లక్నో: వారణాసిలో యువత మద్యం తాగి రోడ్డు మీద పడి ఉన్నారని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తీవ్రంగా మండిపడ్డారు. ప్రధాని మోదీ వారణాసి లోక్‌సభ నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన ఓ సభలో పాల్గొని మాట్లాడారు.
‘వాళ్లు నరేంద్ర మోదీని దశాబ్దాలుగా దూషిస్తున్నారు. కానీ ప్రస్తుతం వాళ్లు తమ అసహనాన్ని ప్రజల మీద చూపిస్తున్నారు. వాళ్లు కనీసం తెలివి లేకుండా ఉత్తరప్రదేశ్ యువతను మద్యం బానిసలు అంటూ నిందిస్తున్నారు. వారణాసి యువతపై రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నా’ అని ప్రధాని మోదీ అన్నారు.
రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో న్యాయ యాత్ర ఉత్తరప్రదేశ్‌లో కొనసాగుతున్న సమయంలో వారణాసిలో యువత మద్యం తాగి రోడ్డు మీద పడి ఉన్నారని వ్యాఖ్యానించారు. రాహుల్ వ్యాఖ్యలను ప్రధాని మోదీ తీవ్రంగా ఖండించారు.
‘ప్రస్తుతం ఉత్తర ప్రదేశ్ అభివృద్ధి చెందుతోంది. కాంగ్రెస్ కుటుంబానికి చెందిన యువరాజు(రాహుల్ గాంధీ) యూపీ యువతను మద్యం బానిసలు అన్నారు. ఇదేం భాష. ఇండియా కూటమి యూపీ యువతను అవమానించిన తీరును ఎవరూ మర్చిపోరు. వారసత్వంగా వచ్చి ఆ వ్యక్తి(రాహుల్ గాంధీ) దేశంలోని సామాన్య ప్రజలకు ప్రమాదకారి. తెలివిలేనివారు మాత్రమే నా వారణాసి యువతను మద్యం బానిసలు అని పిలుస్తారు.
...వాళ్లు కేవలం తమను పొగిడే వాళ్లనే ఇష్టపడతారు. రామ మందిరం ప్రారంభోత్సవం జరిగినప్పటి నుంచి యూపీ ప్రజలను ఇష్టపడటం లేదు. నాకు అస్సలు అర్థం కావటం లేదు.. కాంగ్రెస్ పార్టీ ఎందుకు రాముడిపై అంత ద్వేషం పెంచుకుంటుందో?. వాళ్లు తమ కుటుంబం, ఓటు బ్యాంకును తప్ప ఏమి చూడరు’అని ప్రధాని మోదీ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.
Comments
Please login to add a commentAdd a comment