వారణాసి పర్యటనలో ప్రధాని మోదీ
కిసాన్ సమ్మాన్ నిధి కింద రూ. 20 వేల కోట్లు విడుదల
వారణాసి: గంగా మాత తనను దత్తత తీసుకున్నట్లే కనపడుతోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. వారణాసి లోక్‌సభ నియోజకవర్గం నుంచి వరుసగా మూడోసారి ఎంపీగా ఎన్నికయ్యాక మోదీ తొలిసారిగా మంగళవారం వారణాసిలో పర్యటించారు. పీఎం కిసాన్ సమ్మాన్ నిధి కింద 17వ విడత రూ.20,000 కోట్లను 9.26 కోట్ల మంది రైతుల ఖాతాల్లో జమచేశారు. మెహందీగంజ్‌లో పీఎం కిసాన్ సమ్మాన్ సమ్మేళన్‌లో మాట్లాడుతూ ‘వారణాసి ప్రజలు మూడోసారి నన్ను ఎంపీగానే కాదు ప్రధానిగానూ ఎన్నుకున్నారు. ఈ లోక్‌సభ ఎన్నికల్లో ప్రజలు ఇదివరకెప్పుడూ చూడని తీర్పునిచ్చారు.
చరిత్ర సృష్టించారు’ అని మోదీ పేర్కొన్నారు. కొత్త ప్రభుత్వ తొలి నిర్ణయం రైతులకు, పేదలకు సంబంధించినదని అన్నారు. వికసిత్ భారత్‌కు.. రైతులు, మహిళలు, యువత, పేదలు గట్టి మూలస్తంభాలుగా తాను పరిగణిస్తానన్నారు. ’విశ్వనాథుడు, గంగా మాత ఆశీస్సులు, కాశీ ప్రజల ఆపార ప్రేమతో మూడోసారి దేశానికి ప్రధాన సేవకుడిని అయ్యే భాగ్యం నాకు దక్కింది. వరుసగా మూడోసారి నన్ను తమ ప్రతినిధిగా ఎన్నుకొని కాశీ ప్రజలు నన్ను ఆశీర్వదించారు.
ఇప్పుడు గంగా మాత కూడా నన్ను దత్తత తీసుకున్నట్లే కనపడుతోంది. నేనిక్కడి వాడిని అయిపోయాను’ అని మోదీ అన్నారు. ప్రజాస్వామ్య దేశాల్లో ప్రభుత్వాలు వరుసగా మూడోసారి ఎన్నికకావడం అరుదని, భారత్ ప్రజలు దీన్ని చేసి చూపించారని ప్రధాని అన్నారు. భారత్‌లో 60 ఏళ్ల తర్వాత తమ ప్రభుత్వం హ్యాట్రిక్ సాధించిందన్నారు. ‘యువత ఆకాంక్షలు, ప్రజల కలలు ఎక్కువగా ఉన్న భారత్ లాంటి దేశంలో 10 ఏళ్ల పాలన తర్వాత కూడా మరో అవకాశం రావడం ఘన విజయం. ప్రజల విశ్వాసానికి ప్రతీక’ అని మోదీ అన్నారు.
ప్రతి డైనింగ్ టేబుల్‌పై మన ఆహార ఉత్పత్తులు ఉండాలి
ప్రపంచవ్యాప్తంగా ప్రతి డైనింగ్ టేబుల్‌పై మన ఆహార ఉత్పత్తులు ఉండాలని తాను కోరుకుంటున్నట్లు ప్రధాని మోదీ రైతులనుద్దేశించి అన్నారు. ‘ప్రపంచ మార్కెట్ గురించి ఆలోచించాలి. పప్పులు, నూనె గింజల ఉత్పత్తిలో స్వయంసమృద్ధిని సాధించాలి. వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతిలో అగ్రగామిగా ఎదగాలి. బనారస్ లంగ్డా మామిడి, జౌన్‌పూర్ రాడిష్ రకం, గాజిపూర్ లేడీ ఫింగర్ రకం.. తదితరాలు నేడు విదేశీ మార్కెట్‌లకు చేరుతున్నాయి. ఒక జిల్లా.. ఒక ఉత్పత్తి చొరవతో, జిల్లా స్థాయిలో వ్యవసాయ ఉత్పత్తుల హబ్‌ల ఏర్పాటుతో ఎగుమతులు పెరుగుతున్నాయి. ప్రపంచ ప్యాకేజ్డ్ ఫుడ్ మార్కెట్‌లో భారత్‌ను మనమిప్పుడు కొత్త శిఖరాలకు తీసుకెళ్లాలి’ అని మోదీ పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment