పేద విద్యార్థులు ఉన్నత చదువులు చదివేందుకు దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రవేశపెట్టిన ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకాన్ని ప్రభుత్వం కొనసాగించాలని బీసీ విద్యార్థి సంఘం
దామరచర్ల : పేద విద్యార్థులు ఉన్నత చదువులు చదివేందుకు దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రవేశపెట్టిన ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకాన్ని ప్రభుత్వం కొనసాగించాలని బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జాజుల లింగయ్యగౌడ్ డిమాండ్ చేశారు. మంగళవారం ఆయన స్థానిక విలేకరులతో మాట్లాడుతూ ఫాస్ట్ పథకం కేసీఆర్ ప్రభుత్వం ప్రవేశపెట్టి పేద విద్యార్థుల స్కాలర్‌షిప్‌లకు గండికొట్టే ప్రయత్నం చేస్తోందన్నారు. కేసీఆర్ తన పాలనలో బీసీలకు ఒక్క సంక్షేమ పథకం ప్రవేశపెట్టకుండా ఉన్న ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకానికి కూడా ఎగనామం పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కల్యాణలక్ష్మి పథకాన్ని బీసీలకు వర్తింపజేయాలని డిమాండ్ చేశారు. వివాహ సమయంలో దళిత, మైనారిటీల యువతుల వివాహాలకు రూ.51వేల నగదు ఇవ్వడాన్ని స్వాగతిస్తున్నామని, జనాభాలో 55 శాతం ఉన్న బీసీ యువతులకు వర్తింపజేయకపోవడంలో అంతర్యమేమిటని ప్రశ్నించారు. సమావేశంలో సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి జీడయ్య, కిరణ్, రమేష్, అంజి, సైదులు, మోహన్, రామకృష్ణ ఉన్నారు.