నవ్వుల పాలైన నాలుగేళ్ల డిగ్రీ | shameless in four years degree method | Sakshi
Sakshi News home page

నవ్వుల పాలైన నాలుగేళ్ల డిగ్రీ

Published Tue, Jul 1 2014 12:56 AM | Last Updated on Tue, Oct 2 2018 7:58 PM

నవ్వుల పాలైన నాలుగేళ్ల డిగ్రీ - Sakshi

నవ్వుల పాలైన నాలుగేళ్ల డిగ్రీ

1943 సంవత్సరం నుంచి మూడేళ్ల డిగ్రీ విధానమే కొనసాగుతోంది. ఈ కోర్సును నాలుగేళ్లకు పెంచి ‘బ్రిటిష్ మోడల్’ తీసుకురావాలని 2013 విద్యా సంవత్సరంలోనే వీసీ దినేశ్‌సింగ్ తలపెట్టారు. డిగ్రీ కోర్సును నాలుగు సంవత్సరాల కోర్సుగా ‘సంస్కరించడానికి’ జరిగిన తొలి ప్రయత్నం ఇదే.
 
‘స్పర్ధయా వర్థతే విద్య’ అంటారు. పోటీతో విద్య వర్ధిల్లుతుందన్న ఆ నానుడి సదా సంస్కృత శ్లోకాలతో, స్వాతంత్య్రోద్యమ ఘట్టాలతో తన ఉపన్యాసాలని అలంకరించే ఢిల్లీ యూనివర్సిటీ (డీయూ) వైస్ చాన్సలర్ (వీసీ) దినేశ్‌సింగ్ తెలిసే ఉండాలి. కానీ ఆయన ఏం అర్థం చేసుకున్నారో గానీ, దేశంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన జేఎన్‌యూను అధికార రాజకీయాల పోటా పోటీ వేదికగా మార్చడానికి దోహదపడ్డారనే అనిపిస్తుంది. ఆ విశ్వ విద్యాలయం పరిధిలో ఉన్న మూడేళ్ల వ్యవధి కలిగిన అన్ని డిగ్రీ కోర్సులను నాలుగేళ్ల కోర్సులుగా మార్చాలన్న నిర్ణయం నవ్వుల పాలయింది. విద్యార్థులు చదువులలో పోటీ పడే అవకాశమే లేకుండా, ప్రవేశాలకు ఈ అంశం పెద్ద అంతరాయంగా మారిపోయింది.

దేశంలో 1943 సంవత్సరం నుంచి మూడేళ్ల డిగ్రీ విధాన మే కొనసాగుతోంది. ఈ కోర్సును నాలుగేళ్లకు పెంచి ‘బ్రిటిష్ మోడల్’ తీసుకురావాలని 2013 విద్యా సంవత్సరంలోనే వీసీ దినేశ్‌సింగ్ తలపెట్టారు. డిగ్రీ కోర్సును నాలుగు సంవత్సరాల కోర్సుగా ‘సంస్కరించడానికి’ దేశం మొత్తం మీద జరిగిన తొలి ప్రయత్నం ఇదే. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న నాలుగేళ్ల డిగ్రీ కోర్సుకు సమాంతరంగా ఇక్కడ కూడా నాలుగేళ్ల పరిధిలోకి డిగ్రీ కోర్సులను తీసుకురావాలన్నది దీని వెనుక ఉన్న ఉద్దేశం. అప్పుడు మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రిగా పని చేసిన సిబల్ సలహాతో దినేశ్‌సింగ్ ఈ ‘సంస్కరణ’కు శ్రీకారం చుట్టా రు. నిరుడు జరిగిన ప్రవేశాలు ఆ ప్రాతిపదికనే జరిగాయి. అప్ప టి నుంచి దీని మీద వివాదం సాగుతూనే ఉంది. కానీ ప్రభుత్వం మారిపోవడంతో డీయూకు ఇక్కట్లు ముదిరాయి.
నిజానికి డిగ్రీ కాల పరిధిని నాలుగేళ్లు చేయడం మీద విశ్వ విద్యాలయ ప్రాంగణంలోనే ఏకాభిప్రాయం లేదు. ఇది 60,000 మంది విద్యార్థుల భవిష్యత్తుకు సంబంధించిన విషయం. బీజేపీ, ఆమ్ ఆద్మీ నాలుగేళ్ల వ్యవధికి వ్యతిరేకం. తాము అధికారానికి వస్తే నాలుగేళ్ల కోర్సును మూడేళ్ల కోర్సుగా మార్చడం తథ్యమని బీజేపీ ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల వేళ ప్రకటించింది కూడా. డీయూ పరిధిలో ఉన్న 64 కళాశాలల మధ్య కూడా ఈ అంశం మీద ఏకాభిప్రాయం లేదు. అయితే జూన్ 24న నాలుగేళ్ల కోర్సును మూడేళ్ల కోర్సుగా మార్చవలసిందని యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ ఆదేశాలు జారీ చేసింది. ఇలా మార్చడం విద్యా విధానానికే విరుద్ధమని యూజీసీ వాదించింది. అయితే ఢిల్లీ విశ్వవిద్యాలయం అధ్యాపక సంఘం నాలుగేళ్ల కోర్సుకు అనుకూలం. ఎంతో పటిష్టంగా ఉండే ఢిల్లీ విశ్వ విద్యాలయం అధ్యాపకుల సంఘం (డ్యూటా) యూజీసీ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తోంది.  ఈ విషయం మీద పూర్తి స్పష్టత వచ్చే వరకు కొత్త ప్రవేశాలు నిలిపివేయాలనే డ్యూటా ప్రస్తుత అధ్యక్షురాలు నందితా నారాయణ్ కోరుతున్నారు. యూజీసీ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ విశ్వ విద్యాలయం అధ్యాపకులు పార్లమెంటు భవనం వరకు నిరసన ప్రదర్శన నిర్వహించారు. ఖాళీగా ఉన్న నాలుగు వేల అధ్యాపక ఉద్యోగాలను భర్తీ చేయకుండా, ఇలాంటి నిర్ణయాలతో ప్రభుత్వం విశ్వవిద్యా లయం స్వయం ప్రతిపత్తిని భగ్నం చేయడానికి ప్రయత్నిస్తున్న దని  డ్యూటా ఆరోపిస్తున్నది.  54,000 సీట్ల భర్తీకి ఇప్పటికే 2,70,000 దరఖాస్తులు పెట్టుకున్న విద్యార్థులు ఈ పరిణామాలతో దిక్కుతోచని పరిస్థితిలో పడ్డారు.

నాలుగేళ్ల డిగ్రీ కోర్సును తిరిగి మూడేళ్లకు తగ్గించాలని యూజీసీ ఇచ్చిన ఆదేశాల మీద డ్యూటా మాజీ అధ్యక్షుడు ఆదిత్య నారాయణ్ మిశ్రా ఢిల్లీ సుప్రీం కోర్టులో సవాలు చేశారు. అయితే కోర్టు కలుగ చేసుకోవడానికి అంగీకరించలేదు. కాగా, ఈ అంశం యూజీసీకీ, విశ్వ విద్యాలయానికి మధ్య వివాదమని, తనకు సంబంధం లేదని మానవ వనరుల మంత్రి స్మృతీ ఇరానీ ఇప్పటికే ప్రకటించారు. అయితే ఎప్పుడూ నాలుగేళ్ల వ్యవధి కోర్సుగానే ఉన్న బీటెక్, బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ కోర్సుల విద్యార్థులు తమ భవిష్యత్తు గురించి తీవ్ర ఆందోళన చెందుతున్నారు. వీరి కోర్సు వ్యవధిని మూడేళ్లు చేస్తే రాబోయే పరిణా మాలు తీవ్రంగానే ఉంటాయి.

అధ్యాపకులు, కేంద్రం లేదా యూజీసీ, విద్యార్థులు ఎవరి దారి వారిది అన్న రీతిలో ఈ అంశం మీద తమ తమ వైఖరిని కనబరుస్తున్నారు. యూజీసీ ఆదేశాలు రాగానే వీసీ దినేశ్ సింగ్ వెంటనే వాటిని శిరసావహిస్తున్నట్టు ప్రకటించారు. డీయూ పరిధిలోని 64 కళాశాలల్లో 57 వరకు మూడేళ్ల డిగ్రీని తిరిగి ప్రవేశపెట్టడానికి ఆమోదం తెలియచేశాయని యూజీసీ వెంటనే ప్రకటించడం విశేషం. బీజేపీ, దాని విద్యార్థి విభాగం ఏబీవీపీ, ఆప్ యూజీసీ నిర్ణయాన్ని స్వాగతించగా, కాంగ్రెస్ తొందరపా టు చర్యగా భావిస్తోంది. ఇవన్నీ చూస్తే ఒక పెద్ద విద్యా పీఠాన్ని మన రాజకీయులు నవ్వుల పాలు చేశారని చెప్పక తప్పదు.

- కల్హణ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement