న్యూఢిల్లీ: మౌలిక రంగానికి సంబంధించి 421 ప్రాజెక్టుల నిర్మాణంలో జాప్యం కారణంగా వ్యయం రూ.4.40 లక్షల కోట్ల మేర పెరిగినట్టు కేంద్ర గణాంకాలు, ప్రణాళికల అమలు శాఖ నివేదిక తెలిపింది. ఈ ప్రాజెక్టులన్నీ కూడా రూ.150 కోట్లు అంతకుమించి నిర్మాణ వ్యయంతో కూడినవి కావడం గమనార్హం. మొత్తం1,831 ప్రాజెక్టులకు గాను 421 ప్రాజెక్టులు పెరిగిపోయిన వ్యయాలతో నత్తనడకన సాగుతుంటే, 845 ప్రాజెక్టుల నిర్మాణం ఆలస్యమైనట్టు తెలిపింది.
‘‘మొత్తం 1,831 ప్రాజెక్టుల అసలు నిర్మాణ వ్యయం అంచనా రూ.25.10 లక్షల కోట్లు కాగా, వీటి నిర్మాణం పూర్తయ్యే నాటికి వ్యయం 29.51 లక్షల కోట్లుగా ఉంటుంది. దీనివల్ల నిర్మాణ వ్యయ భారం 17.54 శాతం మేర అంటే, రూ.4.40 లక్షల కోట్లు పెరిగింది’’అని వివరించింది. 2023 నవంబర్ నాటికి ఈ ప్రాజెక్టుల కోసం చేసిన ఖర్చు రూ.15.58 లక్షల కోట్లుగా ఉంది. అంటే మొత్తం అంచనాలో 53 శాతం వ్యయం చేశారు.
ఆలస్యమైన 845 ప్రాజెక్టుల్లో 204 ప్రాజెక్టులకు సంబంధించి జాప్యం 1–12 నెలల మధ్య ఉంటే, 198 ప్రాజెక్టులు 13–24 నెలల ఆలస్యంగా, 322 ప్రాజెక్టులు 25–60 నెలలు, 121 ప్రాజెక్టులు 60 నెలలకు పైగా జాప్యంతో కొనసాగుతున్నాయి. భూ సమీకరణ, అటవీ, పర్యావరణ అనుమతుల్లో జాప్యం, మౌలిక సదుపాయాల మద్దతు లేకపోవడం సకాలంలో నిర్మాణాలు పూర్తి కాకపోవడానికి, వ్యయాలు పెరిగిపోవడానికి కారణాలుగా ఉన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment