‘బెంగాలీ భార్య’ విషాదం
రవీంద్ర కవీంద్రుడి కాబూలీవాలా కథలో కనిపించే కాబూలీవాలా లాగే జాన్‌బజ్ కోల్‌కతాలో వడ్డీ వ్యాపారమే చేసేవాడు. కానీ కథలో కాబూలీవాలా అంతటి ఉన్నతుడు కాదు. ‘ఒక్క మాటా అబద్ధం కాదు’... ఆఫ్ఘనిస్థాన్‌లోని పరిస్థితులును వర్ణిస్తూ బెంగాలీ వనిత సుస్మితా బెనర్జీ రాసిన మూడు పుస్తకాలలో ఇది చివరిది. ఆమె మాటలు అక్షర సత్యాలని రుజువు చేస్తూ తాలిబన్లు ఈ నెల నాలుగు(లేదా ఐదో తేదీ వేకువ)న ఆఫ్ఘనిస్థాన్‌లోని మారుమూల పక్‌టికా ప్రాంతంలో, ఇంటి నుంచి తీసుకుపోయి కాల్చిచంపారు. ‘ఓ కాబూలీవాలా బెంగాలీ భార్య’, ‘తాలిబన్- అప్ఘన్-నేను’, ‘ఒక్క మాటా అబద్ధం కాదు’- ఈ మూడు పుస్తకాలు ఆఫ్ఘన్‌లో తాలిబన్లు రాజ్యం పక్‌టికా ప్రాంతంలో సుస్మిత అనుభవించిన విషాద జ్ఞాపకాలకు అక్షరరూపాలే. కోల్‌కతాలో పుట్టిన సుస్మిత ఆఫ్ఘనిస్థాన్‌కు చెందిన కాబూలీవాలా ప్రేమలో పడి వివాహం చేసుకోవడం, ఆఫ్ఘన్ కోడలిగా వెళ్లడం, సంఘర్షణ, దారుణ హత్యకు గురికావడం సినిమా కథను తలపిస్తాయి.
చిత్రంగా, ఒక నాటకం దగ్గర సుస్మిత ప్రేమఘట్టానికి తెర లేచింది. కాబూలీవాలా తెగకు చెందిన జాన్‌బజ్ ఖాన్, సుస్మిత రిహా ర్సల్స్ దగ్గర మొదటిసారి చూసుకుని ఇష్టపడ్డారు. వారి వివాహం జూలై 2, 1988న కోల్‌కతాలోనే గుట్టుగా జరిగింది. ఈ పెళ్లిని సుస్మిత తల్లిదండ్రులు తీవ్రంగా వ్యతిరేకిం చారు. విడాకులు ఇప్పించడానికి ప్రయత్నాలు జరిగాయి. అప్పుడే సుస్మితను తీసుకుని జాన్‌బజ్ అప్ఘాన్ (స్వగ్రామం పటియా) వెళ్లాడు. రవీంద్ర కవీంద్రుడి కాబూలీవాలా కథలో కనిపించే కాబూలీవాలాలాగే జాన్‌బజ్ కోల్‌కతాలో వడ్డీ వ్యాపారమే చేసేవాడు. కానీ కథలో కాబూలీవాలా అంతటి ఉన్నతుడు కాదు. ఆ సంగతి సుస్మితకు అత్తింట అనుభవానికి వచ్చింది. ఆమె అత్తవారింట గుమ్మం లో అడుగుపెడుతుండగానే రష్యన్ సేనలకు, తాలిబన్లకు మధ్య కాల్పులు మొదలైనాయి. ఒక రాయి చాటున ఆరు గంటలు భర్తతో నిశిరాత్రి బిక్కుబిక్కుమంటూ గడిపింది. తెల్లవారాక ఇంట్లో అడుగు పెట్టగానే ఇంకో బాంబు సిద్ధంగా ఉంది. జాన్‌బజ్‌కు అప్పటికే పెళ్లయింది. ఆమె పేరు గుల్‌గుట్టి. 72 మంది సభ్యుల ఉమ్మడి కుటుంబం. అయినా సవతితో, కుటుంబంతో సఖ్యంగా ఉండడానికే సుస్మిత అలవాటు పడింది. ఆమెను అక్కడే వదిలి జాన్‌బజ్ వ్యాపారం కోసం తిరిగి కోల్‌కతా చేరాడు.
దాంతో అక్కడ సుస్మిత ఆగచాట్లు మొదలయినాయి. తాలిబన్ల ఆధిపత్యం ఉన్న ఆ ప్రాంతం లో స్త్రీలపై అనేక ఆంక్షలు ఉన్నాయి. ఆ ప్రాం తం నుంచి ఎంపికైన తొలి మహిళా ఎంపీని కూడా తాలిబన్లు కిడ్నాప్ చేశారు. వైద్యానికి కూడా స్త్రీలు నోచుకోవడం లేదు. దీనితో సయీదా కమల్ (సుస్మిత ఇస్లాంలోకి మారిన తరువాతి పేరు) తోటి స్త్రీల సాయంతో రహస్యంగా ఒక వైద్య కేంద్రాన్ని ఏర్పాటు చేసింది. ఈ సంగతి 1995 మేలో తాలిబన్లకు తెలిసి, సుస్మితపై దాడి చేసి తీవ్రంగా హింసించారు. దానితో ఆమె ఆఫ్ఘన్ విడిచిపోవాలని రెండుసార్లు ప్రయత్నించింది. మొదటిసారి సరిగ్గా ఇస్లామాబాద్ వచ్చి భారత దౌత్య కార్యాలయం గుమ్మం వరకు వచ్చాక భర్త వైపు బంధువులు పట్టుకుని తీసుకుపోయారు.
ఇంట్లో అతిథులు వేచి ఉండే గదిలో పదిహేను మంది తాలిబన్లు తనను ఏ విధంగా విచారించినదీ,మరణ దండన (జూలై 22, 1995 ఉదయం పదిన్నరకు) విధిస్తూ తీర్పు చదివిన తీరు సుస్మిత ‘ఓ కాబూలీవాలా బెంగాలీ భార్య’లో చిత్రించారు. అయితే ఆ గ్రామ పెద్ద, సవతి, ఇంకొందరు బంధువుల సహకారంతో సుస్మిత ఇంటి గోడ బద్దలుకొట్టుకుని బయటపడి ఆగస్టు 12, 1995న కోల్‌కతాలో ఉన్న భర్త దగ్గరకు చేరుకుంది. పద్దెనిమిది సంవత్సరాలు అక్కడే ఉండిపోయింది. ఈ సమయంలోనే ఆమె రచయితగా మారింది. 1998 జనవరిలో వెలువడిన ‘ఓ కాబూలీవాలా భార్య’ బెంగాలీ రచన ఏడు లక్షల ప్రతులు, దాని ఆంగ్లానువాదం లక్ష ప్రతులు అమ్ముడుపోయాయి. దీని కొనసాగింపు ‘తాలిబన్, ఆఫ్ఘన్, నేను’ (2012) ఐదు లక్షల ప్రతులు అమ్ముడుపోయింది. ‘ఒక్క మాటా అబద్ధం కాదు’ ఈ ఏడాదే వెలువడింది. ‘ఓ కాబూలీవాలా భార్య’ ఆధారంగా బాలివుడ్ దర్శకుడు ఉజ్జ్వ ల్ చటర్జీ ‘ఎస్కేప్ ఫ్రం తాలిబన్’ (2003) పేరుతో మనీషా కొయిరాలా కథానాయికగా సినిమా నిర్మించారు.
దాదాపు ఇరవై తూటాలతో ఛిద్రమైన సుస్మిత (49) మృతదేహం పటియా గ్రామ సమీపంలోనే ఉన్న పక్‌టికా ప్రాంత రాజధాని షారానాలో కనుగొన్నారు. ఆమె రచనలు, చేసిన సంఘ సేవ, బుర్ఖా సంప్రదాయాన్ని పాటించకపోవడం, ఆఖరికి భారతీయ స్త్రీ కావడం-వీటిలో ఏ కారణంతోనైనా దుండగు లు ఆమెను చంపి ఉండవచ్చునని పోలీసులు చెబుతున్నారు. అయితే ఈ హత్య తో తమకు సంబంధం లేదని తాలిబన్ల ప్రతినిధి వెల్లడించడం విశేషం. పద్దెనిమదేళ్ల తరువాత మళ్లీ ఆమె ఆఫ్ఘన్ ఎందుకు వెళ్లినట్టు? అక్కడి స్త్రీల స్థితిగతులను చిత్రించి, లోకానికి చూపడానికే. ఆ పనిలో ఆమె ప్రాణాలు కోల్పోయింది.
- కల్హణ