
ప్రతిపక్షాలపై మోదీ మండిపాటు
బీజేపీకి అధికార కాంక్ష అసలే లేదని స్పష్టీకరణ
వారణాసిలో రూ.3,880 కోట్ల విలువైన ప్రాజెక్టులకు శంకుస్థాపన
వారణాసి/అశోక్‌నగర్: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రతిపక్షాలపై మరోసారి విరుచుకుపడ్డారు. ఆ పారీ్టలు కేవలం సొంత కుటుంబాల బాగు కోసమే అధికారం దక్కించుకోవడానికి ఆరాట పడుతున్నాయని విమర్శించారు. బీజేపీ విధానం ‘సబ్ కా సాత్, సబ్ కా వికాస్’అయితే విపక్షాల విధానం ‘పరివార్ కా సాత్, పరివార్ కా వికాస్’అని ధ్వజమెత్తారు. సమాజంలో అన్ని వర్గాల సంక్షేమంతోపాటు దేశ సమగ్రాభివృద్ధి కోసం తమ ప్రభుత్వం పని చేస్తోందని ఉద్ఘాటించారు.
బీజేపీకి అధికార కాంక్ష లేదని స్పష్టంచేశారు. విపక్ష నాయకులు స్వార్థ ప్రయోజనాలే లక్ష్యంగా అధికారం కోసం పాకులాడుతూ రాత్రి పగలు రాజకీయ క్రీడల్లో మునిగితేలుతున్నారని ఆరోపించారు. ప్రధాని మోదీ శుక్రవారం తన సొంత నియోజకవర్గం వారణాసిలో పర్యటించారు. రూ.3,880 కోట్ల విలువైన 44 ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశారు.
ఇందులో 130 తాగునీటి పథకాలు, 100 అంగన్‌వాడీ కేంద్రాలు, 356 గ్రంథాలయాలు, ఒక పాలిటెక్నిక్ కాలేజీ, డిగ్రీ కాలేజీ తదితరాలు ఉన్నాయి. 2014లో ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి ఇప్పటిదాకా మోదీ వారణాసికి రావడం ఇది 50వ సారి. నగరంలో బహిరంగ సభలో ఆయన పాల్గొన్నారు. తొలుత మహాత్మా జ్యోతిబా ఫూలే, సావిత్రిబాయి ఫూలే దంపతులకు నివాళులరి్పంచారు. వారు అందించిన సేవలను గుర్తు చేసుకున్నారు.
పూర్వాంచల్ ఆరోగ్య రాజధాని కాశీ
ఉత్తరప్రదేశ్‌లోని పూర్వాంచల్ ప్రాంతం గతంలో పూర్తిగా వెనుకబడి ఉండేదని, తాము అధికారంలోకి వచి్చన తర్వాత గత పదేళ్లలో ఎంతగానో అభివృద్ధి సాధించిందని ప్రధాని మోదీ పేర్కొన్నారు. కాశీ నగరం ఇప్పుడు ఈ ప్రాంతానికి ఆరోగ్య రాజధానిగా మారిందన్నారు. ఇక్కడ అత్యుత్తమ వైద్య చికిత్స లభిస్తోందని హర్షం వ్యక్తంచేశారు. 70 ఏళ్లు దాటినవారికి ఉచితంగా చికిత్స అందించడానికి ఆయుష్మాన్ వయ్ వందన కార్డులు పంపిణీ చేస్తున్నామని, అత్యధికంగా వారణాసిలో 50 వేల మందికి ఈ కార్డులు ఇచ్చామని తెలిపారు.
కాశీ కేవలం ప్రాచీన నగరమే కాదు, ప్రస్తుతం ప్రగతిశీల నగరంగా మారిందని పేర్కొన్నారు. కాశీ–తమిళ సంగమం గురించి మోదీ ప్రత్యేకంగా ప్రస్తావించారు. 2036లో వారణాసిలో ఒలింపిక్ క్రీడలు నిర్వహించాలన్న ఆలోచన ఉందని తెలిపారు. అందుకోసం కార్యాచరణ మొదలైందన్నారు. ఈ క్రీడల్లో పతకాలు సాధించడానికి ఇప్పటి నుంచే సన్నద్ధం కావాలని వారణాసి యువతకు పిలుపునిచ్చారు.
అంతకుముందు ప్రధాని మోదీ శుక్రవారం ఉదయం వారణాసికి చేరుకున్న తర్వాత.. ఇటీవల యువతిపై జరిగిన సామూహిక అత్యాచార ఘటనపై ఆరా తీశారు. అధికారులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. అత్యాచారానికి పాల్పడిన దుండగులను కఠినంగా శిక్షించాలని ఆదేశించారు. అత్యాచార ఘటనలు పునరావృతం కాకుండా పటిష్టమైన చర్యలు చేపట్టాలన్నారు. వారణాసిలో 19 ఏళ్ల యువతిపై 23 మంది వ్యక్తులు ఆరు రోజులపాటు అత్యాచారానికి పాల్పడిన ఘటన ఇటీవల దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే.
ఆనంద్‌పూర్ ధామ్‌లో మోదీ పూజలు
ప్రధాని మోదీ శుక్రవారం మధ్యప్రదేశ్ రాష్ట్రం అశోక్‌నగర్ జిల్లాలోని ఆనంద్‌పూర్ ధామ్‌ను దర్శించుకున్నారు. ఇక్కడి గురూజీ మహారాజ్ ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. శ్రీఆనంద్‌పూర్ ట్రస్టు స్థాపించిన ఆనంద్‌పూర్ ధామ్ 315 ఎకరాల్లో విస్తరించి ఉంది. గోశాల నిర్వహణతోపాటు ఆనంద్‌పూర్ ధామ్ చేపడుతున్న ఇతర సామాజిక సేవా కార్యక్రమాలను ప్రధానమంత్రి ప్రశంసించారు.