విశ్వాన్ని కుదిపిన విదూషకుడి ఆత్మహత్య
నటుడు పండించే హాస్యరసానికి పరాకాష్ట, ప్రేక్షకుడి కంటి కొన మీద విరిసే ఓ కన్నీటి చుక్క అంటారు లాక్షణికులు. దానికి తిరుగులేని నమూనా రాబిన్. షికాగోలో పుట్టిన రాబిన్‌కు చిన్నతనం నుంచి రంగస్థల కళలంటే ఆసక్తి.
‘అతడు మనందరినీ నవ్వించాడు. కన్నీళ్లూ పెట్టించాడు.’ అంటూ విచారం ప్రకటించాడు అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా, రాబిన్ విలియమ్స్(జూలై 21, 1951-ఆగస్ట్ 11, 2014) మరణవార్త విని. ఉల్కాపాతం వంటి మేధో పరమైన హాస్యాన్ని చిందించిన ఆ హాలీవుడ్ దిగ్గజం కూలిపోయింది. ఈ సంగతి తెలిశాక శ్వేతసౌధం మౌనం వహించడం సాధ్యం కాకుండా ముందే చేశాడు రాబిన్. ఎందుకంటే, ‘వ్యంగ్యం చచ్చిపోయిందని ప్రజలంతా అంటూ ఉంటారు. కానీ ఆ మాట అబద్ధం. వ్యంగ్యం జీవించి ఉండడమే కాదు, శ్వేత సౌధంలో మనుగడ సాగిస్తోంది’ అంటూ ఒక సందర్భంలో నిశితమైన చెణుకు విసిరాడతడు. నిజమే, ఓ చానల్ చెప్పి నట్టు రాబిన్ అమెరికన్లకి నవ్వడం నేర్పాడు. లోకానికి నవ్వు ను కానుకగా ఇచ్చి, ఆత్మహత్యతో దాన్ని విడిచి పెట్టి వెళ్లిపోయాడు.
నటుడు పండించే హాస్యరసానికి పరాకాష్ట, ప్రేక్షకుడి కంటి కొన మీద విరిసే ఓ కన్నీటి చుక్క అంటారు లాక్షణికు లు. దానికి తిరుగులేని నమూనా రాబిన్. షికాగోలో పుట్టిన రాబిన్‌కు చిన్నతనం నుంచి రంగస్థల కళలంటే ఆసక్తి. తరు వాత వేదికల మీద హాస్య, వ్యంగ్య ప్రదర్శనలు ఇచ్చే వృత్తిని చేపట్టాడు. ‘నేను నటుడిని కావాలని అనుకుంటున్నాను’ అని తండ్రితో చెబితే, ‘మంచిది, దానితో పాటు ఎప్పుడైనా పనికొస్తుంది, వెల్డింగ్ వంటి వృత్తి కూడా ఒకటి నేర్చుకో!’ మని ఆయన సలహా ఇచ్చాడట. కానీ రాబిన్ వెనక్కి తిరిగి చూసుకోలేదు. ఆ ‘స్టాండ్ అప్ కమేడియన్’ ఆస్కార్ వేదిక మీద ఉత్తమ సహాయ నటుడు పురస్కారం అందుకునేవరకు ప్రయాణం ఆపలేదు.
‘మోర్క్ అండ్ మిండీ’ అనే మొదటి టీవీ షోతోనే రాబిన్ ప్రపంచ ప్రేక్షకుల మనసులు దోచుకున్నాడు. హాలీవుడ్ అక్కున చేర్చుకుంది. పాపయ్, ది వరల్డ్ అకార్డింగ్ టు గార్ప్, గుడ్ మార్నింగ్, వియత్నాం, డెట్ పొయెట్స్ సొసైటీ, అవేకెనింగ్స్, గుడ్‌విల్ హంటింగ్ (ఇందులో నటించిన మా నసిక విశ్లేషకుడికి పాత్రకే ఆస్కార్ లభించింది), ది ఫిషర్ కింగ్, హుక్, అలాదీన్, మిసెస్ డౌట్‌ఫైర్ (కమల్ హసన్ నటించిన ‘భామనే సత్యభామనే’కు మాతృక), జుమాంజీ, ది బర్డ్ కేజ్, నైట్ ఎట్ ది మ్యూజియం వంటి అపురూప చిత్రాలలో రాబిన్ నటించారు.
‘హాస్యగాడు బావిలో పడినట్టు’ అని సామెత. అతడు ఆత్మహత్య చేసుకోవడానికి బావిలో పడినా, అదీ లోకానికి నవ్వులాటే. మూడు వారాలుగా ఇంటికే పరిమితమైన రాబిన్ నిజానికి వీధిలోకి వచ్చి ఉంటే ఇలాంటి పరిస్థితినే ఎదుర్కొనేవాడు. అతడు తీవ్రమైన మానసిక ఒత్తిడికి గురై ఉన్నాడు. కొన్ని వారాలుగా పార్కిన్‌సన్స్ పెయిన్స్‌కు వైద్యం చేయించుకుంటున్నాడు. ప్రపంచానికి ఇంత హాస్యాన్ని పంచిన రాబిన్ వ్యక్తిగత జీవితంలో కొంత చేదు లేకపోలేదు. ఒకనాడు అతడు మత్తుమందులకు బానిస. నటన మీద అభి మానం ఆ వ్యసనం నుంచి అతడిని బయటపడేసింది. చివ రికి రోగాన పడ్డాడు. కలం పట్టడం జీవితంలో ఇక సాధ్యం కాదు అన్న సంగతి తెలిశాకే ప్రఖ్యాత రచయిత ఎర్నెస్ట్ మి ల్లర్ హెమింగ్వే ఆత్మహత్య చేసుకున్నాడని అంటారు. చేతుల నరాలు కోసుకుని, ఉరి వేసుకున్న రాబిన్ జీవితం కూడా ఆ పంథాలోనే ముగిసిందా? ‘గుర్తుంచుకో! తాత్కాలిక సమస్య కి ఆత్మహత్య శాశ్వత పరిష్కారం’ అని 2009లో తీసిన ఒక వీడియోలో తను చెప్పిన మాటనే ఇప్పుడు రాబిన్ ఆచరించా డా? ఇది ప్రపంచాన్ని కుదిపిన విదూషకుడి ఆత్మహత్య.
నిజానికి అమోఘమైన సృజనాత్మక ప్రతిభ ఉన్న ఎం దరో సినీ నటులు ఆత్మహత్యను ఆశ్రయించడం పెద్ద విషా దం. మార్లిన్ మన్రో, ఫ్రెడ్డీ ప్రింజ్, స్పాల్డింగ్ గ్రే (హాస్యన టులు), హ్యూ ఓ కానర్, డయానా బెరీమోర్, ల్యూప్ వెలేజ్ ఇలా ఆత్మహత్యలు చేసుకున్న హాలీవుడ్ నటీనటులే. ఆ స్కార్ పురస్కారం కోసం గుమ్మం వరకు వెళ్లిన మహా ప్రతి భావంతులు కూడా ఆత్మహత్యలు చేసుకోవడం మరీ వింత. రిచర్డ్ ఫ్రాన్స్‌వర్త్, గిన్ యంగ్, చార్లెస్ బోయర్ అలాంటి వారే. డెరైక్టర్ కుర్చీలోనే కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్న గురుదత్, చేదు తప్ప జీవిత మాధుర్యం భ్రమ అనే ప్రగాఢ విశ్వాసంతో ఆత్మహత్యకు పాల్పడిన దివ్యభారతి, సిల్క్ స్మిత, జియాఖాన్, ఉదయ్‌కిరణ్ వంటివారు ఈ సంద ర్భంలో గుర్తుకు రాకుండా ఉండరు. ఇలా ఇంకా ఎందరో! వారందరి ఆత్మలకు శాంతి కలగాలని ఆశిద్దాం.
కల్హణ