bhadradri thermal power plant
-
‘భద్రాద్రి.. యాదాద్రి’పై సర్కారుకు నివేదిక
సాక్షి, హైదరాబాద్: గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జరిగిన యాదాద్రి, భద్రాద్రి థర్మల్ విద్యుత్ కేంద్రాల నిర్మాణం, ఛత్తీస్‌గఢ్ విద్యుత్ కొనుగోలు ఒప్పందంలో అవకతవకలు చోటు చేసుకున్నట్టు వచ్చి న ఆరోపణలపై విచారణ నిర్వహించిన జస్టిస్ మదన్ బి.లోకూర్ కమిషన్.. గడువు చివరి తేదీ అయిన గత నెల 28న రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక సమరి్పంచింది. ప్రస్తుతం రాష్ట్ర ఇంధన శాఖ వద్ద ఈ నివేదిక ఉంది. త్వరలో సీఎం రేవంత్‌రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క దీనిపై సమీక్ష నిర్వహించడంతో పాటు కేబినెట్ భేటీలో చర్చించి తదుపరి కార్యాచరణపై కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలిసింది. రాష్ట్ర శాసనసభలో కూడా నివేదికను ప్రవేశపెట్టి చర్చించే అవకాశం ఉన్నట్లు సమాచారం. తదుపరి చర్యలకు సిఫార్సు టెండర్లు లేకుండా నామినేషన్ ప్రాతిపదికన యాదాద్రి, భద్రాద్రి థర్మల్ విద్యుత్ కేంద్రాల నిర్మాణాన్ని బీహెచ్ఈఎల్కు అప్పగించడం, టెండర్లకు వెళ్లకుండా ఛత్తీస్‌గఢ్ నుంచి 1000 మెగావాట్ల విద్యుత్ కొనుగోలుకు ఒప్పందం చేసుకోవడంలో చోటు చేసుకున్న విధానపరమైన అవకతవకతలు, వీటితో రాష్ట్ర ఖజానాకు జరిగిన నస్టాన్ని కమిషన్ లెక్కగట్టినట్లు తెలిసింది. వీటికి సంబంధించిన నిర్ణయాలన్నీ నాటి సీఎం కేసీఆర్ తీసుకున్నారని కమిషన్ నిర్ధారణకు వచ్చి నట్టు సమాచారం.ఆయనతో పాటు గత ప్రభుత్వంలోని ఇతర మాజీ ప్రజా ప్రతినిధులు, అధికారులూ బాధ్యులని స్పష్టం చేసినట్టు తెలిసింది. ఈ విషయంలో తదుపరి దర్యాప్తు కోసం తీసుకోవాల్సిన చర్యలను కమిషన్ ప్రభుత్వానికి సిఫారసు చేసింది. కాగా దీని ఆధారంగా ప్రభుత్వం కేసీఆర్‌తోపాటు ఇతరులపై కేసు నమోదు చేసి తదుపరి విచారణకు ఆదేశించాలని భావిస్తున్నట్టు తెలిసింది. కేసీఆర్‌ను విచారించకుండానే నివేదిక! తొలుత జస్టిస్ ఎల్.నరసింహారెడ్డి ఆధ్వర్యంలో ఈ కమిషన్ ఏర్పాటు కాగా, ఆయన గత ప్రభుత్వంలోని మాజీ ప్రజాప్రతినిధులు, విద్యుత్ సంస్థల సీఎండీలు, ఇతర అధికారులు, ప్రస్తుత రిటైర్డ్ ఐఏఎస్ అధికారులు, ఇతర సాక్షుల అభిప్రాయ సేకరణ ప్రక్రియను పూర్తి చేశారు. పలువురికి క్రాస్ ఎగ్జామినేషన్ సైతం నిర్వహించారు. రాతపూర్వకంగా లేదా వ్యక్తిగతంగా హాజరై వివరణ ఇవ్వాలని కేసీఆర్‌కు నోటీసులు జారీ చేయగా, ఆయన్నుంచి రాత పూర్వక సమాధానం అందింది.నిర్ణయాలను తీసుకోవడానికి దారితీసిన పరిస్థితులను వివరిస్తూనే..విచారణ కమిషన్ బాధ్యతల నుంచి వైదొలగాల్సిందిగా జస్టిస్ నరసింహారెడ్డిని అప్పట్లో కేసీఆర్ కోరారు. కాగా విలేకరుల సమావేశంలో కేసీఆర్‌పై జస్టిస్ నరసింహారెడ్డి చేసిన వ్యాఖ్యలను పరిగణనలోకి తీసుకున్న సుప్రీంకోర్టు..విచారణ బాధ్యతల నుంచి తప్పుకోవాల్సిందిగా జస్టిస్ నరసింహారెడ్డిని ఆదేశించింది. ఆయన స్థానంలో నియమితులైన జస్టిస్ లోకూర్..సాక్ష్యాలు, నివేదికల పరిశీలన అనంతరం ప్రభుత్వానికి నివేదిక సమరి్పంచారు. కేసీఆర్ ఇచ్చి న జవాబును ఆయన పరిగణనలోకి తీసుకున్నట్టు సమాచారం. సీఎం రేవంత్ సమీక్ష గత ప్రభుత్వంలో జరిగిన విద్యుత్ నిర్ణయాలకు సంబంధించి అందిన నివేదికపై సీఎం రేవంత్‌రెడ్డి శుక్రవారం రాత్రి ఇంధన శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్‌కుమార్ సుల్తానియా, ఇతర అధికారులతో సమీక్ష నిర్వహించారు. నివేదికలోని అంశాలను అధికారులు సీఎంకు వివరించారు. -
ఎక్కడా పక్షపాతం లేదు
సాక్షి, హైదరాబాద్: విద్యుత్ రంగానికి సంబంధించి గత ప్రభుత్వ నిర్ణయాలపై విచారణకు ఏర్పాటైన జస్టిస్ ఎల్.నరసింహారెడ్డి ఏకసభ్య కమిషన్ ఎక్కడా పక్షపాత ధోరణితో వ్యవహరించలేదని, నిష్పక్షపాతంగా విచారణ చేస్తోందని అడ్వొకేట్ జనరల్ ఎ.సుదర్శన్‌రెడ్డి హైకోర్టుకు నివేదించారు. దీనిపై దాఖలైన పిటిషన్‌ను విచారణకు అనుమతించ వద్దని కోరారు. దీనిపై పిటిషనర్, మాజీ సీఎం కె.చంద్రశేఖర్‌రావు తరఫు సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది ఆదిత్య సోంధీ అభ్యంతరం వ్యక్తం చేశారు. కమిషన్ ఆఫ్ ఎంక్వయిరీ యాక్ట్–1952 ప్రకారం జ్యుడీషియల్ కమిషన్ వేసినందున విచారణకు స్వీకరించాలని కోరారు. ఇరుపక్షాల వాదనలు విన్న ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరాధే, జస్టిస్ అనిల్‌కుమార్ జూకంటితో కూడిన ధర్మాసనం తీర్పు రిజర్వు చేసింది. పిటిషన్‌ను అనుమతించాలా? వద్దా? ఛత్తీస్‌గఢ్ నుంచి విద్యుత్ కొనుగోలు, యాదాద్రి, భద్రాద్రి థర్మల్ విద్యుత్ కేంద్రాల నిర్మాణంపై ఒప్పందాలు, ఎంవోయూలు చేసుకోవడంలో అక్రమా లు జరిగాయని ఆరోపిస్తూ..వీటిపై విచారణకు రాష్ట్ర ప్రభుత్వం గత మార్చి 14న జస్టిస్ ఎల్.నరసింహారెడ్డి కమిషన్‌ను నియమించింది. విచారణ ప్రారంభించిన కమిషన్ పలువురికి నోటీసులు జారీ చేసింది. ఈ నేపథ్యంలో కమిషన్ ఏర్పాటును సవాల్ చేస్తూ కేసీఆర్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.కానీ జస్టిస్ ఎల్.నరసింహారెడ్డిని వ్యక్తిగతంగా ప్రతివాదిగా చేర్చడంపై రిజిస్ట్రీ అభ్యంతరం చెబుతూ పిటిషన్‌కు నంబర్ కేటాయించలేదు. అయితే గురువారం విచారణ చేపట్టిన సీజే ధర్మాసనం నంబర్ చేయాలని ఆదేశించింది. పిటిషన్‌ను విచారణకు స్వీకరించాలా.. వద్దా అన్న అంశంపై విచారణ చేపట్టింది. ఈ అంశంపైనే వాదనలు వినిపించాలని, కేసు మెరిట్స్‌లోకి వెళ్లవద్దని సూచించింది. ప్రజలకు వివరాలు తెలిస్తే నష్టం లేదు: ఏజీ ‘కమిషన్ నియామకమైన నాటి నుంచి ఇప్పటివరకు 20 మందికిపైగా సాక్షులను విచారించింది. అందులో మాజీ సీఎండీ ప్రభాకర్‌రావుతో పాటు ట్రాన్స్‌కో, జెన్కో అధికారులున్నారు. వివరాలు ఇవ్వాలని కేసీఆర్‌ను కూడా కమిషన్ కోరింది. ఏప్రిల్‌లోనే నోటీసులు జారీ చేసింది. అయితే తాను ఓ జాతీయ పార్టీ అధ్యక్షుడినని, పార్లమెంట్ ఎన్నికలు ఉన్న కారణంగా వివరాలు ఇచ్చే సమయం లేదని ఆయన బదులిచ్చారు.జూలై తర్వాత వస్తానని చెప్పారు. కమిషన్ గడువు జూన్ 30 వరకే ఉండటంతో జూన్ 15న వివరాలు తెలియజేయాలని కమిషన్ సూచించింది. వివరాలు ఇతరులతో పంపినా సరిపోతుందని, స్వయంగా వస్తానంటే ఆ మేరకు ఏర్పాట్లు చేస్తామని కూడా తెలిపింది. అయినా కేసీఆర్ వివరాలు అందజేయలేదు. గతంలోనూ కమిషన్లు మీడియాకు వివరాలు వెల్లడించిన సందర్భాలున్నాయి. ఇది ప్రభుత్వం ఏర్పాటు చేసిన బహిరంగ కమిషన్. ఇందులో దాపరికం అంటూ ఏదీ లేదు. ప్రజలకు వివరాలు తెలిస్తే వచ్చే నష్టం కూడా లేదు. జస్టిస్ నరసింహారెడ్డి పక్షపాత ధోరణితో మాట్లాడారనడం అసంబద్ధం. ఆయన ఎవరిపైనా వ్యక్తిగతంగా వ్యాఖ్యలు చేయలేదు. 8బీ నోటీసులు ఇచ్చే అధికారం కమిషన్‌కు ఉంది.గతంలో మాజీ ముఖ్యమంత్రి కోట్ల విజయభాస్కర్‌రెడ్డిపై ప్రభుత్వం కమిషన్ ఏర్పాటు చేసింది. ఆ కమిషన్ ఆయనకు నోటీసులు జారీ చేయడమే కాదు.. మీడియాకు వివరాలు వెల్లడించింది. ఆ కమిషన్ విచారణను అడ్డుకోలేమని నాడు కోర్టులు కూడా చెప్పాయి. బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా గతంలో పలుమార్లు అంతకు ముందు ప్రభుత్వాల నిర్ణయాలపై కమిషన్లు వేస్తామని అసెంబ్లీలోనే పేర్కొంది. ఛత్తీస్‌గఢ్ నుంచి చేసిన విద్యుత్ కొనుగోలుపై విచారణ జరిపించుకోవచ్చని మాజీమంత్రి జగదీశ్‌రెడ్డి పేర్కొన్నారు. అలాంటప్పుడు ఈ కమిషన్ చట్ట వ్యతిరేకం ఎలా అవుతుంది? కమిషన్ల విచారణలో కోర్టులు కలుగజేసుకోలేవు. పిటిషన్‌ను విచారణకు స్వీకరించ వద్దు. ’అని ఏజీ ఎ.సుదర్శన్‌రెడ్డి కోరారు.గతంలో ఏ కమిషన్ ఇలా వ్యవహరించలేదు: సోంధీ ‘ఎల్.నరసింహారెడ్డి కమిషన్ మీడియా భేటీలో గత ప్రభుత్వ తీరును తప్పుబట్టింది. కోట్ల రూపాయల నష్టం వాటిల్లిందని పేర్కొంది. గతంలో ఏ కమిషన్ ఇలా పక్షపాత ధోరణితో వ్యాఖ్యలు చేయలేదు. ఎంక్వైరీ కమిషన్ పేరుతో జ్యుడీషియల్ కమిషన్ వేయడం చట్టవిరుద్ధం..’అని సోంధీ వాదించారు. దీంతో కమిషన్‌కు న్యాయపరమైన అధికారాలు లేనప్పుడు నివేదిక ఇచ్చినా ఏమీ జరగదు కదా అని ధర్మాసనం వ్యాఖ్యానించింది. ఇరుపక్షాల వాదనలు పూర్తి కావడంతో తీర్పు ను వాయిదా వేసింది. సోమవారం తీర్పు వెల్లడించే అవకాశం ఉంది. -
మాతోనే కరెంట్ అని భారీగా అప్పులు: మంత్రి భట్టి
భద్రాద్రి కొత్తగూడెం: విద్యుత్ కొనుగోలు పేరుతో రాష్ట్ర ప్రభుత్వానికి రూ.59 వేల కోట్ల బకాలున్నాయని తెలంగాణ డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క అన్నారు. ఆయన శనివారం భద్రాది థర్మల్ ప్రాజెక్టును సందర్శించారు. స్వయంగా ప్రాజెక్టు నిర్మాణ పనులను పరిశీలించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తమతోనే కరెంట్ అని చెప్పిన గత ప్రభుత్వానికి చెందినవారు భారీగా అప్పలు చేశారని మండిపడ్డారు. సింగరేణికి రూ.19వేల కోట్లు బకాయి పడ్డారని తెలిపారు. అన్ని శాఖల్లో గత ప్రభుత్వం అప్పులు చేసి ఆందోళనకర పరిస్థితుల్లోకి రాష్ట్రాన్ని నెట్టివేసిందని భట్టి విక్రమార్క అన్నారు. అందుకే వాస్తవ విషయాలు అసెంబ్లీలో శ్వేతపత్రం రూపంలో తాము చెప్పడానికి ప్రయత్నం చేశామని తెలిపారు. ఇదేవిధంగా అన్ని ప్రాజెక్టులను సందర్శించి వాటిపై కూడా సమగ్రమైన సమాచారం సేకరించి ప్రజల ముందుకు తీసకువస్తామని వెల్లడించారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం 81,514 కోట్ల అప్పులు చేసిందని అన్నారు. ప్రభుత్వం నుంచి డిస్కంలకు 28వేల కోట్ల బకాయి పడి ఉన్నామని తెలిపారు. తాము ఉంటేనే కరెంట్ సాధ్యం అని చెప్పిన గత ప్రభుత్వం రాష్ట్రాన్ని తాకట్టు పెట్టిందని మండిపడ్డారు. యాదాద్రి పవర్ ప్రాజెక్టుకు రూ. 50,000 కోట్ల అప్పు ఉందని అన్నారు. అప్పుల నుంచి విముక్తులై గాడిలో పెట్టడానికి రివ్యూ చేస్తూ ప్రయత్నం చేస్తున్నాని తెలిపారు.ఇవన్నీ గాలి లెక్కలు కాదని.. ఉన్నరికార్డ్స్ ప్రకారం మీకు అందిస్తున్నామని చెప్పారు.గత ప్రభుత్వం పవర్ సెక్టార్‌ను పీకలదాకా ముంచేసిందని మండిపడ్డారు.తమ ప్రభుత్వం ఈ అప్పుల నుంచి బయటపడటానికి ప్రయత్నం చేస్తోందని అన్నారు. భద్రాద్రి థర్మల్ పవర్ స్టేషన్ (బీటీపీఎస్) సూపర్ క్రిటికల్ టెక్నాలజీ వాడుకొని పర్యావరణానికి హని కలుగకుండా మేధావుల సూచనల మేరకు ముందుకు వెళ్తామని వెల్లడించారు. చదవండి: పథకాల అమలులో కాలయాపన చేసే ప్రయత్నం: ఎమ్మెల్సీ కవిత -
భద్రాద్రి ప్లాంట్‌కు ‘సీతమ్మ’ కష్టాలు
సాక్షి, హైదరాబాద్: భద్రాద్రి థర్మల్ విద్యుత్ కేంద్రానికి వరద గండం పొంచి ఉంది!. గోదావరిపై దుమ్ముగూడెం వద్ద 63 మీటర్ల ఎత్తుతో నిర్మించతలపెట్టిన సీతమ్మసాగర్ డ్యాంతో భవిష్యత్తులో భద్రాద్రి థర్మల్ విద్యుత్ కేంద్రం వరద ముంపునకు గురయ్యే ప్రమాదముందని ఆందోళన వ్యక్తమవుతోంది. కొత్తగూడెం జిల్లా మణుగూరు వద్ద గోదావరి తీరంలో 1,080 (270్ఠ4) మెగావాట్ల విద్యుదుత్పత్తి సామర్థ్యంతో భద్రాద్రి విద్యుత్ కేంద్రాన్ని తెలంగాణ జెన్కో నిర్మిస్తోంది. గత 100 ఏళ్లలో గోదావరికి వచ్చిన గరిష్ట వరదలను పరిగణనలోకి తీసుకుని ఈ విద్యుత్ కేంద్రం కోసం నిర్మాణ స్థలాన్ని ఎంపిక చేశారు. 2015లో విద్యుత్ ప్లాంట్ నిర్మాణపనులు మొదలయ్యాయి. అప్పట్లో సీతమ్మసాగర్ డ్యాం నిర్మాణానికి సంబంధించిన ఆలోచన కూడా లేదు. తాజాగా సీతమ్మసాగర్ జలాశయం నిర్మించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించడంతో పరిస్థితులు మారిపోయాయని ఉన్నతస్థాయి అధికారవర్గాలు పేర్కొంటున్నాయి. దుమ్ముగూడెం ఆనకట్ట ఎత్తును 63 మీటర్లకు పెంచి సీతమ్మసాగర్ జలాశయాన్ని నిర్మిస్తే ఎగువన ఉన్న భద్రాద్రి థర్మల్ విద్యుత్ కేంద్రానికి సంబంధించిన ఇన్‌టేక్ వెల్‌తో పాటు ఆర్డబ్ల్యూఎస్, సింగరేణి సంస్థకు చెందిన ఇన్‌టేక్ వెల్స్.. బ్యాక్‌వాటర్‌తో ముంపునకు గురికానున్నాయని ఇప్పటికే నీటిపారుదల శాఖ నిర్థారించింది. అయితే, భవిష్యత్తులో గోదావరికి భీకర వరదలు పోటెత్తితే మాత్రం భద్రాద్రి విద్యుత్ కేంద్రానికి సైతం ముంపు ప్రమాదం తప్పదని అభిప్రాయానికి వచ్చినట్టు తెలిసింది. వరద రక్షణ గోడలు నిర్మించి భద్రాద్రి విద్యుత్ కేంద్రానికి రక్షణ కల్పిస్తామని నీటిపారుదల శాఖ ప్రతిపాదించింది. ఈ విషయమై నీటిపారదుల శాఖ, జెన్కోల మధ్య గత కొంతకాలంగా ఉత్తరప్రత్యుత్తరాలు నడుస్తున్నాయి. త్వరలో ఈ అంశంపై ప్రభుత్వం ఓ నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. గతేడాది వణికించిన వరదలు గతేడాది ఆగస్టులో కురిసిన భారీ వర్షాలతో గోదావరిలో వరద పోటెత్తింది. ఆగస్టు 17న 20 లక్షల క్యూసెక్కుల భారీ వరద రాగా, భద్రాచలం వద్ద గోదావరిలో నీటిమట్టం 61.60 అడుగులకు ఎగబాకింది. విద్యుత్ కేంద్రం ఇన్‌టేక్ వెల్ పిల్లర్లు దాదాపు సగం వరకు మునిగిపోగా, భద్రాద్రి విద్యుత్ కేంద్రం ప్రహరిగోడ దగ్గరికి వరకు నీళ్లొచ్చాయి. విద్యుత్ కేంద్రం లోపల కురిసిన వర్షపు నీటిని గోదావరిలోకి తీసుకెళ్లేందుకు దాదాపు రెండు మీటర్ల లోతులో నిర్మించిన డ్రెయిన్స్ నుంచి వరద నీరు విద్యుత్ కేంద్రంలోకి రివర్స్‌ఫ్లోలో పోటెత్తింది. దీనికి తోడు లోపల కురిసిన వాననీరు సైతం బయటకు వెళ్లక దీనికి జతకావడంతో విద్యుత్ కేంద్రం ఆవరణలో భారీగా నీరు నిలిచింది. వరద తీవ్రత మరింత పెరిగితే విద్యుత్ కేంద్రం ముంపునకు గురి అవుతుందని అక్కడ విధులు నిర్వహించే ఇంజనీర్లు ఆందోళనకు గురయ్యారు. వారం పాటు విద్యుదుత్పత్తిని నిలిపివేసి వరద ఉధృతి తగ్గాక మళ్లీ పునరుద్ధరించాల్సి వచ్చింది. 20 లక్షల క్యూసెక్కుల సాధారణ వరదలకే థర్మల్ విద్యుత్ కేంద్రం కొంతవరకు ప్రభావానికి గురైందని, భవిష్యత్తులో వరదలు తీవ్రస్థాయిలో వస్తే ముంపునకు గురయ్యే అవకాశాలెక్కువ ఉంటాయనే ఆందోళన అధికారుల్లో వ్యక్తం అవుతోంది. గోదావరికి 1986 ఆగస్టు 16న అత్యంత భీకరంగా 36 లక్షల క్యూసెక్కుల జల ప్రవాహంతో వరదలు పోటెత్తాయి. భద్రాచలం వద్ద 75.6 అడుగులకు నీటిమట్టం పెరిగింది. గత 100 ఏళ్లల్లో గోదావరికి వచ్చిన అతిభారీ వరదలు ఇవే. మళ్లీ అంతకు మించిన వరదలు వస్తే మాత్రం భద్రాద్రి విద్యుత్ కేంద్రం ముంపునకు గురవడం ఖాయమని నిపుణులు అంటున్నారు. సీతమ్మసాగర్ జలాశయం నిర్మాణంతో ముంపు ముప్పు మరింత పెరగనుందని ఆందోళన వ్యక్తం అవుతోంది. 1986 నాటి వరదల నేపథ్యంలో గరిష్టంగా 50 లక్షల క్యూసెక్కులతో భవిష్యత్తులో వరదలు వచ్చే అవకాశముందని కేంద్ర జలసంఘం (సీడబ్ల్యూసీ) గరిష్ట వరదలకు సంబంధించిన అంచనాలను సవరించింది. వరద గోడలు నిర్మించినా వాగులతో సమస్యే! భద్రాద్రి విద్యుత్ కేంద్రానికి వరద రక్షణ గోడలు నిర్మిస్తే గోదావరి వరద పోటు తప్పినా.. పరిసర ప్రాంతాల్లోని వాగుల రూపంలో కొత్త ముంపు సమస్య తలెత్తనుందని అధికారులు పేర్కొంటున్నారు. ప్రధానంగా భద్రాద్రి థర్మల్ విద్యుత్ కేంద్రం నిర్మిస్తున్న స్థలంలోనే ఓ సీపేజీ వాగు ఉంది. రక్షణ గోడ నిర్మాణంతో దీని ప్రవాహం సైతం విద్యుత్ కేంద్రం లోపలి ప్రాంతంలోనే నిలిచిపోనుంది. ఇలా రక్షణ గోడలకు ఇవతల నిలిచిపోయే నీటిని పంపుల ద్వారా గోదావరిలో ఎత్తిపోయాలని నీటిపారుదల శాఖ మరో ప్రతిపాదన చేసినట్టు సమాచారం. ప్లాంట్‌కు రక్షణ గోడలు భద్రాద్రి ప్లాంట్ చుట్టూ 7.76 కి.మీ నిడివితో వరద రక్షణ గోడల నిర్మించాలని జెన్కో, నీటిపారదుల శాఖ ఓ అభిప్రాయానికి వచ్చినట్టు సమాచారం. వరద రక్షణ గోడలు నిర్మిస్తే సువిశాలమైన ప్లాంట్ లోపలి భాగంలోకురిసే వర్షపు నీటితో పాటు పరిసర ప్రాంతాల్లోని వాగుల్లోని ప్రవాహాలను ఎత్తిపోయడానికి ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని భావిస్తున్నారు. ప్లాంట్ నిర్మాణ ఖర్చుకు అదనంగా ఇందుకు రూ.వందల కోట్లలో ఖర్చు కానుందని అంచనా. లేనిపక్షంలో అనూహ్యంగా భారీ వరదలు పోటెత్తితే రూ.9962.32 కోట్ల వ్యయంతో నిర్మిస్తున్న విద్యుత్ కేంద్రానికి తీవ్ర నష్టంవాటిల్లుతుందనే ఆందోళన వ్యక్తమవుతోంది. విద్యుత్ కేంద్రంలో చాలా వరకు ఎలక్ట్రో–మెకానికల్ యంత్రపరికరాలు ముంపునకు గురైతే మరమ్మతులు సాధ్యం కాదని, మళ్లీ కొత్తవి తెచ్చుకోవాల్సిందేనని నిపుణులు అంటున్నారు. ఇప్పటికే కల్వకుర్తి ఎత్తిపోతల పథకం అనూహ్యంగా ముంపునకు గురికావడంతోదాదాపు ఇలానే భారీ నష్టం వాటిల్లింది. చుట్టూ రక్షణ గోడలు నిర్మించినా సరే వరద పోటెత్తినప్పుడు ..రక్షణ గోడల చుట్టూ చేరిన నీటి ఉర్ద్వ పీడనం (అప్లిఫ్ట్ ప్రెషర్)తో పవర్ ప్లాంట్ పునాదులకు ప్రమాదం ఏర్పడే అవకాశం ఉందని అధికారులు అంటున్నారు. భద్రాద్రి థర్మల్ ప్లాంట్‌తో పాటు సీతారామ ఎత్తిపోతల పథకంలోని తొలి లిఫ్టునకు సైతం గోదావరి నుంచి వరద ముప్పు ఉందని అధికారుల్లో చర్చ జరుగుతోంది. భవిష్యత్తులో అనూహ్య వరదలు పోటెత్తవచ్చు తీవ్ర వాతావరణ మార్పులను చూడబోతున్నాం. ఉష్ణోగ్రతలకు తగ్గట్టు వర్షపాతం పెరుగుతోంది. నదుల గరిష్ట వరద ప్రవాహ మట్టాలు (ఫ్లడ్ లెవల్స్) మారిపోతున్నాయి. గత వందేళ్లలో వచ్చిన వరదలను పరిగణనలోకి తీసుకుని ప్రాజెక్టులకు డిజైన్ చేస్తున్నారు. గతంలో వందేళ్లకొచ్చిన వరదలు ఇప్పుడు పదేళ్లలో, వెయ్యేళ్లలో వచ్చిన వరదలు వందేళ్లలోనే వస్తున్నాయి. భద్రాద్రి పవర్ ప్రాజెక్టు కట్టేటప్పుడే ఇవన్నీ చూసుకోవాల్సింది. 1986లో వచ్చిన 36 లక్షల క్యూసెక్కుల స్థాయి వరద మళ్లీ పునరావృతమైనా, లేక సీడబ్ల్యూసీ సవరించిన అంచనాల మేరకు 50 లక్షల క్యూసెక్కుల వరద వచ్చినా భద్రాద్రి విద్యుత్ కేంద్రానికి ముప్పు పొంచి ఉంటుంది. - డాక్టర్ బాబూరావు, పర్యావరణ శాస్త్రవేత్త -
‘భద్రాద్రి’కి అడ్డంకిని తొలగించండి
కేంద్ర విద్యుత్ మంత్రికి సీఎం కేసీఆర్ విజ్ఞప్తి సాక్షి, న్యూఢిల్లీ/హైదరాబాద్: కొత్తగూడెం జిల్లా మణుగూరులో జెన్కో ఆధ్వర్యంలో నిర్మించతలపెట్టిన 1080 మెగావాట్ల భద్రాద్రి థర్మల్ పవర్‌ప్లాంటుకు పర్యావరణ అనుమతులిచ్చేందుకు సహకరించాలని కేం ద్ర విద్యుత్ శాఖ మంత్రి పీయూష్ గోయె ల్కు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర విద్యుత్ అవసరాలను తీర్చేందుకు చేపట్టిన ఈ విద్యుత్ కేంద్రాన్ని సబ్ క్రిటికల్ పరిజ్ఞానంతో నిర్మించేందుకు నిబంధనలు సడలించాలని కోరారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న సీఎం ఆదివారం పీయూష్ గోయెల్‌తో సమావేశమయ్యారు. రాష్ట్రంలో నిర్మిస్తున్న థర్మల్ పవర్ ప్రాజెక్టులు, సోలార్ ప్లాంట్లు, ఉదయ్ పథకం, డిస్కంల పనితీరు తదితర అంశాలపై గంటపాటు చర్చించారు. భద్రాద్రి విద్యుత్ కేంద్ర నిర్మాణం, ముడి యంత్రాల సరఫరా కోసం ఇప్పటికే కేంద్ర ప్రభుత్వరంగ సంస్థ బీహెచ్ఈఎల్కు రూ.987 కోట్లు చెల్లించామని, భూసేకరణ కోసం రూ.69.5 కోట్లు ఖర్చు చేశామని కేంద్రమంత్రి దృష్టికి తీసుకెళ్లారు. కేంద్ర విద్యుత్ శాఖ మార్గదర్శకాలకు లోబడి 12వ పంచవర్ష ప్రణాళిక (2012-17) కాలం ముగిసేలోపే కేవలం 24 నెలల్లో భద్రాద్రి విద్యుత్ ప్లాంటును నిర్మించేందుకు ప్రణాళికలు రూపొందించామని వివరించారు. అరుుతే పర్యావరణ అనుమతులు రాకపోవడంతో నిర్మాణంలో జాప్యం జరుగుతోందన్నారు. రూ.5,044 కోట్ల అంచనా వ్యయంతో నిర్మించతలపెట్టిన ఈ ప్రాజెక్టుకు అనుమతులు రాకపోతే రాష్ట్రానికి తీవ్ర నష్టం జరుగుతుందని వివరించారు. దేశవ్యాప్తంగా నిర్మాణంలో ఉన్న మరో 36 సబ్ క్రిటికల్ విద్యుత్‌ప్లాంట్లు 13వ పంచవర్ష ప్రణాళిక కాలంలోనే పూర్తవుతాయని, భద్రాద్రి ప్రాజెక్టును కూడా ఆ కోవలోనే చూడాలని విజ్ఞప్తి చేసినట్లు సమాచారం. సమావేశ నేపథ్యం.. 13వ పంచవర్ష ప్రణాళిక కాలం (2017-2022)లో సూపర్ క్రిటికల్ థర్మల్ విద్యుత్ కేంద్రాల నిర్మాణాన్ని మాత్రమే అనుమతిం చాలని కేంద్ర విద్యుత్ శాఖ గతంలో తీసుకున్న నిర్ణయం తాజాగా భద్రాద్రి సబ్ క్రిటికల్ విద్యుత్ కేంద్రం నిర్మాణానికి అడ్డంకిగా మారింది. దీనివల్ల ప్లాంటుకు పర్యావరణ అనుమతుల జారీని పరిశీలించలేమని కేంద్ర పర్యావరణ, అటవీ శాఖ ఈ నెల 4న నిర్ణరుుంచిన విషయం తెలిసిందే. పర్యావరణ అనుమతుల కోసం పరిశీలనలో ఉన్న ప్రాజెక్టుల జాబితా నుంచి భద్రాద్రి ప్లాంటు పేరును కూడా తొలగించింది. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్.. కేంద్ర విద్యుత్ మంత్రిని కలిశారు. శాశ్వత బొగ్గు కేటాయింపులు చేయండి నల్లగొండ జిల్లా దామరచర్లలో 4,000 మెగావాట్ల సామర్థ్యంతో నిర్మిస్తున్న యాదాద్రి పవర్ ప్లాంటుకు శాశ్వత బొగ్గు కేటాయింపులు జరపాలని సీఎం కోరా రు. తెలంగాణను విద్యుత్ మిగులు రా ష్ట్రంగా తీర్చిదిద్దాలని లక్ష్యంగా పెట్టుకున్నామని, అందుకు అనుగుణంగా కేం ద్రం నుంచి సహకరించాలని విజ్ఞప్తి చేశా రు. భద్రాద్రి ప్లాంట్‌కు ప్రత్యేక సడలింపులతో పాటు ఇతర అంశాలపై సీఎం చేసిన విజ్ఞప్తిపై కేంద్రమంత్రి సానుకూలంగా స్పందించినట్లు తెలిసింది. ఈ అంశాన్ని పరిశీలించి త్వరలో చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చినట్లు సమాచారం. అలాగే డిస్కంల ఆర్థిక పునర్వ్యవస్థీకరణ కోసం కేంద్రం ప్రవేశపెట్టిన ఉజ్వల్ డిస్కంల యోజన (ఉదయ్) పథకంలో చేరాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరినట్లు తెలిసింది. సీఎంతో పాటు మంత్రి జగదీశ్‌రెడ్డి, ఎంపీలు జితేందర్‌రెడ్డి, కె.కేశవరావు, వినోద్ కుమార్, బాల్క సుమన్, ఢిల్లీలో ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధులు వేణుగోపాలచారి, రామచంద్ర తేజోవత్, జెన్కో సీఎండీ ప్రభాకర్‌రావు ఉన్నారు. -
‘భద్రాద్రి’ తనిఖీ నివేదిక సానుకూలం
కేంద్ర పర్యావరణ శాఖ నిపుణుల సబ్ కమిటీ నివేదిక యాదాద్రి ప్లాంట్‌కు అనుమతులపై నిర్ణయం వాయిదా సాక్షి, హైదరాబాద్: ఖమ్మం జిల్లా మణుగూరులో 1,080 (4x270) మెగావాట్ల భద్రాద్రి థర్మల్ విద్యుత్ ప్లాంట్ ప్రాజెక్టుకు సంబంధించి పర్యావరణ ప్రభావ అధ్యయనం (ఎన్విరాన్మెంటల్ ఇంపాక్ట్ అసెస్మెంట్) సాధ్యమేనని కేంద్ర పర్యావరణ, అటవీ మంత్రిత్వ శాఖ నిపుణుల సబ్ కమిటీ నివేదించింది. పర్యావరణ అనుమతులు రాకముందే పనులు చేపట్టిన దృష్ట్యా అసలు ఈ ప్లాంట్‌కు ఎన్విరాన్మెంటల్ అప్రైజల్ సాధ్యమేనా? కాదా? అన్న అంశంపై నిర్ణయం తీసుకోవాలని నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ కొన్ని నెలల కింద కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖను ఆదేశించింది. పర్యావరణ మంత్రిత్వ శాఖ నిపుణుల సబ్ కమిటీ గత నెల 17-19 తేదీల్లో మణుగూరులో తనిఖీలు జరిపి ఆ శాఖకు సమగ్ర అధ్యయన నివేదిక సమర్పిం చింది. మొత్తం ప్లాంట్ నిర్మిత ప్రాంతంలోని 1.85% భాగంలో మాత్రమే జెన్కో పనులు చేపట్టిందని, ఈ నేపథ్యంలో ఎన్విరాన్మెంట్ ఇంపాక్ట్ అసెస్మెంట్ సాధ్యమేనని నివేదించింది. ఈ కమిటీలోని ఓ సభ్యుడు మాత్రం ప్రస్తుత పరిస్థితిలో అసెస్మెంట్ కష్టమని విరుద్ధమైన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. గత నెల 29,30వ తేదీల్లో ఢిల్లీలో సమావేశమైన కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖ నిపుణుల మదింపు కమిటీ(ఈఏసీ) ఈ నివేదికపై చర్చించి మెజారిటీ సభ్యుల అభిప్రాయాన్ని ఆమోదించింది. యాదాద్రి నివేదిక తయారీలో జెన్కో గ్రంథ చౌర్యం.. నల్లగొండ జిల్లా దామరచర్లలో 4,000 (5x800) మెగావాట్ల సామర్థ్యంతో జెన్కో నిర్మించతలపెట్టిన యాదాద్రి థర్మల్ విద్యుత్ ప్లాంట్‌కు పర్యావరణ అనుమతుల జారీ అంశంపై నిర్ణయాన్ని కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖ నిపుణుల మదింపు కమిటీ మరోసారి వాయిదా వేసింది. ఇతర ప్లాంట్ల నివేదికలను కాపీ పేస్ట్ చేయడం ద్వారా ఈ ప్రాజెక్టుకు సంబంధించిన పర్యావరణ ప్రభావ అధ్యయన నివేదికను జెన్కో తయారు చేసి గ్రంథ చౌర్యానికి పాల్పడిందని ఆక్షేపించింది. జెన్కోపై చర్యలు తీసుకోవాలని కేంద్రానికి సిఫారసు చేసింది. బొగ్గు రవాణా కోసం రైల్వే, పోర్టులతో ఒప్పందాలు, నిర్వాసితులకు ఆర్అండ్ఆర్ ప్యాకేజీ అమలు తదితర వివరాలతో కొత్త నివేదికను సమర్పిం చాలని ఆదేశించింది. ఈ ప్రాజెక్టు నిర్మాణంపై నిర్వహించిన బహిరంగ విచారణలో వచ్చిన ప్రజల అభ్యం తరాలకు సమాధానాలను ప్రధాన పత్రికల్లో ప్రచురించాలని, జెన్కో వెబ్సైట్లో ప్రదర్శనకు ఉంచి ప్రజల నుంచి తదుపరి అభ్యంతరాలను స్వీకరించాలని ఆదేశించింది.