సాక్షి, నాగర్‌కర్నూల్: రీడిజైన్ల పేరుతో అంచనాలను పెంచి దోచుకునేందుకే ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రాజెక్టుల నిర్మాణంలో జాప్యం చేస్తున్నారని సీఎల్పీ నాయకుడు మల్లు భట్టి విక్రమార్క అన్నారు. నాలుగు రోజులుగా వట్టెం రిజర్వాయర్ నిర్వాసితులు చేస్తున్న ఆమరణ నిరాహార దీక్ష శిబిరాన్ని శుక్రవారం మాజీ మంత్రి నాగం జనార్దన్‌రెడ్డి, మాజీ ఎంపీ మల్లురవితో కలసి ఆయన సందర్శించారు. నిర్వాసితుల దీక్షకు కాంగ్రెస్ పార్టీ తరఫున సంఘీభావం ప్రకటించారు. ఈ సందర్భంగా భట్టి మాట్లాడుతూ పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టును పూర్తి చేసేందుకు నిర్దేశించుకున్న సమయం అయిపోయిందని అన్నారు. ప్రాజెక్టును అనుకున్న సమయానికి పూర్తి చేయాలనుకుంటే చట్ట ప్రకారం కావాల్సిన చర్యలన్నీ ముందే తీసుకునే వారని అన్నారు.
కానీ చట్టానికి వ్యతిరేకంగా వ్యవహరిస్తూ, నిర్వాసితులకు పరిహారం చెల్లించకుండా కోర్టుకు పోయే పరిస్థితి తీసుకొచ్చి ప్రాజెక్టుల వ్యయాన్ని పెంచుకొని లబ్ధిపొందాలన్నది ముఖ్యమంత్రి ఆలోచన అని ఆరోపించారు. పార్లమెంట్‌లో చేసిన 2013 భూ సేకరణ చట్టాన్ని దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలు అమలు చేయాల్సిందేనని అన్నారు. పేదల తరఫున మాట్లాడే వారిని ప్రాజెక్టులకు వ్యతిరేకం అని ముద్రవేసే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. 2013 చట్టాన్ని అమలు చేయాలని శాసనసభలో నిర్వాసితుల పక్షాన పోరాటం చేస్తామని అన్నారు. నాగం జనార్దన్‌రెడ్డి, మల్లురవి మాట్లాడుతూ మల్లన్న సాగర్‌లో ఏవిధంగా పరిహారం ఇస్తున్నారో ఇక్కడా అదేవిధంగా చెల్లించాలని డిమాండ్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment