
మూడేళ్ల క్రితమే ముగిసిన బీఎంసీ కార్పొరేటర్ల పదవీకాలం
పలుమార్లు ఎన్నికల వాయిదా...కమిషనర్ల ఆధ్వర్యంలోనే కార్యకలాపాలు
ఇది ప్రజాస్వామ్యానికి విరుద్ధమని ప్రతిపక్షాల మండిపాటు
ఇంకెన్ని రోజులు ఎన్నికలు వాయిదా వేస్తారంటూ ఆగ్రహం
సాక్షి, ముంబై: దేశంలోనే అత్యధిక ఆదాయాన్ని కలిగిన ముంబై మున్సిపల్ కార్పొరేషన్(బీఎంసీ)కు గత మూడేళ్లుగా ఎన్నికలు జరగలేదు. దీంతో మూడేళ్లుగా ప్రజాప్రతినిధులు లేకుండానే మున్సిపల్ కమిషనర్ల ఆధ్వర్యంలో కార్పొరేషన్ పరిపాలన కార్యకలాపాలు జరుగుతున్నాయి.
రాజకీయ పరిణామాల రీత్యా...వాయిదా
2022, మార్చి 7న మున్సిపల్ కార్పొరేటర్ల పదవీకాలం ముగిసింది. వెంటనే ఎన్నికలు నిర్వహించాల్సి ఉన్నా ఎప్పటికప్పుడు మారుతున్న రాజకీయ సమీకరణాల కారణంగా వాయిదాపడుతూ వచ్చాయి. గత మూడేళ్లలో, ముంబై మున్సిపల్ కార్పొరేషన్ పరిపాలన బాధ్యతలను మొదట ఇక్బాల్ సింగ్ చాహల్ ఆ తరువాత భూషణ్ గగ్రానీ స్వీకరించారు. ఈ మూడేళ్లలో వీరిద్దరూ మున్సిపల్ కమిషనర్లు స్వయంగా మూడు బడ్జెట్లను సమర్పించారు. ఆర్థిక సంవత్సరానికి అనుగుణంగా నగరానికి అవసరమైన అభివృద్ధి పనులను చేపట్టారు. మున్సిపల్ ఎన్నికలు జరగకపోయినా మూడేళ్ల వ్యవధిలో రూ.6,000 కోట్ల విలువైన వివిధ మౌలిక సదుపాయాల ప్రాజెక్టులకు గ్రీన్‌సిగ్నలిచ్చారు. ముఖ్యంగా రోడ్లు, మురుగునీటి శుద్ధి, డీశాలినేషన్ ప్రాజెక్టులు, దహిసర్–భయందర్ లింక్ రోడ్డులకు అనుమతులు మంజూరుచేశారు.
ప్రభుత్వ అప్పుల పెరుగుదల....
2024–25 ఆరి్థక సంవత్సరానికి మున్సిపల్ కార్పొరేషన్ అప్పులు రూ.1.90 లక్షల కోట్లుగా తేలింది. తాజా లెక్కల ప్రకారం, ఈ సంఖ్య రూ.2,32 లక్షల కోట్లకు చేరుకుంది. ప్రజా ప్రతినిధులు లేకపోవడంతో, బడ్జెట్ వ్యయంపై బహిరంగ చర్చ జరగలేదు.
కమిషనర్లు పరిపాలించడమేమిటి?
కమిషనర్ల ఆధ్వర్యంలో బీఎంసీ పరిపాలన జరగడమేమిటంటూ విపక్ష పారీ్టలు విమర్శిస్తున్నాయి. ప్రజా ప్రతినిధులు లేని పాలన ప్రజాస్వామిక విధానాలకు విరుద్ధమని, ప్రజల అభిప్రాయాలను పట్టించుకోకుండా కీలక నిర్ణయాలు అమల వుతున్నాయని ఆరోపిస్తున్నాయి. మున్సిపల్ పాలనలో పారదర్శకత లేదని, పెద్ద మొత్తంలో నిధులు ఖర్చవుతున్నాయని మండిపడుతున్నాయి.
మరో 6–7 నెలల తర్వాతే!
ప్రస్తుత పరిస్థితి దృష్యా ఎన్నికలు మరో 6-7 నెలలు ఆలస్యమయ్యే అవకాశం ఉంది. 1984లో అప్పటి కమిషనర్ డి.ఎం.సుక్తాంకర్ కార్యనిర్వాహక పాలన తర్వాత మళ్లీ 38 ఏళ్లకు ముంబై మున్సిపల్ కార్పొరేషన్‌లో ప్రజాప్రతినిధులు లేకుండా పాలన జరుగుతోంది. అయితే ఈసారి ఇది మరింత ఎక్కువ కాలం కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో నగర అభివృద్ధి, ప్రజల అవసరాలను పరిగణనలోకి తీసుకుని త్వరలో ఎన్నికలు నిర్వహించాలని పలువురు నాయకులు, రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment