కరప నుంచి సాక్షి ప్రతినిధి: వైఎస్ రాజశేఖరరెడ్డి ఫీజు రీయింబర్స్‌మెంట్‌తో చదివిస్తే.. జగనన్న ఉద్యోగమిచ్చారని కొత్తగా సచివాలయ ఉద్యోగాల్లోకి వచ్చిన యువతీ యువకులు హర్షం వ్యక్తం చేశారు. వారి మేలు ఈ జన్మలో మరచిపోలేమని కృతజ్ఞతలు తెలిపారు. ఇచ్చిన మాటను అధికారం చేపట్టిన నాలుగు మాసాల్లోనే నెరవేర్చిన సీఎం జగన్ అరుదైన నేత అని కొనియాడారు. సీఎం బుధవారం తూర్పుగోదావరి జిల్లా కరపలో గ్రామ సచివాలయాన్ని ప్రారంభించి వివిధ శాఖలు ఏర్పాటు చేసిన స్టాల్స్‌ను పరిశీలించారు. అనంతరం కొత్తగా నియమితులైన సచివాలయ ఉద్యోగులు, వలంటీర్లను ఆప్యాయంగా పలకరించారు. ఈ సందర్భంగా పలువురు నూతన ఉద్యోగులు వారి మనోభావాలు పంచుకున్నారు.
బంగారు భవిత ఇచ్చారు
మా నాన్న ఆటో డ్రైవర్. నేను రెండో తరగతి చదువుతున్నప్పుడే చనిపోయారు. మా అమ్మ ఆస్తమా పేషెంట్. ఆమె మందుల ఖర్చులు పక్కనపెట్టి మమ్మల్ని పదో తరగతి వరకు చదివించింది. ఇక ఉన్నత చదువులు చదువుకునే స్థోమత లేదు. ఆ సమయంలో దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రవేశపెట్టిన ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకం ద్వారా ఇంజినీరింగ్ పూర్తి చేశా. ప్రస్తుత ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఇప్పుడు ఉద్యోగం ఇచ్చారు. మా కుటుంబం వైఎస్ కుటుంబానికి రుణపడి ఉంటుంది.
– మట్టపర్తి విజయదుర్గ, గ్రామ సర్వేయర్, అంబాజీపేట
నా బాధ్యత సక్రమంగా నిర్వర్తిస్తా
మా నాన్న సాధారణ రైతు. మేం నలుగురు సంతానం. చెల్లి, ఇద్దరు తమ్ముళ్లు. తమ్ముళ్లు ఇద్దరూ బ్‌లైండ్. వైఎస్సార్ ప్రవేశపెట్టిన ఫీజు రీయింబర్స్‌మెంట్ ద్వారా చదువుకున్నాం. ప్రభుత్వ ఉద్యోగం నా కల. దాన్ని సాకారం చేసుకోవడానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సహకారం అందించారు. బాబు వస్తే జాబ్ వస్తుందని చెప్పి.. మాట తప్పిన ముఖ్యమంత్రిని చూశాం. చెప్పింది చెప్పినట్లు చేసి చూపించిన ముఖ్యమంత్రి ఇప్పుడు మన ముందు ఉన్నారు. ఉద్యోగ నిర్వహణలో నిష్పక్షపాతంగా, ఎలాంటి ప్రలోభాలకు లొంగకుండా నా బాధ్యతను నిర్వర్తిస్తా.
– మంగాదేవి, డిజిటల్ అసిస్టెంట్, మంజేరు
Comments
Please login to add a commentAdd a comment