. అన్నా హజారే చెప్పడంతో నాటి ప్రధాని మన్మోహన్సింగ్ డాక్టర్ అగర్వాల్ డిమాండ్లను నెరవేర్చడానికి అంగీకరించారు. 2012లో గంగా ముక్తి సంగ్రామ్ సమితి ఆధ్వర్యంలో పెద్ద ర్యాలీ జరిగింది. అలహాబాద్ నుంచి ఢిల్లీ వరకు సాగిన ఈ ర్యాలీలో ప్రముఖ మఠాధిపతులు, సాధుసంతులు పాల్గొ న్నారు. గంగ రక్షణకు దేశం ఇంత తాపత్రయ పడుతోంది. గంగా క్షాళనం అంటే దేశం ఎదురు చూస్తున్న సత్కార్యం. ఇప్పుడు మోడీ ఈ అంశాన్ని చేపడతానని ఘంటాప థంగా చెబుతున్నారు. ఆయన ఎంత తొందరగా చర్యలు చేపడితే భారత పర్యావరణానికి అంత మంచిది. గంగలో కొద్దికాలం క్రితం వరకు 100 మిల్లీలీటర్ల నీటికి గాను 5,000 పరిమాణంలో ఉన్న కోలిఫోరమ్ బాక్టీరియా, ఇటీవలి లెక్క ల ప్రకారం 60,000కు చేరింది. ఈ బాక్టీరియా ప్రతి 100 మిల్లీలీటర్లకు ఉండవలసినది (ప్రపంచ ఆరోగ్య సంస్థ లెక్క) 500 మాత్రమే. అంటే 120 రెట్లు అధికం. ఈ స్థితిలో అయి నా ప్రధాని తన ధృఢ నిశ్చయాన్ని ప్రకటించడం సంతోషిం చదగినదే. వారణాసి ఎంపీ మోడీ. వారణాసి నగర పాలక సంస్థను ఆయన పార్టీయే ఏలుతోంది. వీరు ఐదేళ్లు పదవు లలో ఉంటారు. కాబట్టి గంగ కోసం చాలా చేయవచ్చు. కల్హణ -
పండిట్లకు ‘ప్రణవ’నాదం
సొంతగడ్డ లేని జాతుల ఇక్కట్లు ప్రపంచ చరిత్రలో అత్యంత దయనీయంగా కనిపిస్తాయి. అలాంటి జీవన్మరణ సమస్యే కాశ్మీరీ పండిట్లది కూడా. పాండిత్యాన్నీ, శాంతినీ ప్రేమించే పండిట్ల చరిత్రలో ఏడు బలవంతపు వలసలు కనిపిస్తాయి. అందులో చివరిది-1990 నాటిదే. పదహారో లోక్‌సభ ఏర్పడిన తరువాత పార్లమెంట్ ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి ప్రసంగించారు. అది కేంద్రంలో తొలిసారి ఏర్పడిన బీజేపీ ప్రభుత్వం తరఫున రాష్ట్రపతి విని పించిన ప్రసంగమే. అందులో కాశ్మీరీ పండిట్ల కోసం కొన్ని నిమిషాలు కేటాయించారు. పూర్తి మెజారిటీ సాధించిన బీజేపీ కాశ్మీర్, పండిట్ల అంశాలను కదపకుండా ఉండడం సాధ్యం కాదు. నరేంద్ర మోడీ మంత్రిమండలి ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే 370 ఆర్టికల్ మీద దుమారం చెల రేగింది. రాష్ట్రపతి ప్రసంగంలో 5,000 ఏళ్ల నాటి వారి సొంతగడ్డకు వెళ్లి ‘తలెత్తుకుని జీవించేటట్టుగా, రక్షణతో, జీవనోపాధి’తో కాశ్మీరీ పండిట్లు నివసించడానికి కొత్త ప్రభుత్వం కృషి చేస్తుందని హామీ ఇచ్చారు. 370 ఆర్టికల్‌పై ఉన్న వివాదం అందరికీ తెలుసు. కానీ పండిట్ల అంశం వివాదాస్పదమని ఎవరూ వ్యాఖ్యానించరు. అయినా భారత ప్రభుత్వాలు సహా, అంతర్జాతీయ హక్కుల సంఘాలు కూడా ఈ సమస్య మీద మౌనం వహిస్తున్నాయి. పండిట్లు కాశ్మీర్ లోయకు తిరిగి వెళ్లడానికి బీజేపీ ప్రభు త్వం తన ఐదేళ్ల కాలపరిమితిలో ప్రత్యేక ఏర్పాట్లు చేస్తుందని పార్టీ అధ్యక్షుడు రాజ్‌నాథ్ సింగ్ కూడా ప్రకటించారు. స్వదే శంలో పండిట్లు శరణార్థులుగా బతకడం విషాదమే. కానీ ఈ ఆరు దశాబ్దాల రాజకీయాలు పండిట్లు తమ హక్కులను గుర్తు చేసుకోవడం కూడా సాధ్యం కానంతగా పరిస్థితులను విషతుల్యం చేశాయి. పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులు, వేర్పాటు వాదులు సహా కేంద్ర ప్రభుత్వాలూ బాధ్యత వహించాలి. సొంతగడ్డ లేని జాతుల ఇక్కట్లు ప్రపంచ చరిత్రలో దయనీయంగా కనిపిస్తాయి. అలాంటి జీవన్మరణ సమస్యే కాశ్మీరీ పండిట్లది కూడా. పాండిత్యాన్నీ, శాంతినీ ప్రేమించే పండిట్ల చరిత్రలో ఏడు భారీ వలసలు కనిపిస్తాయి. అందు లో చివరిది-1990 నాటిదే. పాక్ ప్రేరేపిత ఉగ్రవాదం తార స్థాయికి చేరిన కాలం అదే. భారత ప్రభుత్వం ఏజెంట్లు అని పేరు పెట్టి, ఒక వర్గాన్ని ముఖ్యంగా పండిట్లను కాశ్మీర్‌లోయ నుంచి ఖాళీ చేయించే పని మొదలుపెట్టారు. అప్పుడే 24, 202 కుటుంబాలు జమ్మూ, ఢిల్లీలలో ఏర్పాటు చేసిన శిబిరా లకు చేరాయి. తరువాత ఈ సంఖ్య 38,119కి చేరింది. ఆరు నుంచి ఏడు లక్షల మంది పండిట్లు నిరాశ్రయులయ్యారని అ ఖిల భారత కాశ్మీరీ సమాజ్ వంటి సంస్థలు చెబుతున్నాయి. 1947లో కాశ్మీర్లో డోగ్రా పాలన ముగిసే నాటికి పండి ట్ల జనాభా 14 నుంచి 15 శాతం ఉంది. 1948 అల్లర్లు, 1950 నాటి భూసంస్కరణలతో చాలా జనాభా ఖాళీ అయింది. 1981 నాటి పండిట్ల జనాభా ఐదు శాతమని తేలింది. గృహ దహనాలు, ఊచకోత, మానభంగాల ఫలితమిది. 2010లో రాష్ట్ర ప్రభుత్వం చెప్పిన లెక్కల ప్రకారం 808 పండిట్ల కుటుంబాలు మాత్రమే లోయలో మిగిలాయి. అక్బర్ కాలంలో పండిట్ హోదా పొందిన వీరంతా, 1948 నుంచి ఇక్కట్లు పడుతున్నా ఏ ప్రభుత్వమూ పట్టించు కోలేదు. ఇది సొంతగడ్డను వీడి రావడం కంటె ఎక్కువగా వారిని బాధిస్తున్నది. ఎప్పుడు కాశ్మీర్ అంశం మీద చర్చలు జరిగినా ఉగ్రవాదుల ప్రతినిధులకు, వేర్పాటువాదులకే ఆ హ్వానాలు వెళుతున్నాయి తప్ప, పండిట్ల వాణికి అవకాశమే ఉండడం లేదు. వలస వచ్చిన పండిట్ల కుటుంబాల కోసం 2008లో యూపీఏ ప్రభుత్వం రూ.7.5 లక్షలతో పథకం ప్ర వేశపెట్టింది. లోయకు తిరిగి వెళ్లే వారి కోసం మోడీ రూ. 20 లక్షల ప్యాకేజీ ప్రకటించారు. వారిని తిరిగి లోయకు వెళ్లేలా ప్రోత్సహించడానికి ఉద్దేశించినదే ఈ పథకం. దీనికి సీఎం ఒమర్ అబ్దుల్లా అంగీకారం కూడా ఉందని చెబుతున్నారు. అయితే, పండిట్లు రావచ్చు గానీ, వారి పూర్వపు ఆవా సాలలోనే ఉండాలని వేర్పాటువాద హురియత్ కాన్ఫరెన్స్ నాయకుడు సయ్యద్ అలీ షా జిలానీ వెంటనే నినాదం అం దుకున్నారు. పండిట్లకు ప్రత్యేక రక్షణపేరుతో రాష్ట్రంలోనే మ రో రాష్ట్రం సృష్టించడానికీ, ఇజ్రాయెల్ తరహా సెటిల్మెంట్లు ఏర్పాటు చేయడానికీ బీజేపీ ప్రయత్నిస్తున్నదని వాదిస్తు న్నారు. కాశ్మీర్ సమస్య తక్షణ పరిష్కారానికి భారత్‌పై ఒత్తిడి తేవాలని పాకిస్థాన్ విదేశీ వ్యవహారాల కార్యదర్శిని వెంటనే కోరారు కూడా. పండిట్లు ఒక పక్క ‘పనూన్ కాశ్మీర్’ను కోరు తున్నారు. అంటే రాజ్యాంగాన్ని గౌరవిస్తూ, మువ్వన్నెల జెం డాకు వందనం చేసే పౌరుల కోసం ఒక రాష్ట్రం. మోడీ పండిట్ల అంశాన్ని ప్రధాన స్రవంతిలోకి తీసుకువచ్చిన మాట నిజం. కానీ పరిష్కారం అంత సులభం కాదు. చాలా అంశా లు కలసి రావాలి. నిజానికి అఫ్ఘాన్ నుంచి అమెరికా సేనలు వైదొలగితే కాశ్మీర్ సమస్య మరింత జటిలమవుతుంది. -కల్హణ -
బద్దలైన యూపీ ఓటు బ్యాంకులు
బీజేపీ వంటి పార్టీకి మైనారిటీ ఓటు పడేటట్టు చేసిన ఘనతను మళీ ్ల ‘గోధ్రా అల్లర్లకు బాధ్యుడు’ మోడీకే ఇవ్వడం మరో విశేషం. అభివృద్ధి కోసం జరుగుతున్న ఎన్నికలు అంటూ మోడీ ఇచ్చిన పిలుపుతో ముస్లిం యువత ఆయనకే ఓటు వేసిందని సర్వే చెబుతోంది. ఏ విధంగా చూసినా 2014 లోక్‌సభ ఎన్నికలు అనేక రకాల ప్రత్యేకతలతో చరిత్ర ప్రసిద్ధమైనాయి. మారిన ఉత్తర ప్రదేశ్ రాజకీయ చిత్రం కూడా అందులో ఒకటి. అక్కడి ఓటింగ్ సరళినీ, పాత పోకడలనీ ఈ ఎన్నికలు పరిపూర్ణంగా మార్చివేసిన సంగతి ఇప్పుడు జరుగుతున్న సర్వేలతో బయటపడుతోంది. ఉత్తరప్రదేశ్‌ను నాలుగు రాష్ట్రాలుగా విభజించాలన్న డిమాండ్ ఊపందుకోవడం వెనుక ఉన్న కారణాలలో ఈ ‘మార్పు’కూడా ఒకటి కావచ్చు. కుల సమీకరణలకీ, మైనారిటీ ఓటు బ్యాంకులకూ, మత రాజకీయాలకూ నిలయమైన ఉత్తరప్రదేశ్ తీర్పు ఈసారి మార్పును సంతరించుకుంది. ఇప్పుడు ఈ రాష్ట్ర ముస్లింల నుంచి బీజేపీకి దక్కిన మద్దతు చరిత్రలో ఎప్పుడూ లేదు. ‘ఉత్తరప్రదేశ్ నుంచి ఢిల్లీ పీఠానికి’ అన్న నినాదంతో సాగుతున్న బీఎస్పీ దళిత రాజకీయ అజెండాకు ఈ ఎన్నికలు గండి కొట్టాయి. బీజేపీని దరి చే రనీయని వర్గాలుగా పేర్గాంచిన మైనారిటీలూ, దళితులూ, ఓబీసీలూ దృక్పథాన్ని మార్చుకున్న సంగతి సుస్పష్టమైంది. ఉత్తరప్రదేశ్‌లోని లక్నో, ఉనావ్, జాన్పూర్ వంటి లోక్‌సభ స్థానాలకు ప్రత్యేకత ఉంది. ఇక్కడ ముస్లింలు అధిక సంఖ్యలో ఉన్నారు. ఇందులో లక్నో స్థానం నుంచి గతంలో వాజపేయి గెలిచేవారు. ఆయన సంగతి వేరు. ఇప్పుడు సాక్షాత్తు బీజేపీ అధ్యక్షుడు రాజ్‌నాథ్‌సింగ్ పోటీ చేసి గెలిచారు. యూపీలో బీజేపీ 73 లోక్‌సభ స్థానాలు గెలుచుకుని విశ్లేషకుల చేత నోరు వెళ్లబెట్టించింది. ఇందుకు ఉన్న అనేక కారణాలలో ఒకటి- బీజేపీకి ముస్లిం ఓటు. కమలం పార్టీతో ముస్లింల వైరం జగద్విదితం. కానీ ఈ ఎన్నికలలో ఆ రాష్ట్రంలో పదిశాతం ముస్లింలు ఆ పార్టీ వైపు మొగ్గారు. ఈ రాష్ట్రంలోనే సంబాల్, రాంపూర్, షహరన్‌పూర్ వంటి నియోజకవర్గాలలో ముస్లిం ఓటర్లు గణనీయంగా ఉన్నారు. మెజారిటీ కాస్త తక్కువే అయినా ఈ నియోజక వర్గాలలో కూడా బీజేపీ అభ్యర్థులే గెలుపొందారు. ఇది బీజేపీ మీద ఉన్న మత ముద్రను మాసిపోయేటట్టు చేయగలుగుతోందని సర్వే జరిపిన సీఎస్డీఎస్కు చెందిన ప్రొఫెసర్ అస్మెర్బేగ్ (అలీఘర్ ముస్లిం విశ్వవిద్యాలయం) వ్యాఖ్యానించారు. పైగా బీజేపీ వంటి పార్టీకి మైనారిటీ ఓటు పడేటట్టు చేసిన ఘనతను మళీ ్ల గోధ్రా అల్లర్లకు బాధ్యునిగా ప్రసిద్ధిగాంచిన నరేంద్ర మోడీకే ఇవ్వడం మరో విశేషం. అభివృద్ధి కోసం జరుగుతున్న ఎన్నికలు అంటూ మోడీ ఇచ్చిన పిలుపునకు స్పందించి ముస్లిం యువత ఆయనకే ఓటు వేసిందని సర్వే చెబుతోంది. వీరంతా ఎన్నికల సమయంలో మోడీకి జైకొట్టకపోయినా, ఓటు వేశారని ఆ పార్టీ ఉత్తరప్రదేశ్ ప్రముఖుడు ముఫ్తీ షామున్ ఖాస్మీ చేసిన వ్యాఖ్య నిజమనే అనిపిస్తుంది. సెక్యులర్ పార్టీలంటూ డబ్బా కొట్టుకునే ఎస్పీ, బీఎస్పీ వంటి పార్టీలకు ఈ ఎన్నికలలో మైనారిటీలు ఝలక్ ఇచ్చారంటూ ఉత్తరప్రదేశ్ బీజేపీ మైనారిటీ సెల్ అధ్యక్షుడు రషీద్ అన్సారీ చెబుతున్న మాట వాస్తవమే. కుల రాజకీయాలకు కూడా ఉత్తరప్రదేశ్ పెట్టింది పేరు. సమాజ్‌వాదీ పార్టీ నాయకుడు ములాయం విజయ సూత్రం కుల, మత ప్రాతిపదికకు సంబంధించినదే. ఈ ఎన్నికలలో అక్కడ ఈ కుల సమీకరణలు కూడా చెల్లాచెదురైనాయి. దళితుల పార్టీ బీఎస్పీకి ఆది నుంచి అండదండలను ఇస్తున్న జాతవ్‌లు, సమాజ్‌వాదీ పార్టీకి విధేయులుగా ఉన్న యాదవులు ఈ ఎన్నికలలో బీజేపీకి ఓటు వేశారు. అలాగే ఈ రెండు పార్టీలను నమ్ముకుని ఉన్న ఇతర దళిత వర్గాలు, ఓబీసీలు కూడా ఈసారి ఎదురు తిరిగారు. ఈ ధోరణి ఇలాగే రెండేళ్లు కనుక కొనసాగితే రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమని రాజకీయ విశ్లేషకుడు ఆదిత్య అవస్థి జోస్యం పలికారు. గత రెండు దశాబ్దాలుగా ఓబీసీ ఓట్లన్నీ ప్రాంతీయ పార్టీలకు పడుతున్నాయి. లేదా ‘సామాజిక న్యాయం’ నినాదం అందుకున్న పార్టీలకు వెళుతున్నాయి. నిజానికి ‘ఇతర వెనుకబడిన వర్గాలు’ దేశ జనాభాలో 41 శాతం ఉన్నారు. ఈ వర్గమే బీజేపీని స్వాగతించింది. 2009లో 22 శాతం ఓబీసీ ఓట్లు బీజేపీకి రాగా, 2014 ఎన్నికలలో 34 శాతానికి పెరిగాయి. కాంగ్రెస్ ఘోర పరాజయానికి ఇదో ప్రధాన కారణం. ఇందులో ఇంకో విశేషం కూడా ఉంది. దిగువ ఓబీసీలలో 42 శాతం, ఉన్నత ఓబీసీ వర్గం నుంచి 30 శాతం బీజేపీని ఆదరించారు. గుజరాత్, ఎంపీ, రాజస్థాన్, మహారాష్ట్రలో ఓబీసీలు మరో అభిప్రాయం లేకుండా బీజేపీకి ఓటు వేశారు. అయితే దేశమంతా ఇదే ధోరణి లేదు. ఇంతకీ ఇప్పుడు హిందూ ఓటు బ్యాంకు సుస్థిరమవుతున్నదా? లేక ప్రస్తుతం బీజేపీయే దేశాన్ని ముందుకు తీసుకువెళ్లగలదన్న ఓటర్ల నమ్మకమా? అది భవిష్యత్తులో నిర్ణయమవుతుంది. - కల్హణ -
పంజాబ్‌లో ఆప్‌కు మరోజన్మ
దేశంలో ఎక్కడా విజయం సాధించలేకపోయిన ఆప్ పంజాబ్‌లో నాలుగు లోక్‌సభ స్థానాలు - ఫరీద్కోట్, ఫతేగఢ్ సాహెబ్, పాటియాలా, సంగ్రూర్ గెలుచుకుంది. పదహారో లోక్‌సభ ఎన్నికల ఫలితాలలో ఆప్ సాధించిన పంజాబ్ విజయం మరీ ప్రత్యేకమైనది. పదహారో లోక్‌సభ ఎన్నికల ఫలితాలలో ఒక్కొక్క పార్టీది ఒక్కొక్క అనుభవం. ఇందులో కోటలు కూలిన పార్టీలు గానీ, కోటలు అనూహ్యంగా బలపడిన పార్టీలు గానీ ఊహించని పరిణామాలే ఎక్కువ. ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) నమోదు చేసిన చరిత్ర మాత్రం దేశంలో ఏ ఎన్నికల విశ్లేషకుడు ఊహించినది కాదు. మరే ఇతర ఎన్నికల సర్వే ఊహించినది కూడా కాదు. దేశమంతటా పోటీ చేసిన ‘చీపురు’ పార్టీ కేవలం పంజాబ్‌లోనే నాలుగు సీట్లు గెలిచి తనకు తానే ఆశ్చర్యపోయింది. నరేంద్ర మోడీ గాలి వీస్తోందని సర్వేలు ప్రారంభమైన సమయంలో, ఒకటి రెండు చోట్లే కావచ్చు, ఆ గాలికి అడ్డుకట్ట వేయగలిగిన పార్టీగా ఆప్ పేరు ముందుకు వచ్చింది. ముఖ్యంగా ఢిల్లీలో కమల వికాసాన్ని ఆప్ నిరోధిస్తుందని అంచనాలు వచ్చాయి. హర్యానాలోనూ, ఢిల్లీకి ఆనుకుని ఉన్న ఉత్తరప్రదేశ్ రాష్ట్ర భాగాలలోనూ ఆప్ ప్రభావం గణనీయంగా ఉంటుందని భావించారు. కానీ ఊహించని విధంగా పంజాబ్‌లో ఆప్ ప్రతాపాన్ని చూపించడమే కొన్ని పార్టీలకూ, నేతలకూ మాట లేకుండా చేసింది. ఈ ఎన్నికలలో దేశం మొత్తం మీద 430 లోక్‌సభ స్థానాలకు ఆప్ అభ్యర్థులను నిలిపింది. వారణాసిలో ఆ పార్టీ అధ్యక్షుడు అరవింద్ కేజ్రీవాల్ చేసిన హల్చల్తో ఈ విషయం దాదాపు మరుగున పడింది. ఆయన పేరు మాత్రమే ఈ ఎన్నికలలో ప్రధానంగా వినిపించింది. కానీ ఆయన దారుణంగా ఓడిపోయారు. పంజాబ్‌లో ఉన్న మొత్తం 13 లోక్‌సభ స్థానాలలోనూ ఆప్ అభ్యర్థులను నిలిపింది. ఆప్ ఈ నిర్ణయం ప్రకటించగానే అక్కడి ప్రధాన రాజకీయ పక్షాలు ఎద్దేవా చేశాయి. కానీ దేశంలో ఎక్కడా విజయం సాధించలేకపోయిన ఆప్ పంజాబ్‌లో నాలుగు లోక్‌సభ స్థానాలు- ఫరీద్కోట్, ఫతేగఢ్ సాహెబ్, పాటియాలా, సంగ్రూర్ గెలుచుకుంది. ఎన్నో విశేషాలను దాచుకున్న పదహారో లోక్‌సభ ఎన్నికల ఫలితాలలో ఆప్ సాధించిన పంజాబ్ విజయం మరీ ప్రత్యేకమైనది. ఆప్‌ను స్థాపించి 18 మాసాలైంది. పంజాబ్‌లో లోక్‌సభ అభ్యర్థులను నిలపాలని భావించిన నాటికి అక్కడ పార్టీకి శాఖ కూడా లేదు. ఆదరాబాదరా 12 మందితో ఒక బృందాన్ని ఏర్పాటు చేశారు. ఇందులో కొందరు ఢిల్లీ నుంచి వెళ్లినవారే. చాలామంది అభ్యర్థులు ఆర్థిక సమస్యతో తగిన ప్రచారం కూడా చేసుకోలేకపోయారు. అయినా 24.4 శాతం ఓట్లు ఆప్‌కు వచ్చాయి. అభ్యర్థులు పెద్దగా ప్రాచుర్యం ఉన్నవారూ కాదు. ఫరీద్కోట్ నియోజకవర్గం నుంచి డాక్టర్ సాధూసింగ్ పోటీ చేశారు. ఆయన పదవీ విరమణ చేసిన ప్రిన్సిపాల్, కవి. నిధుల కొరతతో నియోజకవర్గంలోని పది శాతం గ్రామాలలో కూడా ప్రచారం చేయలేకపోయారు. కానీ నాలుగున్నర లక్షల ఓట్లు వచ్చాయి. సంగ్రూర్‌లో వ్యంగ్య రచయిత భగవంత్ మాన్ రెండు లక్షల ఓట్ల ఆధిక్యంతో గెలిచారు. పాటియాలా నుంచి పోటీ చేసిన ధరమ్వీర్ గాంధీ హృద్రోగ నిపుణుడు. విదేశ వ్యవహారాల సహాయ మంత్రి ప్రణీత్ కౌర్ ఇక్కడే దారుణంగా ఓడిపోయారు. దీనితో 33 పంజాబ్ అసెంబ్లీ నియోజకవర్గాలలో (మొత్తం 117) ఆప్ ఆధిక్యంలో ఉన్నట్టయింది. మరో 25 స్థానాలలో రెండో స్థానంలో నిలిచింది. పట్టణ, నగర ఓటర్ల అభిమాన పార్టీగా పేరు పొందిన ఆప్ పంజాబ్‌లోని మాల్వా ప్రాంతంలో ప్రతాపం చూపడం విశేషం. ఈ పల్లె ప్రాంతం కేంద్రంగానే ఇటీవలి వ్యవసాయ సంక్షోభం తలెత్తింది. ఈ విజయానికి ఆప్ విజేత ధరమ్వీర్ చెప్పిన కారణాలు తీవ్రమైనవి. రాష్ట్రంలో వెర్రితలలు వేస్తున్న మత్తుమందుల సంస్కృతి గురించి ప్రతిపక్షం కాంగ్రెస్, అధికార అకాలీదళ్-బీజేపీ కూటమి పట్టించుకోకపోవడం పట్ల ప్రజలు ఆగ్రహంతో ఉన్నారని ఆయన విశ్లేషించారు. నిజానికి అకాలీలలో నానాటికీ పెరుగుతున్న అలక్ష్య వైఖరికి ప్రజలు విసిగిపోయారనీ, గుణపాఠం చెప్పడానికి ఓటర్లు ఎదురు చూస్తున్నారనీ దాని ఫలితమే ఈ ఫలితాలనీ ఆయన అభిప్రాయపడుతున్నారు. అకాలీ-బీజేపీ కూటమి అరకొర విజయం, అమృత్‌సర్‌లో కాంగ్రెస్ అభ్యర్థి, మాజీ ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ సింగ్ చేతిలో బీజేపీ ప్రముఖుడు అరుణ్ జైట్లీ లక్ష ఓట్ల తేడాతో పరాజయం పాలవడం సిక్కులు మోడీ పట్ల వ్యతిరేకంగా ఉన్నట్టే అర్థం చేసుకోవాలని కొందరి భాష్యం. పంజాబ్ అసెంబ్లీకి 2017లో ఎన్నికలు జరుగుతాయి. అప్పటికి అకాలీ-బీజేపీ కూటమికే కాక, కాంగ్రెస్‌కు కూడా పోటీ ఇస్తూ రాష్ట్రంలో మూడో శక్తిగా ఆప్ ఎదిగే సూచనలు బలంగానే ఉన్నాయని విశ్లేషకుల అభిప్రాయం. కల్హణ -
అసోం పథకంతో అసలుకే మోసం!
2012లో కూడా రెండు నెలల పాటు బీటీఏడీ స్థానిక గిరిజనుల మధ్య ఘర్షణలతో విలవిలలాడింది. ఆ అరవైరోజులలో వందమంది చని పోయారు. దాదాపు లక్షమంది నిరాశ్రయులయ్యారు. ఆ కొండ మీద అల్లర్లు ఏ స్థాయిలో ఉన్నాయో తెలుసుకోవడానికి ఇదో నిదర్శనం. అదే సమస్యతో, అవే వర్గాల మధ్య వైషమ్యంతో అసోం కొండ ప్రాంతం మరోసారి భగ్గుమంది. ఏప్రిల్ ముప్పయ్యో తేదీన లోక్‌సభ ఏడో విడత పోలింగ్ ముగియగానే మే 1న కొక్రాఝర్ ప్రాంతం అల్లర్లతో అట్టుడికినట్టు ఉడికిపోయిం ది. స్థానిక గిరిజనులకూ, బంగ్లాదేశ్ నుంచి వచ్చినట్టు చెప్పే ముస్లింలకూ మధ్య మరోసారి హింసాకాండ చెలరేగింది. బంగ్లాదేశ్ నుంచి ఈ ప్రాంతానికి వస్తున్న తేయాకు కార్మికులంతా బెంగాలీ భాష మాట్లాడేవారే. స్వతంత్ర భారతదేశంలో తొలి ఎన్నికలు జరిగిన 1952లోనే తొలిసారి ఈ వైషమ్యాలు బయటపడ్డాయి. అంటే బంగ్లాదేశ్ అవతరణకు ముందే, తూర్పు పాకిస్థాన్ కాలంలో రూపు దిద్దుకున్న సమ స్య ఇది. తరువాత నాలుగు పర్యాయాలు స్థానిక గిరిజనులైన బోడోలు, బంగ్లాదేశ్ నుంచి వచ్చిన వారి మధ్య పెద్ద ఎత్తున ఇదే సమస్యతో ఘర్షణలు జరిగాయి. తాజా ఘర్షణలో ఇద్దరు చిన్నారులతో సహా ముప్పయ్ మంది చనిపోయారు. ఇంత సుదీర్ఘ కాలం నుంచి ఈ సమస్య నానుతూ ఉన్నదంటే,దీని పరిష్కారానికి ఏ ప్రభుత్వమూ చిత్తశుద్ధితో పని చేయలేదనే అర్థం. ఉగ్రవాదం చెలరేగి, గిరిజనులు ఏకే 47ను ఆశ్రయించగా, ఈ సమస్య పరిష్కారానికి ఇప్పుడు బంగ్లాదేశ్ నుంచి వచ్చిన వారికి కూడా ఆయుధాలు సరఫరా చేయాలనీ, అందుకు దరఖాస్తులు తీసుకోవాలంటూ వింత ప్రతిపాదన తెరపైకి రావడం విషాదం. ఇది మరోసారి మైనారిటీలను మభ్య పెట్టడానికే.పరిష్కారాన్ని మరోసారి సుదీర్ఘంగా వాయిదా వేయడానికే. ఇది జాతుల సమస్య. చాలా చోట్ల ఈ సమస్య తీవ్రమవుతున్నట్టే అసోం కొండలలో కూడా తీవ్రమవుతూనే ఉంది. ఎప్పటిలాగే బోడోలాండ్ టెరిటోరియల్ కౌన్సిల్ పరిధి మరోసారి నెత్తురుతో తడిసింది. అజ్ఞాత ఉద్యమ సంస్థ నేషనల్ డెమోక్రాటిక్ ఫ్రంట్ ఆఫ్ బోడోలాండ్ సంగ్భిజిత్ వర్గం ఈ కాల్పులకు పాల్పడిందన్న అనుమానాలు ఉన్నాయి. అయితే ఈ ఆరోపణను ఆ సంస్థ ఖండించడం విశేషం. బోడోలాండ్ టెరిటోరియల్ అటానమస్ డిస్ట్రిక్ట్స్ (బీటీఏడీ)లో ఒకటైన కొక్రాఝర్‌లో బాలాపారా అనే ఊరు తాజా హింసాకాండకు వేదికైంది. బోడో ఉగ్రవాదులు ఏకే 47 ఆయుధాలతో వచ్చి బంగ్లాదేశీయుల మీద ఈ ఘాతుకానికి పాల్పడ్డారు. ఎన్నో ఉద్యమాల తరువాత కొక్రాఝర్, బక్సా, షిరాంగ్, ఉదల్గురి అనే జిల్లాలను కలిపి బీటీఏడీ పేరిట ఏర్పాటుచేశారు. తాజా అల్లర్లు కొక్రాఝర్తో పాటు బక్సాలో కూడా జరిగాయి. తమ భాష, సంస్కృతుల పరిరక్షణకు ఇలాంటి స్వయం ప్రతిపత్తి అవసరమని బోడోలు పోరాడుతున్నారు. 1967లో వచ్చిన ఉద్యాచల్ ఉద్యమం లక్ష్యం అదే. ప్రత్యేక రాష్ట్రం నినాదం కూడా అందులో ఉంది. బంగ్లాదేశ్ నుంచి వస్తున్నవారు అసోం కొండలలో బోడోల ఆస్తులను ఆక్రమిస్తున్నారని, తమ సంస్కృతికి భంగం వాటిల్లే తీరులో వ్యవహరిస్తున్నారని గిరిజనుల ఆరోపణ. 2012లో కూడా రెండు నెలల పాటు బీటీఏడీ స్థానిక గిరిజనుల మధ్య ఘర్షణలతో విలవిలలాడింది. ఆ అరవైరోజులలో వంద మంది చనిపోయారు. దాదాపు లక్షమంది నిరాశ్రయులయ్యారు. ఆ చిన్న కొండ ప్రాంతంలో అల్లర్లు ఏ స్థాయిలో ఉన్నాయో తెలుసుకోవడానికి ఇది మంచి ఉదాహరణ. బో డోలు స్థానిక గిరిజనులు. తమ ఉనికిని కాపాడుకునే ప్రయత్నంలో బంగ్లాదేశ్ నుంచి వచ్చే గిరిజనులు (ముస్లింలు), బెంగాలీ హిందువులతో కూడా వారు స్వాతంత్య్రం రాక ముందు నుంచి ఎన్నోసార్లు ఘర్షణలకు దిగారు. 2003లో ఎన్డీయే ప్రభుత్వ హయాంలోనే సమస్య పట్ల భా రత ప్రభుత్వం కొంత శ్రద్ధ తీసుకుని, ఉగ్రవాదులతో చర్చ లు జరిపి, ఆయుధాలు విడిచిపెట్టేలా చేసి కొంత స్వతంత్ర ప్రతిపత్తి ఇచ్చింది. నిజానికి సమస్య ఇంత క్లిష్టంగా మారిపోవడానికి కారణం 2001 నుంచి అసోంను ఏలుతున్న తరుణ్ గొగోయ్ ప్రభుత్వమేనని (కాంగ్రెస్) ఆరోపణలు ఉన్నాయి. బోడోలు ఆయుధాలు విడిచిపెట్టేటట్టు చేయడమే సమస్య పరిష్కారానికి తొలి మెట్టు అని అభిప్రాయాలు వెలువడుతున్న కాలంలో, తరుణ్ గొగోయ్ ప్రభుత్వం ఇంకొక వర్గానికి ఆయుధాలు సరఫరా చేస్తామని చెప్పడం వింతగానే ఉంటుంది. తాజా అల్లర్ల తరువాత, బంగ్లాదేశ్ నుంచి వచ్చినవారి ఆత్మ రక్షణార్థం ప్రభుత్వం లెసైన్సులతో కూడిన తుపాకులు సరఫరా చేయాలని అసోం అటవీ శాఖ మంత్రి రాకీబుల్ హుస్సేన్ కోరారు. ప్రభుత్వం కూడా ఇదే ఆలోచనతో ఉన్నట్టు తరువాత వార్తలు వెలువడ్డాయి. ఇది సాధ్యమైన, సమస్య పరిష్కారానికి ఆచరణ యోగ్యమైన ప్రతిపాదన అని ఎవరూ అనలేరు. అంతకంటె బోడోల వాస్తవ సమస్యను గమనించి రాజ్యాంగం పరిధిలో పరిష్కరించడానికి చర్చలు జరపాలి. బోడోలు ఆయుధాలు విడిచిపెట్టేటట్టు చేయడమే దీనికి సరైన మార్గం. అసోం ప్రభుత్వం ఆలోచన అసలుకే ఎసరు పెడుతుంది. కల్హణ -
సాహిత్య, సమన్యాయాల తీర్పరి
న్యాయమూర్తి తన సుదీర్ఘ తీర్పులోని ముఖ్యాంశాలను నిపుణతతో వెల్లడించినట్టే ఒక సాహిత్యాంశం గురించీ, సాహిత్యవేత్త గురించీ, సామాజికాంశం గురించీ చిన్నపరెడ్డి ప్రసంగించడం కనిపిస్తుంది. మానవాళికి అందకుండా అనంతంగా బాధిస్తున్న మౌలిక అవసరాలను, ప్రభుత్వాన్ని నిగ్గదీసి సాధించుకునే మానవ హక్కుల స్థాయికి తీసుకువచ్చిన అరుదైన న్యాయమూర్తులు మనకు ఉన్నారు. అంటే అణగారిన వర్గాలకు గొంతును ఇచ్చే బాధ్యతను వారు స్వీకరించారు. వారిలో జస్టిస్ ఒంటెత్తుపల్లి చిన్నపరెడ్డి ఒకరు. చిన్నపరెడ్డి ‘ది కోర్ట్ అండ్ ది కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా’ (ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ ప్రెస్, 2008) పుస్తకానికి ప్రొఫెసర్ ఉపేంద్ర బాగ్చి రాసిన్ఙ‘ముందుమాట’లో వీఆర్ కృష్ణయ్యర్, పీఎన్ భగవతి, డీఏ దేశాయ్‌లతో పాటు మన రాష్ట్రానికి చెందిన చిన్నపరెడ్డి కూడా అలాంటి చరిత్రాత్మక బాధ్యతను నిర్వర్తించారని వ్యాఖ్యానించారు. నిజానికి సాహిత్యం చేసిందీ, చేయాల్సిందీ ఇదేనని చిన్నపరెడ్డి విశ్వసించి, మనందరికీ చెప్పదలిచారనిపిస్తుంది. చిన్నపరెడ్డి ప్రథమ వర్ధంతి (ఏప్రిల్ 13, 2014)కి విడుదలవుతున్న ‘జస్టిస్ ఓ. చిన్నపరెడ్డి: సాహిత్య సామాజిక ప్రసంగాలు’ (జనసాహితి ప్రచురణ)పుస్తకం ఈ తాత్వికతనే ప్రతిబింబిస్తోంది. న్యాయస్థానం మౌనంగా ఉండిపోవడం మీద జస్టిస్ చిన్నపరెడ్డికి ఉన్న ఆవేదనే ఆయన విస్తృత గ్రంథం ‘ది కోర్ట్ అండ్ ది కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా’లో కనిపిస్తుంది. 1967 నాటి గోలక్‌నాథ్ వ్యాజ్యంలో (ప్రాథమిక హక్కులను సవరించేందుకు పార్లమెంటును అనుమతించకపోవడం) అత్యున్నత న్యాయస్థానం నిర్ణయం విషాదమని ఆయన వ్యాఖ్యానించారు. 1970లో ఈఎంఎస్ నంబూద్రిపాద్‌ను శిక్షిస్తూ తీర్పునివ్వడం తప్పిదమని అంటారాయన. అరుంధతీరాయ్‌ని శిక్షించడం, బాబ్రీ మసీదు కూల్చివేతలో మౌనం దాల్చడం గురించి కూడా చిన్నపరెడ్డి అసంతృప్తి వ్యక్తం చేశారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తులు జస్టిస్ వైవీ చంద్రచూడ్, జస్టిస్ ఎంఎన్ వెంకటాచలయ్య తీర్పులూ, హయాం మీద వెలువరించిన వ్యాఖ్యలు అసాధారణమైనవి. భూమయ్య, కిష్టాగౌడ్ మరణ దండనను తప్పించి, విప్లవకవుల మీద కేసును కొట్టేసిన న్యాయమూర్తి ఆయన. మహా నేరగాళ్లు సమాజంలో నిర్భయంగా తిరుగుతుంటే వీళ్లనెందుకు శిక్షించాలన్నది ఆయన ప్రశ్న. ఇలాంటి తీర్పరి తెలుగు సాహిత్యం మీద చేసిన వాదనలూ, విశ్లేషణలూ లోతుగా కాకుండా ఇంకెలా ఉంటాయి? ‘సాహిత్యానికీ సామ్యవాదానికీ, నిత్య జీవితానికీ తీరని బంధాలున్నాయి’ అని నమ్మారాయన. ‘సమాజ హృదయం సాహిత్యం. లోకాన్నంతటినీ అవలోకించే నేత్రం సాహిత్యం. చదువరిలో చైతన్యం కలిగించి భావి భావ విప్లవానికి దారి తీస్తుంది సాహిత్యం’ అంటారు జస్టిస్ చిన్నపరెడ్డి. న్యాయమూర్తి తన సుదీర్ఘ తీర్పులోని ముఖ్యాంశాలను నిపుణతతో వెల్లడించినట్టే ఒక సాహిత్యాంశం గురించీ, సాహిత్యవేత్త గురించీ, సామాజికాంశం గురించీ చిన్నపరెడ్డి ప్రసంగించడం కనిపిస్తుంది. ఆ అంశం మీద ఆయన అధ్యయనం లోతుగా ఉంటుంది. దాని సారాన్ని ఆయన క్లుప్తంగా, బలంగా ఆవిష్కరిస్తారు. ‘వేమన ఏ కాలానికి చెందిన వాడూ కాదు. వేమన కాలం కలకాలం. చిరకాలం, స్థిరకాలం’ (వేమన-మనకర్తవ్యం) అన్నారాయన. కానీ వేమన తన సమకాలీన సమాజం మీద చేసిన విమర్శలు, నేటి సమాజానికి వర్తించడం గురించి జస్టిస్ గట్టిగానే స్పందించారు. ఆ దుస్థితి నుంచి సమాజాన్ని తప్పించమని మీ అందరినీ ‘శాసిస్తున్నాను’ అన్నారా న్యాయమూర్తి. ‘గురజాడ తెనుగు వారికి గ్రాంథిక భాషకు బదులు వాడుక భాషను చేకూర్చాడు. తెనుగు సాహిత్యంలో కాల్పనికానికి బదులు వాస్తవికాన్ని ప్రవేశపెట్టాడు. తెనుగు వారికి ఆధ్యాత్మికతత్వం బదులు శాస్త్రీయ మానవతాతత్వం పరిచయం చేశాడు. ఈ విధంగా రకరకాలుగా నవయుగ వైతాళికుడుగా వెలుగొందాడు గురజాడ’ (నవయుగ వైతాళికుడు - గురజాడ )అన్నారాయన. చండీగఢ్ ఆంధ్ర సాంస్కృతిక సంఘం నాటక పోటీలు నిర్వహిస్తే అక్కడకి కూడా వెళ్లి ‘ఏ విషయాన్నైనా, ఏ సమస్యనైనా ప్రజాబాహుళ్యానికి సులభ గ్రాహ్యం చేయగల కళ నాటక కళ’ అని పేర్కొన్నారు. ఆరుద్ర ‘సమగ్ర ఆంధ్ర సాహిత్యం’ కృషిలో జస్టిస్ చిన్నపరెడ్డి పాత్ర ఏమిటో చెప్పే ప్రసంగం చదవడం మంచి అనుభవం. ఆధునిక చరిత్రలో లోక్‌నాయక్ జయప్రకాశ్ నారాయణ్ స్థానం, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ‘ధర్మయుద్ధం’, వసతి గృహాలలో ఉండే పేద విద్యార్థులకు ఏమి అందాలి వంటి అంశాల మీద ప్రసంగాలు విలువైనవి. సామాజిక న్యాయానికీ, సాహిత్యానికీ మధ్య బంధం గురించి ప్రపంచం చర్చిం చుకుంటున్న వేళ ఈ పుస్తకం రావడం ఆహ్వానించదగినదే. - కల్హణ 13 వ తేదీన హైదరాబాద్‌లోని సోమాజీగూడ ప్రెస్‌క్లబ్‌లో చిన్నపరెడ్డి ప్రథమ వర్ధంతి సభ సందర్భంగా -
ఈశాన్య భారతంలో కొత్త పొద్దు
ఈశాన్య భారతానికీ, ప్రధాన స్రవంతి భారతానికీ నడుమ కనిపించని ఒక గోడ ఉంది. దీనిని బలంగా ఉంచుతున్నది- సాయుధ దళాల ప్రత్యేక అధికారాల చట్టం (ఏఎఫ్ఎస్పీఏ). దీనిని ఎత్తివేయాలని కొన్ని దశాబ్దాలుగా ఈశాన్య వాసులు కోరుతున్నారు. పదహారో లోక్‌సభ ఎన్నికలు ఈశాన్య భారతం భవిష్యత్తును తీర్చిదిద్దగలుగుతాయా? సిక్కింతో పాటు సెవెన్ సిస్టర్స్ ఓటర్లలో ఈసారి గణనీయమైన మార్పు కనిపిస్తున్నదని విశ్లేషకులు చెబుతున్నారు. 25 లోక్‌సభ స్థానాలు ఉన్న ఈశాన్య భారతంలో ఇప్పుడు జరుగుతున్న పోటీ చరిత్రలో ప్రత్యేకమైనది కూడా. ఈశాన్యం నిర్లక్ష్యానికి గురైన ప్రాంతమంటే ఎవరికీ సందేహం అక్కరలేదు. భౌగోళికంగా ఈశాన్య భారతం వాటా దేశ భూభాగంలో ఎనిమిది శాతం. అక్కడి జనాభా 2011 లెక్కల ప్రకారం దేశ జనాభాలో 3.1 శాతం. స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి ఇక్కడ ప్రధానంగా కాంగ్రెస్ రాజ్యమేలింది. తరువాత ప్రాంతీయ పార్టీలు గట్టి ప్రభావాన్ని కలిగి ఉన్నాయి. బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్రమోడీ ఫిబ్రవరి మొదటి వారంలోనే ఇక్కడ ఎన్నికల ప్రచారం ప్రారంభించారు. మిగిలిన భారతదేశం మాదిరిగానే అక్కడ కూడా ఈసారి ‘మోడీ గాలి’ కనిపించడంతో పార్టీ దీనిని ఉపయోగించుకుంది. అటల్ బిహారీ వాజ్‌పేయి నాయకత్వంలో ఎన్డీయే ప్రభుత్వం ఏర్పడిన తరువాతే ఈశాన్యంలో ఆ పార్టీకి ఉనికి ఏర్పడింది. ఇందుకు కారణం ఎన్డీయే ‘లుక్ ఈస్ట్’విధానం, ఈశాన్య రాష్ట్రాల కోసం మంత్రిత్వ శాఖ ఏర్పాటు యోచన. గౌహతి మునిసిపల్ కార్పొరేషన్‌కు నిరుడు జరిగిన ఎన్నికలలో బీజేపీ ద్వితీయ స్థానం సాధించింది. అయితే అక్కడ కూడా బీజేపీ పట్టణ ఓటర్లకు పరిమితమైన సూచనలే ఎక్కువ. ఇప్పుడు మోడీ ప్రచార శైలి, కాంగ్రెస్ మీద సంధిస్తున్న విమర్శలు బాగా ఆకట్టుకుంటున్నాయి. 23 సంవత్సరాలుగా అసోం నుంచి రాజ్యసభకు ఎన్నికవుతూ డాక్టర్ మన్మోహన్సింగ్ ఈ ప్రాంతానికి ఏం చేశారని మోడీ ప్రశ్నించడం ఆకట్టుకుంటోంది. ఆమ్ ఆద్మీ పార్టీ కూడా వారిని ఆకర్షిస్తున్నది. కాంగ్రెస్‌నూ, ఇతర స్థానిక పార్టీలనూ వదిలి ఈసారి ఈశాన్య భారత వాసులు ధోరణి మార్చుకునే పంథాలో ఉన్నారు. ఇందులో కొందరు ముస్లింలు కూడా ఉండడం పెద్ద పరిణామం. అసోం, మణిపూర్, త్రిపుర, అరుణాచల్‌ప్రదేశ్‌లలో మోడీ ప్రసంగించిన సభలకు విశేష స్పందన వచ్చింది. ప్రపంచంలో ఏ మూల నుంచి శరణార్థిగా వచ్చిన హిందువునైనా ఆదరిస్తామని మోడీ బంగ్లా హిందువులను ఉద్దేశించి పేర్కొని హిందుత్వ కార్డును ఉపయోగించుకున్నారు. 1962 నాటి చైనా దాడి సమయంలో అరుణాచల్ వాసులు ‘జైహింద్’ నినాదం ఇచ్చి వీరులు అనిపించుకున్నారని శ్లాఘించారు. ఈశాన్య ప్రాంత తేయాకు కార్మికులకు అనేక వరాలు ప్రకటించారు. ఢిల్లీలో ఈశాన్య భారత విద్యార్థి నిడో హత్యకు గురికావడం దారుణమని ప్రకటించి వారి మనసులను గెలిచే ప్రయత్నం చేశారు. కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు, ఆ పార్టీ అప్రకటిత ప్రధాని అభ్యర్థి రాహుల్ గాంధీ ఒకింత ఆలస్యంగా ఇక్కడ ప్రచారం ప్రారంభించారు. మార్చి 18న ఆయన కూడా నాలుగు రాష్ట్రాలలో - మేఘాలయ, అరుణాచల్, మణిపూర్, మిజోరాం-లలో ప్రచా రం ప్రారంభించారు. ఈశాన్య భారతాన్ని ఢిల్లీతో అనుసంధా నం చేయాలన్న కాంగ్రెస్ కృషికి కొన్ని అభివృద్ధి నిరోధక శక్తులు అడ్డుపడుతున్నాయని ఆరోపించారు. ఈశాన్యంలో ఈ ఇద్దరితో పాటు ఇంతవరకు విస్తృతంగా ప్రచారంలో పాల్గొన్నవారిలో మమతా బెనర్జీ ఒకరు. అరుణాచల్ వరకు నిన్నటి తరం బాలీ వుడ్ హాస్య నటుడు గోవర్ధన్ అస్రానీ కాంగ్రెస్ తరఫున ప్రచారంలో కీలకంగా ఉన్నారు. ఇంతకు మించి హడావుడి లేదు. ఈశాన్య భారతానికీ, ప్రధాన స్రవంతి భారతానికీ నడుమ కనిపించని ఒక గోడ ఉంది. దీనిని బలంగా ఉంచుతున్నది- సాయుధ దళాల ప్రత్యేక అధికారాల చట్టం (ఏఎఫ్ఎస్పీఏ). దీనిని ఎత్తివేయాలని కొన్ని దశాబ్దాలుగా ఈశాన్య వాసులు కోరుతున్నారు. సాయుధ దళాలకు విశేష అధికారాలను కట్టబెట్టే ఈ చట్టం రాజ్యాంగ బద్ధతను ఐక్యరాజ్య సమితి మానవ హక్కుల కమిషనర్ నవనీతం పిళ్లై ప్రశ్నించారు. ఈ చట్టాన్ని తొలగించవలసిన అవసరం ఉందని మార్చి 23, 2009లో ఐక్య రాజ్యసమితి కూడా భారత్‌కు సూచించింది. మణిపూర్‌కు చెందిన మహిళ షర్మిల చాను ఈ చట్టాన్ని ఎత్తి వేయాలని కోరుతూ 2000 సంవత్సరం నుంచి నిరశన దీక్ష చేస్తున్నారు. కానీ బీజేపీ, కాంగ్రెస్ రెండూ ఈ అంశాన్ని ఎన్నికల ప్రచారంలో ప్రస్తావించడం లేదు. ఎన్డీయే కాలంలో ఈశాన్యంలో ఉగ్రవాదులతో చర్చల ప్రక్రియను ప్రారంభించారు. ఇప్పుడు కూడా ఎన్డీయే వైపు ఈశాన్య వాసులు మొగ్గుతున్న సూచనలు కనిపిస్తున్నాయి. పార్టీ, ప్రభుత్వం ఏదైనా, ఇప్పుడు అక్కడ వ్యక్తమవుతున్న ధోరణి జాతి ప్రయోజనాల దృష్ట్యా మంచి అవకాశం. ప్రత్యేక అధికారాల చట్టాన్ని తొలగించి ఆ ప్రాంత ప్రజలకు స్వేచ్ఛను ఇచ్చి ప్రధాన స్రవంతి జీవనంలోకి ఆహ్వానించేందుకు వచ్చిన అవకాశమిది. ఈ ఎన్నికలు అందుకు ఉపయోగపడితే ప్రజాస్వామ్యం ధన్యమైనట్టే. - కల్హణ -
ఉషస్సులు వద్దంటున్న ఉత్తర కొరియా
విలీనం కోసం దక్షిణ కొరియా అధ్యక్షురాలు పార్క్ ఒక సంఘాన్ని ఏర్పాటు చేసి తన నాయకత్వంలోనే కార్యకలాపాలను నిర్వహింప చేస్తున్నారు. సైనిక విన్యాసాలతో, నిరంతర వివాదాలతో ఉత్తర కొరియా ఉంటున్నప్పటికీ ఏకీకరణ విషయంలో పార్క్ ప్రయత్నాలు ఆపలేదు. ‘నాసా’ అంతరిక్ష సంస్థ విడుదల చేసిన ఈ చిత్రం కొరియాల మధ్య వెలు గుల తేడాను చూపుతోంది. మధ్యలో దాదాపు చీకటిగా ఉన్న ప్రాంతం ఉత్తర కొరియా. కాస్త మినుకుమినుకు మంటున్న స్థలమే ఉత్తర కొరియా రాజధాని పైన్గాంగ్. కుడి పక్క దిగువ భాగం దక్షిణ కొరియా. ఆపైన ఎడమ భాగాన ఉన్నది చైనా. ఉత్తర కొరియా విద్యుత్ వినియోగం గంటకు 739 కిలోవాట్లు. దక్షిణ కొరియా వినియోగం గంటకు 10,162 కిలోవాట్లు. యుద్ధం చరిత్ర మీద మిగిల్చే విషాదానికి అంతు ఉండదు. తరం తరువాత తరం ఆ బాధను అనుభవిస్తూనే ఉంటుంది. రెండో ప్రపంచ యుద్ధం, దరిమిలా సోవియెట్ రష్యా, అమెరికా మధ్య నెలకొన్న ప్రచ్ఛన్నయుద్ధం ఎన్నో సమాజాలను, దేశాలను ఇలాంటి విషాదంలోకి నెట్టివేశాయి. ఉభయ కొరియాల గాథ అలాంటిదే. 1945లో తొందరపాటుతో జరిగిన కొరియా విభజన ఆధునిక ప్రపంచ చరిత్రకే పెద్ద పాఠం. వెయ్యేళ్లు కలసి జీవిం చి, ప్రపంచ రాజకీయాల నేపథ్యంలో విడిపోయిన దక్షిణ, ఉత్తర కొరియాలను ఐక్యం చేయడానికి 1990లో ప్రారంభమైన ప్రయత్నం ఇప్పటికి కూడా ఊపందుకోలేదు. చెదురుమదురుగా ఉన్న సమాజాలను ఒకే దేశం కింద ఐక్యం చేయడానికి ఉద్యమించడం చరిత్రకు కొత్తకాదు. ఇటలీ, జర్మనీ ఏకీకరణలు ఇందుకు గొప్ప తార్కాణం. రెండవ ప్రపంచ యుద్ధంలో జపాన్ ఓడిన తరువాత అప్పటిదాకా ఆ దేశం అధీనంలో ఉన్న కొరియా ద్వీపకల్పం అంతర్జాతీయ రాజకీయాలకు వేదిక అయింది. సోవియెట్ రష్యా మద్దతుతో కొరియా ఉత్తర భాగం పైన్గాంగ్ రాజధానిగా డెమాక్రటిక్ పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ కొరియా (దీపీఆర్కే)గా అవతరించింది. ఇదే ఉత్తర కొరియా. మిగిలినది సియోల్ కేంద్రంగా దక్షిణ కొరియా పేరుతో, అమెరికా అండగా రిపబ్లిక్ ఆఫ్ కొరియా (ఆర్ఓకే) ఏర్పడింది. ఆగర్భ శత్రువులైనట్టు దాయాదుల మధ్య భీకర యుద్ధం (1950-53)కూడా జరిగింది. కానీ తూర్పు ఐరోపా, సోవియెట్ రష్యా పరిణామాలు ఉభయ కొరియాలను ఏకీకరణ దిశగా ఆలోచించేటట్టు చేశాయి. తమ రెండు దేశాల ఏకీకరణ వ్యవహారం కోసం 1990లోనే దక్షిణ కొరియా మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేసింది. రెండు దేశాల మధ్య విడిపోయిన బంధువుల సమావేశం ఈ ఫిబ్రవరి ఆఖరి వారంలో సియోల్‌లో జరిగింది. ఈ సమావేశాల ముగింపు, ప్రస్తుత కొరియా అధ్యక్షురాలు పార్క్ పదవిని చేపట్టి ఒక సంవత్సరకాలం పూర్తికావడం ఒకేసారి జరిగింది. ఆ సందర్భంగా చానళ్లలో ప్రసంగించిన పార్క్, ఏకీకరణకు తమ వంతు ప్రయత్నాలను ముమ్మరం చేస్తానని హామీ ఇచ్చారు. ఏకీకరణ కోసం రూపొందించిన మూడెంచల పథకానికి కొత్తరూపు ఇవ్వవలసిన సమయం కూడా వచ్చిందని ఆ శాఖ ప్రస్తుత మంత్రి రేయూ కిల్ జెయీ అనడం విశేషం. ఇలా బంధువుల కలయికకు అవకాశం కల్పిస్తూ 2010 తరువాత కార్యక్రమం జరగడం మళ్లీ ఇప్పుడే. నిజానికి 1990 ముందు కూడా ఐక్యత కోసం కొంత కృషి జరిగింది. సన్ మ్యూంగ్ మూన్ (1920-2012) అనే పారిశ్రామికవేత్త ఆధ్వర్యంలో ‘యూనిఫికేషన్ చర్చి’ పేరుతో 1954 నుంచి ఒక ప్రయత్నం జరిగింది. ఉత్తర కొరియాకే చెందిన మూన్ నలభయ్ దశకంలో కమ్యూనిస్టులతో కలసి జపాన్‌కు వ్యతిరేకంగా పోరాడినవాడే. తరువాత ఉత్తర కొరియా ప్రభుత్వం చర్చి పట్ల విద్వేషపూరితమైన వైఖరి అవలంబించడంతో దక్షిణ కొరియాకు పారిపోయి వచ్చాడు. దక్షిణ కొరియా ఆర్థిక వ్యవస్థ ఆసియాలో నాలుగో స్థానంలో ఉంది. ఉత్తర కొరియా కంటె నలభయ్ రెట్లు పెద్దది. అయినా ఆ దేశాన్ని కలుపుకోవాలని ఆశిస్తున్నది. కానీ ఈ ఆశయానికి యువతరం అనుకూలంగా లేకపోవడం గమనించాలి. సమస్యలతో సతమతమవుతున్న దేశాన్ని ఇప్పుడు విలీనం చేసుకోవలసిన అవసరం ఏమొచ్చిందన్నదే ఎక్కువ మంది యువకుల ప్రశ్న. అయితే రెండు దేశాల రాజ్యాంగాలు విలీనాన్ని ఒక ఆశయంగా పొందుపరుచుకున్నాయి. అయినా ఈ ప్రతిపాదనకు ఉత్తర కొరియా ప్రాధాన్యం ఇవ్వడం లేదు. కానీ విలీనం కోసం దక్షిణ కొరియా అధ్యక్షురాలు పార్క్ ఒక సంఘాన్ని ఏర్పాటు చేసి తన నాయకత్వంలోనే నిర్వహింప చేస్తున్నారు. సైనిక విన్యాసాలతో, నిరంతర వివాదాలతో ఉత్తర కొరియా ఉంటున్నప్పటికీ ఏకీకరణ విషయంలో పార్క్ ప్రయత్నాలు మానుకోవడం లేదు. పార్క్ తొలి యేటి పని తీరుపై మంచి మార్కులు వేయడానికి ఆమె ఉత్తర కొరియా విధానం కూడా కారణమని పలువురు పేర్కొన్నారు. - కల్హణ -
అళగిరి ఆఖరి పోరాటం
ఇప్పుడు అళగిరి ముందున్న మార్గం ఏమిటి? కాంగ్రెస్‌తో కలిసి దక్షిణ తమిళనాడులో కొన్ని పార్లమెంటు సీట్లు సాధించడమేనని జాతీయ పత్రికలు చెబుతున్నాయి. వాల్‌పోస్టర్లతో సినిమా బాగోగులు నిర్ణ యం కావు. కానీ అవి మంచి ప్రచారం తెచ్చి పెడతాయి. పోటాపోటీగా ఉండే మాస్ హీరోల విషయంలో ఇది మరింత నిజం. వెండితెర శైలిని ప్రతి అడుగులోను అనుసరిం చే ద్రవిడ పార్టీలకి ఇదంతా వెన్నతో పెట్టిన విద్య. ద్రవిడ మున్నేట్ర కజగం (డీ ఎంకే)లో తాజాగా మొదలైన వాల్‌పోస్టర్ల వివాదం ఈ సారి ప్రచారం స్థాయిని దాటి, విశ్లేషకులూ ఇతర పార్టీలూ కొత్త అంచనాలకు, ఆశలకు వచ్చేటట్టు చేసింది. డీఎంకే దళపతి, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి ఎం. కరుణానిధి పెద్ద కొడుకు ఎంకె అళగిరిని హీరోను చేసే ఉద్దేశంతో వెలిసిన ఈ పోస్టర్ల మీద పార్టీ నాయకత్వమే పిడకలు కొట్టించేసింది. ఈ సీరియస్ కామెడీ చివరికి ఎక్కడికి దారి తీస్తుందోనన్నది పెద్ద ప్రశ్న. దక్షిణ తమిళనాడులోని మధురై నగరంలో జనవరి నాలుగున హఠాత్తుగా ఆ పోస్టర్లు గోడల నిండా వెలిశాయి. భారీ సిని మా పోస్టరుకు ఏమీ తగ్గకుండా రంగులతో, వృద్ధనేత కరుణానిధి, వారసత్వ పోరులో తలమునకలై ఉన్న ఆయన ఇద్దరు కొడుకులు అళగిరి, స్టాలిన్, ఇతర పెద్దల ముఖాలన్నీ ఆ పోస్టర్లో ఉన్నాయి. కానీ అవి ఇచ్చిన సమాచారం అధిష్టానం పాలిట పుండు మీది కారమైంది. ‘జనవరి 30న చెన్నై నగరంలోని కలైంజర్ అరంగంలో డీఎంకే సర్వ సభ్య సమావేశం జరుగుతుంది’ అని ఆ రాతల అర్థం. జనవరి 30 అళగిరి పుట్టినరోజు. దీనికి ‘ఇని ఒరు విధి సీవొమ్’ అని శీర్షిక కూడా పెట్టారు. దీనర్థం, మనం లక్ష్యాన్ని నిర్దేశిస్తాం. ఇది మహాకవి సుబ్రహ్మణ్య భారతి కవితలలో ఓ పంక్తి. సినిమా పోస్టర్లు వేర్వేరు నిశ్చల చిత్రాలతో దర్శనమిచ్చినట్టు, ఈ పోస్టర్లను రకరకాలుగా ముద్రించారు. అళగిరి వీరాభిమానులు ముగ్గురి పేర్లు కింద కనిపిస్తున్నా యి. పార్లమెంటు ఎన్నికలకు ముందు ఇలాంటి ‘తుంటరి పోస్టర్లు’ ఏమిటని కరుణానిధి ఇచ్చిన ప్రకటన పార్టీ పత్రిక ‘మురసోలి’లో మరునాడే కనిపించడంతో రాష్ట్ర రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. జాతీయ పత్రికలలో, తమిళనాడు పత్రికలలో వస్తున్న వార్తలూ విశ్లేషణలను బట్టి, ఇది పార్టీతో అళగిరి చేస్తున్న ఆఖరి పోరాటం. మధురై కేంద్రంగా దక్షిణ తమిళనాడు పార్టీ వ్యవహారాలను అళగిరి చూస్తుంటారు. చెన్నై కేంద్రంగా స్టాలిన్ మిగిలిన భాగాన్ని అదుపు చేస్తూ ఉంటారు. డీఎంకే ద్రవిడ సిద్ధాంతాలతో ఆవిర్భవించి ఉండవచ్చు. బ్రాహ్మణాధిపత్యం మీద, వైదిక సంప్రదాయాల మీద తిరుగుబాటే ఊపిరిగా మనుగడ సాగిస్తూ ఉం డొచ్చు. కానీ రాజకీయాల దగ్గర మాత్రం మధ్యయుగం పోకడలకు, అది ఎంతో ద్వేషిం చే కాంగ్రెస్‌కు ఏ మాత్రం అతీతం కాదని ఎప్పుడో రుజువు చేసుకుంది. కరుణానిధికి ఇప్పుడు 90 ఏళ్లు. ఆయన వారసత్వం గురిం చి పోరాటం తీవ్రం కావడం అనూహ్యమేమీ కాదు. నిజానికి ఇది ఏడేళ్ల క్రితమే ప్రారంభమైంది. డీఎంకేలో స్టాలిన్ అంత్యంత ప్రజాకర్షణ గల నాయకుడంటూ 2007 సంవత్సరంలో ‘దినకరన్’ పత్రిక ప్రచురించిన కథనం తుపాను సృష్టించింది. మధురైలో ఆ పత్రిక ప్రతులను అళగిరి వర్గీయులు తగులబెట్టారు. పత్రిక కార్యాలయం మీద దాడికి దిగారు. ఈ అల్లర్లను అదుపు చేయడానికి జరిపిన కాల్పులలో ముగ్గురు చనిపోయారు కూడా. అప్పు డు కొడుకులిద్దరి మధ్య సయోధ్య కుదర్చడానికి కరుణానిధి తన వంతు ప్రయత్నం చేశారు. అవేమీ ఫలితాలను ఇవ్వలేదనే అనిపిస్తుంది. తాజా వాల్‌పోస్టర్ల వివాదం, తరువాత జరిగిన పరిణామాలు ఇదే చెబుతున్నాయి. పోస్టర్లు ముద్రించిన ముగ్గురిని పార్టీ బహిష్కరించింది. వారు తన వర్గం వారు కాదని అళగిరి వెంటనే ప్రకటన చేశారు. ఆ వెంటనే మధురై శాఖను రద్దు చేసి తాత్కాలిక నిర్వాహక కమిటీని స్టాలిన్ ఏర్పాటు చేశారు. దీన్నిండా స్టాలిన్ వర్గీయులే. స్టాలిన్ చర్యను ఖండిస్తూనే, తనను పార్టీలో ఏకాకిని చేసే కుట్ర ఇప్పటిది కాదనీ, అయినా తాను విమర్శలకు దిగడం లేదనీ అళగిరి చెప్పారు. అక్కడితో ఆగక, తాను ఒక్క కరుణానిధి నాయకత్వాన్ని మినహా మరెవ్వరి నాయకత్వాన్ని ఆమోదించే ప్రశ్నే లేదంటూ స్టాలిన్ నాయకత్వానికి అళగిరి నేరుగానే సవాలు విసిరారు. జయలలితతో విభేదాలు పెంచుకున్న దేశీయ మరుపోక్కు ద్రవిడ కజగం (డీఎండీకె)తో రేపటి పార్లమెంట్ ఎన్నికలలో పొత్తు పెట్టుకునే అవకాశాలు ఉన్నట్టు సాక్షాత్తు కరుణానిధి చేసిన ప్రకటనను కూడా అళగిరి ఎద్దేవా చేశారు. డీఎండీకే నేత, సినీనటుడు విజయ్‌కాంత్ డీఎండీకే అధినాయకుడు. అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడు ఆయనే. డీఎంకే మూడో స్థానంలో ఉంది. అయితే విజయ్‌కాంత్‌ను తాను రాజకీయవేత్తగానే పరిగణించనని అళగిరి ప్రకటించి, తండ్రి ఆగ్రహాన్ని చవి చూశా రు. క్రమశిక్షణ తప్పిన వారు ఎవరినైనా పార్టీ నుంచి పంపే అధికారం తమకు ఉందని వృద్ధనేత మండిపడ్డారు. ఈ పరిణామాలన్నీ జనవరి నాలుగున మొదలై నాలుగు రోజులలోనే వేగంగా జరిగిపోవడం విశేషం. ఇప్పుడు అళగిరి ముందున్న మార్గం ఏమిటి? కాంగ్రెస్‌తో కలిసి దక్షిణ తమిళనాడులో కొన్ని పార్లమెంటు సీట్లు సాధించడమేనని జాతీయ పత్రికలు చెబుతున్నాయి. తమిళనాడులో ఒక ఆధారం కోసం పడిగాపులు పడి ఉన్న కాంగ్రెస్ ఇందుకు ఎలాగూ సై అం టుంది. డీఎంకేకు బద్ధశత్రువైన జయకు ఈ ‘మధురై బలాఢ్యుడు’ స్నేహహస్తం చాపే అవ కాశాలు కూడా ఉన్నాయని మరొక వాదన. స్టాలిన్‌ను ఎదుర్కొనడానికీ, ఇప్పటికే రకరకాల కేసులతో జైళ్లలో మగ్గుతున్న తన అనుచరులకు ఊరట కల్పించడానికీ ఇది అళగిరికి ఉపయోగపడుతుందని అంచనా. ఏమైనా మధురై పోస్టర్లు ఒక బాక్సాఫీసు హిట్‌నే దేశం ముందుకు తేబోతున్నాయని అనుకోవచ్చు. - కల్హణ -
చల్లబడుతున్న ‘ప్రచండ’ం
ఒక తిరుగుబాటు నాయకుడి హోదా నుంచి సంప్రదాయ రాజకీయవేత్త స్థితికి రావడానికి ప్రచండ సంఘర్షణ పడుతున్నాడని ఆయన సన్నిహితులు చెబుతున్నారు. ఇది కాకపోచ్చు. రాజును పదవీచ్యుతుడిని చేయడంలో విజ యవంతమయ్యాడు గానీ, ప్రజల హృదయాలను గెలుచుకోవడం దగ్గర మాత్రం ఆయన విఫలమయ్యాడు. ఆయన ప్రచండ. ‘ప్రచండ అంటే నిన్నటి వరకు గొప్ప ఆకర్షణ, ఇవాళ ఆయన అలంకారప్రాయం’ అని యూనిఫైడ్ కమ్యూనిస్టుపార్టీ ఆఫ్ నేపాల్ (మావోయిస్టు) (యూసీపీఎన్-ఎం) కేంద్ర కమిటీ సభ్యుడు ఒకరు వ్యాఖ్యానించారు. ఆ పార్టీ నాయకుడు సాక్షాత్తు ప్రచండే. నిజమే, నేపాల్ సమీప గతంలో ప్రచండ ఒక ప్రభంజనం. వర్తమాన హిమాలయ భూమిలో ఆయనొక పతన శిఖరం. నేపాల్ రాచరికానికి వ్యతిరేకంగా 1996 -2006 మధ్య దశాబ్దం పాటు నేపాల్‌లో సాయుధ విప్లవం నడిపిన నాయకుడు ప్రచం డ. అసలు పేరు పుష్పకమాల్ దహాల్. మూడున్నర శతాబ్దాల రాచరికాన్ని కాలమనే చెత్తబుట్టలోకి విసిరివేయడానికి ఆయన నడిపిన కమ్యూనిస్టు విప్లవం అసాధారణమైనది. పదమూడువేల మందిని ప్రాణత్యాగాలకు సిద్ధం చేసిన నాయకుడాయన. రాచరికం రద్దయిన తరువాత తొలిసారి జూన్ 16, 2006లో నీలిరంగు సూట్లో ప్రజలందరికీ కనపడినప్పుడు ప్రచండలో నేపాలీలు ‘దేవుడు’నే చూశారు. కానీ అనతికాలంలోనే ఆయన వ్యక్తిత్వం మీద, నడత మీద నీలినీడలు కమ్ముకుంటాయని ఎవరూ అనుకోలేదు. పెద్ద ప్రజా ఉద్యమంతో వచ్చిన ఖ్యాతినీ, అందుకు ఉపకరించిన నేపాల్ కమ్యూనిస్టు పార్టీ (మషాల్)నీ కేవలం ఐదేళ్లలోనే కోల్పోతాడని ఊహించలేకపోయారు. పార్టీలో వచ్చిన మూడు ప్రధాన ముఠాలు ఆయన చరిత్రని తిరగరాశాయి. ఆ చీలిక కార్యకర్తల మధ్య భౌతికదాడులకు దారి తీసింది. సాయుధ పంథాను వీడి రాజ్యాంగబద్ధంగా ప్రధాన జీవన స్రవంతిలోకి వచ్చిన తరువాత ఇనుమడించిన ప్రచండ గౌరవం ముఠాలతో, కార్యకర్తలు బాహాటంగా చేస్తున్న విమర్శలతో అడుగంటిపోయింది. పాలుంగ్తార్ ప్లీనం తరువాత సొంత పార్టీ ప్రచండ మీద 18 ఆరోపణలతో అసమ్మతి పత్రం విడుదల చేసింది. ‘రివిజనిస్ట్’ అని, పెట్టుబడిదారుల ప్రయోజనాల కోసం పని చేస్తున్నాడని, పార్టీ ప్రయోజనాలకు వ్యతి రేకంగా వ్యవహరిస్తున్నాడని, నిధులను సొం త సొమ్ములా దుర్వినియోగం చేస్తున్నాడని అసమ్మతి పత్రంలో విమర్శించారు. అవినీతి, అనైతికత ఆరోపణలూ ఉన్నాయి. ప్రచండ ఒక పార్టీని నడుపుతున్నాడని చెప్పడం కంటె, ఒక ముఠాకు నాయకుడని చెప్పడం సబబని యూసీపీఎన్-ఎం పొలిట్‌బ్యూరో సభ్యుడు రామ్ కార్కి వ్యాఖ్యానించడం విశేషం. ఎన్నిసార్లు చెప్పినా, పార్టీ జమాఖర్చులు చెప్పడం లేదని తీవ్రమైన ఆరోపణే కార్కి చేశాడు. పదేళ్లపాటు అలుపెరుగని రక్తసహిత విప్లవం నడిపిన ప్రచండ ప్రధాని పదవిలో కేవలం ఒక్క సంవత్సరం మాత్రమే(2008- 09) ఉండగలిగారు. సైన్యాధ్యక్షుడిని తొలగిం చడానికి చేసిన ప్రయత్నాన్ని సైన్యం అడ్డుకోవడంతో పదవి నుంచి తప్పుకోవలసి వచ్చింది. నిజానికి ఒక తిరుగుబాటు నాయకుడి హోదా నుంచి సంప్రదాయ రాజకీయవేత్త స్థితికి రావడానికి ప్రచండ సంఘర్షణ పడుతున్నాడని ఆయన సన్నిహితులు చెబుతున్నారు. ఇది కాకపోచ్చు. మొన్న రాజ్యాంగ సభకు జరిగిన ఎన్నికలలో తన పార్టీ మూడో స్థానానికి దిగజారడంతో ఈ ఎన్నికలను అంగీకరించడం లేదనీ, బ్యాలెట్ బాక్సులు మార్చారని ఆరోపించి సంప్రదాయ రాజకీయ నేతల ధోరణికి ప్రచండ దగ్గరగా వచ్చేశారనే అనిపిస్తుంది. క ఠ్మాండు నడిబొడ్డున లక్ష రూపాయల అద్దె ఇంట్లో ఉండడం కూడా దీనినే సూచిస్తుంది. రాజ్యాంగ సభ ఎన్నికలలో ప్రచండ నాయకత్వంలోని యూసీపీఎన్-ఎం మూడో స్థానంలోకి పడిపోయింది. నేపాలీ కాంగ్రెస్, సీపీఎన్-యుఎంఎల్ ఒకటి, రెండు స్థానాలలో నిలిచాయి. కఠ్మాండు-10 నియోజకవర్గంలో నేపాలీ కాంగ్రెస్ అభ్యర్థి రాజన్ కె.సి. చేతిలో 8000 ఓట్ల తేడాతో ప్రచండ ఘోరం గా ఓడిపోయారు. మరో నియోజకవర్గం సిరాహా-5లో కమ్యూనిస్టు పార్టీ తిరుగుబాటు వర్గం స్థాపించిన పార్టీ సీపీఎన్-యుఎంఎల్ అభ్యర్థి లీలా శ్రేష్ట మీద కేవలం 900 ఓట్ల ఆధిక్యంతో గెలిచారు. కానీ ఈ గెలుపును ఎవరూ గుర్తించడం లేదు. కఠ్మాండు-1 నుంచి పోటీ చేసి ప్రచండ కుమార్తె రేణు దహాల్ నేపాలీ కాంగ్రెస్ అభ్యర్థి చేతిలో ఓడిపోయారు. చిత్రం గా ‘రాచరిక పునరుద్ధరణ, హిందూ దేశం’ నినాదాలతో పోటీకి దిగిన రాష్ట్రీయ ప్రజాతంత్ర పార్టీ (నేపాల్) కూడా 3.95 లక్షల ఓట్లు గెలుచుకుంది. 2008 ఎన్నికలతో కూడా దేశంలో రాజ్యాంగం ఏర్పడలేదు. ఈ ఎన్నికల ఫలితాలను గుర్తించబోమని ప్రచండ ప్రకటిం చారు. ఆయన అనుచరులు కొందరు ఈ విషయం విలేకరులకు చెబుతున్నపుడే మళ్లీ ఆయుధం పట్టాలని నినాదాలు ఇవ్వడం విశేషం. కొత్త రాజ్యాంగం కోసం, ప్రజాస్వామ్యం కోసం నేపాల్ ఇంకా ఎంతకాలం వేచి ఉండాలో? - కల్హణ -
చరిత్రతో మోడీ సమరం
ప్రధాని మన్మోహన్సింగ్ అయితే, ‘మోడీ అత్యుత్సాహంతో చారిత్రక వాస్తవాలతో పాటు, భౌగోళిక హద్దులను కూడా మారుస్తున్నా’రని ఎద్దేవా చేశారు. బీహార్ సీఎం నితీశ్ కుమార్ ‘ఇంతటి మహాజ్ఞాని, చరిత్ర మీద అమోఘమైన అభినివేశం ఉన్నవాడు’ అంటూ, పేరు ప్రస్తావించకుండా అపహాస్యం చేశారు. చంద్రగుప్తమౌర్యుడికీ, చంద్రగుప్తుడికీ, చంద్రగుప్తవిక్రమాదిత్యుడికీ మధ్య చాలా తేడా ఉంది. చంద్రగుప్తుడు, చంద్రగుప్త విక్రమాదిత్యుడు గుప్త వంశానికి చెందినవారు. మొదట పేర్కొన్న చంద్రగుప్తుడులో ‘గుప్త’ అని ఉన్నా, అది ఆయన వంశ నామం కాదు. ఆయన మౌర్యుడు. కానీ వీరిని ఒకరిగా చెప్పడమో, లేక తేడా తెలియకుండా ప్రస్తావించడమో చేస్తే అది తప్పిదమే. భారతదేశ చరిత్ర తక్కువదేమీ కాదు. కానీ భారతీయులకు చరిత్ర స్పృహ తక్కువే. నాయకులు కూడా సామాన్య భారతీయులు జాబితాలో చేరితే కొంచెం కష్టమనిపిస్తుంది. భారతీయ జనతాపార్టీ ప్రధాని అభ్యర్థి, గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్రమోడీ విషయంలో ఇప్పుడు జరుగుతున్నది అదే. చరిత్ర, అది ఇచ్చే ఉద్వేగాలు, ప్రేరణల మీద విశేషమైన నమ్మకం ఉన్న పార్టీ బీజేపీ. అలాంటి పార్టీ ఎం పిక చేసుకున్న ప్రధాని అభ్యర్థి ఇటీవల మాట్లాడిన కొన్ని చారిత్రాకాంశాలు అపహాస్యం పాలుకావడం విషాదం. అక్టోబర్ 27న ‘హుంకారం’ పేరుతో పాట్నాలోని గాంధీ మైదానంలో ఇచ్చిన ఉపన్యాసం, నవంబర్ 11న గుజరాత్‌లోనే చరిత్రాత్మక ఖెడా దగ్గర ఒక ఆస్పత్రి ప్రారంభోత్సవంలో ఇచ్చిన ఉపన్యాసాలు మోడీని, ఆయన పార్టీని ఇరకాటంలోకి నెట్టేశాయి. మనల్ని పాలించడానికి ఒక చరిత్రకారుడు కావాలని మనం అనుకోవడం లేదు. కానీ చారిత్రకాంశాల ప్రస్తావన దగ్గర జాగరూకత ఉండాలి. చిన్న పొరపాటైనా పెద్ద రగడకు దారితీస్తుంది. సొంత రాష్ట్రంలోనే ఖెడా దగ్గర జరిగిన కార్యక్రమంలో ఆయన శ్యామాప్రసాద్ ముఖర్జీ (1901-1953) గుజరాత్ ముద్దుబిడ్డ అని అన్నారు. మోడీ ప్రస్తావించవలసిన అసలు పేరు శ్యాంజీ కృష్ణవర్మ (1857-1930). వర్మ విప్లవ సంఘాలతో కలిసి భారత స్వాతంత్య్రం కోసం పనిచేశారు. లండన్‌లో ఇండి యా హౌస్ స్థాపించిన గొప్పతనం కూడా ఆయనదే. చిత్రం ఏమిటంటే, 22 ఆగస్టు, 2003న మోడీ స్విట్జర్లాండ్ నుంచి కృష్ణవర్మ చితాభస్మాన్ని రాష్ట్రానికి తీసుకువచ్చారు. ఈ మేరకు గుజరాత్ పర్యాటకశాఖ వెబ్‌లో సమాచారం ఉంది. ఇన్ని ఉన్నా ఒక బెంగాలీ ప్రముఖుడిని గుజరాత్ ముఖ్యమంత్రి తన రాష్ట్ర పౌరుడిని చేశారు. పైగా ముఖర్జీ భారతీయ జనసంఘ్ వ్యవస్థాపక అధ్యక్షుడు. బీజేపీ పూర్వరూపం అదే. 1951-52లో ఆవిర్భవించిన జనసంఘ్ అత్యవసర పరిస్థితి (1975-77) తరువాతి పరిణామాలలో భాగంగా జనతాపార్టీలో ఒకటైంది. ముఖర్జీ కాశ్మీర్ అంశం మీద పోరాడుతూ అక్కడి జైలులోనే జూన్ 23,1953లో మరణించారు (ఇందుకు నెహ్రూ బాధ్యుడని మొన్న ఈ జూన్‌లోనే పంజాబ్‌లో జరిగిన ఒక సభలో మోడీ అన్నా రు). అయితే ఇది తడబాటు మాత్రమేనని బీజేపీ అధికార ప్రతినిధి లేఖి వివరణ ఇచ్చుకున్నారు. పాట్నా సభలో చేసిన కొన్ని వ్యాఖ్యలు మోడీని ఇం కాస్త ఇబ్బంది పెట్టాయి. ఆయన అక్కడ ప్రయోగించిన ‘గుప్త’ పాశుపతాస్త్రం ఎదురు తిరిగిందని మోడీ విమర్శకులు ధ్వజమెత్తారు. కాంగ్రెస్ ప్రముఖుడు, నెహ్రూ చరిత్ర రాసిన శశి థరూర్ మోడీ తడబాట్ల మీద చాలా వ్యంగ్యంగా స్పందించారు. చంద్రగుప్త మౌర్యుడికీ, చంద్రగుప్తుడికీ మధ్య తేడాను మోడీ గుర్తించాలని శశి వ్యాఖ్యానించారు. అలాగే సర్దార్ పటేల్ అంత్యక్రియలకు నెహ్రూ హాజరు కాలేదంటూ మోడీ విసిరిన విసురును కూడా శశి కొట్టిపారేశారు. ‘మోడీ మంచివాడు, ముక్కుకు సూటిగా ఉంటాడు. కానీ విస్తృతంగా చదువుకున్నవాడు కాదు’ అని శశి ముక్తాయింపు ఇచ్చాడు. ప్రధాని మన్మోహన్సింగ్ అయితే, ‘మోడీ అత్యుత్సాహంతో చారిత్రక వాస్తవాలతో పాటు, భౌగోళిక హద్దులను కూడా మారుస్తున్నా’రని ఎద్దేవా చేశారు. బీహార్ ముఖ్యమంత్రి నితీశ్‌కుమార్ ‘ఇంతటి మహాజ్ఞాని, చరిత్ర మీద అమోఘమైన అభినివేశం ఉన్నవాడు’ అంటూ, పేరు ప్రస్తావించకుండా అపహాస్యం చేశా రు. అలెగ్జాండర్ గంగ ఒడ్డున ఓడిపోయాడని చెప్పడం, తక్షశిలను (ఇస్లామాబాద్‌కు సమీపంలోనిది) బీహార్‌లో భాగంగా పేర్కొనడం విమర్శలకు దారి తీసింది. అయితే మోడీని ప్రశంసించి నితీశ్ ఆగ్రహానికి గురైన జేడీ(యు) జాతీయ కార్యదర్శి శివరాజ్ సింగ్ మాత్రం ఈ విషయంలో మోడీకి మద్దతుగా నిలుస్తున్నారు. ఇన్నాళ్లూ సర్దార్ పటేల్‌ను మరచిపోయిన కాంగ్రెస్ పార్టీ, మోడీని తూర్పార పట్టడానికి ఆయన పేరును ఉపయోగించుకోవడమే విడ్డూరమని సింగ్ అంటున్నారు. మోడీని పాట్నాలో అడుగుపెట్టనివ్వకూడదన్న పట్టుదలతో ఉన్న నితీశ్, నెహ్రూ కుటుంబం మీద ధ్వజమెత్తడంలో ముందుండే మోడీ లోని దోషాన్ని ఎంచే అవకాశం కోసం సదా పొంచి ఉండే కాంగ్రెస్ ఇలాంటి విమర్శలు చేయడంలో కొంత రాజకీయం కూడా ఉంది. కానీ ప్రధాని పదవికి పార్టీ ఎంపిక చేసిన అభ్యర్థి ఇలా దోషాలతో చరిత్ర చెప్పడాన్ని ఎవరూ మెచ్చరు. - కల్హణ -
‘బెంగాలీ భార్య’ విషాదం
రవీంద్ర కవీంద్రుడి కాబూలీవాలా కథలో కనిపించే కాబూలీవాలా లాగే జాన్‌బజ్ కోల్‌కతాలో వడ్డీ వ్యాపారమే చేసేవాడు. కానీ కథలో కాబూలీవాలా అంతటి ఉన్నతుడు కాదు. ‘ఒక్క మాటా అబద్ధం కాదు’... ఆఫ్ఘనిస్థాన్‌లోని పరిస్థితులును వర్ణిస్తూ బెంగాలీ వనిత సుస్మితా బెనర్జీ రాసిన మూడు పుస్తకాలలో ఇది చివరిది. ఆమె మాటలు అక్షర సత్యాలని రుజువు చేస్తూ తాలిబన్లు ఈ నెల నాలుగు(లేదా ఐదో తేదీ వేకువ)న ఆఫ్ఘనిస్థాన్‌లోని మారుమూల పక్టికా ప్రాంతంలో, ఇంటి నుంచి తీసుకుపోయి కాల్చిచంపారు. ‘ఓ కాబూలీవాలా బెంగాలీ భార్య’, ‘తాలిబన్- అప్ఘన్-నేను’, ‘ఒక్క మాటా అబద్ధం కాదు’- ఈ మూడు పుస్తకాలు ఆఫ్ఘన్లో తాలిబన్లు రాజ్యం పక్టికా ప్రాంతంలో సుస్మిత అనుభవించిన విషాద జ్ఞాపకాలకు అక్షరరూపాలే. కోల్‌కతాలో పుట్టిన సుస్మిత ఆఫ్ఘనిస్థాన్‌కు చెందిన కాబూలీవాలా ప్రేమలో పడి వివాహం చేసుకోవడం, ఆఫ్ఘన్ కోడలిగా వెళ్లడం, సంఘర్షణ, దారుణ హత్యకు గురికావడం సినిమా కథను తలపిస్తాయి. చిత్రంగా, ఒక నాటకం దగ్గర సుస్మిత ప్రేమఘట్టానికి తెర లేచింది. కాబూలీవాలా తెగకు చెందిన జాన్‌బజ్ ఖాన్, సుస్మిత రిహా ర్సల్స్ దగ్గర మొదటిసారి చూసుకుని ఇష్టపడ్డారు. వారి వివాహం జూలై 2, 1988న కోల్‌కతాలోనే గుట్టుగా జరిగింది. ఈ పెళ్లిని సుస్మిత తల్లిదండ్రులు తీవ్రంగా వ్యతిరేకిం చారు. విడాకులు ఇప్పించడానికి ప్రయత్నాలు జరిగాయి. అప్పుడే సుస్మితను తీసుకుని జాన్‌బజ్ అప్ఘాన్ (స్వగ్రామం పటియా) వెళ్లాడు. రవీంద్ర కవీంద్రుడి కాబూలీవాలా కథలో కనిపించే కాబూలీవాలాలాగే జాన్‌బజ్ కోల్‌కతాలో వడ్డీ వ్యాపారమే చేసేవాడు. కానీ కథలో కాబూలీవాలా అంతటి ఉన్నతుడు కాదు. ఆ సంగతి సుస్మితకు అత్తింట అనుభవానికి వచ్చింది. ఆమె అత్తవారింట గుమ్మం లో అడుగుపెడుతుండగానే రష్యన్ సేనలకు, తాలిబన్లకు మధ్య కాల్పులు మొదలైనాయి. ఒక రాయి చాటున ఆరు గంటలు భర్తతో నిశిరాత్రి బిక్కుబిక్కుమంటూ గడిపింది. తెల్లవారాక ఇంట్లో అడుగు పెట్టగానే ఇంకో బాంబు సిద్ధంగా ఉంది. జాన్‌బజ్‌కు అప్పటికే పెళ్లయింది. ఆమె పేరు గుల్‌గుట్టి. 72 మంది సభ్యుల ఉమ్మడి కుటుంబం. అయినా సవతితో, కుటుంబంతో సఖ్యంగా ఉండడానికే సుస్మిత అలవాటు పడింది. ఆమెను అక్కడే వదిలి జాన్‌బజ్ వ్యాపారం కోసం తిరిగి కోల్‌కతా చేరాడు. దాంతో అక్కడ సుస్మిత ఆగచాట్లు మొదలయినాయి. తాలిబన్ల ఆధిపత్యం ఉన్న ఆ ప్రాంతం లో స్త్రీలపై అనేక ఆంక్షలు ఉన్నాయి. ఆ ప్రాం తం నుంచి ఎంపికైన తొలి మహిళా ఎంపీని కూడా తాలిబన్లు కిడ్నాప్ చేశారు. వైద్యానికి కూడా స్త్రీలు నోచుకోవడం లేదు. దీనితో సయీదా కమల్ (సుస్మిత ఇస్లాంలోకి మారిన తరువాతి పేరు) తోటి స్త్రీల సాయంతో రహస్యంగా ఒక వైద్య కేంద్రాన్ని ఏర్పాటు చేసింది. ఈ సంగతి 1995 మేలో తాలిబన్లకు తెలిసి, సుస్మితపై దాడి చేసి తీవ్రంగా హింసించారు. దానితో ఆమె ఆఫ్ఘన్ విడిచిపోవాలని రెండుసార్లు ప్రయత్నించింది. మొదటిసారి సరిగ్గా ఇస్లామాబాద్ వచ్చి భారత దౌత్య కార్యాలయం గుమ్మం వరకు వచ్చాక భర్త వైపు బంధువులు పట్టుకుని తీసుకుపోయారు. ఇంట్లో అతిథులు వేచి ఉండే గదిలో పదిహేను మంది తాలిబన్లు తనను ఏ విధంగా విచారించినదీ,మరణ దండన (జూలై 22, 1995 ఉదయం పదిన్నరకు) విధిస్తూ తీర్పు చదివిన తీరు సుస్మిత ‘ఓ కాబూలీవాలా బెంగాలీ భార్య’లో చిత్రించారు. అయితే ఆ గ్రామ పెద్ద, సవతి, ఇంకొందరు బంధువుల సహకారంతో సుస్మిత ఇంటి గోడ బద్దలుకొట్టుకుని బయటపడి ఆగస్టు 12, 1995న కోల్‌కతాలో ఉన్న భర్త దగ్గరకు చేరుకుంది. పద్దెనిమిది సంవత్సరాలు అక్కడే ఉండిపోయింది. ఈ సమయంలోనే ఆమె రచయితగా మారింది. 1998 జనవరిలో వెలువడిన ‘ఓ కాబూలీవాలా భార్య’ బెంగాలీ రచన ఏడు లక్షల ప్రతులు, దాని ఆంగ్లానువాదం లక్ష ప్రతులు అమ్ముడుపోయాయి. దీని కొనసాగింపు ‘తాలిబన్, ఆఫ్ఘన్, నేను’ (2012) ఐదు లక్షల ప్రతులు అమ్ముడుపోయింది. ‘ఒక్క మాటా అబద్ధం కాదు’ ఈ ఏడాదే వెలువడింది. ‘ఓ కాబూలీవాలా భార్య’ ఆధారంగా బాలివుడ్ దర్శకుడు ఉజ్జ్వ ల్ చటర్జీ ‘ఎస్కేప్ ఫ్రం తాలిబన్’ (2003) పేరుతో మనీషా కొయిరాలా కథానాయికగా సినిమా నిర్మించారు. దాదాపు ఇరవై తూటాలతో ఛిద్రమైన సుస్మిత (49) మృతదేహం పటియా గ్రామ సమీపంలోనే ఉన్న పక్టికా ప్రాంత రాజధాని షారానాలో కనుగొన్నారు. ఆమె రచనలు, చేసిన సంఘ సేవ, బుర్ఖా సంప్రదాయాన్ని పాటించకపోవడం, ఆఖరికి భారతీయ స్త్రీ కావడం-వీటిలో ఏ కారణంతోనైనా దుండగు లు ఆమెను చంపి ఉండవచ్చునని పోలీసులు చెబుతున్నారు. అయితే ఈ హత్య తో తమకు సంబంధం లేదని తాలిబన్ల ప్రతినిధి వెల్లడించడం విశేషం. పద్దెనిమదేళ్ల తరువాత మళ్లీ ఆమె ఆఫ్ఘన్ ఎందుకు వెళ్లినట్టు? అక్కడి స్త్రీల స్థితిగతులను చిత్రించి, లోకానికి చూపడానికే. ఆ పనిలో ఆమె ప్రాణాలు కోల్పోయింది. - కల్హణ