నల్లగొండ జిల్లాలో రోడ్డుపై కరెన్సీ నోట్ల కట్టల వర్షం!
-
డబ్బులు విసిరేస్తూ కారులో వెళ్లిన వ్యక్తి నల్లగొండ జిల్లాలో ఘటన
దామరచర్ల: సమయం మధ్యాహ్నం కావస్తోంది. హైదరాబాద్ నుంచి గుంటూరు వైపు వెళుతున్న కారులో నుంచి రోడ్డుపైకి కరెన్సీ నోట్ల కట్టలు విసిరేస్తూ వెళ్లాడు ఓ వ్యక్తి. అప్పుడే అటుగా టీవీఎస్‌పై వెళ్తున్న వ్యక్తికి కొన్ని నోట్ల కట్టలు దొరకగా సమీప గ్రామస్తులకు కొన్ని నోట్లు లభించాయి. అవన్నీ కూడా రూ.500, రూ.1000 నోట్లే. ఈ సంఘటన నల్లగొండ జిల్లా దామరచర్ల మండలం కొండ్రపోల్ గ్రామ సమీపంలో అద్దంకి- నార్కట్‌పల్లి రహదారిపై మంగళవారం మధ్యాహ్నం జరిగింది.
గ్రామస్తులు తెలిపినవివరాల ప్రకారం..హైదరాబాద్ నుంచి గుంటూరు వైపు వెళుతున్న కారులోనుంచి ఓ గుర్తు తెలియని వ్యక్తి డబ్బులు (నోట్ల కట్టలు) విసిరేశాడు. అదే సమయంలో రోడ్డు మీద టీవీఎస్‌పై వెళ్తున్న ఓ వ్యక్తి గమనించి భారీగా కట్టలను తీసికెళ్లినట్లు తెలిసింది. కొండ్రపోల్ గ్రామస్తులకు కొన్ని రూ.500, 1000 నోట్లు దొరికాయి. దొరికిన వారు కొందరు పరారీలో ఉన్నారని సమాచారం.
విషయం తెలిసిన వాడపల్లి ఎస్‌ఐ జి.మన్మథ కుమార్ సిబ్బందితో ఆ గ్రామానికి చేరుకుని విచారణ చేపట్టారు. ఓ వ్యక్తి నుంచి రూ.500, రూ.1000 నోట్లు తీసుకుని మిర్యాలగూడ బ్యాంకులో పరీక్షించగా అసలువేనని తేలింది. టీవీఎస్‌పై వెళ్లిన వ్యక్తి ఆచూకీ కోసం, డబ్బులు వెదజల్లుతూ వెళ్లిన కారు కోసం దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై తెలిపారు.