
తొలిదశ కింద 135 అడుగులకు తగ్గింపు..కేంద్ర కేబినెట్‌లో నిర్ణయం
పోలవరం ప్రాజెక్టు అథారిటీ భేటీలో ఏపీ వెల్లడి
దీంతో తెలంగాణలో ముంపు ఉండదని వాదన
సాక్షి, హైదరాబాద్: పోలవరం ప్రాజెక్టును 150 అడుగుల ఎత్తులో నిర్మించాలని ప్రతిపాదించగా, తొలిదశ కింద 135 అడుగులకే ఎత్తును కుదించి నిర్మించాలని కేంద్ర మంత్రివర్గ సమావేశంలో నిర్ణయించినట్టు ఏపీ ప్రభుత్వం వెల్లడించింది. ప్రస్తుతానికి ప్రాజెక్టులో 135 అడుగుల నీటిమట్టంతో నీటిని నిల్వ చేస్తే.. ప్రాజెక్టు కింద తెలంగాణ భూభాగంలో ఎలాంటి ముంపు ఉండదని స్పష్టం చేసింది. ప్రాజెక్టు ఎత్తు 150 అడుగులకు ఎప్పుడు పెంచితే అప్పుడే తెలంగాణ భూభాగంలో ఏర్పడనున్న ముంపు ప్రభావంపై తగిన చర్యలు తీసుకుంటామని పేర్కొంది.
పోలవరం ప్రాజెక్టుతో తెలంగాణ భూభాగంలో ఏర్పడనున్న ముంపు ప్రభావంపై సంయుక్త సర్వే నిర్వహించే అంశంపై పోలవరం ప్రాజెక్టు అథారిటీ(పీపీఏ) ఈ నెల 8న హైదరాబాద్‌లో ఏపీ, తెలంగాణ అధికారులతో నిర్వహించిన సమావేశం మినట్స్‌లో ఈ విషయాన్ని పొందుపరిచింది. పోలవరం బ్యాక్‌వాటర్‌తో కిన్నెరసాని, మున్నేరువాగులు ఉప్పొంగి తెలంగాణ భూభాగంలో ఏర్పడనున్న ముంపు ప్రభావంపై మాత్రమే అధ్యయనం చేయాలని ఎన్జీటీ తీర్పు ఇచి్చన నేపథ్యంలో ఆ మేరకే నిర్వహిస్తామని ఈ సమావేశంలో ఏపీ పేర్కొంది.
పోలవరం ప్రాజెక్టు ఎత్తును తగ్గించిన నేపథ్యంలో ప్రస్తుతానికి ముంపు సమస్య ఉండదని వాదించింది. పోలవరం ప్రాజెక్టులో 150 అడుగుల గరిష్ట నీటిమట్టం మేర నీటిని నిల్వ చేస్తే మిగిలిన 5 వాగులకు ఉండనున్న ముంపు ప్రభావంపై సైతం ఏకకాలంలో అధ్యయనం చేయాలని సమావేశంలో తెలంగాణ పట్టుబట్టింది. మొత్తం 954.15 ఎకరాల్లో ముంపు ఏర్పడుతుందని స్పష్టం చేసింది.
ఈ పరిస్థితిలో తాము స్వయంగా మిగిలిన 5 వాగులకు ఉండే ముంపు ప్రభావంపై అధ్యయనం జరుపుతామని పీపీఏ సీఈఓ అనీల్‌జైన్ ఈ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. కేంద్ర జలసంఘం (సీడబ్ల్యూసీ)తో సంప్రదింపులు జరిపి సర్వే నిర్వహిస్తామని తెలిపారు.
పోలవరం ముంపుపై అధ్యయనం చేయండి
ఏపీ, తెలంగాణ రాష్ట్రాలతో నిర్వహించిన సమావేశంలో తీసుకున్న నిర్ణయం మేరకు పోలవరం ప్రాజెక్టుతో తెలంగాణలోని 6 వాగులకు ఏర్పడనున్న ముంపు ప్రభావంపై అధ్యయనం నిర్వహించాలని కేంద్ర జలసంఘానికి పోలవరం ప్రాజెక్టు అథారిటీ కోరింది. ఈ మేరకు పీపీఏ సీఈఓ అనీల్‌జైన్ తాజాగా సీడబ్ల్యూసీకి లేఖ రాశారు. గతంలో పోలవరం ప్రాజెక్టు ముంపు ప్రభావంపై అధ్యయనం నిర్వహించిన అనుభవం సీడబ్ల్యూసీకి ఉండడంతో మరోసారి సర్వే నిర్వహించాలని అధ్యయనంలో కోరారు.