భద్రాద్రి ప్లాంట్‌కు ‘సీతమ్మ’ కష్టాలు | Khammam: Problems In Bhadradri Thermal Plant Construction | Sakshi
Sakshi News home page

భద్రాద్రి ప్లాంట్‌కు ‘సీతమ్మ’ కష్టాలు

Published Sun, Apr 18 2021 3:33 AM | Last Updated on Sun, Apr 18 2021 8:26 AM

Khammam: Problems In Bhadradri Thermal Plant Construction - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: భద్రాద్రి థర్మల్‌ విద్యుత్‌ కేంద్రానికి వరద గండం పొంచి ఉంది!. గోదావరిపై దుమ్ముగూడెం వద్ద 63 మీటర్ల ఎత్తుతో నిర్మించతలపెట్టిన సీతమ్మసాగర్‌ డ్యాంతో భవిష్యత్తులో భద్రాద్రి థర్మల్‌ విద్యుత్‌ కేంద్రం వరద ముంపునకు గురయ్యే ప్రమాదముందని ఆందోళన వ్యక్తమవుతోంది. కొత్తగూడెం జిల్లా మణుగూరు వద్ద గోదావరి తీరంలో 1,080 (270్ఠ4) మెగావాట్ల విద్యుదుత్పత్తి సామర్థ్యంతో భద్రాద్రి విద్యుత్‌ కేంద్రాన్ని తెలంగాణ జెన్‌కో నిర్మిస్తోంది.

గత 100 ఏళ్లలో గోదావరికి వచ్చిన గరిష్ట వరదలను పరిగణనలోకి తీసుకుని ఈ విద్యుత్‌ కేంద్రం కోసం నిర్మాణ స్థలాన్ని ఎంపిక చేశారు. 2015లో విద్యుత్‌ ప్లాంట్‌ నిర్మాణపనులు మొదలయ్యాయి. అప్పట్లో సీతమ్మసాగర్‌ డ్యాం నిర్మాణానికి సంబంధించిన ఆలోచన కూడా లేదు. తాజాగా సీతమ్మసాగర్‌ జలాశయం నిర్మించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించడంతో పరిస్థితులు మారిపోయాయని ఉన్నతస్థాయి అధికారవర్గాలు పేర్కొంటున్నాయి.

దుమ్ముగూడెం ఆనకట్ట ఎత్తును 63 మీటర్లకు పెంచి సీతమ్మసాగర్‌ జలాశయాన్ని నిర్మిస్తే ఎగువన ఉన్న భద్రాద్రి థర్మల్‌ విద్యుత్‌ కేంద్రానికి సంబంధించిన ఇన్‌టేక్‌ వెల్‌తో పాటు ఆర్‌డబ్ల్యూఎస్, సింగరేణి సంస్థకు చెందిన ఇన్‌టేక్‌ వెల్స్‌.. బ్యాక్‌వాటర్‌తో ముంపునకు గురికానున్నాయని ఇప్పటికే నీటిపారుదల శాఖ నిర్థారించింది. అయితే, భవిష్యత్తులో గోదావరికి భీకర వరదలు పోటెత్తితే మాత్రం భద్రాద్రి విద్యుత్‌ కేంద్రానికి సైతం ముంపు ప్రమాదం తప్పదని అభిప్రాయానికి వచ్చినట్టు తెలిసింది. వరద రక్షణ గోడలు నిర్మించి భద్రాద్రి విద్యుత్‌ కేంద్రానికి రక్షణ కల్పిస్తామని నీటిపారుదల శాఖ ప్రతిపాదించింది. ఈ విషయమై నీటిపారదుల శాఖ, జెన్‌కోల మధ్య గత కొంతకాలంగా ఉత్తరప్రత్యుత్తరాలు నడుస్తున్నాయి. త్వరలో ఈ అంశంపై ప్రభుత్వం ఓ నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.

గతేడాది వణికించిన వరదలు
గతేడాది ఆగస్టులో కురిసిన భారీ వర్షాలతో గోదావరిలో వరద పోటెత్తింది. ఆగస్టు 17న 20 లక్షల క్యూసెక్కుల భారీ వరద రాగా, భద్రాచలం వద్ద గోదావరిలో నీటిమట్టం 61.60 అడుగులకు ఎగబాకింది. విద్యుత్‌ కేంద్రం ఇన్‌టేక్‌ వెల్‌ పిల్లర్లు దాదాపు సగం వరకు మునిగిపోగా, భద్రాద్రి విద్యుత్‌ కేంద్రం ప్రహరిగోడ దగ్గరికి వరకు నీళ్లొచ్చాయి.

విద్యుత్‌ కేంద్రం లోపల కురిసిన వర్షపు నీటిని గోదావరిలోకి తీసుకెళ్లేందుకు దాదాపు రెండు మీటర్ల లోతులో నిర్మించిన డ్రెయిన్స్‌ నుంచి వరద నీరు విద్యుత్‌ కేంద్రంలోకి రివర్స్‌ఫ్లోలో పోటెత్తింది. దీనికి తోడు లోపల కురిసిన వాననీరు సైతం బయటకు వెళ్లక దీనికి జతకావడంతో విద్యుత్‌ కేంద్రం ఆవరణలో భారీగా నీరు నిలిచింది. వరద తీవ్రత మరింత పెరిగితే విద్యుత్‌ కేంద్రం ముంపునకు గురి అవుతుందని అక్కడ విధులు నిర్వహించే ఇంజనీర్లు ఆందోళనకు గురయ్యారు.

వారం పాటు విద్యుదుత్పత్తిని నిలిపివేసి వరద ఉధృతి తగ్గాక మళ్లీ పునరుద్ధరించాల్సి వచ్చింది. 20 లక్షల క్యూసెక్కుల సాధారణ వరదలకే థర్మల్‌ విద్యుత్‌ కేంద్రం కొంతవరకు ప్రభావానికి గురైందని, భవిష్యత్తులో వరదలు తీవ్రస్థాయిలో వస్తే ముంపునకు గురయ్యే అవకాశాలెక్కువ ఉంటాయనే ఆందోళన అధికారుల్లో వ్యక్తం అవుతోంది. గోదావరికి 1986 ఆగస్టు 16న అత్యంత భీకరంగా 36 లక్షల క్యూసెక్కుల జల ప్రవాహంతో వరదలు పోటెత్తాయి. భద్రాచలం వద్ద 75.6 అడుగులకు నీటిమట్టం పెరిగింది.

గత 100 ఏళ్లల్లో గోదావరికి వచ్చిన అతిభారీ వరదలు ఇవే. మళ్లీ అంతకు మించిన వరదలు వస్తే మాత్రం భద్రాద్రి విద్యుత్‌ కేంద్రం ముంపునకు గురవడం ఖాయమని నిపుణులు అంటున్నారు. సీతమ్మసాగర్‌ జలాశయం నిర్మాణంతో ముంపు ముప్పు మరింత పెరగనుందని ఆందోళన వ్యక్తం అవుతోంది. 1986 నాటి వరదల నేపథ్యంలో గరిష్టంగా 50 లక్షల క్యూసెక్కులతో భవిష్యత్తులో వరదలు వచ్చే అవకాశముందని కేంద్ర జలసంఘం (సీడబ్ల్యూసీ) గరిష్ట వరదలకు సంబంధించిన అంచనాలను సవరించింది.

వరద గోడలు నిర్మించినా వాగులతో సమస్యే!
భద్రాద్రి విద్యుత్‌ కేంద్రానికి వరద రక్షణ గోడలు నిర్మిస్తే గోదావరి వరద పోటు తప్పినా.. పరిసర ప్రాంతాల్లోని వాగుల రూపంలో కొత్త ముంపు సమస్య తలెత్తనుందని అధికారులు పేర్కొంటున్నారు. ప్రధానంగా భద్రాద్రి థర్మల్‌ విద్యుత్‌ కేంద్రం నిర్మిస్తున్న స్థలంలోనే ఓ సీపేజీ వాగు ఉంది. రక్షణ గోడ నిర్మాణంతో దీని ప్రవాహం సైతం విద్యుత్‌ కేంద్రం లోపలి ప్రాంతంలోనే నిలిచిపోనుంది. ఇలా రక్షణ గోడలకు ఇవతల నిలిచిపోయే నీటిని పంపుల ద్వారా గోదావరిలో ఎత్తిపోయాలని నీటిపారుదల శాఖ మరో ప్రతిపాదన చేసినట్టు సమాచారం.

ప్లాంట్‌కు రక్షణ గోడలు
భద్రాద్రి ప్లాంట్‌ చుట్టూ 7.76 కి.మీ నిడివితో వరద రక్షణ గోడల నిర్మించాలని జెన్‌కో, నీటిపారదుల శాఖ ఓ అభిప్రాయానికి వచ్చినట్టు సమాచారం. వరద రక్షణ గోడలు నిర్మిస్తే సువిశాలమైన ప్లాంట్‌ లోపలి భాగంలోకురిసే వర్షపు నీటితో పాటు పరిసర ప్రాంతాల్లోని వాగుల్లోని ప్రవాహాలను ఎత్తిపోయడానికి ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని భావిస్తున్నారు. ప్లాంట్‌ నిర్మాణ ఖర్చుకు అదనంగా ఇందుకు రూ.వందల కోట్లలో ఖర్చు కానుందని అంచనా. లేనిపక్షంలో అనూహ్యంగా భారీ వరదలు పోటెత్తితే రూ.9962.32 కోట్ల వ్యయంతో నిర్మిస్తున్న విద్యుత్‌ కేంద్రానికి తీవ్ర నష్టంవాటిల్లుతుందనే ఆందోళన వ్యక్తమవుతోంది.

విద్యుత్‌ కేంద్రంలో చాలా వరకు ఎలక్ట్రో–మెకానికల్‌ యంత్రపరికరాలు ముంపునకు గురైతే మరమ్మతులు సాధ్యం కాదని, మళ్లీ కొత్తవి తెచ్చుకోవాల్సిందేనని నిపుణులు అంటున్నారు. ఇప్పటికే కల్వకుర్తి ఎత్తిపోతల పథకం అనూహ్యంగా ముంపునకు గురికావడంతోదాదాపు ఇలానే భారీ నష్టం వాటిల్లింది. చుట్టూ రక్షణ గోడలు నిర్మించినా సరే వరద పోటెత్తినప్పుడు ..రక్షణ గోడల చుట్టూ చేరిన నీటి ఉర్ద్వ పీడనం (అప్‌లిఫ్ట్‌ ప్రెషర్‌)తో పవర్‌ ప్లాంట్‌ పునాదులకు ప్రమాదం ఏర్పడే అవకాశం ఉందని అధికారులు అంటున్నారు. భద్రాద్రి థర్మల్‌ ప్లాంట్‌తో పాటు సీతారామ ఎత్తిపోతల పథకంలోని తొలి లిఫ్టునకు సైతం గోదావరి నుంచి వరద ముప్పు ఉందని అధికారుల్లో చర్చ జరుగుతోంది.

భవిష్యత్తులో అనూహ్య వరదలు పోటెత్తవచ్చు
తీవ్ర వాతావరణ మార్పులను చూడబోతున్నాం. ఉష్ణోగ్రతలకు తగ్గట్టు వర్షపాతం పెరుగుతోంది. నదుల గరిష్ట వరద ప్రవాహ మట్టాలు (ఫ్లడ్‌ లెవల్స్‌) మారిపోతున్నాయి. గత వందేళ్లలో వచ్చిన వరదలను పరిగణనలోకి తీసుకుని ప్రాజెక్టులకు డిజైన్‌ చేస్తున్నారు. గతంలో వందేళ్లకొచ్చిన వరదలు ఇప్పుడు పదేళ్లలో, వెయ్యేళ్లలో వచ్చిన వరదలు వందేళ్లలోనే వస్తున్నాయి. భద్రాద్రి పవర్‌ ప్రాజెక్టు కట్టేటప్పుడే ఇవన్నీ చూసుకోవాల్సింది. 1986లో వచ్చిన 36 లక్షల క్యూసెక్కుల స్థాయి వరద మళ్లీ పునరావృతమైనా, లేక సీడబ్ల్యూసీ సవరించిన అంచనాల మేరకు 50 లక్షల క్యూసెక్కుల వరద వచ్చినా భద్రాద్రి విద్యుత్‌ కేంద్రానికి ముప్పు పొంచి ఉంటుంది. 
- డాక్టర్‌ బాబూరావు, పర్యావరణ శాస్త్రవేత్త

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement