సుజలం.. సఫలమివ్వాలి
విజయనగరం జిల్లా
వైఎస్ కృషితో నీటికళ... ఆయన మరణంతో పడకేసిన ప్రాజెక్టుల నిర్మాణాలు
న్యూస్‌లైన్, నెల్లిమర్ల, అన్నదాతలను రాచిరంపాన పెట్టిన చంద్రబాబు పాలనను గుర్తుచేస్తేనే రైతులు ఉలిక్కిపడుతున్నారు. ఆయన హయాంలో విజయనగరం జిల్లాలో ఒక్క ప్రాజెక్టు పూర్తికాలేదు. రైతుల కష్టాలను దూరం చేసేందుకు వైఎస్ అనేక ప్రాజెక్టులకు రూపకల్పన చేశారు. ఆయన మరణంతో వాటి నిర్మాణాలు నిలిచిపోయాయి.
చంద్రబాబు హయాంలో..
నెల్లిమర్ల, డెంకాడ, పూసపాటిరేగ, భోగాపురం మండలాల్లో ఎక్కడికి వెళ్లినా ఎండిపోయిన పంటలే కన్పించేవి. నెర్రెలుబారిన నేలలే దర్శనమిచ్చేవి. డెంకాడ, కుమిని గ్రోయింగ్ ఆనకట్టలు మినహా సాగునీటికి ఒక్క అవకాశమూ ఉండేది కాదు. వరుణుడు కరుణిస్తే 9 వేల ఎకరాల్లో వరి పండేది. మిగతా 16 వేల ఎకరాల్లో సరుగుడు, నీలగిరి తోటలే దిక్కయ్యేవి.
చంపావతిపై ప్రాజెక్టులు కడితే 25 వేల ఎకరాలకు నీరు ఇవ్వొచ్చని నిపుణులు నివేదికలు ఇస్తే, చంద్రబాబు సర్కారు కనీసం వాటిని తెరిచి చూసిన పాపానపోలేదు. ఎన్టీఆర్ హయాంలో తారకరామ ప్రాజెక్టు నిర్మించాలనే తలంపు వచ్చినా... చంద్రబాబు కాలంలో మాత్రం దాన్ని నిరర్థక ఆలోచనగానే భావించారు. ఫలితంగా ఉత్తరాంధ్రలోని విజయనగరం జిల్లాలో అనేక పల్లెలు ఎడారిని తలపించాయి.
వైఎస్ హయాంలో...
- రైతన్న ఆవేదన చూసి కలత చెందిన వైఎస్ తారకరామ తీర్థసాగర్ రిజర్వాయర్‌కు రూపకల్పన చేశారు. జలయజ్ఞం కింద భారీగా నిధులు వెచ్చించారు.
- పెద్దగడ్డ రిజర్వాయర్ కోసం చంద్రబాబు ఒక్కపైసా కూడా ఇవ్వకుండా నిర్లక్ష్యం చేస్తే... వైఎస్ ఏకంగా రూ.103.55 కోట్లు వెచ్చించారు. ఫలితంగా 12 వేల ఎకరాలు సాగులోకి వచ్చాయి.
- నెల్లిమర్ల నియోజకవర్గంలోని నాలుగు మండలాలకు సాగునీరు, జిల్లా కేంద్రానికి తాగునీరు అందించే ప్రాజెక్టుకు 2006లో వైఎస్ రూపకల్పన చేశారు. రూ.181 కోట్లు విడుదల చేశారు. 2008 నాటికి ప్రాజెక్టును పూర్తిచేయాలని భావించారు. కానీ టీడీపీ నేతలు భూ నిర్వాసితులను రాజకీయ లబ్ధికోసం వాడుకున్నారు. పరిహారం సాకుతో చట్టపరమైన చిక్కులు సృష్టించారు. వీటన్నింటినీ దాటుకుని ముందుకు వెళ్లేందుకు వైఎస్ రాజశేఖరరెడ్డి స్వయంగా అధికారులతో సంప్రదింపులు జరిపారు. ప్రాజెక్టుకు కావాల్సిన అనుమతుల కోసం ఆయనే కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడారు.
- చంద్రబాబు తొమ్మిదేళ్ల పాలనలో ఈ ప్రాజెక్టు కోసం కేవలం రూ.7.78 కోట్లు ఖర్చుచేస్తే, వైఎస్ నాలుగేళ్లలోనే రూ.64.56 కోట్లు వెచ్చించారు.
ఎదురుచూపులే మిగిలాయి
తారకరామ పూర్తికాకపోవడంతో ప్రతి ఖరీఫ్‌లోనూ పంటలకు పూర్తిస్థాయిలో సాగునీరు అందడం లేదు. ఏటా సాగు మొదలు పెట్టేందుకు వర్షాలపైనే ఆధారపడుతున్నాం. మాకు ఈ కష్టాలు ఇంకెన్నాళ్లో? - వి.సూర్యనారాయణ, రైతు, పెదతాడివాడ గ్రామం
వైఎస్ తర్వాత...
జిల్లాలో సాగునీటి ప్రాజెక్టులను పూర్తిగా విస్మరించారు. నిధుల్లో ఊహించని విధంగా కోత పెట్టారు. ఫలితంగా తారకరామ తీర్థసాగర్ ప్రాజెక్టు భవిష్యత్ అగమ్యగోచరంగా మారింది.
- పస్తుతం పనులు జరుగుతున్న తీరు చూస్తుంటే మరో ఐదేళ్లయినా ప్రాజెక్ట్ నిర్మాణం పూర్తయ్యే అవకాశమే లేదని రైతులు చెబుతున్నారు. మళ్లింపు కాలువ పనులకు గుర్ల గ్రామ పరిధిలోని రైల్వేట్రాక్ వద్ద అనుమతులు వచ్చినప్పటికీ ఇప్పటికీ ప్రభుత్వం నుంచి రైల్వేశాఖ అడిగిన నిధులు విడుదల కాకపోవడంతో పనులు నిలిచిపోయాయి.
- కాలువ నిర్మాణానికి రామతీర్థం వద్ద కొండను తొలవాల్సి ఉంది. దీనికి అటవీ శాఖ నుంచి అనుమతులు లేవు. కుమిలి, సారిపల్లి, కుదిపి, జగ్గరాజుపేట గ్రామాల పరిధిలో సుమారు 15 కిలోమీటర్ల మేర ప్రధాన బండింగ్ నిర్మాణం చేపట్టాల్సి ఉంది. బండింగ్ నిర్మాణం విషయంలో పాత కాంట్రాక్టర్ వ్యయం పెంచాలని కోరుతూ 2009 నుంచి పనులు నిలిపివేశారు.
- మారిన ధరల ప్రకారం టెండర్లు పిలవడంతో ప్రధాన బండింగ్ వ్యయం ఏకంగా రూ.56 కోట్లు అదనంగా పెరిగింది.
- ముంపునకు గురవుతున్న కోరాడపేట, ఆత్మారాముని అగ్రహారం గ్రామాలకు ప్రభుత్వం పునరావాస ప్యాకేజీ ప్రకటించింది. అయితే ఇప్పటివరకు పునరావాస పనులు ఏమాత్రం ముందుకు సాగలేదు. కోరాడపేటకు పునరావాసానికి స్థలం కేయించినప్పటికీ అభివృద్ధి చేయలేదు.
జగన్ మాట
పోలవరం, ఉత్తరాంధ్ర సుజల స్రవంతి, వంశధార, గాలేరు నగరి, హంద్రీనీవా, వెలిగొండ సహా జలయజ్ఞం కింద ప్రారంభించిన అన్ని సాగునీటి ప్రాజెక్టులనూ పూర్తిచేస్తాం. కృష్ణా, గోదావరి, పెన్నా బేసిన్లో మురుగు కాల్వల వ్యవస్థను గణనీయంగా మెరుగుపరుస్తాం.
రాజన్న లక్ష్యానికి తూట్లు
దివంగత నేత రాజన్న లక్ష్యానికి జంజావతి అధికారులు, కాంగ్రెస్ పాలకులు తూట్లు పొడిచారు. జంజావతి నుంచి సుమారు 24వేల ఎకరాలకు పూర్తిస్థాయిలో సాగునీరందివ్వాలన్న ఉద్దేశంతో మహానేత ఆస్ట్రియా పరిజ్ఞానంతో రబ్బర్‌డ్యామ్ నిర్మించి 12వేల ఎకరాలకు సాగునీరందించారు. వైఎస్ మరణా నంతరం పాలకులు, అధి కారులు ఆయన ఆశయానికి తూట్లు పొడిచారు. ప్రస్తుతం పూడుకుపోయిన కాలువలు, నిర్మాణం కాని కాలువలు, పిల్లకాలువలే కనిపిస్తున్నాయి. కనీసం 2వేల ఎకరాలకు కూడా సాగునీరందించలేని దుస్థితి ఏర్పడింది. దీంతో రాజన్న లక్ష్యం నీరుగారింది.
- పడాల సత్యం నాయుడు, రైతు
సోమినాయుడువలస, కొమరాడ మండలం
వైఎస్ వల్లే బతుకుతున్నాం..
రైతులు ప్రస్తుతం దిక్కుతోచని పరిస్థితితో అల్లాడు తున్నారు. కుటుంబ అవసరాల కోసం ఉన్న భూములను అమ్ముకుందామన్నా కొనేవారు లేని పరిస్థితి. బోర్లు తీసుకుని వ్యవసాయం చేద్దామన్నా కుదరట్లేదు. 200 అడుగుల లోతు కు వెళ్లినా చుక్కనీరు పడదు. వైఎస్ ఉన్నపుడు జలయజ్ఞంలో భాగంగా మారుమూలన ఉన్న పెద్దగెడ్డ జలా శయ నిర్మాణానికి చర్యలు తీసుకున్నారు. దీంతో ఈ ప్రాంత రైతులకు మహర్దశ పట్టింది. ఆయన దయ వల్ల ఇప్పుడు రెండు పంటలు పండించుకుంటూ హాయిగా జీవిస్తున్నాం. కారణం వైఎస్ నిర్మించిన పెద్దగెడ్డ జలాశయమే. ఈ ప్రాంతంలో ఏ రైతు కూడా ఆయనను ఎన్నటికీ మరిచిపోరు.
- ఇజ్జాడ అప్పలనాయుడు
పాచిపెంట మండలం, విజయనగరం జిల్లా