
ఎలాంటి మతలబు, ఇబ్బంది లేకుండా తయారీ
డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
జూన్ 2 నాటికి సమగ్ర చట్టం: మంత్రి పొంగులేటి
సాక్షి, హైదరాబాద్: సామాన్యుడికి సైతం అర్థమయ్యే విధంగా ఎలాంటి మతలబు, ఇబ్బంది లేకుండా తయారు చేసిందే భూ భారతి 2025 చట్టం అని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పేర్కొన్నారు. శిల్ప కళావేదికలో జరిగిన భూభారతి ప్రారంబోత్సవ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. పోరాడి తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రంలో భూమితో పెన వేసుకున్న ప్రజల జీవితాలను అల్లకల్లోలం చేస్తూ గత పాలకులు ధరణి చట్టం తెచ్చారని భట్టి విమర్శించారు.
ధరణి రైతుల పాలిట శాపంగా మారిందని, కొంతమంది పెత్తందారుల కాళ్ల వద్ద రైతుల హక్కులను తాకట్టు పెట్టే విధంగా ఉందని.. ప్రతిపక్ష నాయకుడిగా అసెంబ్లీలో ఎంత మొత్తుకున్నా గత ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోలేదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వాలు గతంలో పేదలకు పంపిణీ చేసిన 24 లక్షల ఎకరాలకు సంబంధించిన హక్కులను గత ప్రభుత్వం తీసుకువచ్చిన ధరణి కాలరాసిందని ఆరోపించారు. ఇందిరమ్మ రాజ్యంలో ధరణిని బంగాళాఖాతంలో కలిపేస్తామని పాదయాత్రలో రైతులకు భరోసా ఇచ్చామని డిప్యూటీ సీఎం గుర్తు చేశారు.
జన్మ ధన్యమైంది: పొంగులేటి
రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర ప్రజల భూములకు పూర్తి భద్రత, భరోసా కల్పించే భూభారతి చట్టాన్ని ప్రజలకు అందించడంతో తన జన్మ ధన్యమైందని అన్నారు. అధికారులే ప్రజల వద్దకు వచ్చి ఫిర్యాదులు స్వీకరించి 15 రోజుల్లో పరిష్కరిస్తారని వివరించారు. ఈనెల 17 నుంచి కలెక్టర్లు రాష్ట్రంలోని అన్ని మండలాల్లో ఈ చట్టంపై అవగాహనా సదస్సులు నిర్వహిస్తారని మంత్రి తెలిపారు. మే మొదటి వారంలో రాష్ట్రంలో మిగిలిన 29 జిల్లాల్లో ఒక్కో మండలాన్ని ప్రయోగాత్మకంగా ఎంపిక చేసి ఫిర్యాదులు స్వీకరించి భూభారతి చట్టాన్ని పటిష్టపరుస్తామన్నారు.
జూన్ 2వ తేదీ నాటికి సమగ్ర చట్టాన్ని ఉపయోగంలోకి తీసుకురానున్నట్లు చెప్పారు. సీఎస్ శాంతికుమారి మాట్లాడుతూ గత చట్టంలో జరిగిన పొరపాట్లను సరిదిద్ది భూ భారతి పోర్టల్‌ను రూపొందించినట్లు చెప్పారు. రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి నవీన్ మిత్తల్ మాట్లాడుతూ దేశంలోనే అత్యంత గొప్ప రెవెన్యూ చట్టంగా భూభారతిని రూపొందించినట్లు చెప్పారు. శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, స్పీకర్ ప్రసాద్‌కుమార్, మంత్రులు ఉత్తమ్‌కుమార్ రెడ్డి, శ్రీధర్‌బాబు, పొన్నం ప్రభాకర్, జూపల్లి కృష్ణారావు, కొండా సురేఖ, ప్రభుత్వ సలహాదారు కె. కేశవరావు తదితరులు పాల్గొన్నారు.