
మధిర: పదేళ్లు అధికారంలో ఉండి చేయలేని పనులను పదిరోజుల్లో చేస్తామని సీఎం కేసీఆర్ చెప్పడం ప్రజలను మోగించడమేనని సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క మండిపడ్డారు. ఖమ్మం జిల్లా మధిరలోని క్యాంపు కార్యాలయంలో శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు. చిత్తశుద్ధితో పనిచేసే సీఎం కావాలా, ఫామ్‌హౌస్‌లో పడుకునే సీఎం కావాలో ప్రజలే ఆలోచించుకోవాలన్నారు.
దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రతిరోజు ఉదయం 9 నుంచి 10 గంటల వరకు క్యాంప్ ఆఫీసులో ప్రజల సమస్యలు తెలుసుకుని, వినతిపత్రాలు స్వీకరించడమే కాక అన్ని పారీ్టల ఎమ్మెల్యేల సమస్యలు వినేవారని, సచివాలయంలో అధికారులతో సమీక్షలు చేసేవారని గుర్తుచేశారు. ఇందులో ఏ ఒక్కటీ చేయలేని కేసీఆర్, ఆరు నెలలకోసారి అసెంబ్లీని మూడు రోజులు తూతూమంత్రంగా నడుపుతున్నారని ఎద్దేవా చేశారు.
ఎవరు సీఎం అయితే ఏంటీ?
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ఎవరు సీఎం అయితే ఏంటీ.. రాజీవ్ ఆరోగ్యశ్రీ, పేదలకు ఇళ్లు, పేద విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్‌తోపాటు సోనియాగాంధీ ప్రకటించిన ఆరు గ్యారంటీలు అమలవుతాయా, లేదా అన్నదే ముఖ్యమని భట్టి అన్నారు. కేసీఆర్ అనవసరంగా సీఎం గోల ఎత్తుకున్నారని మండిపడ్డారు. దోపిడీ, కమీషన్లు లేకుండా ప్రతీపైసా ప్రజల కోసం ఖర్చు పెడితే కాంగ్రెస్ ప్రకటించిన ఆరు గ్యారంటీల అమలుకు నిధుల సమస్య రాదని స్పష్టం చేశారు.
ఈ విషయంలో సీఎం కేసీఆర్, మంత్రులు కేటీఆర్, హరీశ్‌రావు తప్పుడు ప్రచారం చేస్తున్నారని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన వంద రోజుల్లోనే అన్ని హామీలను అమలు చేస్తామన్నారు. కాగా, అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి కాంగ్రెస్ అభ్యర్థుల ఎంపికలో పారీ్టపరంగానే తప్ప వ్యక్తిగత నిర్ణయాలు ఉండవని స్పష్టం చేశారు. ఉమ్మడి ఖమ్మం, నల్లగొండ జిల్లాల్లోని అన్ని అసెంబ్లీ స్థానాలను కాంగ్రెస్ కైవసం చేసుకుంటుందని భట్టివిక్రమార్క ధీమా వ్యక్తం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment