Yadadri power project
-
ఎక్కడా పక్షపాతం లేదు
సాక్షి, హైదరాబాద్: విద్యుత్ రంగానికి సంబంధించి గత ప్రభుత్వ నిర్ణయాలపై విచారణకు ఏర్పాటైన జస్టిస్ ఎల్.నరసింహారెడ్డి ఏకసభ్య కమిషన్ ఎక్కడా పక్షపాత ధోరణితో వ్యవహరించలేదని, నిష్పక్షపాతంగా విచారణ చేస్తోందని అడ్వొకేట్ జనరల్ ఎ.సుదర్శన్‌రెడ్డి హైకోర్టుకు నివేదించారు. దీనిపై దాఖలైన పిటిషన్‌ను విచారణకు అనుమతించ వద్దని కోరారు. దీనిపై పిటిషనర్, మాజీ సీఎం కె.చంద్రశేఖర్‌రావు తరఫు సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది ఆదిత్య సోంధీ అభ్యంతరం వ్యక్తం చేశారు. కమిషన్ ఆఫ్ ఎంక్వయిరీ యాక్ట్–1952 ప్రకారం జ్యుడీషియల్ కమిషన్ వేసినందున విచారణకు స్వీకరించాలని కోరారు. ఇరుపక్షాల వాదనలు విన్న ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరాధే, జస్టిస్ అనిల్‌కుమార్ జూకంటితో కూడిన ధర్మాసనం తీర్పు రిజర్వు చేసింది. పిటిషన్‌ను అనుమతించాలా? వద్దా? ఛత్తీస్‌గఢ్ నుంచి విద్యుత్ కొనుగోలు, యాదాద్రి, భద్రాద్రి థర్మల్ విద్యుత్ కేంద్రాల నిర్మాణంపై ఒప్పందాలు, ఎంవోయూలు చేసుకోవడంలో అక్రమా లు జరిగాయని ఆరోపిస్తూ..వీటిపై విచారణకు రాష్ట్ర ప్రభుత్వం గత మార్చి 14న జస్టిస్ ఎల్.నరసింహారెడ్డి కమిషన్‌ను నియమించింది. విచారణ ప్రారంభించిన కమిషన్ పలువురికి నోటీసులు జారీ చేసింది. ఈ నేపథ్యంలో కమిషన్ ఏర్పాటును సవాల్ చేస్తూ కేసీఆర్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.కానీ జస్టిస్ ఎల్.నరసింహారెడ్డిని వ్యక్తిగతంగా ప్రతివాదిగా చేర్చడంపై రిజిస్ట్రీ అభ్యంతరం చెబుతూ పిటిషన్‌కు నంబర్ కేటాయించలేదు. అయితే గురువారం విచారణ చేపట్టిన సీజే ధర్మాసనం నంబర్ చేయాలని ఆదేశించింది. పిటిషన్‌ను విచారణకు స్వీకరించాలా.. వద్దా అన్న అంశంపై విచారణ చేపట్టింది. ఈ అంశంపైనే వాదనలు వినిపించాలని, కేసు మెరిట్స్‌లోకి వెళ్లవద్దని సూచించింది. ప్రజలకు వివరాలు తెలిస్తే నష్టం లేదు: ఏజీ ‘కమిషన్ నియామకమైన నాటి నుంచి ఇప్పటివరకు 20 మందికిపైగా సాక్షులను విచారించింది. అందులో మాజీ సీఎండీ ప్రభాకర్‌రావుతో పాటు ట్రాన్స్‌కో, జెన్కో అధికారులున్నారు. వివరాలు ఇవ్వాలని కేసీఆర్‌ను కూడా కమిషన్ కోరింది. ఏప్రిల్‌లోనే నోటీసులు జారీ చేసింది. అయితే తాను ఓ జాతీయ పార్టీ అధ్యక్షుడినని, పార్లమెంట్ ఎన్నికలు ఉన్న కారణంగా వివరాలు ఇచ్చే సమయం లేదని ఆయన బదులిచ్చారు.జూలై తర్వాత వస్తానని చెప్పారు. కమిషన్ గడువు జూన్ 30 వరకే ఉండటంతో జూన్ 15న వివరాలు తెలియజేయాలని కమిషన్ సూచించింది. వివరాలు ఇతరులతో పంపినా సరిపోతుందని, స్వయంగా వస్తానంటే ఆ మేరకు ఏర్పాట్లు చేస్తామని కూడా తెలిపింది. అయినా కేసీఆర్ వివరాలు అందజేయలేదు. గతంలోనూ కమిషన్లు మీడియాకు వివరాలు వెల్లడించిన సందర్భాలున్నాయి. ఇది ప్రభుత్వం ఏర్పాటు చేసిన బహిరంగ కమిషన్. ఇందులో దాపరికం అంటూ ఏదీ లేదు. ప్రజలకు వివరాలు తెలిస్తే వచ్చే నష్టం కూడా లేదు. జస్టిస్ నరసింహారెడ్డి పక్షపాత ధోరణితో మాట్లాడారనడం అసంబద్ధం. ఆయన ఎవరిపైనా వ్యక్తిగతంగా వ్యాఖ్యలు చేయలేదు. 8బీ నోటీసులు ఇచ్చే అధికారం కమిషన్‌కు ఉంది.గతంలో మాజీ ముఖ్యమంత్రి కోట్ల విజయభాస్కర్‌రెడ్డిపై ప్రభుత్వం కమిషన్ ఏర్పాటు చేసింది. ఆ కమిషన్ ఆయనకు నోటీసులు జారీ చేయడమే కాదు.. మీడియాకు వివరాలు వెల్లడించింది. ఆ కమిషన్ విచారణను అడ్డుకోలేమని నాడు కోర్టులు కూడా చెప్పాయి. బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా గతంలో పలుమార్లు అంతకు ముందు ప్రభుత్వాల నిర్ణయాలపై కమిషన్లు వేస్తామని అసెంబ్లీలోనే పేర్కొంది. ఛత్తీస్‌గఢ్ నుంచి చేసిన విద్యుత్ కొనుగోలుపై విచారణ జరిపించుకోవచ్చని మాజీమంత్రి జగదీశ్‌రెడ్డి పేర్కొన్నారు. అలాంటప్పుడు ఈ కమిషన్ చట్ట వ్యతిరేకం ఎలా అవుతుంది? కమిషన్ల విచారణలో కోర్టులు కలుగజేసుకోలేవు. పిటిషన్‌ను విచారణకు స్వీకరించ వద్దు. ’అని ఏజీ ఎ.సుదర్శన్‌రెడ్డి కోరారు.గతంలో ఏ కమిషన్ ఇలా వ్యవహరించలేదు: సోంధీ ‘ఎల్.నరసింహారెడ్డి కమిషన్ మీడియా భేటీలో గత ప్రభుత్వ తీరును తప్పుబట్టింది. కోట్ల రూపాయల నష్టం వాటిల్లిందని పేర్కొంది. గతంలో ఏ కమిషన్ ఇలా పక్షపాత ధోరణితో వ్యాఖ్యలు చేయలేదు. ఎంక్వైరీ కమిషన్ పేరుతో జ్యుడీషియల్ కమిషన్ వేయడం చట్టవిరుద్ధం..’అని సోంధీ వాదించారు. దీంతో కమిషన్‌కు న్యాయపరమైన అధికారాలు లేనప్పుడు నివేదిక ఇచ్చినా ఏమీ జరగదు కదా అని ధర్మాసనం వ్యాఖ్యానించింది. ఇరుపక్షాల వాదనలు పూర్తి కావడంతో తీర్పు ను వాయిదా వేసింది. సోమవారం తీర్పు వెల్లడించే అవకాశం ఉంది. -
పనుల్లో నిర్లక్ష్యాన్ని ఉపేక్షించం
సాక్షి ప్రతినిధి, నల్లగొండ: యాదాద్రి థర్మల్ పవర్ ప్రాజెక్టు నిర్మాణ పనుల్లో నిర్లక్ష్యం వహిస్తే ఉపేక్షించేది లేదని, ప్రాజెక్టు పనులను త్వరితగతిన పూర్తి చేసి అందుబాటులోకి తీసుకురావాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అధికారులను ఆదేశించారు. నల్లగొండ జిల్లా దామరచర్ల మండలం వీర్లపాలెం వద్ద నిర్మాణంలో ఉన్న యాదాద్రి థర్మల్ విద్యుత్ ఉత్పత్తి ప్లాంట్‌ను శనివారం మంత్రులు ఉత్తమ్‌కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డితో కలిసి సందర్శించారు. అనంతరం అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ విద్యుత్ ప్లాంట్‌కు సంబంధించి ఇప్పటికే రెండుసార్లు అంచనా వ్యయాలు పెంచడంతో బడ్జెట్ భారీగా పెరిగిందని, ఫలితంగా రాష్ట్ర ఖజానాకు భారంగా మారిందన్నారు. ఈ పరిస్థితుల్లో ప్రాజెక్టును త్వరగా పూర్తి చేయకపోతే మోయలేని భారంగా పరిణమిస్తుందన్నారు. ప్రాజెక్టు పూర్తికి ప్రభుత్వ సహకారం ప్రాజెక్టు త్వరితగతిన పూర్తికి రాష్ట్ర ప్రభుత్వం నుంచి సహకారం ఉంటుందని భట్టి విక్రమార్క హామీనిచ్చారు. ప్రాజెక్టు ద్వారా స్థానికంగా ఉన్న స్కిల్డ్, అన్ స్కిల్డ్ నిరుద్యోగులందరికీ ఉద్యోగ అవకాశాలు కల్పించే అంశంపై ఆలోచించాలన్నారు. బీహెచ్ఈఎల్ పేరున్న ప్రభుత్వ రంగ సంస్థ అని యాదాద్రి పనులు త్వరగా పూర్తి చేయకపోతే ఆ సంస్థకు చెడ్డపేరు వస్తుందన్న విషయాన్ని సంస్థ అధికారులు, ఇంజనీర్లు దృష్టిలో పెట్టుకోవాలన్నారు. సెప్టెంబర్ నాటికి 1,600 మెగావాట్ల విద్యుత్ ఈ ఏడాది సెప్టెంబర్‌లో రెండు యూనిట్ల ద్వారా 1,600 మెగావాట్ల విద్యుత్ పూర్తిస్థాయిలో ఉత్పత్తి చేస్తామని అధికారులు వివరించారు. 2025 మార్చి నాటికి మొత్తం ఐదు యూనిట్ల ద్వారా నాలుగు వేల మెగావాట్ల విద్యుత్ అందుబాటులోకి తెస్తామని అధికారులు మంత్రులకు చెప్పుకొచ్చారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తున్న నేపథ్యంలో జీరో పర్సంట్ ధూళి బయటికి వెళ్లకుండా నిర్మాణం జరుగుతుందని అధికారులు వివరించారు. అలాగే స్థానికంగా వినియోగించే నీటిని తిరిగి శుద్ధి చేసి ప్రాజెక్టు అవసరాలకే వినియోగిస్తామని తెలిపారు. రుణాలపై ఆరా.. ప్రాజెక్టు నిర్మాణానికి తీసుకున్న రుణాలు, వాటి వడ్డీ రేట్ల గురించి నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి అధికారులను ప్రశ్నించారు. కమర్షియల్ బ్యాంకుల కన్నా ఎక్కువ వడ్డీ రేటు ఉంటే దానిని తగ్గించాలని కోరే అవకాశం ఉందని చెప్పా రు. స్థానికులకే ఉపాధి అవకాశాలు కల్పించడమే కాకుండా, సబ్ కాంట్రాక్టులు, ఇతర చిన్నచిన్న పనుల్లో స్థానికులకు అవకాశం కల్పించడం ద్వారా చేయూతనివ్వాలని మంత్రి కోమటిరెడ్డి అధికారులను కోరారు. ప్రస్తుతం పవర్ ప్లాంట్‌లో జరుగుతున్న అన్ని రకాల అభివృద్ధి పనులను వీడియో ప్రజెంటేషన్ రూపంలో మంత్రుల బృందానికి వివరించారు. సమావేశంలో విద్యుత్ శాఖ సీఎండీ సయ్యద్ అలీ ముర్తుజా రిజ్వీ, ట్రాన్స్‌కో డైరెక్టర్ అజయ్, పవర్ ప్లాంట్ సీఈ సమ్మయ్య పాల్గొన్నారు. -
యాదాద్రి విద్యుత్ కేంద్రానికి నీటి ఇబ్బంది లేదు!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం 4 వేల మెగావాట్ల సామర్థ్యంతో నిర్మించదలిచిన యాదాద్రి విద్యుత్ కేంద్రానికి కృష్ణా జలాల నుంచి నీటి కేటాయింపులకు ఎలాంటి ఇబ్బంది లేదని నీటి పారుదల శాఖ తేల్చింది. ఎలాంటి అంతర్రాష్ట్ర వివాదాలకు ఆస్కారం లేకుండా కృష్ణా నుంచి ఏటా 6.6 టీఎంసీల నీటిని ఇవ్వవచ్చని స్పష్టం చేసింది. యాదాద్రి విద్యుత్ ప్రాజెక్టుతో పర్యావరణంపై పడే ప్రభా వం అంచనా వేసి కేంద్ర పర్యావరణ శాఖకు టీఎస్-జెన్కో, పర్యావరణ ప్రభావ నివేదిక(ఈఐఏ)ను సమర్పించాలి. ప్రాజెక్టుకు సరైన నీటి కేటాయింపులు ఉంటేనే పర్యావరణ అనుమతులు వస్తాయి. ఈ దృష్ట్యా కృష్ణా జలాల్లో నీటి లభ్యత అంశాలపై నీటి పారుదల శాఖ ప్రభుత్వానికి నివేదిక పంపింది. కృష్ణాలో రాష్ట్రానికి 299 టీఎంసీల మేర నీటి హక్కులు ఉండగా, గత 36 ఏళ్లుగా చేసిన నీటి కేటాయింపులను బట్టి రాష్ట్రం సుమారు 256 టీఎంసీలనే వినియోగించుకుంటోంది. ఈ లెక్కన యాదాద్రికి అవసరమైన 6.6 టీఎంసీలను కృష్ణా జలాల్లోంచి ఇవ్వడం ఇబ్బంది కాదని తెలుస్తోంది. విద్యుత్ కేంద్రం పక్కనుంచి తుంగపాడు వాగు వెళుతోంది. ఈ వాగులో కరువు పరిస్థితుల్లో నీటి కొరత ఏర్పడినా పక్కనే ఉండే దేవులపల్లి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ ద్వారా నాగార్జునసాగర్ ఎడమ కాల్వ నుంచి నిర్ణీత నీటిని అందించవచ్చని తెలిపింది. ఈ దృష్ట్యా విద్యుత్ ప్రాజెక్టుకు నీటి కొరత ఏర్పడే అవకాశం లేదని అధికారులు తమ నివేదికలో వివరించారు. నీటి పారుదల శాఖ నివేదికను ప్రభుత్వం ఒకట్రెండు రోజుల్లో కేంద్ర పర్యావరణ శాఖకు పంపే అవకాశాలున్నాయని టీఎస్జెన్కో వర్గాలు తెలిపాయి.