‘భద్రాద్రి.. యాదాద్రి’పై సర్కారుకు నివేదిక | Report to Government on Yadadri and Bhadradri Thermal Plants: Telangana | Sakshi
Sakshi News home page

‘భద్రాద్రి.. యాదాద్రి’పై సర్కారుకు నివేదిక

Published Sat, Nov 2 2024 4:24 AM | Last Updated on Sat, Nov 2 2024 4:24 AM

Report to Government on Yadadri and Bhadradri Thermal Plants: Telangana

గత నెల 28న అందజేసిన జస్టిస్‌ లోకూర్‌ కమిషన్‌

పవర్‌ప్లాంట్లలో అవకతవకలు, ఖజానాకు జరిగిన నష్టం వెల్లడి  

నిర్ణయాలన్నీ మాజీ సీఎం కేసీఆర్‌ తీసుకున్నారని నిర్ధారణ! 

కేసులుపెట్టే యోచనలో ప్రభుత్వం!

కేబినెట్, అసెంబ్లీలో చర్చించిన తర్వాత నిర్ణయం

సాక్షి, హైదరాబాద్‌: గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ హయాంలో జరిగిన యాదాద్రి, భద్రాద్రి థర్మల్‌ విద్యుత్‌ కేంద్రాల నిర్మాణం, ఛత్తీస్‌గఢ్‌ విద్యుత్‌ కొనుగోలు ఒప్పందంలో అవకతవకలు చోటు చేసుకున్నట్టు వచ్చి న ఆరోపణలపై విచారణ నిర్వహించిన జస్టిస్‌ మదన్‌ బి.లోకూర్‌ కమిషన్‌.. గడువు చివరి తేదీ అయిన గత నెల 28న రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక సమరి్పంచింది. ప్రస్తుతం రాష్ట్ర ఇంధన శాఖ వద్ద ఈ నివేదిక ఉంది. త్వరలో సీఎం రేవంత్‌రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క దీనిపై సమీక్ష నిర్వహించడంతో పాటు కేబినెట్‌ భేటీలో చర్చించి తదుపరి కార్యాచరణపై కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలిసింది. రాష్ట్ర శాసనసభలో కూడా నివేదికను ప్రవేశపెట్టి చర్చించే అవకాశం ఉన్నట్లు సమాచారం. 

తదుపరి చర్యలకు సిఫార్సు 
టెండర్లు లేకుండా నామినేషన్‌ ప్రాతిపదికన యాదాద్రి, భద్రాద్రి థర్మల్‌ విద్యుత్‌ కేంద్రాల నిర్మాణాన్ని బీహెచ్‌ఈఎల్‌కు అప్పగించడం, టెండర్లకు వెళ్లకుండా ఛత్తీస్‌గఢ్‌ నుంచి 1000 మెగావాట్ల విద్యుత్‌ కొనుగోలుకు ఒప్పందం చేసుకోవడంలో చోటు చేసుకున్న విధానపరమైన అవకతవకతలు, వీటితో రాష్ట్ర ఖజానాకు జరిగిన నస్టాన్ని కమిషన్‌ లెక్కగట్టినట్లు తెలిసింది. వీటికి సంబంధించిన నిర్ణయాలన్నీ నాటి సీఎం కేసీఆర్‌ తీసుకున్నారని కమిషన్‌ నిర్ధారణకు వచ్చి నట్టు సమాచారం.

ఆయనతో పాటు గత ప్రభుత్వంలోని ఇతర మాజీ ప్రజా ప్రతినిధులు, అధికారులూ బాధ్యులని స్పష్టం చేసినట్టు తెలిసింది. ఈ విషయంలో తదుపరి దర్యాప్తు కోసం తీసుకోవాల్సిన చర్యలను కమిషన్‌ ప్రభుత్వానికి సిఫారసు చేసింది. కాగా దీని ఆధారంగా ప్రభుత్వం కేసీఆర్‌తోపాటు ఇతరులపై కేసు నమోదు చేసి తదుపరి విచారణకు ఆదేశించాలని భావిస్తున్నట్టు తెలిసింది.  

కేసీఆర్‌ను విచారించకుండానే నివేదిక! 
    తొలుత జస్టిస్‌ ఎల్‌.నరసింహారెడ్డి ఆధ్వర్యంలో ఈ కమిషన్‌ ఏర్పాటు కాగా, ఆయన గత ప్రభుత్వంలోని మాజీ ప్రజాప్రతినిధులు, విద్యుత్‌ సంస్థల సీఎండీలు, ఇతర అధికారులు, ప్రస్తుత రిటైర్డ్‌ ఐఏఎస్‌ అధికారులు, ఇతర సాక్షుల అభిప్రాయ సేకరణ ప్రక్రియను పూర్తి చేశారు. పలువురికి క్రాస్‌ ఎగ్జామినేషన్‌ సైతం నిర్వహించారు. రాతపూర్వకంగా లేదా వ్యక్తిగతంగా హాజరై వివరణ ఇవ్వాలని కేసీఆర్‌కు నోటీసులు జారీ చేయగా, ఆయన్నుంచి రాత పూర్వక సమాధానం అందింది.

నిర్ణయాలను తీసుకోవడానికి దారితీసిన పరిస్థితులను వివరిస్తూనే..విచారణ కమిషన్‌ బాధ్యతల నుంచి వైదొలగాల్సిందిగా జస్టిస్‌ నరసింహారెడ్డిని అప్పట్లో కేసీఆర్‌ కోరారు. కాగా విలేకరుల సమావేశంలో కేసీఆర్‌పై జస్టిస్‌ నరసింహారెడ్డి చేసిన వ్యాఖ్యలను పరిగణనలోకి తీసుకున్న సుప్రీంకోర్టు..విచారణ బాధ్యతల నుంచి తప్పుకోవాల్సిందిగా జస్టిస్‌ నరసింహారెడ్డిని ఆదేశించింది. ఆయన స్థానంలో నియమితులైన జస్టిస్‌ లోకూర్‌..సాక్ష్యాలు, నివేదికల పరిశీలన అనంతరం ప్రభుత్వానికి నివేదిక సమరి్పంచారు. కేసీఆర్‌ ఇచ్చి న జవాబును ఆయన పరిగణనలోకి తీసుకున్నట్టు సమాచారం. 

సీఎం రేవంత్‌ సమీక్ష 
    గత ప్రభుత్వంలో జరిగిన విద్యుత్‌ నిర్ణయాలకు సంబంధించి అందిన నివేదికపై సీఎం రేవంత్‌రెడ్డి శుక్రవారం రాత్రి ఇంధన శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్‌కుమార్‌ సుల్తానియా, ఇతర అధికారులతో సమీక్ష నిర్వహించారు. నివేదికలోని అంశాలను అధికారులు సీఎంకు వివరించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement