
నిర్ధారించిన సీడబ్ల్యూసీలోని ప్రాజెక్టుల మదింపు విభాగం
బరాజ్ డిజైన్ల పట్ల సీడబ్ల్యూసీ సంతృప్తి వ్యక్తీకరణ
పంప్‌హౌస్‌లు, జల విద్యుదుత్పత్తి కేంద్రం డిజైన్లతో మళ్లీ డీపీఆర్ సమర్పించాలని సూచన
రాష్ట్రానికి లేఖ రాసిన సీడబ్ల్యూసీలోని ప్రాజెక్టుల మదింపు విభాగం
సాక్షి, హైదరాబాద్: సీతారామ ఎత్తిపోతల పథకం–సీతమ్మసాగర్ బహుళార్థక సాధక ప్రాజెక్టులో భాగంగా నిర్మించబోయే సీతమ్మసాగర్ బరాజ్ డిజైన్లు సరిగ్గానే ఉన్నాయని కేంద్ర జలసంఘం (సీడబ్ల్యూసీ)లోని ప్రాజెక్టుల మదింపు విభాగం సంతృప్తి వ్య్తక్తం చేసింది. దీంతో ఈ ప్రాజెక్టుకు సీడబ్ల్యూసీలోని టెక్నికల్ అడ్వైయిజరీ కమిటీ (టీఏసీ) అనుమతులకు లైన్‌క్లియర్ అయ్యిందని నీటిపారుదల శాఖ అధికారవర్గాలు తెలిపాయి. సీతమ్మసాగర్ బరాజ్ డిజైన్లను పునఃపరిశీలించిన తర్వాతే అనుమతుల విషయంలో ముందుకెళతామని ఇటీవల జరిగిన టీఏసీ సమావేశంలో కేంద్ర జలశక్తి శాఖ కార్యదర్శి దేబశ్రీ ముఖర్జీ తేల్చి చెప్పిన విషయం తెలిసిందే.
ఈ నేపథ్యంలో ప్రాజెక్టు డిజైన్లను సీడబ్ల్యూసీకి రాష్ట్ర నీటిపారుదల శాఖ సమర్పించింది. తమ పరిశీలనకు వచ్చిన అంశాలను తెలియజేస్తూ సీడబ్ల్యూసీలోని ప్రాజెక్టుల మదింపు విభాగం డైరెక్టర్ మనోజ్‌కుమార్ మీనా ఈ నెల 4న రాష్ట్రానికి లేఖ రాశారు. ప్రాజెక్టు బరాజ్ స్థిరత్వాన్ని బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ (బీఐఎస్) ప్రమాణాల మేరకు విశ్లేషించగా, సరిగ్గానే ఉన్నట్టు తేలిందన్నారు. భూకంపాల విషయంలో డిజైన్ల రూపకల్పనలో అనుసరించిన ప్రమాణాలను సమర్పించలేదని, దీంతో అవి సంభవించిన సందర్భాల్లో బరాజ్ స్థిరత్వాన్ని విశ్లేషించడం సాధ్యం కాలేదని తెలిపారు.
బరాజ్ నిర్మిత స్థలంలో భూకంపాల ప్రభావంపై ఐఐటీ రూర్కీతో అధ్యయనం చేయిస్తున్నామని రాష్ట్ర అధికారులు వివరణ ఇచ్చారని పేర్కొన్నారు. బరాజ్ నుంచి దిగువనకు దూకే వరద ఉధృతితో బరాజ్‌కు ఎలాంటి నష్టం జరగకుండా డిజైన్ల రూపకల్పనలో తగిన ఏర్పాట్లు చేసినట్టు గుర్తించామని తెలిపారు. అయితే, 2డీ మోడల్ స్టడీ నిర్వహించి నీటి ఉధృతిని నిర్ధారించాల్సి ఉందన్నారు.
పవర్‌హౌస్ డిజైన్లు సమర్పించలేదు
హైడ్రో మెకానికల్ పరికరాలకు సంబంధించిన డిజైన్ లెక్క లతోపాటు బరాజ్ గేట్లు, స్టాప్ లాగ్ గేట్లు, పవర్ హౌస్‌కు సంబంధించిన ఇన్‌టేక్ గేట్లు, డ్రాఫ్ట్ ట్యూబ్ గేట్స్‌కు సంబంధించిన డ్రాయింగ్స్‌ను సమర్పించలేదని ఆ లేఖలో సీడబ్ల్యూసీ తెలిపింది.
గత నెలలో రాష్ట్ర అధికారులు తమకు బరాజ్ ప్రధా న గేట్లు, స్లూయిజ్ రేడియల్ గేట్లకు సంబంధించిన డ్రాయింగ్స్‌ను సమర్పించగా, అవి కూడా సరైన రీతిలో ఉన్నట్టు నిర్ధా రించామని వెల్లడించింది. పవర్ హౌస్‌కు సంబంధించిన డ్రా యింగ్స్‌ను టీజీ జెన్‌కో తయారు చేస్తుందని, అవి తయారైన తర్వాత సమర్పిస్తామని అధికారులు తెలిపారని పేర్కొంది.
నవీకరించిన డీపీఆర్‌ను మళ్లీ సమర్పించండి
తమకు సమర్పించిన సీతారామ ఎత్తిపోతల పథకం డీపీఆర్‌లో కీలక స్ట్రక్చర్లు అయిన ఇన్‌టేక్, వాటర్ కండక్టర్ సిస్టమ్‌కు సంబంధించిన డిజైన్ లెక్కలు, పంప్‌హౌస్ డిజైన్లు, పెన్‌స్టాక్ డిజైన్లు వంటివి లేవని సీడబ్ల్యూసీ పేర్కొంది. ప్రాజెక్టులో భాగంగా 280 మెగావాట్ల జలవిద్యుత్ కేంద్రాన్ని నిర్మించనుండగా, వీటికి సంబంధించిన డ్రాయింగ్స్ సైతం సమర్పించలేదని తెలిపింది.
జలవిద్యుత్ కేంద్రం నిర్మాణానికి సంబంధించిన ప్రతిపాదనలను రాష్ట్ర ప్రభుత్వం ఇంకా ఆమోదించలేదని, టీజీ జెన్‌కో వీటికి సంబంధించిన డిజైన్లను రూపొందిస్తుందని అధికారులు తెలిపారని వెల్లడించింది. ఈ నేపథ్యంలో ప్రస్తుత డీపీఆర్‌తో నీటి పంపింగ్/ఎత్తిపోతలతో పాటు విద్యుదుత్పత్తి కేంద్రానికి సంబంధించిన సాంకేతిక అంశాలను పరిశీలించలేమని స్పష్టం చేసింది. ఈ అంశాలన్నింటినీ పొందుపరిచి నవీకరించిన డీపీఆర్‌ను మళ్లీ సమర్పించాలని కోరింది.