సాక్షి, అమరావతి: ఆర్థికంగా ఉన్నవారికే ఉన్నత విద్య అన్నట్టున్న ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్సార్ సంక్షేమ చదువుల విప్లవాన్ని సృష్టించారు. దేశ చరిత్రలోనే లేని ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకాన్ని అమలు చేసి కులమతాలతో సంబంధం లేకుండా ఉన్నత విద్య పేదలందరికీ ఉచితమే అని ప్రకటించారు. 2005–08 మధ్య ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, దివ్యాంగులైన 26.67 లక్షల మందికి ఈ పథకం కింద రూ.2 వేల కోట్లను ఖర్చుచేశారు.
ఇక 2009ని సంక్షేమ నామ సంవత్సరంగా ప్రకటించి.. 7 లక్షల మంది అగ్రవర్ణ పేదలను కూడా ఈ పథకంలో భాగం చేశారు. వారి ఉచిత చదువుల కోసం రూ.350 కోట్లు కేటాయించారు. దేశంలో ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి చేపట్టని ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకంతో 33.67 లక్షల మంది పేద విద్యార్థుల చదువులకు పెన్నిధిలా నిలిచారు.
18 యూనివర్సిటీల స్థాపన..
చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో విద్యకు 2003–04లో కేవలం రూ.4,468 కోట్లు మాత్రమే కేటాయించారు. అదే వైఎస్సార్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 2008–09లో రూ.11 వేల కోట్లు కేటాయించి దేశంలోనే ఈ రంగానికి అధిక నిధులు కేటాయించిన ముఖ్యమంత్రిగా చరిత్ర సృష్టించారు. అంతేకాకుండా జిల్లాకు ఒక యూనివర్సిటీ ఉండాలని నిర్ణయించి కొత్తగా 18 విశ్వవిద్యాలయాలను స్థాపించారు. పేద విద్యార్థులకు సైతం ఖరీదైన ఐటీ శిక్షణ అందించాలని నిర్ణయించి నూజివీడు, ఇడుపులపాయ, బాసరలో ట్రిపుల్ ఐటీలను అందుబాటులోకి తెచ్చారు.
ఆయన బాటలోనే..
ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తన తండ్రి ప్రారంభించిన ప్రజా సంక్షేమ పథకాలను, ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను నూరు శాతం అమలు చేస్తున్నారు. అంపశయ్యపై ఉన్న ప్రభుత్వ పాఠశాలలను నాడు–నేడు: మన బడి కింద పది రకాల సౌకర్యాలతో అద్భుతంగా తీర్చిదిద్దారు. ప్రభుత్వ పాఠశాలల్లో స్మార్ట్ టీవీలు, ఉన్నత పాఠశాలలకు ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానెళ్లు ఏర్పాటు చేశారు. పేదింటి పిల్లలు అంతర్జాతీయ పౌరులుగా ఎదగాలని, ప్రపంచ స్థాయిలో పోటీపడాలని ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియం, సీబీఎస్‌ఈ సిలబస్‌ను ప్రవేశపెట్టారు.
జగనన్న గోరుముద్ద, జగనన్న విద్యాకానుక, జగనన్న అమ్మ ఒడి, జగనన్న విద్యాదీవెన, జగనన్న వసతి దీవెన వంటి అనేక పథకాలను అమలు చేస్తున్నారు. అంతేకాకుండా విదేశాల్లో చదువుకోవాలనుకుంటున్న ప్రతిభావంతులకు రూ.1.25 కోట్ల ఫీజును సైతం చెల్లించడం ఆయనకే చెల్లింది. దేశంలో ఏ రాష్ట్రంలోనూ లేనంతగా ఈ నాలుగున్నరేళ్లలో సీఎం వైఎస్ జగన్ విద్యా రంగానికి రూ.69,289 కోట్లు ఖర్చు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment