ఈశాన్య భారతంలో కొత్త పొద్దు
ఈశాన్య భారతానికీ, ప్రధాన స్రవంతి భారతానికీ నడుమ కనిపించని ఒక గోడ ఉంది. దీనిని బలంగా ఉంచుతున్నది- సాయుధ దళాల ప్రత్యేక అధికారాల చట్టం (ఏఎఫ్‌ఎస్‌పీఏ). దీనిని ఎత్తివేయాలని కొన్ని దశాబ్దాలుగా ఈశాన్య వాసులు కోరుతున్నారు.
పదహారో లోక్‌సభ ఎన్నికలు ఈశాన్య భారతం భవిష్యత్తును తీర్చిదిద్దగలుగుతాయా? సిక్కింతో పాటు సెవెన్ సిస్టర్స్ ఓటర్లలో ఈసారి గణనీయమైన మార్పు కనిపిస్తున్నదని విశ్లేషకులు చెబుతున్నారు. 25 లోక్‌సభ స్థానాలు ఉన్న ఈశాన్య భారతంలో ఇప్పుడు జరుగుతున్న పోటీ చరిత్రలో ప్రత్యేకమైనది కూడా. ఈశాన్యం నిర్లక్ష్యానికి గురైన ప్రాంతమంటే ఎవరికీ సందేహం అక్కరలేదు. భౌగోళికంగా ఈశాన్య భారతం వాటా దేశ భూభాగంలో ఎనిమిది శాతం. అక్కడి జనాభా 2011 లెక్కల ప్రకారం దేశ జనాభాలో 3.1 శాతం. స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి ఇక్కడ ప్రధానంగా కాంగ్రెస్ రాజ్యమేలింది. తరువాత ప్రాంతీయ పార్టీలు గట్టి ప్రభావాన్ని కలిగి ఉన్నాయి.
బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్రమోడీ ఫిబ్రవరి మొదటి వారంలోనే ఇక్కడ ఎన్నికల ప్రచారం ప్రారంభించారు. మిగిలిన భారతదేశం మాదిరిగానే అక్కడ కూడా ఈసారి ‘మోడీ గాలి’ కనిపించడంతో పార్టీ దీనిని ఉపయోగించుకుంది. అటల్ బిహారీ వాజ్‌పేయి నాయకత్వంలో ఎన్డీయే ప్రభుత్వం ఏర్పడిన తరువాతే ఈశాన్యంలో ఆ పార్టీకి ఉనికి ఏర్పడింది. ఇందుకు కారణం ఎన్డీయే ‘లుక్ ఈస్ట్’విధానం, ఈశాన్య రాష్ట్రాల కోసం మంత్రిత్వ శాఖ ఏర్పాటు యోచన. గౌహతి మునిసిపల్ కార్పొరేషన్‌కు నిరుడు జరిగిన ఎన్నికలలో బీజేపీ ద్వితీయ స్థానం సాధించింది. అయితే అక్కడ కూడా బీజేపీ పట్టణ ఓటర్లకు పరిమితమైన సూచనలే ఎక్కువ. ఇప్పుడు మోడీ ప్రచార శైలి, కాంగ్రెస్ మీద సంధిస్తున్న విమర్శలు బాగా ఆకట్టుకుంటున్నాయి. 23 సంవత్సరాలుగా అసోం నుంచి రాజ్యసభకు ఎన్నికవుతూ డాక్టర్ మన్మోహన్‌సింగ్ ఈ ప్రాంతానికి ఏం చేశారని మోడీ ప్రశ్నించడం ఆకట్టుకుంటోంది.
ఆమ్ ఆద్మీ పార్టీ కూడా వారిని ఆకర్షిస్తున్నది. కాంగ్రెస్‌నూ, ఇతర స్థానిక పార్టీలనూ వదిలి ఈసారి ఈశాన్య భారత వాసులు ధోరణి మార్చుకునే పంథాలో ఉన్నారు. ఇందులో కొందరు ముస్లింలు కూడా ఉండడం పెద్ద పరిణామం. అసోం, మణిపూర్, త్రిపుర, అరుణాచల్‌ప్రదేశ్‌లలో మోడీ ప్రసంగించిన సభలకు విశేష స్పందన వచ్చింది. ప్రపంచంలో ఏ మూల నుంచి శరణార్థిగా వచ్చిన హిందువునైనా ఆదరిస్తామని మోడీ బంగ్లా హిందువులను ఉద్దేశించి పేర్కొని హిందుత్వ కార్డును ఉపయోగించుకున్నారు. 1962 నాటి చైనా దాడి సమయంలో అరుణాచల్ వాసులు ‘జైహింద్’ నినాదం ఇచ్చి వీరులు అనిపించుకున్నారని శ్లాఘించారు. ఈశాన్య ప్రాంత తేయాకు కార్మికులకు అనేక వరాలు ప్రకటించారు. ఢిల్లీలో ఈశాన్య భారత విద్యార్థి నిడో హత్యకు గురికావడం దారుణమని ప్రకటించి వారి మనసులను గెలిచే ప్రయత్నం చేశారు.
కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు, ఆ పార్టీ అప్రకటిత ప్రధాని అభ్యర్థి రాహుల్ గాంధీ ఒకింత ఆలస్యంగా ఇక్కడ ప్రచారం ప్రారంభించారు. మార్చి 18న ఆయన కూడా నాలుగు రాష్ట్రాలలో - మేఘాలయ, అరుణాచల్, మణిపూర్, మిజోరాం-లలో ప్రచా రం ప్రారంభించారు. ఈశాన్య భారతాన్ని ఢిల్లీతో అనుసంధా నం చేయాలన్న కాంగ్రెస్ కృషికి కొన్ని అభివృద్ధి నిరోధక శక్తులు అడ్డుపడుతున్నాయని ఆరోపించారు. ఈశాన్యంలో ఈ ఇద్దరితో పాటు ఇంతవరకు విస్తృతంగా ప్రచారంలో పాల్గొన్నవారిలో మమతా బెనర్జీ ఒకరు. అరుణాచల్ వరకు నిన్నటి తరం బాలీ వుడ్ హాస్య నటుడు గోవర్ధన్ అస్రానీ కాంగ్రెస్ తరఫున ప్రచారంలో కీలకంగా ఉన్నారు. ఇంతకు మించి హడావుడి లేదు.
ఈశాన్య భారతానికీ, ప్రధాన స్రవంతి భారతానికీ నడుమ కనిపించని ఒక గోడ ఉంది. దీనిని బలంగా ఉంచుతున్నది- సాయుధ దళాల ప్రత్యేక అధికారాల చట్టం (ఏఎఫ్‌ఎస్‌పీఏ). దీనిని ఎత్తివేయాలని కొన్ని దశాబ్దాలుగా ఈశాన్య వాసులు కోరుతున్నారు. సాయుధ దళాలకు విశేష అధికారాలను కట్టబెట్టే ఈ చట్టం రాజ్యాంగ బద్ధతను ఐక్యరాజ్య సమితి మానవ హక్కుల కమిషనర్ నవనీతం పిళ్లై ప్రశ్నించారు. ఈ చట్టాన్ని తొలగించవలసిన అవసరం ఉందని మార్చి 23, 2009లో ఐక్య రాజ్యసమితి కూడా భారత్‌కు సూచించింది.
మణిపూర్‌కు చెందిన మహిళ షర్మిల చాను ఈ చట్టాన్ని ఎత్తి వేయాలని కోరుతూ 2000 సంవత్సరం నుంచి నిరశన దీక్ష చేస్తున్నారు. కానీ బీజేపీ, కాంగ్రెస్ రెండూ ఈ అంశాన్ని ఎన్నికల ప్రచారంలో ప్రస్తావించడం లేదు. ఎన్డీయే కాలంలో ఈశాన్యంలో ఉగ్రవాదులతో చర్చల ప్రక్రియను ప్రారంభించారు. ఇప్పుడు కూడా ఎన్డీయే వైపు ఈశాన్య వాసులు మొగ్గుతున్న సూచనలు కనిపిస్తున్నాయి. పార్టీ, ప్రభుత్వం ఏదైనా, ఇప్పుడు అక్కడ వ్యక్తమవుతున్న ధోరణి జాతి ప్రయోజనాల దృష్ట్యా మంచి అవకాశం. ప్రత్యేక అధికారాల చట్టాన్ని తొలగించి ఆ ప్రాంత ప్రజలకు స్వేచ్ఛను ఇచ్చి ప్రధాన స్రవంతి జీవనంలోకి ఆహ్వానించేందుకు వచ్చిన అవకాశమిది. ఈ ఎన్నికలు అందుకు ఉపయోగపడితే ప్రజాస్వామ్యం ధన్యమైనట్టే. - కల్హణ