
సీపీఎం ప్రధాన కార్యదర్శి ఎంపికకు రంగం సిద్ధం
మదురై(తమిళనాడు): దేశంలోనే అతిపెద్ద వామపక్ష పార్టీగా కొనసాగుతున్న సీపీఎం పార్టీకి నూతన ప్రధాన కార్యదర్శిని ఎన్నుకోనున్న నేపథ్యంలో ఆ పదవిలో ఎవరు కూర్చోబోతున్నారన్న చర్చ మొదలైంది. పార్టీ పగ్గాలు ప్రధానంగా ఎంఏ బేబీ, అశోక్ ధవాలేల్లో ఒకరికి దక్కే వీలుందని వార్తలు వినవస్తున్నాయి. ఎంఏ బేబీ గత 13 సంవత్సరాలుగా పార్టీ పాలిట్‌బ్యూరో సభ్యునిగా సేవలందిస్తున్నారు.
ఎంఏ బేబికి ముఖ్యంగా కేరళ రాష్ట్ర నాయకత్వం నుంచి దాదాపు సంపూర్ణ మద్దతు లభిస్తోంది. గ్రామీణ ప్రాంతాల్లో పార్టీని మరింత విస్తరించాలని పార్టీ అగ్రనాయకత్వం భావిస్తోంది. గ్రామీణ ప్రాంతాలకు సంబంధించి గత కొన్నేళ్లుగా రైతాంగ సమస్యలు దేశవ్యాప్తంగా పతాక శీర్షికలకెక్కాయి. ముఖ్యంగా పంటలకు కనీస మద్దతు ధర అంశంపై రైతు ఉద్యమం ఉధృతంగా కొనసాగిన నేపథ్యంలో ఆలిండియా కిసాన్ సభ(ఏఐకేఎస్) అధ్యక్షుడు అశోక్ ధవాలేను తమ పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఎన్నుకుంటే పార్టీ గ్రామీణ ప్రాంతాల్లో బలపడుతుందని ముఖ్యనేతలు భావిస్తున్నట్లు తెలుస్తోంది.
అధికార బీజేపీ విధానాలపై పోరాటంలో భాగంగా వామపక్ష పార్టీల మధ్య సఖ్యత సాధించే, లౌకిక, ప్రజాస్వామ్య శక్తులను ఏకతాటి మీదకు తెచ్చే బలమైన నేతను పార్టీ ప్రధాన కార్యదర్శి పీఠంపై కూర్చోబెట్టాలని పార్టీ ముఖ్యులు యోచిస్తున్నారు. ధవాలేకు పశ్చిమబెంగాల్ ప్రాంతం నుంచి బలమైన మద్దతు ఉంది. హిందీ మాట్లాడే రాష్ట్రాల్లో పార్టీని మరింత ముందుకు తీసుకెళ్లగల సత్తా ధవాలేకు ఉందని తెలుస్తోంది. బీజేపీకి వ్యతిరేకంగా తాజా లోక్‌సభ ఎన్నికల వేళ విపక్షాలు ‘ఇండియా’కూటమిగా ముందుకొచ్చి ఘోర వైఫల్యాన్ని చవిచూసిన నేపథ్యంలో మళ్లీ పార్టీల మధ్య సఖ్యత సాధించడంలో కాంగ్రెస్‌తో సత్సంబంధాలు కొనసాగించడంలో నిష్ణాతుడైన నేత కోసం పార్టీ వేట మొదలెట్టడం తెల్సిందే.
తెరమీదకు బీవీ రాఘవులు పేరు
తెలంగాణ రాష్ట్రం నుంచి అత్యంత సీనియర్ పోలిట్‌బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు సైతం ప్రధాన కార్యదర్శి రేసులో ఉన్నట్లు తెలుస్తోంది. పార్టీ ఫైర్‌బ్రాండ్ నాయకురాలు బృందా కారత్‌ను జనరల్ సెక్రటరీగా చూడాలని మరికొందరు నేతలు భావిస్తున్నారు. 75 ఏళ్లు దాటిన నేతను ప్రధాన కార్యదర్శిగా ఎన్నుకోకూడదనే నిబంధనను పార్టీ అమల్లోకి తెచ్చింది. అయితే అరుదైన, అత్యవసర పరిస్థితుల్లో ఈ నిబంధనను పక్కనబెట్టే వీలుందని తెలుస్తోంది. అగ్రనేతను ఎన్నుకునే క్రమంలో గతంలో కేరళ, పశ్చిమబెంగాల్ వర్గాల నుంచి గట్టి పోటీ ఎదురైంది.
1996లో పశ్చిమబెంగాల్ నుంచి జ్యోతిబసు ప్రధానమంత్రి పదవికి అర్హుడని భావించినవేళ కేరళ వామపక్ష వర్గం ఈ నిర్ణయాన్ని గట్టిగా వ్యతిరేకించింది. 2007లో మన్మోహన్ సింగ్ ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించుకునే విషయంలోనూ పార్టీలో ఈ రెండు వర్గాల మధ్య ఏకాభిప్రాయం సాధ్యపడలేదు. 2015లో సీతారాం ఏచూరిని ప్రధా న కార్యదర్శిగా ఎన్నుకుంటే ఆనాడు కేరళ ముఖ్యనేతలు ఎస్‌ఆర్ పిళ్లైకు మద్దతు పలికారు. తర్వాత ఆ నిర్ణయాన్ని మార్చుకున్నారు. పార్టీ 24వ మహాసభలు మదురైలో జరుగుతున్న తరుణంలో ఆదివా రం పార్టీ కేంద్ర కమిటీ తదుపరి పార్టీ ఎన్నికల కోసం అభ్యర్థుల పేర్లను ప్రకటించే వీలుంది.