Sabka Saath Sabka Vikas
-
2047 నాటికి అభివృద్ధి భారత్
న్యూఢిల్లీ: ప్రపంచ అభివృద్ధి ‘జీడీపీ కేంద్రిత విధానం’ నుంచి ‘మానవ కేంద్రిత విధానం’ వైపు మారాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆకాంక్షించారు. మన ‘సబ్కా సాథ్, సబ్కా వికాస్’ మోడల్ ప్రపంచ సంక్షేమానికి ఒక మార్గదర్శిగా మారుతోందని స్పష్టం చేశారు. జీడీపీ పరిమాణంతో సంబంధం లేకుండా ప్రపంచంలో ప్రతి దేశానికీ ప్రాముఖ్యం ఉందని పేర్కొన్నారు. జీ20 శిఖరాగ్ర సదస్సు నేపథ్యంలో ప్రధాని మోదీ తాజాగా వార్తా సంస్థ ‘పీటీఐ’కి ఇంటర్వ్యూ ఇచ్చారు. పలు కీలక అంశాలపై తన అభిప్రాయాలు పంచుకున్నారు. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత ఒక కొత్త ప్రపంచ క్రమం(వరల్డ్ ఆర్డర్) ఏర్పడిందని, కోవిడ్–19 తర్వాత మరో ప్రపంచ క్రమాన్ని చూస్తున్నామని చెప్పారు. మానవ కేంద్రిత అభివృద్ధి దిశగా ప్రపంచం పయనిస్తోందని, ఈ విషయంలో భారత్ ముఖ్యమైన పాత్ర పోషిస్తోందని తెలిపారు. జీ20కి సారథ్యం వహిస్తున్న భారత్ ప్రపంచ దేశాల్లో విశ్వాసం అనే విత్తనాలు నాటిందని ఉద్ఘాటించారు. ప్రధాని మోదీ ఇంకా ఏం చెప్పారంటే.. పేదరికంపై విజయం తథ్యం ‘‘చాలా ఏళ్ల క్రితం భారత్‌ను 100 కోట్లకుపైగా ఆకలితో అలమటించే ఖాళీ కడుపులున్న దేశంగా భావించేవారు. కానీ, ఇప్పుడు 100 కోట్లకుపైగా ఆకాంక్షలతో కూడిన హృదయాలు, రెండు కోట్లకుపైగా నైపుణ్యం కలిగిన చేతులు, కోట్లాది యువత ఉన్నదేశంగా భారత్‌ను చూస్తున్నారు. 2047 నాటికి భారత్ అభివృద్ధి చెందిన దేశంగా మారుతుంది. ఈ కాలమంతా ఒక మంచి అవకాశమే. గొప్ప అభివృద్ధికి పునాదులు వేసే అవకాశం ఈనాటి భారతీయులకు వచి్చంది. మనం సాధించే ప్రగతి రాబోయే వెయ్యేళ్లు గుర్తుండిపోతుంది. పేదరికంపై జరుగుతున్న యుద్ధంలో పేద ప్రజలు కచి్చతంగా విజయం సాధిస్తారు. విద్య, వైద్యం, సామాజిక రంగాల్లో అత్యుత్తమ ఫలితాలు సాధించబోతున్నాం. దేశంలో అవినీతి, కులతత్వం, మతతత్వానికి ఎంతమాత్రం స్థానంలేదు. జీ20 కార్యక్రమాలను దేశవ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో నిర్వహించడంలో వింతేమీ లేదే. అది సహజమే. భారత్ చాలా విశాలమైన, వైవిధ్యం కలిగిన దేశం. మన సొంత భూభాగంలో ఎక్కడైనా సదస్సులు నిర్వహించుకునే స్వేచ్ఛ మాకుంది. వాతావరణ మార్పులపై పోరాడే విషయంలో కేవలం ఒకే విధానం సరిపోదు. నిర్మాణాత్మక చర్యలుండాలి. వాతావరణ లక్ష్యాలను సాధించే విషయంలో ఏ ఒక్క అవకాశాన్నీ వదులుకోం. ఉగ్రవాద సంస్థలు టెక్నాలజీని విచ్చలవిడిగా వాడుకుంటున్నాయి. కార్యకలాపాల కోసం డార్క్ నెట్, మెటావెర్స్, క్రిప్టోకరెన్సీ వేదికలను ఉపయోగించుకుంటున్నాయి. సైబర్ నేరాలను అరికట్టడానికి ప్రపంచ దేశాలన్నీ కలిసికట్టుగా పనిచేయాలి. ప్రపంచ సమస్యలకు భారత్ పరిష్కారం భారత్‌లో అమలవుతున్న మానవ కేంద్రిత అభివృద్ధి మోడల్‌ను ప్రపంచ దేశాలు గుర్తించి, అనుసరిస్తున్నాయి. ఎన్నో సవాళ్లను ఎదుర్కొని ముందుకు సాగుతున్నాం. మన దేశాన్ని గతంలో కేవలం ఒక పెద్ద మార్కెట్‌గానే పరిగణించేవారు. ఇప్పుడు ప్రపంచ దేశాల ఎదుర్కొంటున్న సమస్యలకు భారత్ పరిష్కార మార్గాలు చూపిస్తోంది. అప్పుల భారం అనేది అభివృద్ధి చెందుతున్న దేశాలకు పెద్ద ముప్పుగా మారుతోంది. ఉచిత పథకాలు అనేవి సరైన ఆలోచన కాదు. ఆర్థిక క్రమశిక్షణ పాటిస్తేనే అభివృద్ధి వేగవంతమవుతుంది. ప్రపంచ పరిణామాలు మారిపోతున్నాయి. దానికి అనుగుణంగా ఐక్యరాజ్యసమితిలో సంస్కరణలు చేపట్టాల్సిన అవసరం ఉంది. ఐక్యరాజ్యసమితిలో అన్ని దేశాల గొంతుకలకు ప్రాతినిధ్యం దక్కాలి. జీ20లో ఆఫ్రియన్ యూనియన్‌కు పూర్తిస్థాయి సభ్యత్వం కలి్పంచాలి. అందుకు మేము మద్దతు ఇస్తాం. అన్ని గొంతుకలను గుర్తించకుండా, ప్రాతినిధ్యం కలి్పంచకుండా.. ప్రపంచ భవిష్యత్తు కోసం చేపట్టే ఏ ప్రణాళిక కూడా సఫలం కాదు’’ అని నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. -
శ్రీరాముడే స్ఫూర్తి: మోదీ
అయోధ్య: ప్రభుత్వ నినాదం ‘సబ్కా సాత్, సబ్కా వికాస్’కు శ్రీరాముడి పాలన, ఆయన అందించిన విలువలే స్ఫూర్తి అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. ఆయన ఆదివారం సాయంత్రం ఉత్తరప్రదేశ్ రాష్ట్రం అయోధ్యలోని సరయూ నది ఒడ్డున దీపోత్సవంలో పాల్గొన్నారు. ప్రజలు వెలిగించిన 15.76 లక్షల దీపాలతో సరయూ తీరం వెలుగులతో కనువిందు చేసింది. ఈ కార్యక్రమం గిన్నిస్ ప్రపంచ రికార్డు సృష్టించింది. 3డీ హోలోగ్రాఫిక్ ప్రొజెక్షన్ మ్యాపింగ్ షోను, మ్యూజిక్ షోను మోదీ తిలకించారు. భవ్య రామమందిర నిర్మాణానికి ఆయన 2020 ఆగస్టు 5న భూమిపూజ చేసిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత ఆయన అయోధ్యకు రావడం ఇదే తొలిసారి. తొలుత రామజన్మభూమి స్థలంలోని తాత్కాలిక ఆలయంలో రామ్‌లల్లాను మోదీ దర్శించుకున్నారు. దీపం వెలిగించారు. ప్రత్యేక పూజలు చేశారు. హారతి అందుకున్నారు. అనంతరం రామ మందిర నిర్మాణ పనుల పురోగతిపై అధికారులతో కలిసి సమీక్ష నిర్వహించారు. రామకథా పార్కులో శ్రీరాముడు, సీతల ప్రతీకాత్మక పట్టాభిషేక కార్యక్రమంలో మోదీ పాలుపంచుకున్నారు. పుష్పక విమానం(హెలికాప్టర్) నుంచి రాముడు, లక్ష్మణుడు, సీత పాత్రధారులు దిగడం అందరినీ అకట్టుకుంది. ఈ కార్యక్రమంలో మోదీ మాట్లాడుతూ.. రాముడి ఆశయాలు, విలువలు రాబోయే 25 ఏళ్లలో మన లక్ష్యాల సాధనకు దిక్సూచి అని చెప్పారు. మన రాజ్యాంగ ఒరిజినల్ కాపీపై రాముడు, లక్ష్మణుడు, సీతామాత చిత్రాలు ఉన్నాయని గుర్తుచేశారు. మన రాజ్యాంగ హక్కులకు అది మరో గ్యారంటీ అని అభివర్ణించారు. -
నా సహ భారతీయుడా: ప్రధాని మోదీ
న్యూఢిల్లీ : భారత ప్రధానిగా రెండోసారి బాధ్యతలు చేపట్టిన నరేంద్ర మోదీ ప్రభుత్వం శనివారంతో ఏడాది పాలన పూర్తి చేసుకుంది. గడిచిన తొలి ఏడాది పాలనలో మోదీ నేతృత్వంలోని బీజేపీ సర్కార్ ఎన్నో కీలక సంస్కరణలు తీసుకు వచ్చింది. ఏళ్ల తరబడి మూలుగుతున్న సమస్యలను తుడిచిపెట్టి దేశ వ్యాప్తంగా తనదైన ముద్ర వేశారు. 2019 లో జరిగిన ఎన్నికల్లో బీజేపీ అఖండ విజయం సాధించి కేంద్రంలో మరోసారి పాగ వేసింది. దేశంలోని ప్రతి పౌరుడి కలను సాకారం చేస్తూ భారత్ స్థాయిని ఉన్నత శిఖరాలకు తీసుకెళ్తూ.. ప్రపంచ నాయకుడిగా మోదీ కీర్తి గడించారు. ఈ ఏడాది కాలంలో ఎన్నో సమస్యాత్మక అంశాలను సులువు చేసి అనేక విజయాలను మోదీ తన ఖాతాలో వేసుకున్నారు. వివాదాస్పద ట్రిపుల్ తలాక్ బిల్లు, పౌరసత్వ చట్ట సవరణ, ఆర్టికల్ 370 రద్దు, అయోద్య వివాదం వంటి వాటికి శాశ్వత పరిష్కారం చూపించారు. (ఎన్నో ముడులు విప్పిన మోదీ) కేంద్రంలో రెండోసారి పాలక పగ్గాలు చేపట్టి ఏడాది పూర్తవుతున్న సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ దేశ పౌరులకు బహిరంగ లేఖ రాశారు. లేఖలో ఏడాది కాలంగా తీసుకున్న కీలక నిర్ణయాలను ప్రస్తావించారు. ‘‘నా దేశ పౌరులారా.. గతేడాది ఇదే రోజు భారత ప్రజాస్వామ్య చరిత్రలో ఒక సువర్ణాధ్యాయం ప్రారంభమైంది. అనేక దశాబ్దాల తరువాత దేశ ప్రజలు పూర్తి మెజారిటీతో పూర్తికాలం అధికారం కట్టబెట్టారు. మరోసారి 130 కోట్ల భారతీయులకు, దేశ ప్రజాస్వామ్య సంస్కృతికి తలవంచి నమస్కరిస్తున్నా. మీ ప్రేమ, సహృదయత, చురుకైన సహకారం కొత్త శక్తిని, స్ఫూర్తిని ఇచ్చాయి. సాధారణ సమయంలో అయితే మీ మధ్యనే ఉండేవాణ్ణి. అయితే, ఇప్పుడున్న పరిస్థితులు నన్ను అనుమతించటం లేదు. అందుకే ఈ లేఖ ద్వారా మీ ఆశీస్సులు కోరుకుంటున్నా.అంటూ మోదీ పేర్కొన్నారు. (ప్రధానితో అమిత్ షా భేటీ) 2014 లో దేశ ప్రజలు మార్పు కోరుకుంటూ ఓటు వేశారు. అంతకు ముందు అయిదేళ్ళలో పరిపాలనా యంత్రాంగం ఎలా విఫలమైందో దేశం చూసింది. ఆ తరువాత అవినీతికి దూరంగా జరిగి, పరిపాలనను గాడిలో పెట్టటం చూశారు. ’అంత్యోదయ’ స్ఫూర్తి కి పూర్తిగా కట్టుబడి లక్షలాది ప్రజల జీవితాల్లో మార్పు తీసుకు రాగలిగాం. 2014 నుంచి 2019 వరకు భారత ప్రతిష్ఠ గణనీయంగా పెరిగింది. పేదల గౌరవం పెరిగింది. దేశం ఆర్థికంగా అందరినీ కలుపుకోవటం జరిగింది. ఉచిత గ్యాస్, విద్యుత్ కనెక్షన్లు, సంపూర్ణ పారిశుద్ధ్యం సాధించటంతోబాటు ”అందరికీ ఇళ్ళు" సార్థకమయ్యేలా పురోగతి సాధించాం.సర్జికల్ స్ట్రైక్స్, వైమానిక దాడుల ద్వారా భారత్ తన శక్తిని చాటుకుంది. అదే సమయంలో శతాబ్దాలుగా సాగుతున్న వన్ రాంక్-వన్ పెన్షన్, వన్ నేషన్ - వన్ టాక్స్ , మెరుగైన గరిష్ఠ మద్దతు ధర లాంటివి సాకారం చేసుకున్నాం. సబ్ కా సాథ్, సబ్ కా వికాస్ 2019 లో భారత ప్రజలు కేవలం కొనసాగింపు కోసమే ఓటు వేయలేదు. భారత్‌ను సమున్నతంగా చూడాలన్న కల సాకారం కావటానికి ఓటు వేశారు. భారత్‌ను ప్రపంచ నాయకత్వ స్థానంలో చూడాలన్నదే ఆ కల. గత ఏడాది కాలంలో తీసుకున్న నిర్ణయాలు ఆ కలను సాకారం చేయటానికి తీసుకున్నవే. ఈనాడు దేశ అభివృద్ధి పథంలో 130 కోట్ల మంది ప్రజలు మమేకమయ్యారు, సమీకృతమయ్యారు. జన శక్తి, రాష్ట్ర శక్తి అనే దీపకాంతులు యావద్దేశాన్నీ వెలిగించాయి. సబ్ కా సాథ్, సబ్ కా వికాస్, సబ్ కా విశ్వాస్ అనే మంత్రం ఇచ్చిన ఉత్తేజంతో భారత్ అన్ని రంగాలలో ముందడుగు వేస్తోంది. (ఒక్క ఏడాది.. పెక్కు విజయాలు) నా భారతీయ పౌరులరా, గడిచిన ఏడాది కాలంలో కొన్ని నిర్ణయాలను విస్తృతంగా చర్చించటంతోపాటు బహిరంగ సభలలో కూడా ప్రస్తావించారు. ఆర్టికల్ 370 దేశ సమైక్యతనుమ, సమగ్రతా స్ఫూర్తిని మరింతగా పెంచింది. గౌరవ సుప్రీంకోర్టు ఏకగ్రీవంగా ఇచ్చిన రామమందిరం తీర్పు శతాబ్దాలకాలంగా సాగుతున్న చర్చకు సుహృద్భావపు ముగింపునిచ్చింది. క్రూరమైన ట్రిపుల్ తలాక్ విధానాన్ని చరిత్ర అనే చెత్తబుట్టకు పరిమితం చేశాం. పౌరసత్వ చట్టానికి చేసిన సవరణ భారతదేశపు కరుణ, కలుపుకుపోయే తత్వాన్ని చాటిచెప్పింది. కానీ దేశాన్ని అభివృద్ధిపథంలో పరుగులు పెట్టించిన నిర్ణయాలు ఇంకా అనేకం ఉన్నాయి. జల్ జీవన్ మిషన్ త్రివిధ దళాల అధిపతి పదవిని సృష్టించటమన్నది ఎంతో కాలంగా పెండింగ్‌లో ఉన్న ఒక సంస్కరణ. దీనివలన సాయుధ దళాల మధ్య సమన్వయం మెరుగుపడింది. అదే సమయంలో భారత్ తన మిషన్ గగన్ యాన్ ఏర్పాట్లను వేగవంతం చేసింది. పేదలను, రైతులను, మహిళలను, యువతను బలోపేతం చేయటం మన ప్రాధాన్యంగా మిగిలింది. పీఎం కిసాన్ సమ్మాన్ నిధి ఇప్పుడు రైతులందరికీ వర్తిస్తోంది. కేవలం ఏడాది కాలంలో 72,000 కోట్ల రూపాయలు 9 కోట్ల 50 లక్షలమంది రైతుల ఖాతాల్లో జమ అయ్యాయి. జల్ జీవన్ మిషన్ ద్వారా 15 కోట్లకు పైగా గ్రామీణ గృహాలకు పైపుల ద్వారా త్రాగు నీటి సరఫరా జరిగేట్టు చూశాం. మన 50 కోట్ల పశువుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని పెద్ద ఎత్తున ఉచిత టీకాల కార్యక్రమం చేపట్టాం. మన దేశ చరిత్రలో మొట్టమొదటి సారిగా రైతులు, రైతు కూలీలు, చిన్న దుకాణ దారులు, అసంఘటిత రంగంలోని కార్మికులకు 60 ఏళ్ళు పైబడ్డాక రూ. 3000 వంతున నెలసరి పెన్షన్ క్రమం తప్పకుండా అందే ఏర్పాటు చేశాం. బాంకు రుణాలను వాడుకునే సౌకర్యంతో బాటు మత్స్యకారులకోసం ఒక ప్రత్యేక విభాగాన్ని కూడా ఏర్పాటు చేశాం. మత్స్య రంగాన్ని బలోపేతం చేయటం కోసం అనేక ఇతర నిర్ణయాలు కూడా తీసుకున్నాం. ఇది నీలి ఆర్థిక వ్యవస్థ పుంజుకోవటానికి దోహదపడుతుంది. అదే విధంగా, వర్తకుల సమస్యలు సకాలంలో పరిష్కరించటానికి వీలుగా వ్యాపారి కల్యాణ్ బోర్డ్ ఏర్పాటు చేయాలని నిర్ణయించాం. స్వయం సహాయక బృందాలలోని 7 కోట్లమంది మహిళలకు ఎక్కువ మొత్తంలో ఆర్థిక సహాయం అందేలా చర్యలు తీసుకున్నాం. ఇటీవలే స్వయం సహాయక బృందాలకిచ్చే హామీ లేని రుణాలను అంతకు ముందున్న 10 లక్షల నుంచి రెట్టింపు చేసి 20 లక్షలకు పెంచాం. గిరిజన బాలబాలికల చదువులను దృష్టిలో పెట్టుకొని కొత్తగా 400 కు పైగా ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ పాఠశాలలు నిర్మించటం ప్రారంభించాం. (మోదీ 2.0) గడిచిన ఏడాది కాలంలో అనేక ప్రజానుకూల చట్టాలు రూపొందించాం. ఉత్పాదకత పరంగా మన పార్లమెంట్ దశాబ్దాలనాటి రికార్డును బద్దలు కొట్టింది. దాని ఫలితంగా వినియోగదారుల రక్షణ చట్టం కావచ్చు, చిట్ ఫండ్ చట్టాల సవరణ కావచ్చు, మహిళలకు, దివ్యాంగులకు మరింత రక్షణనిచ్చే చట్టాలు కావచ్చు. వాటిని పార్లమెంట్ ఆమోదించటం వేగవంతమైంది. ప్రభుత్వ విధానాలు, నిర్ణయాల కారణంగా గ్రామీణ-పట్టణ ప్రాంతాల మధ్య అంతరం తగ్గిపోతోంది. మొట్టమొదటి సారిగా గ్రామీణ భారతంలో ఇంటర్నెట్ వాడకం దారుల సంఖ్య పట్టణప్రాంతం వారికంటే 10% ఎక్కువగా నమోదైంది. దేశ ప్రయోజనాల దృష్ట్యా తీసుకున్న అలాంటి చరిత్రాత్మక చర్యలు, నిర్ణయాల జాబితా ఈ లేఖలో ప్రస్తావించటం సాధ్యం కానంత పొడవైనది. కానీ ఈ ఏడాదిలో ప్రతి రోజూ నా ప్రభుత్వం ఈ నిర్ణయాల అమలుకోసం రేయింబవళ్ళూ చురుగ్గా పనిచేస్తూ వచ్చింది. అత్యాధునిక ఆరోగ్య వ్యవస్థ నా సహ భారతీయులారా, మన దేశ ప్రజల ఆశలు, ఆశయాల సాకారానికి మనం వేగంగా అడుగులు వేస్తున్న సమయంలో ప్రపంచమంతటా వ్యాపించిన కరోనావైరస్ మనదేశాన్నీ చుట్టుముట్టింది. ఒకవైపు గొప్ప ఆర్థిక వనరులున్న శక్తులు, అత్యాధునిక ఆరోగ్య వ్యవస్థలున్న దేశాలు ఉండగా, మరోవైపు భారీ జనాభా, పరిమిత వనరులతో సమస్యల సుడిగుండంలో ఉన్న మన దేశం ఉంది. కరోనా భారత్ ను తాకినప్పుడు భారతదేశం ప్రపంచానికి ఒక సమస్యగా మారుతుందని చాలామంది కలవరపడ్దారు. కానీ మనవైపు ప్రపంచం చూస్తున్న తీరును మీరు మీ ఆత్మ విశ్వాసంతో చాకచక్యంతో ఈరోజు మార్చగలిగారు. భారతీయుల సమష్ఠి బలానికీ, సామర్థ్యానికీ శక్తిమంతమైన, సుసంపన్నమైన దేశాలు సైతం సరితూగలేవని మీరు నిరూపించారు. కరోనా యోధుల గౌరవార్థం చప్పట్లు కొట్టినా, దీపాలు వెలిగించినా, భారత సాయుధ దళాలను గౌరవించినా, జనతా కర్ఫ్యూ అయినా, దేశవ్యాప్త లాక్ డౌన్ నిబంధనలకు కట్టుబడటం అయినా ప్రతి సందర్భంలోనూ మీరు శ్రేష్ఠ్ భారత్ కు ఏక్ భారత్‌ను హామీగా ఇచ్చారు. ఇంతటి భారీ విపత్కర సంక్షోభంలో కచ్చితంగా ఎవరూ, ఎలాంటి అసౌకర్యానికీ గురికాలేదనీ, బాధపడలేదనీ చెప్పటం లేదు. మన శ్రామికులు, వలస కార్మికులు, చేతి వృత్తులవారు, చిన్న తరహా పరిశ్రమలలోని హస్త కళాకారులు, బండ్ల వ్యాపారులు ఇంకా అలాంటి సోదరులెందరో అనేకానేక కష్టాలనెదుర్కున్నారు. వాళ్ళ సమస్యల తీవ్రత తగ్గించటానికి మనం కలసికట్టుగా పట్టుదలతో ముందుకు సాగుతున్నాం. అయితే, మనం ఎదుర్కొంటున్న అసౌకర్యాలు మనకు ప్రమాదకర దుర్ఘటనలుగా మనం జాగ్రత్తలు తీసుకోవాలి. అందువలన నిబంధనలు, మార్గదర్శకాలు పాటించటం ప్రతి భారతీయుడికీ ముఖ్యమైన బాధ్యత. ఇప్పటిదాకా మనం ఎంతో ఓపికపట్టాం. దాన్ని అలాగే కొనసాగించాలి. భారతదేశం మిగిలిన అనేకదేశాలకంటే భద్రంగా, మెరుగైన స్థితిలో ఉండటానికి ముఖ్యమైన కారణాల్లో ఇదొకటి. ఇదొక సుదీర్ఘ పోరాటం. కానీ మనం ఇప్పటికే విజయపథంలో సాగుతున్నాం. విజయం మనందరి ఉమ్మడి దీక్షాఫలం. కొద్ది రోజుల కిందట ఒక మహా తుపాను పశ్చిమ బెంగాల్, ఒడిశా రాష్ట్రాల్లోని కొన్ని ప్రాంతాలను అతలాకుతలం చేసింది. అప్పుడు కూడా ఈ రాష్ట్రాల ప్రజలు ప్రదర్శించిన తెలివి, నిబ్బరం చాలా గొప్పవి. వాళ్ళ ధైర్యం భారత ప్రజలందరికీ స్ఫూర్తిదాయకం. కరోనా వైరస్ మీద సమష్ఠిగా పోరాటం ప్రియ మిత్రులారా, ఇలాంటి సమయంలో భారత్ సహా వివిధ దేశాల ఆర్థిక వ్యవస్థలు ఎలా కోలుకుంటాయోనన్న విషయం మీద విస్తృతమైన చర్చ మొదలైంది. అయితే, ఈ విషయంలో భారత్ ప్రపంచాన్ని ఆశ్చర్యంలో ముంచెత్తింది. కరోనా వైరస్ మీద సమష్ఠిగా పోరాడుతునే ఆర్థిక వ్యవస్థ కోలుకునేట్టు చేసుకోవటంలో మనం ఒక ఉదాహరణగా నిలువగలిగాం. ఆర్థిక పరంగా 130 కోట్లమంది భారతీయులు ప్రపంచాన్ని ఆశ్చర్యపరచటంతోబాటు దానికి స్ఫూర్తిదాయకంగా నిలిచారు. మనం స్వయం సమృద్ధం కావాల్సిన సమయమిది. మన శక్తిసామర్థ్యాలతో మనదైన పంథాలో ముందుకు సాగాలి. ఆ పంథా ఒక్కటే... ఆత్మనిర్భర్ భారత్ లేదా స్వయం సమృద్ధ భారత్. ఇటీవల ఆత్మనిర్భర్ భారత్ అభియాన్ కింద ప్రకటించిన రూ. 20 లక్షల కోట్ల పాకేజ్ ఈ దిశలో వేసిన కీలకమైన అడుగు. ఈ చొరవ ఫలితంగా ప్రతి భారతీయునికీ అవకాశాల పరంపర మొదలవుతుంది. అది రైతులు కావచ్చు, శ్రామికులు కావచ్చు, చిన్న తరహా ఔత్సాహిక వ్యాపారులు కావచ్చు, స్టార్టప్ లతో సాగుతున్న యువత కావచ్చు. చెమటతో తడిసిన భారతదేశపు మట్టివాసన, కఠోరశ్రమ, మన శ్రామికుల ప్రతిభ ఫలితంగా భారతదేశం కచ్చితంగా దిగుమతుల మీద ఆధారపడటం తగ్గుతుంది. ఆ విధంగా స్వయం సమృద్ధి దిశగా సాగుతుంది. ప్రియ మిత్రులారా, గత ఆరేళ్ళ ఈ ప్రయాణంలో మీరు నిరంతరాయంగా నా మీద ప్రేమ కురిపించారు, ఆశీర్వదించారు. మీ ఆశీర్వాద బలమే దేశం చరిత్రాత్మక నిర్ణయాలు తీసుకునేలా చేసింది. గత ఏడాది కాలంలో వేగంగా పురోగతి సాధించేట్టు చేసింది. అయితే, చేయాల్సింది ఇంకా చాలా ఉందని నాకు తెలుసు. మన దేశం ఎదుర్కొంటున్న సవాళ్ళూ, సమస్యలూ చాలా ఉన్నాయి. నేను రేయింబవళ్ళూ పనిచేస్తున్నా. నాలో లోపాలు ఉండవచ్చు. కానీ మనదేశానికి మాత్రం ఏ లోటూ లేదు.అందుకే నా మీద నాకున్న నమ్మకం కంటే మీ మీద, మీ బలం మీద, మీ సామర్థ్యాలమీద నాకు నమ్మకమెక్కువ. నా పట్టుదలకు మూలకారణమైన బలం మీరూ, మీ మద్దతు, మీ ఆశీర్వాదాలు, ప్రేమ మాత్రమే ప్రపంచమంతటా వ్యాపించిన ఈ కరోనా మహమ్మారితో వచ్చింది కచ్చితంగా ఒక సంక్షోభ సమయమే. కానీ మన భారతీయులకు మాత్రం మరింత పట్టుదలతో వ్యవహరించాల్సిన సమయం కూడా. 130 కోట్ల ప్రజల వర్తమానాన్నీ, భవిష్యత్తునూ ఎలాంటి కష్టాలూ శాసించలేవని మనం ఎప్పుడూ గుర్తుంచుకోవాలి. మన వర్తమానాన్ని, మన భవిష్యత్తును మనమే నిర్ణయించుకుందాం. పురోగతి పథంలో ముందుగు సాగితే విజయం మన వశమవుతుంది. కృతమ్ మే దక్షిణే హస్తే, జయో మే సవ్య ఆహితః అంటారు. అంటే, ఒకచేత కార్యాచరణ, విధి నిర్వహణ ఉంటే, రెండో చేతికి విజయం ఖాయం అని. మన దేశ విజయం కోసం ప్రార్థిస్తూ, మీకు మరోమారు ప్రణమిల్లుతున్నా. మీకు, మీ కుటుంబానికి నా హృదయపూర్వక శుభాకాంక్షలు.ఆరోగ్యంగా ఉండండి, సురక్షితంగా ఉండండి. అప్రమత్తంగా ఉండండి, తెలిసి నడుచుకొండి. మీ ప్రధాన సేవకుడు- నరేంద్ర మోదీ’’ గత ఏడాది కాలంగా చేపట్టిన వివిధ సంస్కరణల గురించి ప్రధాన మంత్రి నరేంద్రమోదీ సుదీర్ఘ లేఖ రాశారు. -
పాలన వీడి ప్రత్యర్థులపై గురి
యువ భారతీయులు 2014లో బ్రాండ్ మోదీ తమకు అమ్మిన ఆశను, ఆశావాదాన్ని ఎంతో మక్కువగా కొనిపడేశారు. కానీ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఇందిరాగాంధీ యుగం నాటి కాంగ్రెస్‌గా మారిపోవడమే కాకుండా ఒక ఆవును కూడా తోడు తెచ్చుకోవడంతో అదే యువతరం ఇప్పుడు ఆగ్రహంతో, నిరాశా నిస్పృహలతో దహించుకు పోతోంది. ఇప్పుడు తన సర్కారీ పథకాల గురించి మోదీ జపం చేస్తున్నారు. తాను గతంలో పేర్కొన్న అవినీతి కుంభకోణాలను వెలికి తీసి, తప్పు చేసినవారిని శిక్షించడానికి బదులుగా గాంధీ, చిదంబరం కుటుంబాలకు సంబంధించిన పాత, కొత్త పాపాలచిట్టాను బయటపెట్టడంలోనే ఆయన కాలం గడిపేస్తున్నారు. ప్రపంచ ప్రసిద్ధ బ్రాండ్ గురు అలీక్ పదమ్సే తనకు ఇష్టమైన వాక్యాన్ని పదే పదే చెబుతుండేవారు. ‘క్లయింట్లు తమ బ్రాండ్లను జాగ్రత్తగా తీర్చిదిద్దమని నన్ను అడిగేవారు. నేను నా బ్రాండ్‌ను ఎన్నడూ తీర్చిదిద్దనని, నా పోటీదారు బ్రాండ్‌ను మాత్రమే జాగ్రత్తగా చూస్తానని నేను వారికి చెప్పేవాడిని. ‘దురదృష్టవశాత్తూ అలీక్ ఇటీవలే కన్ను మూశారు. నరేంద్రమోదీ, అమిత్ షాలు 2014లో ప్రతిపక్షం ఎలా ఘోర తప్పిదాలకు పాల్పడి ప్రతిపక్ష బ్రాండుగా మారిపోయి ఓట్ల బజారులో తమకు విజయం సాధించిపెట్టిందో అదే పాత్రను ఇప్పుడు పోషిస్తున్న వైనాన్ని ఆలీక్యూతో చాట్ చేస్తే సరదాగా ఉంటుంది కాబోలు. నేరుగా విషయానికి వద్దాం. 2014 వేసవిలో నరేంద్రమోదీ ప్రతి కూలతకు, నిరాశావాదానికి సంబందించిన ఒక్క పదం కూడా పలక లేదు. ఆయన సందేశం చాలా దృఢంగా, స్థిరంగా, నచ్చచెప్పేవిధంగా ఉండేది. అభివృద్ధి, పురోగతి, ఉద్యోగాలు, దృఢ శక్తి, అచ్చేదిన్ (మంచి రోజులు).. అన్ని రంగాల్లోనూ ఆయన ఇవే మాట్లాడేవారు. ఒక స్వచ్ఛ మైన, నిర్ణయాత్మకమైన, పరిమిత ప్రభుత్వం, అపరిమిత పాలనను మోదీ జాతికి హామీ ఇచ్చారు. భవిష్యత్తును గురించి మాత్రమే మాట్లా డుతూ తాను దాన్ని ఎలా విప్లవీకరించబోతున్నదీ ప్రత్యేకించి యువత ముందు స్పష్టంగా చెప్పేవారు. సబ్కా సాథ్, సబ్కా వికాస్ గతం గురించి ఆయన ప్రస్తావించారంటే అది ఆర్థిక పతనం, పాలసీ పరమైన పక్షవాతం, యూపీఏ–2 హయాంలో పాలన పూర్తిగా అడుగం టిపోవడం, దాని ప్రధానికి తీరని అవమానం జరగడం, పర్యావరణ అనుమతుల మిషతో కుంభకోణాల మీద కుంభ కోణాలు చోటు చేసు కోవడం, ప్రభుత్వం మొత్తంగా కుంభకోణాలలో కూరుకుపోవడం వంటి అంశాలనే ప్రస్తావించేవారు. అంతే కానీ ప్రజలను వేరుపర్చడం, విడ దీయడం అప్పట్లో మోదీ ప్రసంగాల్లో ఉండేవి కావు. ఆయన కేంపెయిన్ థీమ్ ఏదంటే సబ్కా సాథ్, సబ్కా వికాస్ (అందరితో ఉంటాను, అంద రినీ ఎదిగేలా చేస్తాను) మాత్రమే. ఈ సబ్కా సాథ్ వెనుక ఉన్న సందేశం ఒక్కటే. నాకు సమస్యలు తెలుసు. నేను పరిష్కారాలతో వచ్చాను. నాకు మీ తీర్పును, సమ యాన్ని, విశ్వాసాన్ని ఇవ్వండి, అన్నదే ఆ సందేశ సారాంశం. ఆ సందేశం గొప్ప ప్రాడక్టుగా మారి తన ప్రతిపక్షాన్ని ఊచకోత కోసేసింది. కానీ వచ్చే ఎన్నికలు ఇక ఆరునెలల్లో రాబోతుండగా మోదీ సందేశం దాదాపు వ్యతిరేకదిశకు మారిపోయింది. ఇందిరాగాంధీ తర్వాత దేశ చరిత్రలో అత్యంత శక్తివంతమైన ప్రధానిగా మోదీ ఆవిర్భవించారు. కానీ ఇప్పు డేమో కాంగ్రెస్ పార్టీ తనను పని చేయనివ్వడం లేదని ఆరోపిస్తున్నారు. చివరకు భారత్ మాతాకు జై అనే తన ఊతపదాన్ని కూడా కాంగ్రెస్ వ్యతిరేకిస్తోందని ఇటీవలి తన ఎన్నికల ప్రచారంలో మోదీ వాపోయారు. అంటే నాటి ప్రధాని మన్మోహన్ సింగ్‌ని నిర్వీర్యం చేసిన 10 జన్‌పథ్ ఇప్పుడు కేవలం 47 పార్లమెంటు స్థానాలు ఉన్నప్పటికీ మోదీని ఊపిరా డకుండా చేస్తోందన్నమాట. మోదీ ప్రభుత్వ పాలనను పరిమితం చేస్తానని వాగ్దానం చేశారు. కానీ ఇప్పుడు సమయమంతా తన సర్కారీ పథకాల గురించి జపం చేస్తున్నారు. తాను గతంలో పేర్కొన్న అవినీతి కుంభకోణాలను వెలికి తీసి తప్పుచేసినవారిని శిక్షించడానికి బదులుగా, గాంధీ, చిదంబరం కుటుంబాలకు సంబంధించిన పాత, కొత్త పాపాల చిట్టాను బయట పెట్టడంలోనే మోదీ కాలం గడిపేస్తున్నారు. 54 నెలల పాటు సంపూర్ణ అధికారాన్ని అనుభవించి, ప్రభుత్వ ఏజెన్సీలను సంపూర్ణంగా భ్రష్టు పట్టించిన తర్వాత దేశ ప్రజలకు ఒరిగింది ఇదే మరి. పాలనను పరిమితం చేయడం, గుజరాత్ తరహా పారిశ్రామికుల నేతృత్వంలోని అభివృద్ధికి తావియ్యడానికి బదులుగా, మరిన్ని కరపత్రా లను మాత్రమే అందిస్తున్నారు. పైగా భవిష్యత్తు గురించి చాలా అరు దుగా మాత్రమే మోదీ మాట్లాడుతుండటం ఆశ్చర్యం గొలుపుతోంది. పైగా గతంలోకి చాలా దూరం వెళ్లిపోయి జవహర్లాల్ నెహ్రూ, ఆయన తండ్రి, పుత్రిక, పటేల్, శాస్త్రిల గురించి పదే పదే మాట్లాడుతున్నారు. ఉద్యోగాలు, వికాస్, సంపద వంటి వాగ్దానాలు గూట్లో చేరాయి. జాతి ఐక్యత, సబ్కా సాత్ బదులుగా ప్రతి సీజన్లోనూ మతపరమైన విభజన మాత్రమే కర్తవ్యంగా మిగిలిపోతోంది. ఈ విషయంలో యోగి ఆదిత్య నాథ్, అమిత్ షా దాని పెద్ద ఆయుధాలుగా మారిపోయారు. అంటే తన సొంత బ్రాండును, లేక ప్రొడక్టును మోదీ నాటకీయం గానే వ్యతిరేక దిశకు మళ్లించేశారు మోదీ. తన సొంత పనితీరు, చేసిన వాగ్దానాల అమలు గురించి ఆలోచించడం మాని, తన ప్రత్యర్థుల ప్రాచీన గతానికి వ్యతిరేకంగా విమర్శలు చేస్తూ ఓట్లు దండుకోవాలని ప్రయత్నించటం ఆశ్చర్యం కలిగిస్తోంది. పైగా తన వాగ్దానాల విష యంలో మోదీ తీరు ఎలా ఉందంటే, ‘ఓహ్, వారు ఉద్యోగాలు అడుగు తున్నారా? అయితే వారికి తలొక ఆవును ఇవ్వండి చాలు..’ పనిచేయని గోరక్షణ మరోవైపున భారత్‌లో ఉద్యోగాలులేని యువసైన్యం గ్రామీణ ప్రాంతాల్లో కేరమ్స్, పేకాట అడుకుంటా గడిపేస్తున్నారు లేకపోతే ఊరకే పొగ తాగుతూ, చాట్ చేస్తూ, దాదాపుగా ఉచిత డేటాను అందిస్తున్న చైనీస్ స్మార్ట్ ఫోన్లలో చెత్తనంటినీ చూస్తూ పొద్దుçపుచ్చుతున్నారు. కానీ వీరిలో ఆగ్రహం, నిరాశ పెరిగిపోతోంది. మోదీని అధికారంలోకి తీసు కొచ్చిన వారి ఆకాంక్షలు, ఆత్మగౌరవ తృష్ణ వంటివాటిని బలిపెట్టడానికి కూడా వెనుదీయని వీరు ఇప్పుడు తమ హృదయం నిండా గోరక్షణ కర్తవ్యసాధనలో మునిగిపోతున్నట్లు కనిపిస్తున్నారు. కాని ఇటీవలే ముగి సిన అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో ఈ పవిత్ర కర్తవ్యం పనిచేసినట్లులేదు. నరేంద్రమోదీ పచ్చి వ్యతిరేకులు, కార్యకర్తలు ఈ ఎన్నికల్లో వచ్చిన ఫలితాలను గ్రామీణ, రైతుల దుస్థితి ఫలితమే అని ఎవరైనా విశ్లేషిం చవచ్చు. కానీ బీజేపీ ఈ రాష్ట్రాల్లోని చాలా నగరాలను కూడా పోగొట్టు కుంది. మోదీ మద్దతుదార్లలో చాలా పెద్ద, గొంతుబలం కలిగిన, ఆశా వాదులు పట్ణణ, సెమీ అర్బన్ మధ్యతరగతులకు చెందిన వారు, నిరు ద్యోగ యువతే మరి. 2018లో నెహ్రూను పునరుత్థానం చెందించి మళ్లీ ఆయన్ని సమాధి చేయాలన్న పిలుపును వీరెవరూ పెద్దగా పట్టించుకు న్నట్లు కనిపించలేదు. గందరగోళపడుతున్న ఓటర్లు 2014 సార్వత్రిక ఎన్నికల తీర్పు తర్వాత, భారత్‌లో సహస్రాబ్దిలో, భావజాలరహిత తరం ఆవిర్భవించిందని నేను రాశాను. నేను నీకేమీ బాకీ లేను అనే తరహా తరం పుట్టుకొచ్చింది. రాజరికానికి, వంశపాల నకు సంబంధించిన ప్రతి ఒక్కదాన్ని వారు తోసిపుచ్చేశారు. ఆ ప్రకారమే కాంగ్రెస్‌ను శూన్యంలోకి నెట్టేశారు. కానీ ఇప్పుడు మోదీ, షాలు ఆ వంశ పాలనకే వ్యతిరేకంగా పోరాడమని మళ్లీ పిలుపు ఇస్తున్నారు. కానీ ఇది పనిచేయడం లేదు. ఓటర్లు గందరగోళ పడుతున్నారు. వారి ప్రశ్న ఒకటే. ‘నేను ఆలోచిస్తున్న వ్యక్తి మీరేనా?’ 2014 నాటి మేధోవంతమైన కేంపెయిన్‌లో సోనియా గాంధీ ఆమె సంక్షేమవాదం గురించి ఒక అద్భుతమైన కథను నరేంద్ర మోదీ జనా లకు చెప్పేవారు. ఒక రైతు అడవిలో వెళుతూ ఆకలితో ఉన్న సింహం దారికి అడ్డంగా నడి చాడు. అతడిని చంపి తినేయాలని సింహం మాటు గాచింది. కానీ రైతు ప్రశాంతంగా ఉన్నాడు. ఆత్మహత్యా ప్రయత్నానికి దిగకు, అంటూ అతడు సింహాన్ని హెచ్చరించాడు. లేకుంటే నిన్ను నా తుపాకితో కాల్చే స్తాను. సింహం ఆగింది. రైతుకేసి తీక్షణంగా చూసింది. కానీ తుపాకి ఏదీ అని అడిగింది. ఆ రైతు తన కుర్తా జేబునుంచి మడిచిన కాగితం బయటకు లాగాడు. ‘‘ఇదిగో ఇక్కడ ఉంది షేర్ భాయ్, తుపాకి ఇంకా దొరకలేదు కానీ సోనియా గాంధీ నాకు గన్ లైసెన్స్ ఇచ్చింది మరి’’. వేలాదిమంది జనం పకపక నవ్వారు. వారు ఈ కథ లోని సందేశం అర్ధం చేసుకున్నారు. దారిద్య్రం, నిరుద్యోగం, భవిష్యత్తుపై ఆకాంక్షలను కేవలం హక్కుదారీ పథకాలు నెరవేర్చలేవు. హక్కులు సంక్రమింపజేసే చట్టాలు(ఆ రైతుకు తుపాకి లైసెన్స్ ఇవ్వడంలాంటివి) మద్దతిచ్చినా సరే ఆ సమస్యలు తీరవు. పైగా జాతీయ ఉపాధి పథకం అనేది దశాబ్దాల కాంగ్రెస్ ప్రభుత్వాల తీవ్ర వైఫల్యానికి అతి గొప్ప సాక్ష్యమని మోదీ విమర్శించారు. కానీ అదే పథకంలోకి తానే ఇప్పుడు మరింత డబ్బు గుప్పిస్తున్నారు. ఇక ఆయుష్మాన్ భారత్ పేదల ఆరోగ్యం కోసం మోదీ ఇస్తున్న తుపాకి లైసెన్సులా ఉంది. 2014లో మోదీ ఒక వంశ పాలనను ఓడించారుగానీ దాని రాజకీయ ఆర్థిక శాస్త్రాన్ని మాత్రం కౌగలించు కున్నారు. సిద్ధాంతాలతో పనిలేకుండా 2014 నుంచి గత సంవత్సరం ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల వరకూ మోదీని చూసి ఓట్లు కుమ్మరించిన ఓటర్లు ఇప్పుడు అదే మోదీ విధానాలను చూసి గందరగోళంలో పడు తున్నారు. 2014లో నరేంద్రమోదీ, అమిత్‌షాలు తమకు ఎదురే లేదు అన్న విధంగా కేంద్ర రాజకీయాల్లో ప్రవేశించారు. కానీ ఇప్పుడు వారే ఆగ్ర హిస్తున్నారు. గదమాయిస్తున్నారు. తామే బాధితులమని వాపోతు న్నారు. ప్రతికూల వ్యాఖ్యలు చేస్తున్నారు. ఇప్పటికే ఓడిపోయిన తమ ప్రత్యర్థులకు వ్యతిరేకంగా ఓట్లు అడుగుతున్నారు తప్ప తమకు ఓటేయ వలసిందిగా వీరిప్పుడు అడగటం లేదు. గెలిచే టిక్కెట్లను తమ వద్ద ఉంచుకుని కూడా ఇలా తమను ప్రతిపక్ష స్థానంలోకి ఎందుకు మార్చు కుంటున్నారు అనేది గమనించినట్టయితే మనముందు లేని అలీక్ పద మ్సే కూడా పకపకా నవ్వుతారు కాబోలు! వ్యాసకర్త: శేఖర్ గుప్తా, ద ప్రింట్ చైర్మన్, ఎడిటర్–ఇన్–చీఫ్, twitter@shekargupta -
‘కేసీఆర్ ఫెడరల్ ఫ్రంట్ దానికోసమే’
సాక్షి, న్యూఢిల్లీ : ‘సబ్ కా సాథ్ సబ్ కా వికాస్’ నినాదంతో ఊదరగొట్టిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాలుగేళ్ల పాలనలో కార్పొరేట్ శక్తులు మాత్రమే వికాసం చెందాయని సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్ రెడ్డి వ్యాఖ్యానించారు. జాతీయ ప్రజాస్వామ్య కూటమి(ఎన్డీయే) నాలుగు సంవత్సరాల దుష్టపాలనలో రైతులు తీవ్ర అన్యాయానికి గురయ్యారని అన్నారు. పార్టీ కార్యాలయంలో మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు. దేశ వాసులందరికీ మంచి రోజులు (అచ్చేదిన్) తెస్తామని చెప్పి గద్దెనెక్కిన మోదీ పాలనలో.. వ్యాపార వర్గాలకు మాత్రమే అచ్చేదిన్ వచ్చాయని ధ్వజమెత్తారు. పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్ ధరలు విపరీతంగా పెంచి సామాన్యులను ముంచుతున్నారని మండిపడ్డారు. ఇంధన ధరల పెంపునకు వ్యతిరేకంగా సీపీఐ నేతృత్వంలో ఈ నెల 20న దేశవ్యాప్తంగా ఆందోళన చేపడతామన్నారు. మోదీ నాలుగేళ్ల దుష్ట పరిపాలనపై ఆగస్టు 1 నుంచి 14 వరకు దేశవ్యాప్తంగా ప్రచారం చేస్తామని తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా కోరుతూ.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు చేసిన రాజీనామాలు స్పీకర్ ఎందుకు ఆమోదించడం లేదో అర్థం కావడం లేదన్నారు. వైఎస్సార్ సీసీ ఎంపీల రాజీనామాలను ప్రశ్నించే చంద్రబాబు, తొలుత ఆ పార్టీ నుంచి టీడీపీలోకి వచ్చిన ఎమ్మెల్యేలతో ఎందుకు రాజీనామా చేయించలేదో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. షరతులు లేకుండా వస్తే వైఎస్సార్ సీపీతో పొత్తు పెట్టుకోవడానికి సిద్ధమేనని ప్రకటించారు. కేసీఆర్ ప్రతిపాదించిన ఫెడరల్ ఫ్రంట్‌కు దేశ వ్యాప్త ప్రచారం లభించడం లేదన్నారు. మోదీకి వ్యతిరేకంగా ఏర్పాటవుతున్న ప్రతిపక్షాల కూటమిని దెబ్బ కొట్టడానికే కేసీఆర్ ఫెడరల్ ఫ్రంట్ భావన తెచ్చారని ఆరోపించారు. -
మా పాలనకు ప్రజామోదం
కటక్, భువనేశ్వర్: కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం సరైన దారిలోనే పయనిస్తోందని, ప్రజలు తమకు ఆమోద ముద్ర వేశారని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. 20 రాష్ట్రాల్లో బీజేపీ అధికారంలో కొనసాగడమే అందుకు నిదర్శమని ఆయన చెప్పారు. దేశం దుష్పరిపాలన నుంచి సుపరిపాలనకు, నల్లధనం నుంచి ప్రజాధనం వైపుగా అడుగులు వేస్తోందని అన్నారు. ఈ నాలుగేళ్ల పాలన అనంతరం.. దేశం మారగలదన్న నమ్మకం ప్రజల్లో కలిగిందన్నారు. ఎన్డీఏ ప్రభుత్వం నాలుగో వార్షికోత్సవం సందర్భంగా ఒడిశాలోని కటక్‌లో జరిగిన బహిరంగ సభలో మోదీ ప్రసంగిస్తూ.. ఎన్డీఏ ప్రభుత్వం చేపట్టిన అవినీతి వ్యతిరేక పోరాటం అనేకమంది వెన్నులో వణుకు పుట్టించిందని, దాంతో విపక్షాలు ఒకే వేదికపైకి చేరాయని విమర్శించారు. ‘సబ్కా సాత్.. సబ్కా వికాస్ నినాదంతో ఎన్డీఏ ప్రభుత్వం పనిచేయడాన్ని అందరూ గమనించారు. కఠిన నిర్ణయాలు తీసుకోవడానికి భయపడే ప్రభుత్వం మాది కాదు. సర్జికల్ దాడులు నిర్వహించగల సత్తా ఎన్డీఏ సర్కారుకు ఉంది అలాగే అక్రమ ఆదాయం, ఆస్తులపై వివిధ దర్యాప్తు సంస్థలు మూడు వేల దాడులు నిర్వహించాయి. రూ. 53 వేల కోట్ల అక్రమాదాయం బయటపడింది. బినామీ చట్టం కింద రూ. 3500 కోట్ల ఆస్తుల్ని స్వాధీనం చేసుకున్నాం. అవినీతి కేసుల్లో నలుగురు మాజీ సీఎంలు జైళ్లలో ఉన్నారు. 2.26 లక్షల డొల్ల కంపెనీల్ని రద్దు చేశాం. నల్లధనానికి వ్యతిరేకంగా తీసుకున్న కఠిన నిర్ణయాలతో వెన్నులో వణుకు పుట్టిన అనేకమంది.. ఒకే వేదికపైకి చేరారు’ అని ఇటీవల కుమారస్వామి ప్రమాణస్వీకారం సందర్భంగా విపక్షాల ఐక్యతను పరోక్షంగా విమర్శించారు. ప్రజానుకూల పథకాలు చేపట్టాం.. కాలం చెల్లిన చట్టాల్ని పక్కనపెట్టామని, గత నాలుగేళ్లుగా ప్రపంచం ఒక కొత్త భారతదేశాన్ని చూస్తోందని ప్రధాని పేర్కొన్నారు. ‘స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి 2014 వరకూ దేశంలో 6 కోట్ల మరుగుదొడ్లను నిర్మిస్తే.. ఈ నాలుగేళ్ల కాలంలో 7.5 కోట్ల మరుగుదొడ్లను నిర్మించాం. ఎన్డీఏ హయాంలో ప్రతి ఇంటికీ విద్యుత్ వెలుగులు అందాయి. 25 కోట్ల జన్‌ధన్ బ్యాంకు ఖాతాల్ని ఇచ్చాం. 10 కోట్ల మంది గ్యాస్ కనెక్షన్లు అందచేశాం. మా హయాంలో పారిశుద్ధ్య సౌకర్యాల్ని రెండింతలు మెరుగుపర్చాం. గత నాలుగేళ్లలో భారీగా నక్సలైట్లు లొంగిపోయారు. దేశ ప్రజలు అభివృద్ధిని కోరుకుంటున్నారు. అందుకే మా విధానాలు కూడా ప్రజానుకూలంగా ఉన్నాయి’ అని చెప్పారు. ఈ సందర్భంగా ఎన్డీఏ ప్రభుత్వం ప్రారంభించిన పలు పథకాల్ని మోదీ ప్రస్తావించారు. కాంగ్రెస్ పార్టీది ఎప్పుడూ అధికార యావ అని మోదీ విమర్శించారు. శనివారం కటక్‌లో జరిగిన సభలో ప్రజలకు అభివాదం చేస్తున్న మోదీ ప్రజా ఉద్యమంగా ఎన్డీఏ అభివృద్ధి పనులు గత నాలుగేళ్లలో ఎన్డీఏ చేపట్టిన అభివృద్ధి ఉత్సాహపూరిత ప్రజా ఉద్యమంగా మారిందని ట్విట్టర్లో మోదీ పేర్కొన్నారు. ‘2014లో ఇదే రోజున దేశ పరివర్తన కోసం మన ప్రయాణాన్ని ప్రారంభించాము. దేశం వృద్ధి పథంలో ప్రతి పౌరుడు భాగస్వామి అయ్యాడు. 125 కోట్ల మంది భారతీయులు దేశాన్ని ఉన్నత శిఖరాల వైపు తీసుకెళ్తున్నారు’ అని అన్నారు. ‘సాఫ్ నియత్, సహీ వికాస్’(మంచి ఉద్దేశం, సరైన అభివృద్ధి) హ్యాష్‌ట్యాగ్‌లతో ప్రభుత్వ విజయాల్ని ప్రస్తావిస్తూ పలు చార్ట్‌లు, గ్రాఫిక్స్, వీడియోల్ని పోస్టు చేశారు. ‘కేంద్ర ప్రభుత్వం పట్ల ప్రజల దృఢమైన నమ్మకానికి నేను నమస్కరిస్తున్నా. మీ మద్దతు, వాత్సల్యం ప్రభుత్వానికి ప్రేరణ, బలం’ అని ట్వీట్ చేశారు. ఉత్సాహం, అంకితభావంతో ప్రజలకు సేవచేయడాన్ని తమ ప్రభుత్వం కొనసాగిస్తుందని ప్రధాని నొక్కిచెప్పారు. ముందుచూపుతో ప్రజలకు సాయం చేసే నిర్ణయాలు తీసుకున్నామని సరికొత్త భారతావనికి అవి పునాదులు వేశాయని చెప్పారు. -
మోదీ విజన్‌కు కెర్రీ ఫిదా!
ప్రధాని కార్యక్రమాలపై అమెరికా విదేశాంగ మంత్రి ప్రశంసల జల్లు గాంధీనగర్: ప్రధాని మోదీ విజన్‌పై అమెరికా విదేశాంగ మంత్రి జాన్ కెర్రీ ప్రశంసల వర్షం కురిపించారు. ‘మేకిన్ ఇండియా’, ‘సబ్కా సాత్ సబ్కా వికాస్’ కార్యక్రమాలు అద్భుతమన్నారు. సమ్మిళిత వృద్ధిని కాంక్షించే ‘సబ్కా సాత్ సబ్కా వికాస్’ నినాదం విశ్వవ్యాప్తం కావాలని అభిలషించారు. ఆదివారమిక్కడ వైబ్రెంట్ గుజరాత్ సదస్సులో కెర్రీ ప్రసంగించారు. భారత్-అమెరికా సంబంధాలను మరింత బలోపేతం చేసుకుకోవడానికి పుష్కలమైన అవకాశాలు ఉన్నాయని, ఇంతకుమించిన మంచి తరుణం దొరకదని అన్నారు. ద్వైపాక్షిక సంబంధాల్లో సరికొత్త అధ్యాయానికి మేకిన్ ఇండియా నినాదం ‘గెలువు-గెలిపించు’ స్ఫూర్తిగా నిలవాలన్నారు. రైళ్లలో టీ అమ్ముకున్న ఒక వ్యక్తి భారత అత్యున్నత పీఠంపై కూర్చున్నారంటూ మోదీని అభినందించారు. ‘ఈరోజు సరికొత్త భారత నిర్మాణానికి జరుగుతున్న ఈ కార్యక్రమంలో సంతోషంగా భాగస్వాములం అవుతున్నాం. ఎన్నికల సమయంలో మోదీ ఇచ్చిన సబ్కా సాత్ సబ్కా వికాస్ నినాదం నన్నెంతో ఆకట్టుకుంది’ అని అన్నారు. మోదీ చేపట్టిన మేకిన్ ఇండియా కార్యక్రమం విజయవంతం అయ్యేందుకు సహకారం అందిస్తామన్నారు. గణతంత్ర వేడుకల్లో పాల్గొనేందుకు తమ అధ్యక్షుడు ఒబామా ఉత్సాహంగా ఎదురుచూస్తున్నారని చెప్పారు. భారత్‌తో వాణిజ్య బంధాలు మరింత బలోపేతం చేసుకుంటామని కెర్రీ పేర్కొన్నారు. ‘వస్తువులు, సేవలకు సంబంధించిన వాణిజ్యం ఇరుదేశాల మధ్య 2000 సంవత్సరంతో పోలిస్తే ఐదు రెట్లు పెరిగింది. ద్వైపాక్షిక పెట్టుబడులు 30 బిలి యన్ డాలర్లకు చేరాయి. ఇరు దేశాల మధ్య వార్షిక వాణిజ్యం ఐదు రెట్లు పెరగాలని మోదీ ఆకాంక్షిస్తున్నారు. అందుకు అనుగుణంగా మేం కూడా చర్యలు చేపడతాం. ప్రజల ఆకాంక్షలను ప్రజాస్వామ్యమే నెరవేరుస్తుందని నిరూపించే ఉమ్మడి బాధ్యత రెండు దేశాలపైనా ఉంది’ అని వ్యాఖ్యానించారు. అనంతరం కెర్రీ ప్రధాని మోదీతో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. పలు ద్వైపాక్షిక అంశాలపై చర్చించారు. ఆయన ఇక్కడి గాంధీ ఆశ్రమా న్ని కూడా సందర్శించి మహిళలతో ముచ్చటించారు. ఆయన వెంట అహ్మదాబాద్‌కు చెందిన నిషా బిస్వాల్ ఉన్నారు. ఆమె ప్రస్తు తం అమెరికా దక్షిణ, మధ్య ఆసియా వ్యవహారాల శాఖకు ఉపమంత్రిగా ఉన్నారు. -
నరేంద్ర మోడీకి యుఎస్ ప్రశంసలు
వాషింగ్టన్: అభివృద్ధిపై ప్రధాని నరేంద్ర మోడీ ప్రణాళిక ఆయన ఎన్నికల నినాదంలోనే ప్రతిఫలించిందని అమెరికా విదేశాంగ శాఖ మంత్రి జాన్ కెర్రీ అన్నారు. ’అందరితో కలసి, అందరి అభివృద్ధి కోసం’ (సబ్కా సాత్, సబ్కా వికాస్) అన్న నినాదం ఎంతో దార్శనికతతో కూడుకున్నదని ఆయన ప్రశంసించారు. మంగళవారం భారత్ పర్యటనకు బయలుదేరుతున్న సందర్భంగా జాన్ కెర్రీ వాషింగ్టన్లో ఈ వ్యాఖ్యలు చేశారు. భారత్, అమెరికా దేశాల మధ్య జరగనున్న ఐదవ వార్షిక వ్యూహాత్మక చర్చలకు విదేశాంగ మంత్రి సుష్మాస్వరాజ్‌తో కలసి ఆయన అధ్యక్షత వహించనున్నారు. భారత పర్యటనకు కెర్రీ బయలుదేరే సమయంలో నరేంద్ర మోడీ అభివృద్ధి అజెండాపై ప్రశంసల వర్షం కురిపించారు. భారత్‌లో మోడీ నేతత్వంలోని కొత్త ప్రభుత్వం కృషిలో భాగస్వామి అయ్యేందుకు అమెరికా సంసిద్ధంగా ఉందని స్పష్టంచేశారు. మోడీ ప్రభుత్వ అభివృద్ధి నినాదానికి తాము మద్దతు ఇస్తున్నామన్నారు. భారత్ ఆర్థిక వ్యవస్థ పునరుజ్జీవంలో అమెరికా ప్రైవేటు రంగం ప్రోత్సాహకారిగా పనిచేస్తుందని చెప్పారు. అమెరికన్ ప్రోగ్రెస్ సెంటర్ ఆధ్వర్యంలో వాషింగ్టన్లో జరిగిన కార్యక్రమంలో కెర్రీ ప్రసంగిస్తూ, వస్తుతయారీ, మౌలిక సదుపాయాలు, ఆరోగ్య రక్షణ, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ తదితర రంగాల్లో భారత్ అభివృద్ధి కోసం అమెరికా కంపెనీలు సహకరిస్తాయన్నారు. పొరుగు దేశాలతో సంబంధాల మెరుగుదల కోసం నరేంద్ర మోడీ తీసుకున్న చర్యలపై కూడా కెర్రీ ప్రశంసలు కురిపించారు. ప్రధానమంత్రిగా తన ప్రమాణ స్వీకారోత్సవానికి పాకిస్థాన్ ప్రధాని నవాజ్ షరీఫ్‌ను పిలవడం, ఉభయదేశాల మధ్య సంబంధాల మెరుగుపరిచే దిశగా మోడీ చేపట్టిన మొదటి చర్యగా అభివర్ణించారు. ఉభయదేశాల శ్రేయస్సు, సుస్థిరత కోసం భారత్, పాకిస్థాన్ కలసి పనిచేసేలా అమెరికా అన్నివిధాలా సహాయం అందిస్తుందని కెర్రీ చెప్పారు.