పరిశుభ్ర గంగావతరణమెప్పుడో!
ఇప్పుడు మోడీ ఈ అంశాన్ని చేపడతానని ఘంటాపథంగా చెబుతున్నారు. ఆయన ఎంత తొందరగా చర్యలు చేపడితే భారత పర్యావర ణానికి అంత మంచిది. గంగా క్షాళనం కోసం దేశం మొత్తం ఎదురు చూస్తోంది.
‘గంగామాత పిలుపుతోనే ఇక్కడికి వచ్చాను’ అని ప్రధాని నరేంద్రమోడీ ఎన్నికల ప్రచారంలో ఉద్విగ్నంగా చెప్పుకు న్నారు. వారణాసి ఓటర్లు ఆయనను ఘన విజయంతో అభిషేకించారు కూడా. గంగ క్షాళనకు కంకణం కట్టుకున్నట్టు ప్రధాని పార్లమెంటులో ప్రకటించారు. 26 సంవత్సరాలుగా గంగ క్షాళనకు కృషి జరుగుతోంది. ఇంతవరకు వేల కోట్లు ఖర్చు చేశారు. ప్రపంచ బ్యాంకు నిధులు, జలశుద్ధి సాంకేతిక పరిజ్ఞానంలో ఎంతో ఖ్యాతి పొందిన ఇజ్రాయెల్ సాంకేతిక పరిజ్ఞానం అందించడానికి కూడా అంగీకరించింది. అయినా పవిత్ర గంగావతరణం జరగడంలేదు.
పదకొండు రాష్ట్రాల గుండా పారే గంగ, దేశంలో 40 శాతం ప్రజలకు (500 మిలియన్‌లు) జీవనాధారం. గంగా పరీవాహక ప్రాంతమే నాలుగు లక్షల చదరపు మైళ్లు. లక్ష, ఆపై జనాభా ఉన్న 29 పట్టణాలు, యాభయ్‌వేలు-లక్ష మధ్య జనాభా కలిగిన 23 పట్టణాలు, ఇంకో 48 చిన్న చిన్న పట్టణాలను తాకుతూ 2,525 కిలోమీటర్ల మేర ప్రవహి స్తోంది. దీనితో పెద్ద మురికికూపంగా అవతరించడానికి కావలసిన అన్ని ప్రమాదాలు సంక్రమించాయి. రోజుకు 8 ల క్షల గ్యాలన్ల మలినాలు చేరుతున్నాయని నిపుణులు చెబుతు న్నారు. గృహావసరాలు, పరిశ్రమల వ్యర్థాలు, స్మశానాల మలినాల వల్ల గంగ కలుషితమవుతున్నదని జల కాలుష్య అధ్యయనాల నిపుణుడు, ఆచార్య బీడీ త్రిపాఠి(బీహెచ్‌యు) చెప్పారు. ప్రస్తుతం చేరుతున్న మలినాలు 20 ఏళ్ల క్రితం కంటే రెట్టింపు ఉన్నాయి. వచ్చే ఇరవై ఏళ్లలో ఇంకో రెట్టింపు కావచ్చునని అంచనా. పశు కళేబరాలు, అవాంఛనీయ శిశు వుల మృతదేహాలు, చాకిరేవులు నదికి పెద్ద బెడద. నిజానికి రసాయనాలతో చేసిన పదార్థాలే, పశు- మానవ కళేబరాల కంటే ప్రమాదకరమని సెంట్రల్ గంగా అథారిటీ తొలి సంచా లకుడు కేసీ శివరామకృష్ణన్ హెచ్చరించారు. కళేబరాలను నదిలో పెరిగే ఒక జాతి తాబేళ్లు తినగలవు. రసాయనాల నుంచి నదిని కాపాడే శక్తి ఏదీ లేదు.
గంగ ప్రయోజనం మత విశ్వాసాలకు పరిమితం కాదు. భవిష్యత్తులో గంగ, దాని ఉపనదుల మీద 300 డ్యామ్‌లు నిర్మించాలని ప్రభుత్వం యోచిస్తున్నది. గంగ పరిరక్షణో ద్యమం పేరుతో అటు ఆధ్యాత్మికవాదులు, పర్యావరణవే త్తలు పాతిక ముప్పయ్ సంవత్సరాలుగా ఉద్యమిస్తున్నారు. అందరి కృషి ఆహ్వానించదగినదే. కేంద్ర ప్రభుత్వ పరంగా 1986, ఏప్రిల్‌లో రాజీవ్ గాంధీ ప్రధానిగా ఉండగా గంగా కార్యాచరణ ప్రణాళికను ప్రారంభించారు. 190 మిలియన్ డాలర్లు ఖర్చు చేసినా నది కాలుష్యం స్థాయిని తగ్గించలేకపో యారు. దీనితో మార్చి 31, 2000 సంవత్సరంలో ఈ కార్య క్రమాన్ని రద్దు చేశారు. ఈ పథకం శుద్ధ దండగ అని శాస్త్రవే త్తలు, ప్రభుత్వేతర సంస్థలు ప్రకటించాయి. సుందర్‌లాల్ బహుగుణ, సుశీలానాయర్, కాంచనలతా సబర్వాల్ వంటి వారు ఈ ఉద్యమంలో భాగస్వాములయ్యారు. ఉత్తరాఖండ్ లోని హరిద్వార్‌లో గంగ ఒడ్డున జరుగుతున్న అక్రమ గనుల తవ్వకానికి వ్యతిరేకంగా స్వామి నిగమానంద సరస్వతి అనే సాధువు ఆమరణ దీక్ష చేసి, చనిపోయారు. దీనితో హరిద్వార్ జిల్లాలో అక్రమ గనుల తవ్వకాన్ని నిషేధించారు. ప్రముఖ పర్యావరణవేత్త డాక్టర్ జీడీ అగర్వాల్ గంగ ప్రక్షాళన కోరుతూ దీర్ఘకాలం నిరాహార దీక్ష చేశారు. అన్నా హజారే చెప్పడంతో నాటి ప్రధాని మన్మోహన్‌సింగ్ డాక్టర్ అగర్వాల్ డిమాండ్లను నెరవేర్చడానికి అంగీకరించారు. 2012లో గంగా ముక్తి సంగ్రామ్ సమితి ఆధ్వర్యంలో పెద్ద ర్యాలీ జరిగింది. అలహాబాద్ నుంచి ఢిల్లీ వరకు సాగిన ఈ ర్యాలీలో ప్రముఖ మఠాధిపతులు, సాధుసంతులు పాల్గొ న్నారు. గంగ రక్షణకు దేశం ఇంత తాపత్రయ పడుతోంది. గంగా క్షాళనం అంటే దేశం ఎదురు చూస్తున్న సత్కార్యం.
ఇప్పుడు మోడీ ఈ అంశాన్ని చేపడతానని ఘంటాప థంగా చెబుతున్నారు.
ఆయన ఎంత తొందరగా చర్యలు చేపడితే భారత పర్యావరణానికి అంత మంచిది. గంగలో కొద్దికాలం క్రితం వరకు 100 మిల్లీలీటర్ల నీటికి గాను 5,000 పరిమాణంలో ఉన్న కోలిఫోరమ్ బాక్టీరియా, ఇటీవలి లెక్క ల ప్రకారం 60,000కు చేరింది. ఈ బాక్టీరియా ప్రతి 100 మిల్లీలీటర్లకు ఉండవలసినది (ప్రపంచ ఆరోగ్య సంస్థ లెక్క) 500 మాత్రమే. అంటే 120 రెట్లు అధికం. ఈ స్థితిలో అయి నా ప్రధాని తన ధృఢ నిశ్చయాన్ని ప్రకటించడం సంతోషిం చదగినదే. వారణాసి ఎంపీ మోడీ. వారణాసి నగర పాలక సంస్థను ఆయన పార్టీయే ఏలుతోంది. వీరు ఐదేళ్లు పదవు లలో ఉంటారు. కాబట్టి గంగ కోసం చాలా చేయవచ్చు.
కల్హణ