కొత్త సీఎస్ టక్కర్
♦ నేడు పదవీ బాధ్యతల స్వీకరణ
♦ బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్‌గా ఐవైఆర్
♦ అర్చక, ఇతర ఉద్యోగుల సంక్షేమనిధి
♦ ట్రస్టు చైర్మన్‌గానూ నియామకం
సాక్షి, హైదరాబాద్: ఊహించినట్టే రాష్ట్ర ప్రభుత్వ నూతన ప్రధాన కార్యదర్శి(సీఎస్)గా సత్యప్రకాశ్ టక్కర్ నియమితులయ్యారు. 1981 ఐఏఎస్ బ్యాచ్‌కు చెందిన సీనియర్ అధికారి అయిన టక్కర్‌ను సీఎస్‌గా నియమిస్తూ సాధారణ పరిపాలన శాఖ(రాజకీయ) కార్యదర్శి శశిభూషణ్ కుమార్ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. టక్కర్ ప్రణాళికా శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తున్న విషయం తెలిసిందే.
ప్రస్తుత ప్రధాన కార్యదర్శి ఐ.వై.ఆర్. కృష్ణారావు ఈ నెలాఖరున పదవీ విరమణ చేయనున్నారు. ఆయన స్థానంలో టక్కర్ శనివారం సాయంత్రం సచివాలయంలో పదవీ బాధ్యతలు స్వీకరించనున్నారు. వచ్చే ఆగస్టు వరకు ఈ పదవిలో ఆయన కొనసాగుతారు. ఆగస్టు నెలాఖరుకు పదవీ విరమణ చేస్తారు. సీనియారిటీ ప్రకారం చూస్తే ఐవైఆర్ తరువాత 1980 ఐఏఎస్ బ్యాచ్‌కు చెందిన అశ్వనికుమార్ పరీడా సీఎస్ అవ్వాల్సి ఉంది.
అయితే బాక్సైట్ వ్యవహారంలో ప్రభుత్వంలోని ‘ముఖ్య’ నేతకు పరీడా అనుసరించిన వైఖరి నచ్చలేదు. దీనికితోడు సీఎం పదవి చేపట్టినప్పటినుంచి చంద్రబాబు చెబుతూ వస్తున్న గ్రిడ్లు, మిషన్లు, డబుల్ డిజిట్ గ్రోత్లపై టక్కర్ తొలినుంచీ ప్రెజెంటేషన్లను రూపొందించి ఆయనకు అందజేస్తున్నారు. ఈ నేపథ్యంలో సీఎస్ పదవికి టక్కర్వైపే చంద్రబాబు మొగ్గుచూపారు.
ఐవైఆర్ సేవలకు గుర్తుగా...
మరోవైపు నెలాఖరుకు సీఎస్‌గా పదవీ విరమణ చేయనున్న ఐ.వై.ఆర్. కృష్ణారావును బ్రాహ్మణ సంక్షేమ కార్పొరేషన్ చైర్మన్‌గా ప్రభుత్వం నియమించింది. అలాగే రాష్ట్ర దేవాదాయశాఖ అర్చక, ఇతర ఉద్యోగుల సంక్షేమనిధి ట్రస్టు చైర్మన్‌గానూ నియమించింది. ఈ మేరకు దేవాదాయ శాఖ ముఖ్యకార్యదర్శి జె.ఎస్.వి.ప్రసాద్ శుక్రవారం రెండు జీవోలు జారీ చేశారు.
బాధ్యతలు స్వీకరించిన తేదీ నుంచి ఐవైఆర్ మూడేళ్లపాటు పదవిలో కొనసాగుతారు. చైర్మన్ హోదాలో ఐవైఆర్‌కు నెలసరి అలవెన్సులు, సిబ్బంది సంఖ్యను కూడా ఖరారు చేస్తూ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. బ్రాహ్మణ సంక్షేమ కార్పొరేషన్‌ను ఏర్పాటు చేయించడంలో సీఎస్ హోదాలో కృష్ణారావు కృషి చేశారు. ఈ నేపథ్యంలో ఆయన్నే కార్పొరేషన్ చైర్మన్‌గా ప్రభుత్వం నియమించింది.