కేంద్ర కేబినెట్ ఆర్థిక వ్యవహారాల కమిటీ ముందుకు రామగుండం–మణుగూరు రైలుమార్గం ప్రతిపాదన
ఇక్కడ సరే అంటే, వచ్చే బడ్జెట్‌లో చోటు
ఇప్పటికే డీపీఆర్‌కు ఓకే చెప్పిన రైల్వే బోర్డు
208 కి.మీ. నిడివి, రూ.3,997 కోట్ల అంచనా వ్యయం
సాక్షి, హైదరాబాద్: ఇన్నాళ్లూ ప్రతిపాదనలకే పరిమితమైన కోల్ కారిడార్ ఎట్టకేలకు సాకారం కాబోతోంది. ఇటీవల అందిన డీపీఆర్‌ను పరిశీలించిన రైల్వే బోర్డు, దీనిని సాధ్యమయ్యే ప్రాజెక్టుగా తేల్చటంతో తుది ఆమోదం లభించే కేంద్ర కేబినెట్ ఆర్థిక వ్యవహారాల కమిటీ(సీసీఈఏ)కి చేరింది. ఇక్కడ ఆమోదం లభిస్తే.. కేంద్ర బడ్జెట్‌లో దీనికి నిధులు కేటాయించే అవకాశం ఉంది. 207.80 కి.మీ. నిడివితో ఉండే ఈ కారిడార్ నిర్మాణానికి రూ.3997 కోట్లు ఖర్చవుతుందని డీపీఆర్‌లో పొందుపరిచారు. 1999లో తొలుత ఈ లైన్‌కు ప్రతిపాదించగా, తిరిగి 2013లో మరోసారి రూ.1112 కోట్ల నిర్మాణ అంచనాతో ప్రతిపాదనను పునరుద్ధరించారు. చివరకు గతేడాది అక్టోబరులో కేంద్ర ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది.
రైళ్ల ట్రాఫిక్ సాంద్రత 140 శాతంగా ఉండటంతో....
ప్రస్తుతం రామగుండం నుంచి మణుగూరుకు వరంగల్–మహబూబాబాద్–డోర్నకల్–కారేపల్లి–పాండురంగాపురం మీదుగా రైల్వేలైన్ ఉంది. ఈ మార్గంలో మణుగూరు వెళ్లాలంటే 287 కి.మీ. ప్రయాణించాలి. ఈ మార్గంలో డోర్నకల్ జంక్షన్ వరకు విజయవాడ, విశాఖపట్నం మార్గం కావటంతో ప్రయాణికుల రైళ్లు అధికంగా తిరుగుతాయి. రామగుండం నుంచి బొగ్గులోడుతో గూడ్సు రైళ్లు అధికంగా తిరుగుతాయి. దీంతో ఈ మార్గంలో రైళ్ల ట్రాఫిక్ సాంద్రత 140 శాతంగా ఉంది. ఈ నేపథ్యంలో రామగుండం–మణుగూరు మధ్య నేరుగా ప్రత్యామ్నాయ రైలు మార్గం అవసరమని నిర్ణయించారు. కొత్త మార్గంలో ప్రయాణిస్తే 80 కి.మీ. నిడివి తగ్గుతుంది. దీంతో సమయంతోపాటు ఇంధనం కూడా ఆదా అవుతుంది. అన్నింటికి మించి రైలు ట్రాఫిక్ రద్దీ బాగా తగ్గి ఇటు ప్రయాణికుల రైళ్లు, అటు సరుకు రవాణా రైళ్లు వేగంగా గమ్యం చేరతాయి.
కోల్‌మైన్ టూ పవర్‌ప్లాంట్స్..
రామగుండం నుంచి పెద్ద ఎత్తున బొగ్గు వివిధ ప్రాంతాల్లో విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలకు సరఫరా అవుతుంది. ప్రస్తుతం సరైన రైలు మార్గం లేక రోడ్డు ద్వారా తరలిస్తున్నారు. రోడ్లు పాడవటంతోపాటు ఖర్చు కూడా అధికంగా ఉంటోంది. రైల్వేలైన్ అందుబాటులో ఉంటే..మణుగూరులో ఉన్న భద్రాద్రి పవర్‌ప్లాంట్‌కు బొగ్గు తరలింపు సులభవుతుంది. దీంతోపాటు కాకతీయ, పాల్వంచ పవర్‌ప్లాంట్లకు దగ్గరి దారి అవుతుంది. ఇక కొత్తగూడెం నుంచి ఒడిశాలోని మల్కన్‌గిరికి కొత్తలైన్ నిర్మిస్తోంది. అక్కడి పారిశ్రామిక వాడతో ఈ కొత్త మార్గం అనుసంధానం కానుంది. వెరసి పారిశ్రామిక పురోగతికి కూడా ఇది దోహదం చేయనుంది.
పర్యాటక ప్రాంతాల అనుసంధానం..
పర్యాటకులు అధికంగా వచ్చే ప్రాంతాలతో కొత్త మార్గం నిర్మించనున్నారు. కాళేశ్వరం, రామప్ప, మేడారం, కోట గుళ్లు, లక్నవరం, బొగత జలపాతం ప్రాంతాల మీదుగా సాగుతుంది. దీంతో ఆయా ప్రాంతాలకు వెళ్లే పర్యాటకులకు ఇది ఎంతో వీలుగా ఉంటుంది. పర్యాటకంగా ఆయా ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయి. ఇవన్నీ అటవీ ప్రాంతాలు కావటంతో సరైన రవాణా వ్యవస్థ లేదు. లక్షల మంది వచ్చే మేడారం జాతర సందర్భంలో భక్తులు ఆ ప్రాంతానికి చేరేందుకు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. రైలుమార్గం అందుబాటులోకి వస్తే, ప్రత్యేక రైళ్లు నడపటం ద్వారా లక్షల మందిని సులభంగా తరలించే వీలు కలుగుతుంది.
గిరిజిన ప్రాంత ప్రయాణికులకు..
గిరిజన ప్రాంతాలకు సరైన రైలు మార్గం లేదన్న వెలితి కూడా దీనితో తీరుతుంది. రాఘవాపురం, మంథని, భూపాలపల్లి, మేడారం, తాడ్వాయి లాంటి ప్రాంతాలవాసులకు ఈ రైలు మార్గం ఎంతో ఉపయుక్తంగా ఉంటుంది. కొత్త మార్గంలో దాదాపు 13 వరకు స్టేషన్లు ఉండే అవకాశముంది. ఉత్తర భారత్ వైపు వెళ్లే రైళ్లను ఎక్కువగా నడిపేందుకు ఇది ప్రత్యామ్నాయ లింకు మార్గంగా ఉపయోగపడుతుంది. ఢిల్లీ, ముంబయి లాంటి ప్రాంతాల ప్రయాణ సమయాన్ని ఇది తగ్గిస్తుంది.
రైటప్: కొత్తగా నిర్మించే రైల్వే లైన్ మార్గం ఇలా..
Comments
Please login to add a commentAdd a comment