‘ భూ భారతి’ ప్రారంభోత్సవంలో సీఎం రేవంత్‌ | CM Revanth Reddy Bhu Bharathi Portal Launch | Sakshi
Sakshi News home page

‘ భూ భారతి’ ప్రారంభోత్సవంలో సీఎం రేవంత్‌

Published Mon, Apr 14 2025 8:59 PM | Last Updated on Mon, Apr 14 2025 9:03 PM

CM Revanth Reddy Bhu Bharathi Portal Launch

హైదరాబాద్:  తెలంగాణ ప్రాంతంలో పోరాటలన్నీ భూమితోనే ముడిపడి ఉన్నాయన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఈరోజు(సోమవారం) భూ భారతి పోర్టల్ ను ఆవిష్కరించారు సీఎం రేవంత్.. దీనిలోభాగంగా మాట్లాడుతూ.. ‘కొమురం భీమ్ జల్ జమీన్ జంగిల్ పోరాటం, సాయుధ రైతాంగ పోరాటం, కమ్యూనిస్టు సోదరుల పోరాటాలన్నీ భూమి కోసమే జరిగాయి. గత పాలకులు రెవెన్యూ చట్టాలను మార్చి తెచ్చిన ధరణి ప్రజల పాలిట భూతంగా మారింది. తహసీల్దార్ పైనే పెట్రోల్ పోసి తగలబెట్టే పరిస్థితి తీసుకొచ్చారు. రెవెన్యూ అధికారులను దోపిడీదారులుగా చిత్రీకరించి లబ్ది పొందాలని ఆనాటి పాలకులు ఆలోచన చేశారు. చట్టాలను చట్టాలుగా మార్చుకుని వేలాది ఎకరాలు కొల్లగొట్టిన మాట వాస్తవం కాదా?, 

అందుకే పేదలకు మేలు చేసేందుకు నూతన ఆర్వోఆర్ చట్టాన్ని తీసుకొచ్చాం. భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపేందుకే భూ భారతిని ప్రారంభించుకున్నాం. పైలట్ ప్రాజెక్టుగా నాలుగు మండలాల్లో చేపడుతున్నాం. వివాద రహిత భూ విధానాలను తీసుకురావాలని మా ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. ఈ చట్టాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లే బాధ్యత రెవెన్యూఅధికారులపైనే ఉంది. రెవెన్యూ అధికారులను ప్రజలకు చేరువ చేయాలనేదే మా ఉద్దేశం. గత పాలకుల్లా మిమ్మల్ని ప్రజల ముందు దోషులుగా నిలబెట్టే ఆలోచనకు మేం వ్యతిరేకం. ఆనాటి ముఖ్యమంత్రి రెవెన్యూ అధికారులపై అసెంబ్లీ సాక్షిగా ఏం మాట్లాడారో మీకు తెలుసు. మేం అవినీతికి పాల్పడే వ్యక్తులపైన కఠినంగా ఉంటాం.. కానీ వ్యవస్థపై కాదు.

మేం చేసే తప్పులకు మిమ్మల్ని దోషులుగా నిలబెట్టే విధానానికి నేను వ్యతిరేకం. భవిష్యత్ లో ఆధార్ లాగే భూమికి సంబంధించి భూధార్ తీసుకొస్తాం. రాబోయే రోజుల్లో వ్యవసాయ భూములను సర్వే చేసి కొలతలు వేసి హద్దులు గుర్తిస్తాం. రెవెన్యూ అధికారులపై దురుద్దేశంతో కొందరు కల్పించిన అపోహలను తొలగిద్దాం  

కలెక్టర్లు ప్రతీ మండలంలో పర్యటించాలని ఈ వేదికగా స్పష్టమైన ఆదేశాలు ఇస్తున్నా. అందరి సహకారంతో చట్టాన్ని పకడ్బందీగా అమలు చేయండి’ అని సీఎం రేవంత్ విజ‍్క్షప్తి చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement