
స్పీకర్ కార్యాలయం ఆపరేషన్ సక్సెస్.. పేషెంట్ డెడ్ తరహాలో వ్యవహరించొద్దు
బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేల ఫిరాయింపు కేసులో సుప్రీంకోర్టు తీవ్ర వ్యాఖ్యలు
చట్టసభల గడువు ముగిసేవరకు నిర్ణయం తీసుకోకపోతే ఎలా?.... ఇలాగైతే ప్రజాస్వామ్యానికి అర్థం ఏముంటుంది?
తగిన సమయం అంటే అసెంబ్లీ కాలం ముగిసేంత వరకా? అంటూ ప్రశ్నలు
రాష్ట్ర ప్రభుత్వం, స్పీకర్, అసెంబ్లీ కార్యదర్శి, కేంద్ర ఎన్నికల సంఘం, ఫిరాయించిన ఎమ్మెల్యేలకు నోటీసులు
తెలంగాణ హైకోర్టు రిజిస్ట్రార్ ద్వారా నోటీసులు అందజేయాలని ఆదేశం
ఈ నెల 22 లోగా వివరణ ఇవ్వాలని స్పషీ్టకరణ.. విచారణ 25కు వాయిదా
సాక్షి, న్యూఢిల్లీ: ‘ఎమ్మెల్యేల ఫిరాయింపులపై ప్రతిసారీ ‘‘స్పీకర్ తగిన సమయంలో నిర్ణయం తీసుకుంటారు’’ అంటున్నారు. తగినంత సమయం అంటే ఎంత? ఐదేళ్ల పదవీ కాలం పూర్తయ్యే వరకా?. తగినంత సమయాన్ని కోర్టు ఫిక్స్ చేయాలా? వద్దా?. మనం ప్రజాస్వామ్యంలో ఉన్నాం.
చట్ట సభల గడువు ముగిసే వరకు నిర్ణయం తీసుకోకపోతే ఎలా? ప్రజాస్వామ్యానికి అర్థం ఏం ఉంటుంది? ఆపరేషన్ సక్సెస్.. పేషెంట్ డెడ్ అనే విధంగా వ్యవహరించడం ఎంతమాత్రం సరికాదు..’ అంటూ సుప్రీంకోర్టు తీవ్ర వ్యాఖ్యలు చేసింది.
రాష్ట్రంలో బీఆర్‌ఎస్ పార్టీ నుంచి గెలిచి కాంగ్రెస్‌లో కొనసాగుతున్న ఎమ్మెల్యేల వ్యవహారంలో స్పీకర్ కార్యాలయం ఇంతవరకు ఎటువంటి చర్యలు తీసుకోకపోవడంపై అసహనం వ్యక్తం చేసింది. రాష్ట్ర ప్రభుత్వానికి, స్పీకర్, అసెంబ్లీ కార్యదర్శి, కేంద్ర ఎన్నికల సంఘం, పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలకు నోటీసులు జారీ చేసింది.
ఈ నోటీసులు హైకోర్టు రిజిస్ట్రార్ ద్వారా అందజేయాలని జస్టిస్ బీఆర్ గవాయి, జస్టిస్ అగస్టీన్ జార్జ్‌ల ధర్మాసనం ఆదేశించింది. ఈ నోటీసులపై వీరంతా ఈనెల 22లోపు వివరణ ఇవ్వాలని స్పష్టం చేస్తూ తదుపరి విచారణను ఈ నెల 25వ తేదీకి వాయిదా వేసింది.
ఓ ఎస్‌ఎల్‌పీ, మరో రిట్ పిటిషన్‌పై విచారణ
కారు గుర్తుపై గెలిచి కాంగ్రెస్ పార్టీలో చేరిన ఎమ్మెల్యేలు దానం నాగేందర్, కడియం శ్రీహరి, తెల్లం వెంకట్రావ్‌లపై ఎస్‌ఎల్‌పీ, మిగిలిన ఏడుగురు ఎమ్మెల్యేలు పోచారం శ్రీనివాస్‌రెడ్డి, ఎం.సంజయ్‌కుమార్, కాలె యాదయ్య, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, ప్రకాశ్‌గౌడ్, గూడెం మహీపాల్ రెడ్డి, అరెకపూడి గాందీలపై రిట్ పిటిషన్ దాఖలు అయిన విషయం తెలిసిందే.
కాగా ఈ రెండు పిటిషన్లపై తాజాగా మంగళవారం సుప్రీం ధర్మాసనం విచారణ చేపట్టింది. పిటిషనర్ల తరఫున సీనియర్ న్యాయవాదులు ఆర్యమ సుందరం, దామ శేషాద్రినాయుడు, పి.మోహిత్‌రావు, స్పీకర్ తరఫున సీనియర్ న్యాయవాదులు అభిషేక్ మనుసింఘ్వీ, ముకుల్ రోహత్గీ తదితరులు వాదనలు వినిపించారు.
ఏడాది కావొస్తున్నా చర్యలు లేవు
‘గతేడాది మార్చి, ఏప్రిల్‌లో పార్టీ ఫిరాయింపులపై తొలిసారి కోర్టును ఆశ్రయించాం. అనంతరం జూన్‌లో రిట్ పిటిషన్ దాఖలు చేశాం. ఏడాది అవుతున్నా ఇప్పటివరకు పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలకు స్పీకర్ ఎలాంటి నోటీసులు ఇవ్వలేదు. ఆర్టికల్ 32, 226 ప్రకారం స్పీకర్ నిర్ణయం తీసుకోవడానికి ఎలాంటి సమయం అవసరం లేదు.
ప్రధానంగా పార్టీ ఫిరాయింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న ఒక ఎమ్మెల్యే కాంగ్రెస్ బీ ఫాంపై లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేశారు. మరో ఎమ్మెల్యే ఏకంగా కాంగ్రెస్ పార్టీ కోసం లోక్‌సభ ఎన్నికల్లో ప్రచారం చేశారు. మిగిలిన ఎమ్మెల్యేలు అధికార కాంగ్రెస్ పార్టీకి చెందిన ముఖ్యమంత్రి సమక్షంలో ఆ పార్టీ కండువా కప్పుకున్నారు.
బీఆర్‌ఎస్ పార్టీకి సంబంధించినంత వరకు వాళ్లు పార్టీ ఫిరాయించినట్టే. దీనిపై తొలుత రాష్ట్ర హైకోర్టును ఆశ్రయించగా..విచారణకు సమయాన్ని ఖరారు చేయాలంటూ సింగిల్ బెంచ్ నాలుగు వారాలు గడువు ఇచ్చింది. దీనిపై స్పీకర్ కార్యాలయం అప్పీల్‌కు వెళ్లింది.
అయితే స్పీకర్‌కు తగినంత సమయం ఇవ్వాలన్న భావనతో ఈ ఉత్తర్వులను డివిజన్ బెంచ్ పక్కన పెట్టింది. ఈ నేపథ్యంలోనే సుప్రీంను ఆశ్రయించాం. కానీ స్పీకర్ కార్యాలయం ఇప్పటివరకు ఆ తగినంత సమయం అంటే ఎంతో చెప్పనేలేదు.
స్పీకర్ సమయం తీసుకునే విషయంలో సుభాష్ దేశాయ్, కేశం మేఘాచంద్, రాజేంద్ర సింగ్ రాణా కేసుల్లో సుప్రీంకోర్టు స్పష్టమైన మార్గదర్శకాలు ఇచ్చింది. ఈ తీర్పుల ఆధారంగా పార్టీ ఫిరాయింపులకు పాల్పడిన ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకునేందుకు అవకాశం ఉంది..’ అని అని పిటిషనర్ల తరఫు న్యాయవాదులు ధర్మాసనం దృష్టికి తెచ్చారు.
అయితే సుభాష్ దేశాయ్ కేసులో స్పీకర్ నిర్ణయంపై ఎలాంటి గడువు ఫిక్స్ చేయలేదని జస్టిస్ బీఆర్ గవాయి అన్నారు. రాణా కేసులో మూడు నెలల సమయం ఇవ్వాలని చెప్పిందని తెలిపారు. ఫిరాయింపులపై కాంగ్రెస్ అధికారం ఉన్నచోట ఒకలా... లేనిచోట మరోలా వ్యవహరిస్తున్నారని పిటిషనర్ తరపు న్యాయవాది అర్యమ సుందరం వాదించారు.
స్పీకర్‌కు కోర్టు ఆదేశాలివ్వడానికి అవకాశం లేదు
స్పీకర్ కార్యదర్శి తరఫు న్యాయవాది అభిషేక్ మనుసింఘ్వీ వాదిస్తూ.. ‘ఫిరాయింపులపై గతేడాది జూలై మొదటి వారంలో స్పీకర్‌కు ఫిర్యాదు చేస్తే 9వ తేదీ నాటికే కోర్టులో పిటిషన్ వేశారు. మరోవైపు ఫిరాయింపులపై ఫిర్యాదు అందగానే స్పీకర్ స్పందించారు.. నోటీసులు ఇచ్చారు. వారి నుంచి రిప్లై రాగానే నిర్ణయం తీసుకుంటారు.
అసలు స్పీకర్ నిర్దిష్ట సమయంలో నిర్ణయం తీసుకోవాలని లేదు. రాజ్యాంగబద్ధంగా అత్యంత ఉన్నతమైన పదవుల్లో స్పీకర్ పదవి ఒకటి. ఈ పదవిలో ఉన్న స్పీకర్‌కు కోర్టు ఆదేశాలు జారీ చేయడానికి అవకాశం లేదు..’ అని చెప్పారు. దీంతో ధర్మాసనం అసహనం వ్యక్తం చేసింది.
‘స్పీకర్‌కు కోర్టు ఆదేశాలు జారీ చేయడానికి అవకాశం లేదూ అంటే.. న్యాయమే డిసైడ్ చేస్తుంది ఆగండి..’ అంటూ వ్యాఖ్యానించింది. నోటీసుల జారీకి ఆదేశాలిచ్చింది. ప్రతివాదుల తరఫు న్యాయవాదులు కూడా వీరికి నేరుగా నోటీసులు ఇవ్వొచ్చని తెలిపింది. ఈనెల 25న ఐటెం నంబర్–1గా కేసును విచారిస్తామని స్పష్టం చేసింది.
Comments
Please login to add a commentAdd a comment