‘విద్యుత్’ఒప్పందాలపై నిష్పక్షపాతంగానే జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్ విచారణ
హైకోర్టులో ఏజీ సుదర్శన్‌రెడ్డి వాదనలు
తీర్పు రిజర్వ్ చేసిన సీజే ధర్మాసనం
సాక్షి, హైదరాబాద్: విద్యుత్ రంగానికి సంబంధించి గత ప్రభుత్వ నిర్ణయాలపై విచారణకు ఏర్పాటైన జస్టిస్ ఎల్.నరసింహారెడ్డి ఏకసభ్య కమిషన్ ఎక్కడా పక్షపాత ధోరణితో వ్యవహరించలేదని, నిష్పక్షపాతంగా విచారణ చేస్తోందని అడ్వొకేట్ జనరల్ ఎ.సుదర్శన్‌రెడ్డి హైకోర్టుకు నివేదించారు. దీనిపై దాఖలైన పిటిషన్‌ను విచారణకు అనుమతించ వద్దని కోరారు. దీనిపై పిటిషనర్, మాజీ సీఎం కె.చంద్రశేఖర్‌రావు తరఫు సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది ఆదిత్య సోంధీ అభ్యంతరం వ్యక్తం చేశారు. కమిషన్ ఆఫ్ ఎంక్వయిరీ యాక్ట్–1952 ప్రకారం జ్యుడీషియల్ కమిషన్ వేసినందున విచారణకు స్వీకరించాలని కోరారు. ఇరుపక్షాల వాదనలు విన్న ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరాధే, జస్టిస్ అనిల్‌కుమార్ జూకంటితో కూడిన ధర్మాసనం తీర్పు రిజర్వు చేసింది.
పిటిషన్‌ను అనుమతించాలా? వద్దా?
ఛత్తీస్‌గఢ్ నుంచి విద్యుత్ కొనుగోలు, యాదాద్రి, భద్రాద్రి థర్మల్ విద్యుత్ కేంద్రాల నిర్మాణంపై ఒప్పందాలు, ఎంవోయూలు చేసుకోవడంలో అక్రమా లు జరిగాయని ఆరోపిస్తూ..వీటిపై విచారణకు రాష్ట్ర ప్రభుత్వం గత మార్చి 14న జస్టిస్ ఎల్.నరసింహారెడ్డి కమిషన్‌ను నియమించింది. విచారణ ప్రారంభించిన కమిషన్ పలువురికి నోటీసులు జారీ చేసింది. ఈ నేపథ్యంలో కమిషన్ ఏర్పాటును సవాల్ చేస్తూ కేసీఆర్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
కానీ జస్టిస్ ఎల్.నరసింహారెడ్డిని వ్యక్తిగతంగా ప్రతివాదిగా చేర్చడంపై రిజిస్ట్రీ అభ్యంతరం చెబుతూ పిటిషన్‌కు నంబర్ కేటాయించలేదు. అయితే గురువారం విచారణ చేపట్టిన సీజే ధర్మాసనం నంబర్ చేయాలని ఆదేశించింది. పిటిషన్‌ను విచారణకు స్వీకరించాలా.. వద్దా అన్న అంశంపై విచారణ చేపట్టింది. ఈ అంశంపైనే వాదనలు వినిపించాలని, కేసు మెరిట్స్‌లోకి వెళ్లవద్దని సూచించింది.
ప్రజలకు వివరాలు తెలిస్తే నష్టం లేదు: ఏజీ
‘కమిషన్ నియామకమైన నాటి నుంచి ఇప్పటివరకు 20 మందికిపైగా సాక్షులను విచారించింది. అందులో మాజీ సీఎండీ ప్రభాకర్‌రావుతో పాటు ట్రాన్స్‌కో, జెన్‌కో అధికారులున్నారు. వివరాలు ఇవ్వాలని కేసీఆర్‌ను కూడా కమిషన్ కోరింది. ఏప్రిల్‌లోనే నోటీసులు జారీ చేసింది. అయితే తాను ఓ జాతీయ పార్టీ అధ్యక్షుడినని, పార్లమెంట్ ఎన్నికలు ఉన్న కారణంగా వివరాలు ఇచ్చే సమయం లేదని ఆయన బదులిచ్చారు.
జూలై తర్వాత వస్తానని చెప్పారు. కమిషన్ గడువు జూన్ 30 వరకే ఉండటంతో జూన్ 15న వివరాలు తెలియజేయాలని కమిషన్ సూచించింది. వివరాలు ఇతరులతో పంపినా సరిపోతుందని, స్వయంగా వస్తానంటే ఆ మేరకు ఏర్పాట్లు చేస్తామని కూడా తెలిపింది. అయినా కేసీఆర్ వివరాలు అందజేయలేదు. గతంలోనూ కమిషన్లు మీడియాకు వివరాలు వెల్లడించిన సందర్భాలున్నాయి. ఇది ప్రభుత్వం ఏర్పాటు చేసిన బహిరంగ కమిషన్. ఇందులో దాపరికం అంటూ ఏదీ లేదు. ప్రజలకు వివరాలు తెలిస్తే వచ్చే నష్టం కూడా లేదు. జస్టిస్ నరసింహారెడ్డి పక్షపాత ధోరణితో మాట్లాడారనడం అసంబద్ధం. ఆయన ఎవరిపైనా వ్యక్తిగతంగా వ్యాఖ్యలు చేయలేదు. 8బీ నోటీసులు ఇచ్చే అధికారం కమిషన్‌కు ఉంది.
గతంలో మాజీ ముఖ్యమంత్రి కోట్ల విజయభాస్కర్‌రెడ్డిపై ప్రభుత్వం కమిషన్ ఏర్పాటు చేసింది. ఆ కమిషన్ ఆయనకు నోటీసులు జారీ చేయడమే కాదు.. మీడియాకు వివరాలు వెల్లడించింది. ఆ కమిషన్ విచారణను అడ్డుకోలేమని నాడు కోర్టులు కూడా చెప్పాయి. బీఆర్‌ఎస్ ప్రభుత్వం కూడా గతంలో పలుమార్లు అంతకు ముందు ప్రభుత్వాల నిర్ణయాలపై కమిషన్లు వేస్తామని అసెంబ్లీలోనే పేర్కొంది. ఛత్తీస్‌గఢ్ నుంచి చేసిన విద్యుత్ కొనుగోలుపై విచారణ జరిపించుకోవచ్చని మాజీమంత్రి జగదీశ్‌రెడ్డి పేర్కొన్నారు. అలాంటప్పుడు ఈ కమిషన్ చట్ట వ్యతిరేకం ఎలా అవుతుంది? కమిషన్ల విచారణలో కోర్టులు కలుగజేసుకోలేవు. పిటిషన్‌ను విచారణకు స్వీకరించ వద్దు. ’అని ఏజీ ఎ.సుదర్శన్‌రెడ్డి కోరారు.
గతంలో ఏ కమిషన్ ఇలా వ్యవహరించలేదు: సోంధీ
‘ఎల్.నరసింహారెడ్డి కమిషన్ మీడియా భేటీలో గత ప్రభుత్వ తీరును తప్పుబట్టింది. కోట్ల రూపాయల నష్టం వాటిల్లిందని పేర్కొంది. గతంలో ఏ కమిషన్ ఇలా పక్షపాత ధోరణితో వ్యాఖ్యలు చేయలేదు. ఎంక్వైరీ కమిషన్ పేరుతో జ్యుడీషియల్ కమిషన్ వేయడం చట్టవిరుద్ధం..’అని సోంధీ వాదించారు. దీంతో కమిషన్‌కు న్యాయపరమైన అధికారాలు లేనప్పుడు నివేదిక ఇచ్చినా ఏమీ జరగదు కదా అని ధర్మాసనం వ్యాఖ్యానించింది. ఇరుపక్షాల వాదనలు పూర్తి కావడంతో తీర్పు ను వాయిదా వేసింది. సోమవారం తీర్పు వెల్లడించే అవకాశం ఉంది.
Comments
Please login to add a commentAdd a comment