Damaracherla
-
నగదుతో ఉడాయించిన వ్యక్తే కిడ్నాపరా?
దామరచర్ల : దామరచర్ల మండలం కొండ్రపోల్ రైతు మిత్ర ఎరువుల దుకాణంలో సోమవారం విజిలెన్స్ అధికారిగా హల్చల్ చేసిన వ్యక్తి.. ఈ నెల 23న హయత్ నగర్లో సోనీని కిడ్నాప్ చేసిన వ్యక్తి ఒక్కరేనా? అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. బీ ఫార్మసీ విద్యార్థిని సోనీని రవిశంకర్ అనే వ్యక్తి కిడ్నాప్ చేశాడు. కిడ్నాపర్ వినియోగించిన లాంటి కారునే విజిలెన్స్ అధికారిగా చెప్పుకున్న వ్యక్తీ వినియోగించాడని సమాచారం. అయితే కారునంబర్లో మాత్రం తేడాలున్నట్లు తెలుస్తోంది. ఎరువుల దుకాణం నుంచి నగదుతో ఉడాయించిన సదరు వ్యక్తి రాష్ట్ర సరిహద్దు అయిన వాడపల్లి వంతెన ద్వారా ఏపీలోకి ప్రవేశించినట్లు గుర్తించారు. ఉన్నతాధికారులు అప్రమత్తం చేయడంతో కిడ్నాపర్, విజెలెన్స్ అధికారిగా చెప్పుకున్న వ్యక్తి ఒక్కరేనా? అన్న దిశలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. -
‘భద్రాద్రి’ తనిఖీ నివేదిక సానుకూలం
కేంద్ర పర్యావరణ శాఖ నిపుణుల సబ్ కమిటీ నివేదిక యాదాద్రి ప్లాంట్‌కు అనుమతులపై నిర్ణయం వాయిదా సాక్షి, హైదరాబాద్: ఖమ్మం జిల్లా మణుగూరులో 1,080 (4x270) మెగావాట్ల భద్రాద్రి థర్మల్ విద్యుత్ ప్లాంట్ ప్రాజెక్టుకు సంబంధించి పర్యావరణ ప్రభావ అధ్యయనం (ఎన్విరాన్మెంటల్ ఇంపాక్ట్ అసెస్మెంట్) సాధ్యమేనని కేంద్ర పర్యావరణ, అటవీ మంత్రిత్వ శాఖ నిపుణుల సబ్ కమిటీ నివేదించింది. పర్యావరణ అనుమతులు రాకముందే పనులు చేపట్టిన దృష్ట్యా అసలు ఈ ప్లాంట్‌కు ఎన్విరాన్మెంటల్ అప్రైజల్ సాధ్యమేనా? కాదా? అన్న అంశంపై నిర్ణయం తీసుకోవాలని నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ కొన్ని నెలల కింద కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖను ఆదేశించింది. పర్యావరణ మంత్రిత్వ శాఖ నిపుణుల సబ్ కమిటీ గత నెల 17-19 తేదీల్లో మణుగూరులో తనిఖీలు జరిపి ఆ శాఖకు సమగ్ర అధ్యయన నివేదిక సమర్పిం చింది. మొత్తం ప్లాంట్ నిర్మిత ప్రాంతంలోని 1.85% భాగంలో మాత్రమే జెన్కో పనులు చేపట్టిందని, ఈ నేపథ్యంలో ఎన్విరాన్మెంట్ ఇంపాక్ట్ అసెస్మెంట్ సాధ్యమేనని నివేదించింది. ఈ కమిటీలోని ఓ సభ్యుడు మాత్రం ప్రస్తుత పరిస్థితిలో అసెస్మెంట్ కష్టమని విరుద్ధమైన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. గత నెల 29,30వ తేదీల్లో ఢిల్లీలో సమావేశమైన కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖ నిపుణుల మదింపు కమిటీ(ఈఏసీ) ఈ నివేదికపై చర్చించి మెజారిటీ సభ్యుల అభిప్రాయాన్ని ఆమోదించింది. యాదాద్రి నివేదిక తయారీలో జెన్కో గ్రంథ చౌర్యం.. నల్లగొండ జిల్లా దామరచర్లలో 4,000 (5x800) మెగావాట్ల సామర్థ్యంతో జెన్కో నిర్మించతలపెట్టిన యాదాద్రి థర్మల్ విద్యుత్ ప్లాంట్‌కు పర్యావరణ అనుమతుల జారీ అంశంపై నిర్ణయాన్ని కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖ నిపుణుల మదింపు కమిటీ మరోసారి వాయిదా వేసింది. ఇతర ప్లాంట్ల నివేదికలను కాపీ పేస్ట్ చేయడం ద్వారా ఈ ప్రాజెక్టుకు సంబంధించిన పర్యావరణ ప్రభావ అధ్యయన నివేదికను జెన్కో తయారు చేసి గ్రంథ చౌర్యానికి పాల్పడిందని ఆక్షేపించింది. జెన్కోపై చర్యలు తీసుకోవాలని కేంద్రానికి సిఫారసు చేసింది. బొగ్గు రవాణా కోసం రైల్వే, పోర్టులతో ఒప్పందాలు, నిర్వాసితులకు ఆర్అండ్ఆర్ ప్యాకేజీ అమలు తదితర వివరాలతో కొత్త నివేదికను సమర్పిం చాలని ఆదేశించింది. ఈ ప్రాజెక్టు నిర్మాణంపై నిర్వహించిన బహిరంగ విచారణలో వచ్చిన ప్రజల అభ్యం తరాలకు సమాధానాలను ప్రధాన పత్రికల్లో ప్రచురించాలని, జెన్కో వెబ్సైట్లో ప్రదర్శనకు ఉంచి ప్రజల నుంచి తదుపరి అభ్యంతరాలను స్వీకరించాలని ఆదేశించింది. -
దామరచర్లలో వీవీఎస్ లక్ష్మణ్ పుష్కరస్నానం
దామరచర్ల: ఇండియన్ మాజీ క్రికెటర్ వీవీఎస్ లక్ష్మణ్ గురువారం కృష్ణా పుష్కరాల్లో స్నానమాచారించారు. నల్లగొండ జిల్లా దామరచర్ల మండలం అడవిదేవులపల్లిలోని పుష్కర ఘాట్‌కు కుటుంబ సభ్యులతో కలిసి వచ్చిన ఆయన కృష్ణమ్మకు ప్రత్యేక పూజలు నిర్వహించి పుణ్య స్నానమాచారించారు. -
అరగంటపాటు నిలిచిపోయిన జన్మభూమి ఎక్స్ ప్రెస్
దామరచర్ల(నల్లగొండ): సికింద్రాబాద్ నుంచి గుంటూరు వెళోతన్న జన్మభూమి ఎక్స్ ప్రెస్ రైలు సోమవారం సాయంత్రం నల్లగొండ జిల్లా దామరచర్లలో అర్ధాంతరంగా నిలిచిపోయింది. బొత్తల పాలెం వద్ద పట్టాలపై ఉన్న రెండు గేదెలను రైలు ఢీకొట్టిన అనంతరం డ్రైవర్ రైలును నిలిపేశాడు. చనిపోయిన గేదెల శరీరభాగాలు రైలు చక్రాల్లో ఇరుక్కుపోవడంతో రైలును అనివార్యంగా నలిపేశారు, వీటిని తొలగించిన అనంతరం తిరిగి రైలు గుంటూరుకు బయలుదేరింది. -
10 అడుగుల కొండచిలువ హతం
దామరచర్ల (నల్లగొండ) : అడవికి మేతకు వెళ్లిన గొర్రెలు మాయమవుతున్నాయని బాధపడుతున్న గొర్రెల కాపరులకు ఈ రోజు ఒక మేకపిల్లను తింటున్న కొండచిలువ కనిపించింది. దీంతో గొర్రెల కాపరులంతా కలిసి దాన్ని హతమార్చారు. ఈ సంఘటన నల్లగొండ జిల్లా దామరచర్ల మండలం వాజ్యతండాలో మంగళవారం జరిగింది. సుమారు పది అడుగులు ఉన్న కొండచిలువ మేకను తింటుండగా.. గుర్తించిన మేకల కాపరులు స్థానికుల సాయంతో దాన్ని హతమార్చారు. -
అదుపుతప్పిన కారు.. నలుగురికి తీవ్ర గాయాలు
దామరచర్ల(నల్లగొండ): గుంటూరు నుంచి హైదరాబాద్ వెళుతున్న ఓ కారునల్లగొండ జిల్లా దామరచర్ల వద్ద అదుపుతప్పి ఒక బైక్, ఒక సైకిల్‌ను ఢీకొట్టడంతో నలుగురికి తీవ్ర గాయాలు కాగా, మరొకరు స్వల్పంగా గాయపడ్డారు. అద్దంకి-నార్కట్‌పల్లి జాతీయ రహదారిపై ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో కారులో ఉన్న ఇద్దరు, బైక్‌పై ఉన్న ఇద్దరితో పాటు సైకిల్‌పై వెళుతున్న ఒక వ్యక్తికి గాయాలయ్యాయి. వారిని చికిత్స కోసం 108 వాహనంలో మిర్యాలగూడ ఆస్పత్రికి తరలించారు. -
ఆగ్రహం.. అనుగ్రహం
దామరచర్ల : రాష్ట్ర ప్రభుత్వం దామరచర్ల మండలంలో నిర్మించతలపెట్టిన థర్మల్ విద్యుత్ పవర్‌ప్లాంట్ నిర్మాణానికి సేకరించిన అటవీ భూమిని అటవీయేతర భూమిగా మార్చేందుకు శనివారం చేపట్టిన గ్రామసభల్లో తొలుత ఆగ్రహించిన ప్రజలు ఆ తర్వాత అనుగ్రహించారు. 7,500 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం గల పవర్ ప్లాంట్ నిర్మాణానికి గాను మండలంలోని ముదిమాణిక్యం, వీర్లపాలెం, తాళ్లవీరప్పగూడెం, నర్సాపురం, కల్లెపల్లి, తిమ్మాపురం, కొండ్రపోల్, కేజేరెడ్డి కాలనీ, వాచ్యాతండా, బాలాజీనగర్ గ్రామ పంచాయతీల పరిధిలో సుమారు 10,500 ఎకరాల రిజర్వ్ ఫారెస్ట్ భూమిని ప్రభుత్వం సేకరించింది. ఈ భూమిని అటవీయేతర భూమిగా మార్చేందుకు గ్రామ పంచాయతీల తీర్మానం కోసం గ్రామసభలు నిర్వహించారు. ఐదు గ్రామాల్లో ఆగ్రహం.. అధికారులు గ్రామసభలు నిర్వహించేందుకు తమ గ్రామాలకు వస్తున్నారని తెలుసుకున్న గ్రామస్తులు పెద్దఎత్తున పంచాయతీ కార్యాలయం వద్దకు చేరుకున్నారు. తాళ్లవీరప్పగూడెం, నర్సాపురం, కల్లెపల్లి, బాలాజీనగర్, ముదిమాణిక్యం, కేజేరెడ్డి కాలనీ గ్రామాల్లో తొలుత అగ్రహం వ్యక్తం చేసి గ్రామసభలను బహిష్కరిం చారు.ఉన్న ఫలంగా తాముసాగు చేసుకున్న భూములను ప్రభుత్వం ఎలాంటి హామీలు లేకుండా లాగేసుకుంటే ఉపాధి కోల్పోయి మా కుటుంబాలు వీధిన పడతాయని, గ్రామ పంచాయతీ తీర్మానించవద్దని, ఎవరు కూడా పంచాయతీ ఆవరణలో అడుగుపెట్టవద్దని హెచ్చరించారు. దీంతో తాళ్లవీరప్పగూడెం, కల్లెపల్లి గ్రామాల్లో ఉద్రిక్తత చోటు చేసుకుంది. కల్లెపల్లి గ్రామంలో రెండు వర్గాలుగా ఏర్పడి అనుకూలంగా, వ్యతిరేకంగా నినాదాలు చేశారు. తోపులాట వరకు పరిస్థితి రావడంతో సీఐ జోక్యం చేసుకొని అడ్డుకున్నారు. బాలాజీనగర్‌లో గ్రామసభ తీర్మానానికి ఎవరూ అంగీకరించలేదు. గాంధీనగ రం గ్రామస్తులు నిరసన వ్యక్తం చేశారు. కేజేరెడ్డి కాలనీలో బహిష్కరించారు. ముదిమాణిక్యం గ్రామంలో క్వారీ కార్మికులు భూములు కోల్పోతే ఉపాధి పోతుందని, పరిశ్రమ ఏర్పడితే కాలుష్యంతో పొలాల్లో పంటలు పండకుండా పోతాయని గ్రామసభను అడ్డుకున్నారు. కాగా ముది మాణిక్యం, తాళ్లవీరప్పగూడెం గ్రామ సభలకు జేసీ సత్యనారాయణ హాజరై ప్రజల సందేహాలను నివృత్తి చేయడంతో తీర్మానం ఆమోదించారు. కేజేరెడ్డి కాలనీ, బాలాజీనగర్, కల్లెపల్లి గ్రామాల్లో అధికారులు నచ్చ జెప్పడంలో గ్రామస్తులు చివరికి ఆమోదం తెలిపారు. నాలుగు గ్రామాల్లో ప్రశాంతంగా.. వీర్లపాలెం,కొండ్రపోల్, వాచ్యతండా, తిమ్మాపురం గ్రామాల్లో ప్రజలు గ్రామసభలకు హాజరై ప్రశాంత వాతావరణంలో పంచాయతీయ తీర్మానం సంతకాలు చేసి థర్మల్ విద్యుత్ ప్లాంట్ కావాలని కోరారు. భూములు కోల్పోయిన వారికి పరిహారం, ఉ ద్యోగావకాశాలు కల్పించాలని విజ్ఞప్తి చేశారు. భారీగా పోలీసుల మోహరింపు.. గ్రామసభలు నిర్వహించిన 10 గ్రామాల్లో భారీగా పోలీసు బలగాలను మోహరించారు. మిర్యాలగూడ, సూర్యాపేట డీఎస్పీలు సందీ ప్ గోనె, బషీర్ ఆధ్వర్యంలో 20 మంది సీఐ లు, 30 మంది ఎస్ఐలు, సుమారు 400 మం ది పోలీసులు బందోబస్తు నిర్వహించారు. గ్రామసభల్లో పాల్గొన్న అధికారులు.. వీర్లపాలెంలో మిర్యాలగూడ ఆర్డీఓ బి. కిషన్‌రావు, తాళ్లవీరప్పగూడెంలో భువనగిరి ఆర్డీఓ ఎన్.మధుసూదన్, ముదిమాణిక్యంలో ఎస్డీసీ ఏఎమ్మార్పీ చంద్రశేఖర్‌రెడ్డి, తిమ్మాపురంలో సూర్యాపేట ఆర్డీఓ శ్రీనివాస్‌రెడ్డి, కల్లెపల్లిలో జెడ్పీ సీఈఓ దామోదర్‌రెడ్డి, బాలాజీ నగర్లో ఏఎమ్మార్పీ ఎస్డీసీ సూర్యాపేట ఎ.భాస్కర్‌రావు, నర్సాపురంలో శ్రీనివాసులు,. నల్లగొండ ఎస్డీసీ, కేఆర్ఆర్సీ, కేజేరెడ్డి కాలనీలో దేవరకొండ ఆర్డీఓ జి. రవి, కొండ్రపోల్‌లో నల్లగొండ ఆర్డీఓ ఈ. వెంకటాచారి, వాచ్యతండాలో ఏఎమ్మార్పీ స్పెషల్ కలెక్టర్ పీఏ ప్రభాకర శ్రీనివాస్‌తోపాటు 10 మంది తహసీల్దార్లు పాల్గొన్నారు. అపోహలకు పోవద్దు-జేసీ ప్రజలు ఎవరో చెప్పిన మాటలు విని అపోహలకు పోవద్దని జేసీ సత్యనారాయణ కోరా రు. తాళ్లవీరప్పగూడెం పంచాయతీ కార్యాల యంలో ఆయన మాట్లాడారు. మండలంలో ని ప్రైవేటు పరిశ్రమలతో ప్రభుత్వం నెల కొల్పే పరిశ్రమను పోల్చుకోవద్దని సూచించా రు. బాధితులను ప్రభుత్వం అన్ని రకాలుగా ఆదుకుంటుందన్నారు.ప్రజామోదం తర్వాతే పనులు చేపడుతామన్నారు. మండలంలోని పది గ్రామాల్లో ప్రజాభిప్రాయ సేకరణ ముగిసిందన్నారు. -
‘ఫీజు రీయింబర్స్మెంట్’ను కొనసాగించాలి
దామరచర్ల : పేద విద్యార్థులు ఉన్నత చదువులు చదివేందుకు దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రవేశపెట్టిన ఫీజు రీయింబర్స్మెంట్ పథకాన్ని ప్రభుత్వం కొనసాగించాలని బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జాజుల లింగయ్యగౌడ్ డిమాండ్ చేశారు. మంగళవారం ఆయన స్థానిక విలేకరులతో మాట్లాడుతూ ఫాస్ట్ పథకం కేసీఆర్ ప్రభుత్వం ప్రవేశపెట్టి పేద విద్యార్థుల స్కాలర్‌షిప్‌లకు గండికొట్టే ప్రయత్నం చేస్తోందన్నారు. కేసీఆర్ తన పాలనలో బీసీలకు ఒక్క సంక్షేమ పథకం ప్రవేశపెట్టకుండా ఉన్న ఫీజు రీయింబర్స్మెంట్ పథకానికి కూడా ఎగనామం పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కల్యాణలక్ష్మి పథకాన్ని బీసీలకు వర్తింపజేయాలని డిమాండ్ చేశారు. వివాహ సమయంలో దళిత, మైనారిటీల యువతుల వివాహాలకు రూ.51వేల నగదు ఇవ్వడాన్ని స్వాగతిస్తున్నామని, జనాభాలో 55 శాతం ఉన్న బీసీ యువతులకు వర్తింపజేయకపోవడంలో అంతర్యమేమిటని ప్రశ్నించారు. సమావేశంలో సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి జీడయ్య, కిరణ్, రమేష్, అంజి, సైదులు, మోహన్, రామకృష్ణ ఉన్నారు. -
బాబును అడ్డుకున్న తెలంగాణవాదులు
నల్గొండ : టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడుకు తెలంగాణ సెగ తగిలింది. రాష్ట్ర విభజన విషయంలో రెండుకళ్ల సిద్ధాంతం అనుసరిస్తున్న ఆయనకు తెలంగాణవాదులు నల్లజెండాలతో నిరసన తెలిపారు. నల్గొండ జిల్లా పర్యటనకు వచ్చిన చంద్రబాబునాయుడును శుక్రవారం దామరచెర్ల వద్ద నిరసనకారులు అడ్డుకున్నారు. బాబు కాన్వాయ్‌కు అడ్డుపడి ....జై తెలంగాణ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. జిల్లాలోని వరద బాధిత ప్రాంతాల్లో బాబు పర్యటించి పంట నష్టపోయిన రైతులను పరామర్శిస్తారు. గురువారం రాత్రి గుంటూరు నుంచి జిల్లాలోని వాడపల్లికి చేరుకున్న ఆయన స్థానిక ఇండియా సిమెంట్స్ కంపెనీ అతిథి గృహంలో రాత్రి బసచేశారు. దామరచర్ల మండలంలోని తాళ్లవీరప్పగూడెంలో రైతులను బాబు కలుస్తారు. అక్కడి నుంచి మిర్యాలగూడ మండలం ఏడుకొండల తండాలో పర్యటిస్తారు. జేఎస్ఆర్ ఫంక్షన్‌హాల్ భోజనం అనంతరం వేములపల్లి మండలంలోని బుగ్గబావితండాలో పంట నష్టం తెలుసుకుంటారు. తిప్పర్తి మండలంలోని మామిడాల గ్రామంలో వరద బాధితులతో మాట్లాడుతారు. ఆ తర్వాత నేరుగా కట్టంగూరు చేరుకుంటారు. అక్కడ జరిగిన పంట నష్టం వివరాలు రైతులను అడిగి తెలుకుంటారు. మరోవైపు చంద్రబాబు పర్యటించే ఆయా మండలాల్లో తెలంగాణవాదుల నుంచి నిరసనలు వ్యక్తం కాకుండా టీడీపీ నాయకులు విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. -
నల్లగొండ జిల్లాలో రోడ్డుపై కరెన్సీ నోట్ల కట్టల వర్షం!
డబ్బులు విసిరేస్తూ కారులో వెళ్లిన వ్యక్తి నల్లగొండ జిల్లాలో ఘటన దామరచర్ల: సమయం మధ్యాహ్నం కావస్తోంది. హైదరాబాద్ నుంచి గుంటూరు వైపు వెళుతున్న కారులో నుంచి రోడ్డుపైకి కరెన్సీ నోట్ల కట్టలు విసిరేస్తూ వెళ్లాడు ఓ వ్యక్తి. అప్పుడే అటుగా టీవీఎస్పై వెళ్తున్న వ్యక్తికి కొన్ని నోట్ల కట్టలు దొరకగా సమీప గ్రామస్తులకు కొన్ని నోట్లు లభించాయి. అవన్నీ కూడా రూ.500, రూ.1000 నోట్లే. ఈ సంఘటన నల్లగొండ జిల్లా దామరచర్ల మండలం కొండ్రపోల్ గ్రామ సమీపంలో అద్దంకి- నార్కట్‌పల్లి రహదారిపై మంగళవారం మధ్యాహ్నం జరిగింది. గ్రామస్తులు తెలిపినవివరాల ప్రకారం..హైదరాబాద్ నుంచి గుంటూరు వైపు వెళుతున్న కారులోనుంచి ఓ గుర్తు తెలియని వ్యక్తి డబ్బులు (నోట్ల కట్టలు) విసిరేశాడు. అదే సమయంలో రోడ్డు మీద టీవీఎస్పై వెళ్తున్న ఓ వ్యక్తి గమనించి భారీగా కట్టలను తీసికెళ్లినట్లు తెలిసింది. కొండ్రపోల్ గ్రామస్తులకు కొన్ని రూ.500, 1000 నోట్లు దొరికాయి. దొరికిన వారు కొందరు పరారీలో ఉన్నారని సమాచారం. విషయం తెలిసిన వాడపల్లి ఎస్ఐ జి.మన్మథ కుమార్ సిబ్బందితో ఆ గ్రామానికి చేరుకుని విచారణ చేపట్టారు. ఓ వ్యక్తి నుంచి రూ.500, రూ.1000 నోట్లు తీసుకుని మిర్యాలగూడ బ్యాంకులో పరీక్షించగా అసలువేనని తేలింది. టీవీఎస్పై వెళ్లిన వ్యక్తి ఆచూకీ కోసం, డబ్బులు వెదజల్లుతూ వెళ్లిన కారు కోసం దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై తెలిపారు.