శ్రీశైలం ప్రాజెక్టు నుంచి త్రివర్ణ కాంతులతో దిగువకు పారుతున్న వరద నీరు
సాక్షి, హైదరాబాద్: ఎగువన ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తుండటంతో కృష్ణా, గోదావరి నదుల్లో వరద ఉధృతి స్థిరంగా కొనసాగుతోంది. కృష్ణా నుంచి 4.02 లక్షల క్యూసెక్కులు, గోదావరి నుంచి 14.74 లక్షల క్యూసెక్కుల వరద సముద్రంలో కలసిపోతోంది. జూరాల నుంచి కృష్ణా.. సుంకేశుల నుంచి తుంగభద్ర ద్వారా శనివారం సాయంత్రం 6 గంటలకు శ్రీశైలం ప్రాజెక్టులోకి 4,25,563 క్యూసెక్కుల ప్రవాహం వస్తుండగా.. విద్యుదుత్పత్తి చేస్తూ కుడి కేంద్రం ద్వారా 30,252, ఎడమ కేంద్రం ద్వారా 31,784 క్యూసెక్కులను దిగువకు వదిలేస్తున్నారు.
త్రివర్ణ కాంతుల్లో నాగార్జునసాగర్ ప్రాజెక్టు నీటి పరవళ్లు
ప్రాజెక్టులో 884.3 అడుగుల వద్ద 211.47 టీఎంసీలను నిల్వ చేస్తూ.. పది గేట్లను 15 అడుగుల మేర ఎత్తి 3,76,170 క్యూసెక్కులను దిగువకు వదిలేస్తున్నారు. నాగార్జునసాగర్‌లోకి 4,09,963 క్యూసెక్కులు చేరుతుండగా.. విద్యుదుత్పత్తి ద్వారా 32,845 క్యూసెక్కులను, 24 గేట్లను పది అడుగులు, రెండు గేట్లను ఐదు అడుగుల మేర ఎత్తి 3,58,120 క్యూసెక్కులను దిగువకు వదిలేస్తున్నారు. సాగర్‌లో 586.3 అడుగులవద్ద 301.87 టీఎంసీల నిల్వను కొనసాగిస్తున్నారు.
►పులిచింతలలోకి 3,77,117 క్యూసెక్కులు చేరుతుండగా.. 168.01 అడుగుల వద్ద 35.59 టీఎంసీలను నిల్వ చేస్తున్నారు. అలాగే 17 గేట్లు, విద్యుదుత్పత్తి ద్వారా 3,40,827 క్యూసెక్కులను దిగువకు వదిలేస్తున్నారు.
►పులిచింతల, పాలేరు, మున్నేరుల ద్వారా ప్రకాశం బ్యారేజ్‌లోకి 4,15,036 క్యూసెక్కుల ప్రవాహం చేరుతుండగా..4,02,944 క్యూసెక్కులను 70 గేట్ల ద్వారా సముద్రంలోకి వదిలేస్తున్నారు.
►ఎగువన విస్తారంగా వర్షాలు కురుస్తుండటంలో ఆల్మట్టి, నారాయణపూర్‌లలోకి చేరుతున్న 2.30 లక్షల క్యూసెక్కులను, తుంగభద్ర డ్యామ్ నుంచి 1.05 లక్షల క్యూసెక్కులను దిగువకు వదిలేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆదివారం కూడా శ్రీశైలం, సాగర్, పులిచింతల, ప్రకాశం బ్యారేజ్‌లలోకి ఇదే రీతిలో వరద కొనసాగుతుందని అంచనా వేస్తున్నారు.
గోదావరిలో నిలకడగా వరద..
గోదావరిలో వరద ప్రవాహం నిలకడగా కొనసాగుతోంది. భద్రాచలం వద్ద నీటిమట్టం 52 అడుగుల్లో కొనసాగుతుండటంతో రెండో ప్రమాద హెచ్చరికను కొనసాగిస్తున్నారు. పోలవరం ప్రాజెక్టులోకి వచ్చిన వరదను వచ్చినట్టుగా 48 గేట్ల ద్వారా దిగువకు వదిలేస్తున్నారు. దాంతో ధవళేశ్వరం బ్యారేజ్‌లోకి 14,80,877 క్యూసెక్కులు చేరుతోంది. నీటి మట్టం 15 అడుగుల వద్ద కొనసాగుతుండటంతో రెండో ప్రమాద హెచ్చరికను కొనసాగిస్తున్నారు.
గోదావరి డెల్టాకు 6,500 క్యూసెక్కులు వదులుతూ.. 14,74,377 క్యూసెక్కులను 175 గేట్ల ద్వారా సముద్రంలోకి వదిలేస్తున్నారు. మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్‌లలో విస్తారంగా వర్షాలు కురిసిన నేపథ్యంలో పెన్‌గంగ, ప్రాణహితలలో వరద ఉధృతి పెరిగింది. ఈ నేపథ్యంలో ఆదివారం కూడా గోదావరికి వరద ఇదే రీతిలో వరద కొనసాగనుందని భావిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment