
మెరుగైన పని వాతావరణం కల్పించే సంస్థల జాబితా విడుదల
టాప్ టెక్ కంపెనీల్లో పని చేయాలని చాలామంది భావిస్తుంటారు. అందుకు వర్క్‌ప్లేస్ ఒక కారణం అవుతుంది. కొన్ని కంపెనీలు పరిశ్రమలో ఆదరణ పొందినా సరైన పని వాతావరణాన్ని కల్పించలేవు. అదే ఇంకొన్ని సంస్థల పేర్లు పెద్దగా వినిపించకపోయినా మెరుగైన వర్క్‌ప్లేస్‌ను అందిస్తాయి. భారత్‌లో మంచి పని వాతావరణాన్ని అందిస్తున్న కంపెనీల జాబితాను ‘బ్లైండ్’ అనే సంస్థ రూపొందించింది. వాటి వివరాలు కింది విధంగా ఉన్నాయి.
గ్లోబల్ టెక్ దిగ్గజాలు ఆపిల్, గూగుల్, మెటా టాప్ 10 బెస్ట్ రేటింగ్ కంపెనీల్లో చోటు దక్కించుకోగా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇండస్ట్రీ లీడర్ ఎన్విడియా రిటైల్ దిగ్గజం టార్గెట్ సంస్థ తర్వాత రెండో స్థానంలో నిలిచింది. మరోవైపు అమెజాన్ కంపెనీ ఇండియాలోనే అత్యంత పేలవమైన వర్క్‌ప్లేస్‌గా ఉందని నివేదిక తెలిపింది. పేటీఎం, ఇన్ మొబి, కాయిన్ బేస్, ఐబీఎం, స్ప్రింక్లర్ వంటి ఇతర ప్రధాన టెక్ కంపెనీలు కూడా పేలవమైన వర్క్‌ప్లేస్ జాబితాలో చివరన నిలిచాయి.
బ్లైండ్ సంస్థ దేశంలోని 7,020 కంపెనీల ఉద్యోగుల నుంచి సమాచారం సేకరించి ఈ జాబితాను సిద్ధం చేసింది. ఆరు కేటగిరీల్లో ప్రతి కంపెనీకి 5 పాయింట్ల స్కేలును నిర్ణయించినట్లు కంపెనీ తెలిపింది. ముఖ్యంగా బ్లైండ్ సంస్థ ఉద్యోగుల వేతనం, సంతృప్తికర పని వాతావరణాన్ని పరిగణలోకి తీసుకున్నట్లు పేర్కొంది. కొన్ని మెరుగైన కంపెనీలు కూడా కొన్ని అంశాలను అధిగమించలేకపోయాయని తెలిపింది.

ఇదీ చదవండి: రియల్టీలోకి రూ.2.29 లక్షల కోట్లు
కంపెనీ కల్చర్ పరంగా టార్గెట్, ఎన్వీడియా, అమెరికన్ ఎక్స్‌ప్రెస్, అకామై టెక్నాలజీస్, సర్వీస్ నౌ, జోహో, అరిస్టా నెట్‌వర్క్స్, మోర్గాన్ స్టాన్లీ, వీఎంవేర్, జేపీ మోర్గాన్ ఛేజ్ అండ్ కో అత్యధిక స్కోర్లను సాధించాయి. ట్రస్ట్ ఇన్ మేనేజ్‌మెంట్ కేటగిరీలో టార్గెట్, అమెరికన్ ఎక్స్‌ప్రెస్, సర్వీస్ నౌ, అరిస్టా నెట్‌వర్క్స్, ఎన్వీడియా, ప్యూర్ స్టోరేజ్, యాపిల్, హార్నెస్, ఈపీఏఎం సిస్టమ్స్ వంటి సంస్థలు రాణించాయి. గత ఏడాది కాలంలో భారతీయ నిపుణులు ఎక్కువగా సెర్చ్ చేసిన కంపెనీల్లో మెటా, అమెజాన్, గూగుల్, మైక్రోసాఫ్ట్, యాపిల్, ఎన్వీడియా, బైట్ డాన్స్, నెట్‌ఫ్లిక్స్, ఓపెన్ఏఐ, వాల్‌మార్ట్ ఉన్నాయి. వీటితో పాటు ఇండియా ఆఫర్, లేఆఫ్, రిఫరల్, ప్రమోషన్, హెచ్-1బీ వంటి ట్రెండింగ్ సెర్చ్ పదాలు ఉన్నాయి.