నా సహ భారతీయుడా: ప్రధాని మోదీ | Prime Minister Letter On Completion Of One Year Government At Centre | Sakshi
Sakshi News home page

ఏడాది పాలన: ప్రజలకు మోదీ లేఖ

Published Sat, May 30 2020 9:35 AM | Last Updated on Sat, May 30 2020 11:45 AM

Prime Minister Letter On Completion Of One Year Government At Centre - Sakshi

న్యూఢిల్లీ : భారత ప్రధానిగా రెండోసారి బాధ్యతలు చేపట్టిన నరేంద్ర మోదీ ప్రభుత్వం శనివారంతో ఏడాది పాలన పూర్తి చేసుకుంది. గడిచిన తొలి ఏడాది పాలనలో మోదీ నేతృత్వంలోని బీజేపీ సర్కార్‌ ఎన్నో కీలక సంస్కరణలు తీసుకు వచ్చింది. ఏళ్ల తరబడి మూలుగుతున్న సమస్యలను తుడిచిపెట్టి దేశ వ్యాప్తంగా తనదైన ముద్ర వేశారు. 2019 లో జరిగిన  ఎన్నికల్లో బీజేపీ అఖండ విజయం సాధించి కేంద్రంలో మరోసారి పాగ వేసింది. దేశంలోని ప్రతి పౌరుడి కలను సాకారం చేస్తూ భారత్ స్థాయిని ఉన్నత శిఖరాలకు తీసుకెళ్తూ.. ప్రపంచ నాయకుడిగా మోదీ కీర్తి గడించారు. ఈ ఏడాది కాలంలో ఎన్నో సమస్యాత్మక అంశాలను సులువు చేసి అనేక విజయాలను మోదీ తన ఖాతాలో వేసుకున్నారు. వివాదాస్పద ట్రిపుల్‌ తలాక్‌ బిల్లు, పౌరసత్వ చట్ట సవరణ, ఆర్టికల్‌ 370 రద్దు, అయోద్య వివాదం వంటి వాటికి శాశ్వత పరిష్కారం చూపించారు. (ఎన్నో ముడులు విప్పిన మోదీ)

కేంద్రంలో రెండోసారి పాలక పగ్గాలు చేపట్టి ఏడాది పూర్తవుతున్న సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ దేశ పౌరులకు బహిరంగ లేఖ రాశారు. లేఖలో ఏడాది కాలంగా తీసుకున్న కీలక నిర్ణయాలను ప్రస్తావించారు. ‘‘నా దేశ పౌరులారా.. గతేడాది ఇదే రోజు భారత ప్రజాస్వామ్య చరిత్రలో ఒక సువర్ణాధ్యాయం ప్రారంభమైంది. అనేక దశాబ్దాల తరువాత దేశ ప్రజలు పూర్తి మెజారిటీతో పూర్తికాలం అధికారం కట్టబెట్టారు. మరోసారి 130 కోట్ల భారతీయులకు, దేశ ప్రజాస్వామ్య సంస్కృతికి తలవంచి నమస్కరిస్తున్నా. మీ ప్రేమ, సహృదయత, చురుకైన సహకారం కొత్త శక్తిని, స్ఫూర్తిని ఇచ్చాయి. సాధారణ సమయంలో అయితే మీ మధ్యనే ఉండేవాణ్ణి. అయితే, ఇప్పుడున్న పరిస్థితులు నన్ను అనుమతించటం లేదు. అందుకే ఈ లేఖ ద్వారా మీ ఆశీస్సులు కోరుకుంటున్నా.అంటూ మోదీ పేర్కొన్నారు. (ప్రధానితో అమిత్‌ షా భేటీ)

2014 లో దేశ ప్రజలు మార్పు కోరుకుంటూ ఓటు వేశారు. అంతకు ముందు అయిదేళ్ళలో పరిపాలనా యంత్రాంగం ఎలా విఫలమైందో దేశం చూసింది. ఆ తరువాత అవినీతికి దూరంగా జరిగి, పరిపాలనను గాడిలో పెట్టటం చూశారు. ’అంత్యోదయ’ స్ఫూర్తి కి పూర్తిగా కట్టుబడి లక్షలాది ప్రజల జీవితాల్లో మార్పు తీసుకు రాగలిగాం. 2014 నుంచి 2019 వరకు భారత ప్రతిష్ఠ గణనీయంగా పెరిగింది. పేదల గౌరవం పెరిగింది. దేశం ఆర్థికంగా అందరినీ కలుపుకోవటం జరిగింది. ఉచిత గ్యాస్, విద్యుత్ కనెక్షన్లు, సంపూర్ణ పారిశుద్ధ్యం సాధించటంతోబాటు ”అందరికీ ఇళ్ళు" సార్థకమయ్యేలా పురోగతి సాధించాం.సర్జికల్ స్ట్రైక్స్, వైమానిక దాడుల ద్వారా భారత్ తన శక్తిని చాటుకుంది. అదే సమయంలో శతాబ్దాలుగా సాగుతున్న వన్ రాంక్-వన్ పెన్షన్, వన్ నేషన్ - వన్ టాక్స్ , మెరుగైన గరిష్ఠ మద్దతు ధర లాంటివి సాకారం చేసుకున్నాం.

సబ్ కా సాథ్, సబ్ కా వికాస్
2019 లో భారత ప్రజలు కేవలం కొనసాగింపు కోసమే  ఓటు వేయలేదు. భారత్ను సమున్నతంగా చూడాలన్న కల సాకారం కావటానికి ఓటు వేశారు. భారత్ను ప్రపంచ నాయకత్వ స్థానంలో చూడాలన్నదే ఆ కల. గత ఏడాది కాలంలో తీసుకున్న నిర్ణయాలు ఆ కలను సాకారం చేయటానికి తీసుకున్నవే. ఈనాడు దేశ అభివృద్ధి పథంలో 130 కోట్ల మంది ప్రజలు మమేకమయ్యారు, సమీకృతమయ్యారు. జన శక్తి, రాష్ట్ర శక్తి అనే దీపకాంతులు యావద్దేశాన్నీ  వెలిగించాయి. సబ్ కా సాథ్, సబ్ కా వికాస్, సబ్ కా విశ్వాస్ అనే మంత్రం ఇచ్చిన ఉత్తేజంతో భారత్ అన్ని రంగాలలో ముందడుగు వేస్తోంది.
(ఒక్క ఏడాది.. పెక్కు విజయాలు)

నా భారతీయ పౌరులరా, గడిచిన ఏడాది కాలంలో కొన్ని నిర్ణయాలను విస్తృతంగా చర్చించటంతోపాటు బహిరంగ సభలలో కూడా ప్రస్తావించారు. ఆర్టికల్ 370 దేశ సమైక్యతనుమ, సమగ్రతా స్ఫూర్తిని మరింతగా పెంచింది. గౌరవ సుప్రీంకోర్టు ఏకగ్రీవంగా ఇచ్చిన రామమందిరం తీర్పు శతాబ్దాలకాలంగా సాగుతున్న చర్చకు సుహృద్భావపు ముగింపునిచ్చింది. క్రూరమైన ట్రిపుల్ తలాక్ విధానాన్ని చరిత్ర అనే చెత్తబుట్టకు పరిమితం చేశాం. పౌరసత్వ చట్టానికి చేసిన సవరణ భారతదేశపు కరుణ, కలుపుకుపోయే తత్వాన్ని చాటిచెప్పింది. కానీ దేశాన్ని అభివృద్ధిపథంలో పరుగులు పెట్టించిన నిర్ణయాలు ఇంకా అనేకం ఉన్నాయి. 

జల్ జీవన్ మిషన్‌
త్రివిధ దళాల అధిపతి పదవిని సృష్టించటమన్నది ఎంతో కాలంగా పెండింగ్లో ఉన్న ఒక సంస్కరణ. దీనివలన సాయుధ దళాల మధ్య సమన్వయం మెరుగుపడింది. అదే సమయంలో భారత్ తన మిషన్ గగన్ యాన్ ఏర్పాట్లను వేగవంతం చేసింది. పేదలను, రైతులను, మహిళలను, యువతను బలోపేతం చేయటం మన ప్రాధాన్యంగా మిగిలింది. పీఎం కిసాన్ సమ్మాన్ నిధి ఇప్పుడు రైతులందరికీ వర్తిస్తోంది. కేవలం ఏడాది కాలంలో 72,000 కోట్ల రూపాయలు  9 కోట్ల  50 లక్షలమంది రైతుల ఖాతాల్లో  జమ అయ్యాయి. జల్ జీవన్ మిషన్ ద్వారా 15 కోట్లకు పైగా గ్రామీణ గృహాలకు పైపుల ద్వారా త్రాగు నీటి సరఫరా జరిగేట్టు చూశాం. మన 50 కోట్ల పశువుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని  పెద్ద ఎత్తున ఉచిత టీకాల కార్యక్రమం చేపట్టాం. మన దేశ చరిత్రలో మొట్టమొదటి సారిగా రైతులు, రైతు కూలీలు, చిన్న దుకాణ దారులు, అసంఘటిత రంగంలోని కార్మికులకు 60 ఏళ్ళు పైబడ్డాక రూ. 3000 వంతున నెలసరి పెన్షన్ క్రమం తప్పకుండా అందే ఏర్పాటు చేశాం. 

బాంకు రుణాలను వాడుకునే సౌకర్యంతో బాటు మత్స్యకారులకోసం ఒక ప్రత్యేక విభాగాన్ని కూడా ఏర్పాటు చేశాం. మత్స్య రంగాన్ని బలోపేతం చేయటం  కోసం అనేక ఇతర నిర్ణయాలు కూడా తీసుకున్నాం. ఇది నీలి ఆర్థిక వ్యవస్థ పుంజుకోవటానికి దోహదపడుతుంది. అదే విధంగా, వర్తకుల సమస్యలు సకాలంలో పరిష్కరించటానికి వీలుగా వ్యాపారి కల్యాణ్ బోర్డ్ ఏర్పాటు చేయాలని నిర్ణయించాం. స్వయం సహాయక బృందాలలోని 7 కోట్లమంది మహిళలకు ఎక్కువ మొత్తంలో ఆర్థిక సహాయం అందేలా చర్యలు తీసుకున్నాం. ఇటీవలే స్వయం సహాయక బృందాలకిచ్చే హామీ లేని రుణాలను అంతకు ముందున్న 10 లక్షల నుంచి రెట్టింపు చేసి 20  లక్షలకు పెంచాం. గిరిజన బాలబాలికల చదువులను దృష్టిలో పెట్టుకొని కొత్తగా 400 కు పైగా ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ పాఠశాలలు నిర్మించటం ప్రారంభించాం. (మోదీ 2.0)

గడిచిన ఏడాది కాలంలో అనేక ప్రజానుకూల చట్టాలు రూపొందించాం. ఉత్పాదకత పరంగా మన పార్లమెంట్ దశాబ్దాలనాటి రికార్డును బద్దలు కొట్టింది. దాని ఫలితంగా వినియోగదారుల రక్షణ చట్టం కావచ్చు, చిట్ ఫండ్ చట్టాల సవరణ కావచ్చు, మహిళలకు, దివ్యాంగులకు మరింత రక్షణనిచ్చే చట్టాలు కావచ్చు. వాటిని పార్లమెంట్ ఆమోదించటం వేగవంతమైంది. ప్రభుత్వ విధానాలు, నిర్ణయాల కారణంగా గ్రామీణ-పట్టణ ప్రాంతాల మధ్య అంతరం తగ్గిపోతోంది. మొట్టమొదటి సారిగా గ్రామీణ భారతంలో ఇంటర్నెట్ వాడకం దారుల సంఖ్య పట్టణప్రాంతం వారికంటే 10% ఎక్కువగా నమోదైంది. దేశ ప్రయోజనాల దృష్ట్యా తీసుకున్న అలాంటి చరిత్రాత్మక చర్యలు,  నిర్ణయాల జాబితా ఈ లేఖలో ప్రస్తావించటం సాధ్యం కానంత పొడవైనది. కానీ ఈ ఏడాదిలో ప్రతి రోజూ నా ప్రభుత్వం ఈ నిర్ణయాల అమలుకోసం రేయింబవళ్ళూ చురుగ్గా పనిచేస్తూ వచ్చింది. 

అత్యాధునిక ఆరోగ్య వ్యవస్థ
నా సహ భారతీయులారా, మన దేశ ప్రజల ఆశలు, ఆశయాల సాకారానికి మనం వేగంగా అడుగులు వేస్తున్న సమయంలో ప్రపంచమంతటా వ్యాపించిన  కరోనావైరస్ మనదేశాన్నీ  చుట్టుముట్టింది. ఒకవైపు గొప్ప ఆర్థిక వనరులున్న శక్తులు, అత్యాధునిక ఆరోగ్య వ్యవస్థలున్న దేశాలు ఉండగా,  మరోవైపు భారీ జనాభా, పరిమిత వనరులతో సమస్యల సుడిగుండంలో  ఉన్న మన దేశం  ఉంది. కరోనా భారత్ ను తాకినప్పుడు భారతదేశం ప్రపంచానికి ఒక సమస్యగా మారుతుందని చాలామంది కలవరపడ్దారు. కానీ మనవైపు ప్రపంచం చూస్తున్న తీరును మీరు మీ ఆత్మ విశ్వాసంతో చాకచక్యంతో ఈరోజు మార్చగలిగారు. భారతీయుల సమష్ఠి బలానికీ, సామర్థ్యానికీ శక్తిమంతమైన, సుసంపన్నమైన దేశాలు సైతం సరితూగలేవని  మీరు నిరూపించారు.

కరోనా యోధుల గౌరవార్థం చప్పట్లు కొట్టినా, దీపాలు వెలిగించినా, భారత సాయుధ దళాలను గౌరవించినా, జనతా కర్ఫ్యూ అయినా, దేశవ్యాప్త లాక్ డౌన్ నిబంధనలకు కట్టుబడటం అయినా ప్రతి సందర్భంలోనూ మీరు శ్రేష్ఠ్ భారత్ కు ఏక్ భారత్ను హామీగా ఇచ్చారు. ఇంతటి భారీ విపత్కర సంక్షోభంలో కచ్చితంగా  ఎవరూ, ఎలాంటి అసౌకర్యానికీ గురికాలేదనీ, బాధపడలేదనీ చెప్పటం లేదు. మన శ్రామికులు, వలస కార్మికులు, చేతి వృత్తులవారు, చిన్న తరహా పరిశ్రమలలోని హస్త కళాకారులు, బండ్ల వ్యాపారులు ఇంకా అలాంటి సోదరులెందరో అనేకానేక కష్టాలనెదుర్కున్నారు. వాళ్ళ సమస్యల తీవ్రత తగ్గించటానికి మనం కలసికట్టుగా పట్టుదలతో ముందుకు సాగుతున్నాం.

అయితే, మనం ఎదుర్కొంటున్న అసౌకర్యాలు మనకు ప్రమాదకర దుర్ఘటనలుగా మనం జాగ్రత్తలు తీసుకోవాలి. అందువలన నిబంధనలు, మార్గదర్శకాలు పాటించటం ప్రతి భారతీయుడికీ ముఖ్యమైన బాధ్యత. ఇప్పటిదాకా మనం ఎంతో ఓపికపట్టాం. దాన్ని అలాగే కొనసాగించాలి. భారతదేశం మిగిలిన అనేకదేశాలకంటే భద్రంగా, మెరుగైన స్థితిలో ఉండటానికి ముఖ్యమైన కారణాల్లో ఇదొకటి. ఇదొక సుదీర్ఘ పోరాటం. కానీ మనం ఇప్పటికే విజయపథంలో సాగుతున్నాం. విజయం మనందరి ఉమ్మడి దీక్షాఫలం. కొద్ది రోజుల కిందట ఒక మహా తుపాను పశ్చిమ బెంగాల్, ఒడిశా రాష్ట్రాల్లోని కొన్ని ప్రాంతాలను అతలాకుతలం చేసింది. అప్పుడు కూడా  ఈ రాష్ట్రాల ప్రజలు ప్రదర్శించిన తెలివి, నిబ్బరం చాలా గొప్పవి. వాళ్ళ ధైర్యం భారత ప్రజలందరికీ స్ఫూర్తిదాయకం.

కరోనా వైరస్ మీద సమష్ఠిగా పోరాటం
ప్రియ మిత్రులారా, ఇలాంటి సమయంలో భారత్ సహా వివిధ దేశాల ఆర్థిక వ్యవస్థలు ఎలా కోలుకుంటాయోనన్న విషయం మీద విస్తృతమైన చర్చ మొదలైంది. అయితే, ఈ విషయంలో భారత్ ప్రపంచాన్ని ఆశ్చర్యంలో ముంచెత్తింది. కరోనా వైరస్ మీద సమష్ఠిగా పోరాడుతునే ఆర్థిక వ్యవస్థ కోలుకునేట్టు చేసుకోవటంలో మనం ఒక ఉదాహరణగా నిలువగలిగాం. ఆర్థిక పరంగా 130 కోట్లమంది భారతీయులు ప్రపంచాన్ని ఆశ్చర్యపరచటంతోబాటు దానికి స్ఫూర్తిదాయకంగా నిలిచారు. మనం స్వయం సమృద్ధం కావాల్సిన సమయమిది. మన శక్తిసామర్థ్యాలతో మనదైన పంథాలో ముందుకు సాగాలి. ఆ పంథా ఒక్కటే... ఆత్మనిర్భర్ భారత్ లేదా స్వయం సమృద్ధ భారత్.

ఇటీవల ఆత్మనిర్భర్ భారత్  అభియాన్ కింద ప్రకటించిన రూ. 20 లక్షల కోట్ల పాకేజ్ ఈ దిశలో వేసిన కీలకమైన అడుగు. ఈ చొరవ ఫలితంగా ప్రతి భారతీయునికీ అవకాశాల పరంపర మొదలవుతుంది. అది రైతులు కావచ్చు, శ్రామికులు కావచ్చు,  చిన్న తరహా ఔత్సాహిక వ్యాపారులు కావచ్చు, స్టార్టప్ లతో సాగుతున్న యువత కావచ్చు. చెమటతో తడిసిన భారతదేశపు మట్టివాసన, కఠోరశ్రమ, మన శ్రామికుల ప్రతిభ ఫలితంగా భారతదేశం కచ్చితంగా దిగుమతుల మీద ఆధారపడటం తగ్గుతుంది. ఆ విధంగా స్వయం సమృద్ధి దిశగా సాగుతుంది. 

ప్రియ మిత్రులారా, గత ఆరేళ్ళ ఈ ప్రయాణంలో మీరు నిరంతరాయంగా నా మీద ప్రేమ కురిపించారు, ఆశీర్వదించారు. మీ ఆశీర్వాద బలమే దేశం చరిత్రాత్మక నిర్ణయాలు తీసుకునేలా చేసింది. గత ఏడాది కాలంలో వేగంగా పురోగతి సాధించేట్టు చేసింది. అయితే, చేయాల్సింది ఇంకా చాలా ఉందని నాకు తెలుసు. మన దేశం ఎదుర్కొంటున్న సవాళ్ళూ, సమస్యలూ చాలా ఉన్నాయి. నేను రేయింబవళ్ళూ పనిచేస్తున్నా. నాలో లోపాలు ఉండవచ్చు. కానీ మనదేశానికి మాత్రం ఏ లోటూ లేదు.అందుకే నా మీద నాకున్న నమ్మకం కంటే మీ మీద, మీ బలం మీద, మీ సామర్థ్యాలమీద నాకు నమ్మకమెక్కువ. 

నా పట్టుదలకు మూలకారణమైన బలం మీరూ, మీ మద్దతు, మీ ఆశీర్వాదాలు, ప్రేమ మాత్రమే ప్రపంచమంతటా వ్యాపించిన ఈ కరోనా మహమ్మారితో వచ్చింది కచ్చితంగా ఒక సంక్షోభ సమయమే. కానీ మన భారతీయులకు మాత్రం మరింత పట్టుదలతో వ్యవహరించాల్సిన సమయం కూడా. 130 కోట్ల ప్రజల వర్తమానాన్నీ, భవిష్యత్తునూ ఎలాంటి కష్టాలూ శాసించలేవని మనం ఎప్పుడూ గుర్తుంచుకోవాలి. మన వర్తమానాన్ని, మన భవిష్యత్తును మనమే నిర్ణయించుకుందాం. పురోగతి పథంలో ముందుగు సాగితే విజయం మన వశమవుతుంది. కృతమ్ మే దక్షిణే హస్తే, జయో మే సవ్య ఆహితః అంటారు. అంటే, ఒకచేత కార్యాచరణ, విధి నిర్వహణ ఉంటే, రెండో చేతికి విజయం ఖాయం అని. 

మన దేశ విజయం కోసం ప్రార్థిస్తూ, మీకు మరోమారు ప్రణమిల్లుతున్నా.  మీకు, మీ కుటుంబానికి నా హృదయపూర్వక శుభాకాంక్షలు.ఆరోగ్యంగా ఉండండి, సురక్షితంగా ఉండండి. అప్రమత్తంగా ఉండండి, తెలిసి నడుచుకొండి. మీ ప్రధాన సేవకుడు- నరేంద్ర మోదీ’’ గత ఏడాది కాలంగా చేపట్టిన వివిధ సంస్కరణల గురించి ప్రధాన మంత్రి నరేంద్రమోదీ సుదీర్ఘ లేఖ రాశారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement