
ప్రపంచవ్యాప్తంగా టెక్ కంపెనీల్లో ఉద్యోగుల తొలగింపుల (layoffs) జోరు తగ్గడం లేదు. గడిచిన మార్చి నెలలో కనీసం 21 కంపెనీలు 8,834 మంది ఉద్యోగులను తొలగించాయని రియల్ టైమ్‌లో టెక్ లేఆఫ్‌లను ట్రాక్ చేసే పోర్టల్ లేఆఫ్స్.ఎఫ్‌వైఐ తెలిపింది. అయితే ఫిబ్రవరితో పోలిస్తే మార్చిలో లేఆఫ్స్ కాస్త తగ్గాయి. ఈ పోర్టల్ ప్రకారం.. ఫిబ్రవరి నెలలో 46 కంపెనీలు 15,994 ఉద్యోగులను తొలగించాయి. ఇది 2025లో ఇప్పటివరకు అదే అత్యధికం.
లేఆఫ్స్ కాస్త తగ్గినప్పటికీ, ప్రపంచవ్యాప్తంగా టెక్ రంగం ఎలా సమూల మార్పులకు లోనవుతోందో ఈ ధోరణి సూచిస్తుంది. మార్చిలో ఉద్యోగులను తొలగించిన కంపెనీల పేర్లలో హ్యూలెట్ ప్యాకర్డ్ ఎంటర్‌ప్రైజ్, నార్త్‌వోల్ట్, బ్లాక్, ఓలా ఎలక్ట్రిక్, నియాంటిక్ వంటివి ప్రముఖంగా ఉన్నాయి. అన్ని రకాల పరిశ్రమలు, ప్రాంతాలు, ఉద్యోగ స్థాయిల్లో ఉద్యోగాల కోతలు పెరిగాయి.
ఓలాలో ఉద్యోగాల కోత
బెంగళూరుకు చెందిన ఎలక్ట్రిక్ వాహన దిగ్గజం ఓలా 1,000 మందికి పైగా ఉద్యోగులు, కాంట్రాక్ట్ కార్మికులను తొలగించాలని యోచిస్తున్నట్లు మార్చి నెల ప్రారంభంలో వార్తలు వచ్చాయి. పెరుగుతున్న నష్టాలను నియంత్రించుకునే ప్రయత్నంలో భాగంగా కంపెనీ ఈ తొలగింపులను చేపట్టినట్లు తెలుస్తోంది. ప్రొక్యూర్మెంట్, కస్టమర్ రిలేషన్స్, ఫుల్‌ఫిల్మెంట్, ఛార్జింగ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ వంటి పలు విభాగాలపై ఈ ఉద్యోగాల కోత ప్రభావం చూపతోంది. ఐదు నెలల వ్యవధిలో కంపెనీలో ఉద్యోగుల తొలగింపు ఇది రెండోసారి కావడం గమనార్హం. 2024 నవంబర్‌లో ఓలా సుమారు 500 మంది ఉద్యోగులకు పింక్ స్లిప్ ఇచ్చింది.
భారీ తొలగింపులు ఈ కంపెనీల్లోనే..
మార్చిలో హ్యూలెట్ ప్యాకర్డ్ (HP) ఎంటర్‌ప్రైజెస్ 2,500 మంది ఉద్యోగులను తొలగించే ప్రణాళికలను ప్రకటించింది. సర్వర్ వ్యాపారంలో క్షీణిస్తున్న లాభాలను భర్తీ చేసుకోవడానికి తొలగింపులను అమలు చేస్తున్నట్లు ఈ టెక్ దిగ్గజం ప్రకటించింది. మార్చి 6న ట్రేడింగ్ లో కంపెనీ షేరు 19 శాతం క్షీణించింది. ఉద్యోగుల తొలగింపుతో కూడిన వ్యయ తగ్గింపు కార్యక్రమాన్ని వచ్చే 18 నెలల్లో అమలు చేస్తామని, ఇది 2027 ఆర్థిక సంవత్సరం నాటికి స్థూల పొదుపులో 350 మిలియన్ డాలర్లకు దారితీస్తుందని కంపెనీ తెలిపింది. 2024 అక్టోబర్ నాటికి కంపెనీ వార్షిక నివేదిక ప్రకారం ఇందులో 61,000 మంది ఉద్యోగులు ఉన్నారు.
సగానికి పైగా ఉద్యోగుల తొలగింపు
స్వీడిష్ బ్యాటరీ తయారీ సంస్థ నార్త్‌వోల్ట్ దివాలా పిటిషన్ దాఖలు చేసిన తర్వాత సగానికి పైగా ఉద్యోగులను తొలగించినట్లు తెలుస్తోంది. స్వీడన్ లో ఉన్న 4,500 మంది ఉద్యోగుల్లో 2,800 మందిని తొలగించింది. ప్రస్తుతానికి 1,200 మంది ఉద్యోగులను కంపెనీ కొనసాగించనుంది.
మరోవైపు, ట్విటర్ మాజీ సీఈఓ జాక్ డోర్సీకి చెందిన ఫిన్‌టెక్ సంస్థ బ్లాక్ 931 మంది ఉద్యోగులను తొలగించింది. పనితీరు ఆధారిత పునర్నిర్మాణమే ప్రధాన కారణమని కంపెనీ పేర్కొంది. టిక్‌టాక్ మాతృసంస్థ బైట్‌డాన్స్ విస్తృత పునర్నిర్మాణ ప్రయత్నాల్లో భాగంగా తన డబ్లిన్ కార్యాలయం నుండి 300 ఉద్యోగాలను తగ్గించింది.