కేంద్ర పర్యావరణ శాఖ
నిపుణుల సబ్ కమిటీ నివేదిక
యాదాద్రి ప్లాంట్‌కు అనుమతులపై నిర్ణయం వాయిదా
సాక్షి, హైదరాబాద్: ఖమ్మం జిల్లా మణుగూరులో 1,080 (4x270) మెగావాట్ల భద్రాద్రి థర్మల్ విద్యుత్ ప్లాంట్ ప్రాజెక్టుకు సంబంధించి పర్యావరణ ప్రభావ అధ్యయనం (ఎన్విరాన్‌మెంటల్ ఇంపాక్ట్ అసెస్‌మెంట్) సాధ్యమేనని కేంద్ర పర్యావరణ, అటవీ మంత్రిత్వ శాఖ నిపుణుల సబ్ కమిటీ నివేదించింది. పర్యావరణ అనుమతులు రాకముందే పనులు చేపట్టిన దృష్ట్యా అసలు ఈ ప్లాంట్‌కు ఎన్విరాన్‌మెంటల్ అప్రైజల్ సాధ్యమేనా? కాదా? అన్న అంశంపై నిర్ణయం తీసుకోవాలని నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ కొన్ని నెలల కింద కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖను ఆదేశించింది.
పర్యావరణ మంత్రిత్వ శాఖ నిపుణుల సబ్ కమిటీ గత నెల 17-19 తేదీల్లో మణుగూరులో తనిఖీలు జరిపి ఆ శాఖకు సమగ్ర అధ్యయన నివేదిక సమర్పిం చింది. మొత్తం ప్లాంట్ నిర్మిత ప్రాంతంలోని 1.85% భాగంలో మాత్రమే జెన్‌కో పనులు చేపట్టిందని, ఈ నేపథ్యంలో ఎన్విరాన్‌మెంట్ ఇంపాక్ట్ అసెస్‌మెంట్ సాధ్యమేనని నివేదించింది. ఈ కమిటీలోని ఓ సభ్యుడు మాత్రం ప్రస్తుత పరిస్థితిలో అసెస్‌మెంట్ కష్టమని విరుద్ధమైన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. గత నెల 29,30వ తేదీల్లో ఢిల్లీలో సమావేశమైన కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖ నిపుణుల మదింపు కమిటీ(ఈఏసీ) ఈ నివేదికపై చర్చించి మెజారిటీ సభ్యుల అభిప్రాయాన్ని ఆమోదించింది.
యాదాద్రి నివేదిక తయారీలో జెన్‌కో గ్రంథ చౌర్యం..
నల్లగొండ జిల్లా దామరచర్లలో 4,000 (5x800) మెగావాట్ల సామర్థ్యంతో జెన్‌కో నిర్మించతలపెట్టిన యాదాద్రి థర్మల్ విద్యుత్ ప్లాంట్‌కు పర్యావరణ అనుమతుల జారీ అంశంపై నిర్ణయాన్ని కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖ నిపుణుల మదింపు కమిటీ మరోసారి వాయిదా వేసింది. ఇతర ప్లాంట్‌ల నివేదికలను కాపీ పేస్ట్ చేయడం ద్వారా ఈ ప్రాజెక్టుకు సంబంధించిన పర్యావరణ ప్రభావ అధ్యయన నివేదికను జెన్‌కో తయారు చేసి గ్రంథ చౌర్యానికి పాల్పడిందని ఆక్షేపించింది. జెన్‌కోపై చర్యలు తీసుకోవాలని కేంద్రానికి సిఫారసు చేసింది. బొగ్గు రవాణా కోసం రైల్వే, పోర్టులతో ఒప్పందాలు, నిర్వాసితులకు ఆర్‌అండ్‌ఆర్ ప్యాకేజీ అమలు తదితర వివరాలతో కొత్త నివేదికను సమర్పిం చాలని ఆదేశించింది. ఈ ప్రాజెక్టు నిర్మాణంపై నిర్వహించిన బహిరంగ విచారణలో వచ్చిన ప్రజల అభ్యం తరాలకు సమాధానాలను ప్రధాన పత్రికల్లో ప్రచురించాలని, జెన్‌కో వెబ్‌సైట్లో ప్రదర్శనకు ఉంచి ప్రజల నుంచి తదుపరి అభ్యంతరాలను స్వీకరించాలని ఆదేశించింది.