సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం 4 వేల మెగావాట్ల సామర్థ్యంతో నిర్మించదలిచిన యాదాద్రి విద్యుత్ కేంద్రానికి కృష్ణా జలాల నుంచి నీటి కేటాయింపులకు ఎలాంటి ఇబ్బంది లేదని నీటి పారుదల శాఖ తేల్చింది. ఎలాంటి అంతర్రాష్ట్ర వివాదాలకు ఆస్కారం లేకుండా కృష్ణా నుంచి ఏటా 6.6 టీఎంసీల నీటిని ఇవ్వవచ్చని స్పష్టం చేసింది. యాదాద్రి విద్యుత్ ప్రాజెక్టుతో పర్యావరణంపై పడే ప్రభా వం అంచనా వేసి కేంద్ర పర్యావరణ శాఖకు టీఎస్-జెన్‌కో, పర్యావరణ ప్రభావ నివేదిక(ఈఐఏ)ను సమర్పించాలి. ప్రాజెక్టుకు సరైన నీటి కేటాయింపులు ఉంటేనే పర్యావరణ అనుమతులు వస్తాయి. ఈ దృష్ట్యా కృష్ణా జలాల్లో నీటి లభ్యత అంశాలపై నీటి పారుదల శాఖ ప్రభుత్వానికి నివేదిక పంపింది.
కృష్ణాలో రాష్ట్రానికి 299 టీఎంసీల మేర నీటి హక్కులు ఉండగా, గత 36 ఏళ్లుగా చేసిన నీటి కేటాయింపులను బట్టి రాష్ట్రం సుమారు 256 టీఎంసీలనే వినియోగించుకుంటోంది. ఈ లెక్కన యాదాద్రికి అవసరమైన 6.6 టీఎంసీలను కృష్ణా జలాల్లోంచి ఇవ్వడం ఇబ్బంది కాదని తెలుస్తోంది. విద్యుత్ కేంద్రం పక్కనుంచి తుంగపాడు వాగు వెళుతోంది. ఈ వాగులో కరువు పరిస్థితుల్లో నీటి కొరత ఏర్పడినా పక్కనే ఉండే దేవులపల్లి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ ద్వారా నాగార్జునసాగర్ ఎడమ కాల్వ నుంచి నిర్ణీత నీటిని అందించవచ్చని తెలిపింది. ఈ దృష్ట్యా విద్యుత్ ప్రాజెక్టుకు నీటి కొరత ఏర్పడే అవకాశం లేదని అధికారులు తమ నివేదికలో వివరించారు. నీటి పారుదల శాఖ నివేదికను ప్రభుత్వం ఒకట్రెండు రోజుల్లో కేంద్ర పర్యావరణ శాఖకు పంపే అవకాశాలున్నాయని టీఎస్‌జెన్‌కో వర్గాలు తెలిపాయి.
యాదాద్రి విద్యుత్ కేంద్రానికి నీటి ఇబ్బంది లేదు!
Published Mon, Mar 14 2016 4:45 AM | Last Updated on Fri, Nov 9 2018 5:56 PM
Advertisement